అక్టోబరు 15వ తేదీన అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవంగా 2008లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధిలోనూ, ఆహారభద్రతను మెరుగుపరచి గ్రామీణ పేదరికాన్ని తొలగించటంలోనూ, గ్రామీణ మహిళలు – ప్రత్యేకించి ఆదివాసీ మహిళలు పోషిస్తున్న కీలకమైన పాత్రను గుర్తించటానికి ఐక్యరాజ్యసమితి అక్టోబరు 15వ తేదిని ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముకగా వున్నారు. వ్యవసాయ శ్రమ, పంటల సాగు, విత్తనాల సంరక్షణ, పశుపోషణ, పెరటి కోళ్ళ పెంపకం, అటవీ ఫలసాయ సేకరణ, చేపల పెంపకం – శుద్ధి అమ్మకాలు, చేనేత మొదలైన గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయితే వీరికి ఆయా జీవనోపాధులలో నిర్ణయాధికారం, ఆస్థిహక్కులు, ఆదాయంపై నియంత్రణ అనేవి లేవు. పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ సమాన వేతనాలు లభించటం లేదు. గ్రామీణ ఉత్పత్తిలో ప్రధానంగా పాలుపంచుకుంటున్నది దళిత, బహుజన, ఆదివాసీ మహిళలే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో సగానికి పైగా ఈ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు, భూమి లేని కుటుంబాల మహిళలే ఉత్పత్తి చేస్తున్నారు. మహిళలు పనిచేయనిదే దేశానికి తిండి ఉండదని అందరు గుర్తించాలి.
మహిళా రైతులు అంటే వ్యవసాయంలో నిమగ్నమై వున్న చిన్న, సన్నకారు మహిళా రైతులు, మహిళా వ్యవసాయ కూలీలు – కోళ్ళు, కౌలు రైతులు, పశువులను పెంచేవాళ్ళు, సంచార పశు పెంపకదారులు, వ్యవసాయానికి, తోటలను పెంచే కూలీలు, తోటలను పెంచేవారు, తేనెటీగలను పెంచేవారు, మత్స్యకారులు, వాన అనుబంధంగా సాగే పట్టుపురుగుల పెంపకం, వానపాముల పెంపకం వంటివి చేసేవారు, ఉప్పు కొటారులలో పనిచేసే, ఉపయోగించి, చిన్నతరహా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి, పోడు వ్యవసాయం సాగించే, మహిళలు అమ్మే ఆదివాసీ కుటుంబాల మహిళలు – ప్రత్యేకించి దళిత, నిర్వాసితులు, ఒంటరి మహిళలు, ఆదివాసీ, వికలాంగులు జాతీయ వ్యవసాయ విధానం ఇచ్చిన నిర్వచనం.
వ్యవసాయంలో 70 శాతం పైగా పనులు చేస్తున్నప్పటికీ మహిళలకు భూమి హక్కులు లేవు. గ్రామీణ మహిళలకు విద్య, పోషకాహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. పైగా వారిపై పనిచేసే స్థలాల్లోను, కుటుంబంలోను హింస, లైంగిక దోపిడీ, దాడులు జరుగుతున్నాయి. ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల కారణంగా సెజ్‌లు, పారిశ్రామిక కారిడార్లకు భూములను కేటాయించటంవల్ల గ్రామాలలో పేదప్రజలు తమ భూములనుండి నిర్వాసితులవుతున్నారు. ఆదివాసీ ప్రాంతాలలో గనుల తవ్వకం, ప్లాన్టేషన్లు, పంటల మార్పిడి, ఆదివాసేతరుల దోపిడీవల్ల ప్రజలు వలసపోతున్నారు. కొత్త ప్రాంతాలలో జీవనోపాధి లేక మహిళలు వ్యభిచారంలోకి నెట్టివేయబడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వలసపోయిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఫ్యాక్టరీలలో, మాల్స్‌లో విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారు.
ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు మహిళలకు కొంతవరకు మేలు చేసేవిగా ఉన్నప్పటికీ సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక విలువల కారణంగా అవి మహిళలకు లాభించే విధంగా అమలు జరగటం లేదు. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా అక్టోబరు 15వ తేదీన గ్రామీణ మహిళల హక్కుల పరిరక్షణకై మానవహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు ఎలుగెత్తి చాటాలి. వారి సమస్యల పరిష్కారానికి మహిళలందరూ చేతులు కలిపి ఒక్కటిగా నినదించాలి. ఈ సంవత్సరం అక్టోబరు 15వ తేదీని మహిళా రైతుల హక్కుల పరిరక్షణా దినోత్సవంగా జరుపుకుందాం.