మనదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముకగా వున్నారు. వ్యవసాయ శ్రమ, పంటల సాగు, విత్తనాల సంరక్షణ, పశుపోషణ, పెరటి కోళ్ళ పెంపకం, అటవీ ఫలసాయ సేకరణ, చేపల పెంపకం – శుద్ధి అమ్మకాలు, చేనేత మొదలైన గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో దళిత, బహుజన, ఆదివాసీ మహిళలే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయితే వీరికి ఆయా జీవనోపాధులలో నిర్ణయాధికారం, ఆస్థిహక్కులు, ఆదాయంపై నియంత్రణ అనేవి లేవు. పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ సమాన వేతనాలు లభించటం లేదు. దేశంలో మొత్తం మహిళా శ్రామికులలో 79% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు, పురుష శ్రామికులలో 63% మంది – అంటే స్త్రీల కంటే తక్కువ మంది వ్యవసాయంలో వున్నారు.
వ్యవసాయంలోను, పశుపోషణలోను 60-80 శాతం పైగా పనులు చేస్తూ మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలి లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 26% భూకమతాలు మహిళల చేతిలో వున్నట్లు తెలుస్తున్నది. వ్యవసాయ సాగుదార్లు, శ్రామికులలో స్త్రీ పురుష నిష్పత్తి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగుదార్లలో 36% శాతం మహిళలు వుంటే ఆంధ్రప్రదేశ్‌లో 30% శాతం మంది మహిళలు సాగుదార్లుగా వున్నట్లు 2011 జనాభా గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కూలీలలో 57% మంది మహిళలు వున్నారు, ఆంధ్రప్రదేశ్‌లో 51% శాతం మహిళలు వున్నారు. అంటే సాగుదార్లుగా గుర్తింపు పొందిన మహిళలు చాలా తక్కువగా వున్నారు కాని వ్యవసాయ కూలీలలో మాత్రం మహిళలు అత్యధిక శాతంగా వున్నారు. దినసరి వేతనాలలో మనదేశంలో స్త్రీలకు పురుషులకు మధ్య చాలా వ్యత్యాసం ఇప్పటికీ కొనసాగుతున్నదని చీూూూ 2011 గణాంకాల విశ్లేషణ తెలియజేస్తున్నది. గ్రామీణ ప్రయివేటు రంగంలో స్త్రీలకు పురుషుల కంటే 30% తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. గ్రామీణ ప్రభుత్వ పనులలో కూడా 10-12% వరకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. (డా. ఉషా సీతాలక్ష్మి గారు అందించిన విశ్లేషణ ఆధారంగా)
1991 తర్వాత అమలులోకి వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, వాటి కనుసన్నలలో రూపొందిన కొత్త వ్యవసాయ విధానాలు కంపెనీల అదుపును పెంచి వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తెచ్చాయి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయి రైతులకు అందవలసిన సబ్సిడీలు తగ్గాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో వ్యవసాయంలో ఖర్చులు పెరిగి తగినంత దిగుబడులు రాక, వచ్చినా గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలామంది రైతులు వ్యవసాయం వదిలిపోతున్నారు. వ్యవసాయం నుండి సరిపడిన ఆదాయం రాకపోవటంతో చాలా గ్రామాలలో పురుషులు ఇతర జీవనోపాధులను వెతుక్కుంటూ వలసపోతున్నారు. ఆ కుటుంబాలలో మహిళలే వ్యవసాయాన్ని భుజాన వేసుకుంటున్నారు. దానితో సంక్షోభ భారమంతా వారిపై పడుతున్నది. స్త్రీల పేరుమీద భూమి పట్టాలు లేకపోవటం, వారు కౌలు చేస్తూ వుండటం, వారికి రైతులుగా గుర్తింపు లేకపోవటంతో వారికి ప్రభుత్వం నుండి అందవలసిన రుణ సదుపాయం కానీ, కరువుభత్యం కాని అందటం లేదు. అందుకే సంక్షోభ భారం మహిళలపై మరింత అధికంగా ఉంటున్నది. పైగా వారు ఇంటి పని, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి పనులను పురుషులకంటే అదనంగా చేస్తున్నారని గుర్తించాలి.
వ్యవసాయ రంగంలో మార్కెట్ శక్తుల నియంత్రణ పెరిగిపోయి మార్కెట్ కోసం (పత్తి లాంటి) వాణిజ్య పంటలు పండించటం ఎప్పుడయితే మొదలయిందో పురుషులు ఆ పంటలకు సంబంధించిన సమాచారము, పరిజ్ఞానం అందుకుని శ్రమ చేయకపోయినా అదుపు చేయటం పెరిగింది. మహిళలు సంప్రదాయకంగా ఆహార పంటల సాగులో కలిగివున్న జ్ఞానాన్ని, నిర్ణాయకపాత్రను కోల్పోయారు. మహిళలు చాలావరకు శ్రామికులుగానే మిగిలిపోతున్నారు.
వ్యవసాయంలో మహిళలు చేసే పనులన్నీ కూడా అత్యధిక శ్రమతో కూడుకున్నవి. నాట్లు వేయటం, కలుపు తీయటం, కోత కోయటం, నూర్చటం, ధాన్యాన్ని శుద్ధి చేయటం వంటి పనులన్నీ రోజంతా వంగబడి చేసే పనులు. ఇట్లా గంటల తరబడి వంగి చేయటం వల్ల కాళ్ళ నొప్పులు, నడుమునొప్పి, వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనితోపాటు వంగినప్పుడు (నిలబడినప్పటికంటే) తక్కువ ప్రాణవాయువు లభిస్తుంది. కాబట్టి శరీరానికి కావలసిన ప్రాణవాయువు దొరకక రక్తప్రసరణ సరిగ్గా జరగదనీ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ప్రసవ సమయంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయనీ పరిశోధనలలో తెలుస్తున్నది. 50% పైగా మహిళలలో రక్తహీనత ఉన్నట్లు ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. పైగా గ్రామీణ మహిళలకు విద్య, పోషకాహారం, వైద్య సదుపాయాలు వంటివి కూడా సక్రమంగా అందుబాటులో లేవు. వారిపై పనిచేసే స్థలాల్లోను, కుటుంబంలోను హింస, లైంగికదోపిడీ, దాడులు జరుగుతున్నాయి.
ప్రభుత్వ భూపంపిణి పథకంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నుండి నేటి వరకు 42 లక్షల భూమి లేని కుటుంబాలకు 75 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయటం జరిగింది. అందులో అత్యధికం అసైన్డు భూములు, కొంతవరకు భూగరిష్ట పరిమితి దాటిన భూములు, భూదాన్ భూములు వున్నాయి. ఈ విధంగా పంపిణి చేసిన భూములలో కొంతవరకు భూమి లేని పేద మహిళలకు భూమి పట్టాలు లభించాయి. (ఎంతమంది మహిళలకు అనేది గణాంకాలు అందుబాటులో లేవు.) వారికి లభించిన అసైన్డు భూమి రాళ్ళూరప్పలతో నిండి గ్రామాలకు దూరంగా గుట్టలలో వున్నదాన్ని ఇవ్వటంవల్ల చాలామంది సాగు చేసుకోలేకపోయారు. కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఆ భూమిని సాగులోకి తెచ్చుకోవలసి వచ్చింది. భూపంపిణి పథకం కూడా మహిళలకు మరింత భారమే అయింది.
ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు మహిళా రైతులకు కొంతవరకు మేలుచేసేవిగా ఉన్నప్పటికీ, వాటి అమలులో ప్రభుత్వ శాఖలలో వున్న అలసత్వం, సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక విలువల కారణంగా మహిళలకు ప్రయోజనం కలగటం లేదు. కొడుకులతో సమానంగా కూతుళ్ళకు వ్యవసాయ భూమిని పంచి ఇవ్వాలనే హిందూ వారసత్వ సవరణ చట్టం అమలు చాలా నిరాశాజనకంగా వుంది.
వ్యవసాయంలో ఆహార ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళారైతుల సాధికారత పెంచాలంటే ముందుగా వారికి భూమి హక్కులు కల్పించాలి. ప్రభుత్వ భూపంపిణి పథకాలలో వారికి సాగుయోగ్యమైన సారవంతమైన భూములను ఇవ్వాలి. సాగునీటివసతికి గ్రామ చెరువుల పునరుద్ధరణ వంటి పరిష్కారాలను వారి భాగస్వామ్యంతో నిర్వహించాలి. గ్రామస్థాయిలో మహిళా రైతులను సహకార సంఘాలలో సంఘటితం చేసి ఆ సంఘాల ద్వారా వారికి అవసరమైన విత్తనాలు, ఉత్పాదకాలు, పశుసంపద, రుణసదుపాయాలు, సమాచారం, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు వంటివి అన్నీ ఒకేచోట అందజేయాలి. వ్యవసాయ పనులలో మహిళల శ్రమ తీవ్రతను తగ్గించే పరిజ్ఞానాలపై పరిశోధనలు నిర్వహించి ఆ పరిశోధనా ఫలాలను వారికి అందించే విధంగా నిధులు కేటాయించి విస్తృతంగా అమలులోకి తేవాలి.
మహిళా రైతులు సమిష్టిగా సాగు చేసుకుంటూ రసాయ నాలు పురుగుమందులు లేకుండా వైవిధ్యమైన ఆహారపంటలు – గింజ ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటివి పర్యావరణానికి, మనుషులకు, పశువులకు ఆరోగ్యకరమైన విధంగా పండిస్తున్న మంచి ఉదాహరణలు మన రాష్ట్రంలోనే మన కళ్ళ ముందు అమలు జరుగుతున్నాయి. అటువంటి పంటల సాగును, పద్ధతులను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడవేసే విధానాలకు నాంది పలకాలి. ప్రస్తుత వినాశకర పద్ధతిలో సాగించటం ఎంతో కాలం సాధ్యం కాదు. మహిళా రైతులతోనే మార్పు సాధ్యమ వుతుందని గుర్తించాలి.