పరివర్తన- సత్యవతి దినవహి

జ్ఞానోదయ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం. అంతా సందడిగా ఉంది. బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది. పదవతరగతిలోకి రాబోతున్న నవ్య ప్రతి సంవత్సరం లాగే ఆటలు, పాటలు, చదువుకు సంబంధించి చాలా బహుమతులే కాకుండా ఈ సారి ఉత్తమ విద్యార్థిని బహుమతి కూడా అందుకుంది. ఆనంద్‌ లలితల ఏకైక సంతానం నవ్య. ఇద్దరికీ నవ్యంటే పంచప్రాణాలు.

బాగా స్థితిమంతులైనప్పటికీ విపరీత గారాబాలు చెయ్యకుండా చక్కగా క్రమశిక్షణతో పెంచి, మంచి నడవడిక నేర్పించి, అవసరమైనంతవరకూ అన్నీ సమకూర్చి … అందరిచేతా ”బుద్ధిమంతురాలు” అనిపించుకునేలాగానే పెంచారు. నవ్య కూడా ఎప్పుడూ, తనని అర్థంచేసుకుని ఏలోటూ రాకుండా చూసుకునే తల్లిదండ్రులు ఉండటం తన అదృష్టమని అనుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రులే నవ్యకి ఆదర్శం.

పదవతరగతి అర్థవార్షిక పరీక్షలు ఇంకో నెలలోకి వచ్చాయి. తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది నవ్య మంచి మార్కుల కోసం. ”కానీ ఎందుకో ఈ మధ్య చదువుపైన ఏకాగ్రత పెట్టలేకపోతోంది. కారణం ఇంట్లో వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తోంది!!! ఎప్పుడూ ఎంతో సరదాగా కలిసి గడిపే అమ్మా నాన్నా ఒకరిపట్ల ఒకరు కొంచెం ముభావంగా ఉన్నట్లు సందేహం కలుగుతోంది. తన ఎదురుగా ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుకుంటున్నట్లు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇద్దరిమధ్యా అపోహలు ఏర్పడుతున్నాయేమోనని అనిపిస్తోంది తనకి. తాను మరీ చిన్న పిల్లేమీ కాదుగా ఇలాంటి సున్నితమైన విషయాలు తన దృష్టిలోకి రాకపోవటానికి???”

కానీ ”అవి ఏమిటీ అన్నది తెలియటం లేదు!!!” ”మరి తెలుసుకోవటం ఎలా?” ”ఏమిటి మార్గం?” ………… ఇలాంటి ఆలోచనలు పగలూ రాత్రి మెదడుని తొలిచేస్తుంటే ఏకాగ్రతతో చదవలేకపోతోంది. నాన్న జాతీయ బ్యాంకులో రీజనల్‌ మేనేజరు. అమ్మ సంగీతంలో నిష్ణాతురాలు. సంగీత కళాశాలలో మంచి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ అది కాదనుకుని తనకి అన్నివేళలా అందుబాటులో ఉండాలని, ఇంట్లోనే సంగీత పాఠశాల నడుపుతోంది. రోజూ తాను సైకిలుపై స్కూలుకి వెళ్ళగానే నాన్న బ్యాంకుకి వెళతారు. ఈ మధ్య చాలా రాత్రయ్యాక ఇంటికి వస్తున్నారు. అదేమంటే ”బాధ్యతలు” అని అంటున్నారు.

ఒకరోజు నవ్య, స్కూలు వ్యవస్థాపకులలో ఎవరో చనిపోయారని, రోజూ కంటే ముందుగానే స్కూలు వదిలిపెట్టేస్తే, మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంటికి వచ్చేసింది. అలవాటు ప్రకారం ”అమ్మా” అని పిలుస్తూ కాలింగ్‌ బెల్‌ నొక్కబోయిన నవ్యకి లోపలినించి గట్టి గట్టిగా మాటలు వినిపించాయి. ”అమ్మ ఎవరితోనో కోపంగా మాట్లాడుతోంది … ”కాదు కాదు” అది మాట్లాడుతున్నట్లు లేదు వాదిస్తున్నట్లుగా ఉంది??? అమ్మ అంత కోపంగా మాట్లాడగా ఇంతకు ముందెప్పుడూ వినలేదు నేను” అనుకుంది నవ్య.

”కానీ ఎవరితో?” అనుకుంటుండగానే అవతలి గొంతు విని గుర్తుపట్టింది. ”అది నాన్న గొంతు! నాన్న ఈ సమయంలో ఇంట్లో ఉన్నారేమిటీ? అమ్మా నాన్నా ఎందుకు వాదించుకుంటున్నారు? ఏమై ఉంటుందీ?” అనుకుంటూ ”అమ్మా తలుపుతియ్యి” అంటూ విరిగిపోతుందేమో అనేంత గట్టిగా కాలింగ్‌ బెల్‌ నొక్కింది!!! వెంటనే లోపల మాటలు ఆగిపోవటం గమనించింది. తలుపు తీసిన తల్లి వైపు చూసిన నవ్య అమ్మ కళ్ళు ఎర్రబారి ఉండటం గమనించింది. ”అమ్మ బాగా ఏడ్చినట్లుంది” అనుకుని, అది గమనించనట్లుగానే, తాను స్కూలునించి త్వరగా రావటానికి గల కారణాన్ని గబగబా చెప్పేసి, తండ్రి ఇంట్లో ఉన్న విషయం తనకి తెలిసినా తెలియనట్లుగానే ”ఫ్రెష్‌ అయి వస్తానంటూ” తన గదిలోకి వెళ్ళిపోయింది నవ్య.

”అమ్మా ఎందుకేడుస్తున్నావు?” అని అడిగే ధైర్యం లేకపోయింది. మొదటిసారిగా ఎందుకో భయంవేసింది నవ్యకి. తన స్నేహితురాళ్ళలో ఒకరిద్దరు ఇలాగే, తమ తల్లిదండ్రులు గొడవలుపడి విడాకులు తీసుకున్నారని ఇప్పుడు తాము కొన్నాళ్ళు తల్లి దగ్గరా, కొన్నాళ్ళు తండ్రి దగ్గరా ఉంటామని చెప్పటం గుర్తుకు వచ్చింది.

”అమ్మా నాన్నా కూడా విడిపోతారా?” అనే ఆలోచనరాగానే భయంతో ఒక్కసారి ఒళ్ళంతా వణికిపోయి నీరసం వచ్చినట్లై మంచంపై కూలబడిపోయింది. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అమ్మ ముభావంగా, నాన్న కోపంగా ఉండటం గమనించిన నవ్య మౌనంగా భోజనం చేసి తన గదిలోకి వచ్చేసింది.

మర్నాడు స్కూలుకి బయలుదేరుతూ తాను లైబ్రరీ నించి తెచ్చిన పుస్తకం వాపసు ఇవ్వడానికి అదే ఆఖరురోజని గుర్తుకు వచ్చి దాని కోసం వెతకసాగింది కంగారుగా. ”ఇవాళ తిరిగి ఇవ్వకపోతే రోజుకి రూ. 25/- చొప్పున ఫైన్‌ కట్టాలి” అనుకుంటూ ”అమ్మా నా లైబ్రరీ పుస్తకం ఎక్కడైనా చూశావా?” అని అడిగింది తల్లిని. ”మొన్న నాన్న అడిగితే ఇచ్చావు కదమ్మా! మర్చిపోయావా?” అంది లలిత, కూతురికి లంచ్‌ డబ్బా పెడుతూ, వంటగదిలోంచి.

”అవును” నాన్న తాను లైబ్రరి నించి తెచ్చుకున్న పుస్తకాలు అడిగి చదువుతుంటారు అప్పుడప్పుడూ. ”అయితే నాన్న గదిలో

ఉండి ఉంటుంది” అనుకుంది. ఎంతో అవసరమైతే తప్ప తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళదు నవ్య. పోనీ తల్లిని అడుగుదామంటే ఆవిడ వంటగదిలో హడావిడిగా ఉంది.

”సరే తప్పదు” అనుకుంటూ గబగబా ఆ గదిలోకి వెళ్ళి చూడగా టేబుల్‌ పైన పెట్టి ఉంది పుస్తకం. టైమైపోతోందనే కంగారులో పుస్తకం లాగినట్లుగా తీస్తుండగా అది కాస్తా కిందపడిపోయింది. ”అబ్బబ్బా” అనుకుంటూ వంగి పుస్తకం తీసుకుంటున్న నవ్యకి మంచి కింద ఏదో ఉన్నట్లు అనిపించింది. ”ఏమిటా?” అనుకుంటూ సహజమైన ఆసక్తితో మంచం కిందకి వంగి దానిన తీసి చూస్తే అది ఒక ఖరీదైన బ్రాందీ సీసా!!!???? ఒక్కక్షణం మతిపోయినట్లయింది నవ్యకి ”నాన్న బ్రాందీ తాగుతారా?” అనుకుంది ‘అవును’ అనుకోవటానికి మనసు ఒప్పటంలేదు. దానికి కారణం నాన్నే ఎన్నోసార్లు ‘మద్యపానం’ అనేది ఒక చెడు వ్యసనమనీ, పట్టుకుంటే వదుల్చుకోవటం చాలా కష్టమనీ” అనటం తాను వింది.

”అలాంటిది మరి ఇదేమిటీ? ఇది ఒకటేనా ఇంకా సీసాలు ఉన్నాయా?” అనుకుంటూ, తల్లి వస్తుందేమోనని భయపడుతూ ఒక కన్ను అటువేసి ఉంచి గదంతా గబగబా వెతకసాగింది. ఆ క్షణంలో స్కూలు గురించి మర్చిపోయింది. అప్పుడు కనిపించింది బీరువా వెనకాల అలాంటి మరో నాలుగు సీసాలున్న అట్టపెట్టె ఒకటి.

”ఏంటో అంతా అయోమయంగా ఉంది” అనుకుంటూ మంచి కిందనించి తీసిన సీసా మళ్ళీ యథాస్థితిలో పెట్టేసి ”అమ్మా స్కూలుకి వెళుతున్నాను” అని వంటగదిలో ఉన్న తల్లికి వినపడేలా చెప్పేసి, టేబుల్‌ పైన తనకోసం పెట్టి ఉంచిన లంచ్‌ డబ్బా తీసుకుని స్కూలుకి వెళ్ళిపోయింది. దారిలో ఇదే ఆలోచన ”అంటే అమ్మ, నాన్న ముభావంగా ఉండటం, నాన్న ఈ మధ్య ఆలస్యంగా రావటం, వాళ్ళ మధ్య వాదన్లూ, ఆ రోజు అమ్మ కళ్ళు ఎర్రబడి ఉండటం …….. వీటన్నిటికీ నాన్న త్రాగుడు అలవాటే కారణమన్న మాట! నేను నా స్కూలూ, పరీక్షలతో బిజీగా ఉండి ఏమీ గమనించలేదు!” అనుకుని బాధపడింది.

స్కూలుకి వెళ్లే త్రోవలో రాధిక కలిసింది. ఇద్దరూ మంచి ప్రాణ స్నేహితులే కాకుండా రోజూ కలిసి కబుర్తు చెప్పుకుంటూ స్కూలుకి వెళతారు. కానీ ఆ రోజు నవ్య పరధ్యానంగా ఉండటం గమనించి ”నవ్యా?” అని గట్టిగా పిలిచి ”ఏమైంది ఎందుకలా

ఉన్నావు?” అని అడిగింది రాధిక.

తన తండ్రి డ్రింక్‌ చెయ్యటం గురించి, ఎప్పుడూ డ్రింకింగ్‌ అలవాటు మంచిది కాదనే నాన్నే అలా చెయ్యటం తనకి చాలా బాధ కలిగిస్తోందని చెప్పింది నవ్య రాధికతో. అలా చెప్పాక ఎందుకో మనసు కొంత తేలికైనట్లనిపించింది నవ్యకి.

అంతావిని ”బాధపడకు నవ్యా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు కొంచెం ఎక్కువగా కంగారు పడుతున్నావేమో అనిపిస్తోంది. ఎప్పుడూ మీ డాడీ డ్రింకింగ్‌కి వ్యతిరేకమని చెప్తుంటావు కనుక ఒక్కసారిగా మీ డాడీ డ్రింక్‌ చేస్తారని తెలిసి నువ్వు బాధపడటం సహజం” అంది రాధిక.

”కానీ తన తల్లీ తండ్రీ చాలా వాదించుకున్నారనీ, తల్లి ఏడవటం కూడా జరిగిందనీ దీనిని బట్టి చూస్తే డ్రింకింగ్‌ తన తండ్రికి ఒక వ్యసనంలా అయిందేమోనని తనకి అనుమానంగా, చాలా భయంగా ఉందనీ …. ” ఇలా ఇంకా ఏమో చెప్పబోయిన నవ్య స్కూలు రావటంతో ఆపేసింది. నవ్యా రాధికా ఒకే క్లాస్‌ అయినా వేరు వేరు సెక్షన్స్‌ కావటంతో ఎవరి సెక్షన్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు.

మధ్యాహ్నం అందరూ కూర్చుని లంచ్‌ చేస్తూ మాట్లాడుకుంటుండగా డ్రింక్స్‌ తీసుకోవటం గురించి ఏదో ప్రస్తావన వస్తే ఎప్పుడూ లేనిది ఇవాళ ఆసక్తిగా వినసాగింది నవ్య. అందరూ ”ఇప్పుడు డ్రింక్స్‌ చెయ్యటం ఒక స్టేటస్‌ సింబల్‌ లాగా చాలా మామూలు ఐపోయింది. ఎవరైనా ‘మేము డ్రింక్స్‌ చెయ్యము, మాకు అలవాటులేదూ’ అంటే వీళ్ళూ మనుషులేనా అన్నట్లు చిన్న చూపు చూస్తున్నారు” అని మాట్లాడుకుంటున్నారు.

”మా ఇంట్లో కూడా మా పేరెంట్స్‌ ఇద్దరూ డ్రింక్‌ చేస్తారు, అఫ్‌కోర్స్‌ మేము కూడా అప్పుడప్పుడూ తీసుకుంటాము కానీ వాళ్ళకి తెలియకుండానే సుమా” అని నవ్వుకున్నారు అందులో ఒకరిద్దరు.

”తన క్లాస్‌మేట్స్‌లో కూడా డ్రింక్‌ చేసే వాళ్ళున్నారా? ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. అవును ఎలా తెలుస్తుంది? రోజూ కూర్చుని కలిసి లంచ్‌ చేస్తున్నా నేనెప్పుడూ ఇలాంటి సంభాషణలపట్ల పెద్ద ఆసక్తి చూపను మరి” అనుకుంటూ సాలోచనగా చూసింది వాళ్ళ వైపు నవ్య. ”వీళ్ళ మాటలని బట్టి చూస్తే రాధిక అన్నట్లు నేనే అనవసరంగా కంగారు పడుతున్నానేమో?” అనుకుంది మళ్ళీ తనలో తానే నవ్య.

ఇవన్నీ విన్న తరువాత కూడా ఎందుకో ”నాన్న డ్రింక్‌ చేస్తారు” అన్న విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది నవ్య. అసలు

ఆ లోచనే నచ్చటంలేదు నవ్యకి. ఒక్కొక్కసారి మనం ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతనలేనట్ల నిపిస్తే ”వీళ్ళనా నేను ఆదర్శంగా తీసుకున్నది?” అనిపించి ఒక విధమైన వ్యతిరేకత కలుగుతుంది. అది కొంతకాలమే కావచ్చు కానీ ఆ కొంతకాలమే ఒక్కొక్కళ్ళ జీవితం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నవ్య విషయంలో కూడా అలాగే జరిగింది.

”తను తండ్రినే ఆదర్శంగా తీసుకుంది, అలాంటిది ఆయనే తాను చేస్తున్నది తప్పని తెలిసీ చేస్తున్నారు. ఇంక నేనెందుకు నాన్న మాట వినాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అనుకుంది నవ్య.

అప్పటినించీ ఎందుకో నవ్యలో తనకి తెలియకుండానే ఒక రకమైన నిర్లక్ష్యధోరణి అలవాటయ్యింది. ఏమైనా అడిగితే విసురుగా సమాధానం చెప్పటం చెప్పిన మాట వినకపోవటం …. లాంటివి చెయ్యసాగింది. కూతురిలో ఈ మార్పుకి కారణమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటంలేదు ఆనంద్‌ లలితలకి.

ఇంకో రెండురోజుల్లో నవ్య పుట్టినరోజు. ఎప్పుడూ అమ్మా నాన్న అనుమతి తీసుకునిగానీ ఏమీ చెయ్యని నవ్య ఈ సారి మాత్రం వాళ్ళకి చెప్పకుండానే పుట్టినరోజునాడు తన ఫ్రెండ్స్‌ని ఇంటికి పార్టీకి పిలిచింది. అది కొంచెం బాధగా అనిపించినా ఇద్దరూ కూతుర్ని ఏమీ అనలేదు. ఆ రోజు నవ్య పుట్టినరోజు పార్టీ జరుగుతోంది. ఆదివారం కావటంవల్ల ఆనంద్‌ ఇంట్లోనే ఉన్నాడు. లలిత వంటగదిలో పనిచేసుకుంటోంది.

”ఫ్రెండ్స్‌ ఇప్పుడు మీకో సర్‌ప్రైజ్‌” అంటూ నవ్య తన గదిలోకి వెళ్ళింది. ఆనంద్‌, లలితా కూడా అదేమిటో అని ఆత్రంగా చూడసాగారు. ఇంతలో నవ్య ఒక ట్రేలో ఐదు గ్లాసులు, ఒక బ్రాందీ సీసా తెచ్చి, బ్రాందీ గ్లాసులలో పోసి తన ఫ్రెండ్స్‌ అందరికీ ఇచ్చింది. ఫ్రెండ్స్‌ అందరూ నవ్యకేసి ఆశ్చర్యంగా చూశారు. తల్లీ తండ్రీ తమని గమనిస్తున్నారని తెలుసు నవ్యకి అందుకే ”ష్‌! మాట్లాడకుండా తాగండి!” అని సైగ చేసింది ఫ్రెండ్స్‌కి.

నవ్య తమని డ్రింక్స్‌ తాగమని ఎందుకు అంటోందో తెలియకపోయినా, నవ్య సంగతి తెలుసు కనుక, ఆ సైగ వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అర్థంచేసుకుని

”వావ్‌! ఎంత మంచి సర్‌ప్రైజ్‌, మేము ఊహించనేలేదు నవ్యా! చాలా రోజులైంది డ్రింక్‌ చేసి, థాంక్స్‌” అన్నారు ఆనందంగా.

”ఛీర్స్‌!” అనుకుంటూ గ్లాసులు కొట్టుకుని, హ్యాపీ బర్త్‌ డే నవ్యా” అంటూ త్రాగటం మొదలు పెట్టారు. అందరూ ఆనందంగా డ్రింక్‌ చేస్తూ సరదాగా పార్టీ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఎప్పుడొచ్చిందో తెలియదుగానీ లలిత వచ్చి ఆనంద్‌ దగ్గర కూర్చుంది. లోపలనించి చూస్తున్న ఆనంద్‌ లలితలకి మాత్రం మతిపోయినట్లయ్యింది. ”తాము చూస్తున్నది తమ నవ్యనేనా?” అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరు.

తరవాత కొంచెంసేపు కబుర్లు చెప్పుకుని ఇంక వెళ్ళి వస్తామని నవ్య ఫ్రెండ్స్‌ వెళ్ళిపోయారు. ట్రే, గ్లాసులూ, సీసా తీసుకుని తన గదిలో పెట్టి హాలులోకి రాబోతున్న నవ్యకి ”నవ్యా ఇలారా” అని అమ్మ గట్టిగా కోపంగా పిలవటం వినిపించింది. దాంతో ఒకింత భయపడి తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళి మౌనంగా నిలబడింది గోడవారగా. ఆనంద్‌ లలితా నవ్యని కోపంగా చూసారు.

”నవ్యా ఏమిటిదంతా? పార్టీలో ఆ డ్రింక్స్‌ ఎక్కడినించి వచ్చాయి? ఎప్పటినించీ ఈ తాగుడు అలవాటు నీకు?” అడిగింది లలిత నవ్యని కోపంగా. ”నిన్నే అమ్మ ఏదో అడుగుతోంది వినిపించట్లేదా? సమాధానం చెప్పవే?” అరిచాడు ఆనంద్‌ గట్టిగా.

తండ్రికేసి ఒకసారి నిర్లిప్తంగా చూసి ”ఆ డ్రింక్స్‌ నాన్న గదిలోవే” అంది తల్లితో నవ్య. ”అయినా నాన్న తాగితే తప్పు లేదుగానీ నేను తాగితే తప్పేంటీ?” అంది, నిర్లక్ష్యంగా తండ్రికేసి చూస్తూ, తల్లితో. దాంతో కోపంతో రెచ్చిపోయి, ఎదిగిన కూతురిపైన చెయ్యి చేసుకోకూడదనే విషయాన్ని కూడా మర్చిపోయి కూతురి దవడ పగిలేలా కొట్టి ”పద” అంటూ నవ్య రెక్క పుచ్చుకుని బర బరా గదిలోకి లాక్కెళ్ళి మంచంపై బలంగా కూలేసి ”ధఢేల్‌” మని తలుపు లాగి విసురుగా వెనక వరండాలోకి వెళ్ళిపోయింది లలిత.

నవ్య నించి అలాంటి ఎదురు సమాధానం వస్తుందని ఊహించని ఆనంద్‌ ఒక్కసారి అవాక్కయ్యాడు. లలిత నవ్యని కొట్టిన చెంపదెబ్బ అంతకంటే బలంగా తనకే తగిలినట్లుగా అనిపించింది ఆనంద్‌కి. అలాగే కుర్చీలో రెండు చేతుల్లో తల పట్టుకుని కూలబడిపోయాడు. కాసేపటికి తేరుకుని ఆత్మ విమర్శ చేసుకోవటం మొదలుపెట్టాడు.

”అవును నవ్య అన్న మాటల్లో తప్పేముంది? నేను తాగుతూ నవ్యని ”ఎందుకు తాగుతున్నావు?” అని అడిగే హక్కు తనకి ఎక్కడిది? అయితే ఈ మధ్య నవ్య ధోరణిలో మార్పుకి ఇదే కారణమన్నమాట. కూతురికి బుద్ధి నేర్పాల్సిన తనే ఇలా బుద్ధిలేకుండా ప్రవర్తిస్తే, ”ఇదిగో” ఇలాగే జరుగుతుంది. పాపం ఎప్పుడూ ఆదర్శాలు వల్లించే తన తండ్రి డ్రింక్‌ చేస్తాడని తెలిసి నవ్య ఎంత బాధ పడి ఉంటుందో, పిచ్చి పిల్ల” అని అనుకున్నాడు ఆనంద్‌. అప్పుడు ఒక్కసారిగా తాను తాగుతున్నానని లలిత బాధపడటం ఏడవటం గుర్తుకు వచ్చింది. ”తనదాకా వస్తే గానీ తెలియదన్నట్లు”, ”పాపం లలితని నేను ఎంత బాధపెట్టాను?” అనుకున్నాడు ఆనంద్‌.

”అయినా కూడా నవ్య డ్రింక్‌ చేయటం చూస్తే ఎంతో బాధగా ఉంది.” ”అయినా నవ్యకి తెలియకూడదని నేను ఎంత జాగ్రత్త పడినా ఎలా తెలిసింది? లలిత చెప్పిందా? ”ఛ ఛ” లలిత చెప్పి ఉండదు. తాను ఎంతో జాగ్రత్తగా ఎవరికంటా పడకూడదని బీరువా వెనకాల పెట్టిన బ్రాందీ సీసాలు ఎప్పుడో నవ్య కంట పడ్డాయన్న మాట. సరే ఇప్పుడు నవ్యకి ఎలా తెలిసిందనేది కాదు సమస్య. ముందు నేను త్రాగటం మానేయాలి, ఆ తరువాత నవ్యని ఈ అలవాటునించి ఎలా బయటకు తేవాలన్నది చూడాలి” అని ధృఢనిశ్చయం చేసుకున్న ఆనంద్‌కి ఒక్కసారిగా ”ఆనంద్‌” అని లలిత గావుకేక వినిపించి గబగబా తన గదిలోంచి బయటకి పరిగెత్తాడు కంగారుగా ఏమైందోనని.

లలిత కేక నవ్య గదిలోంచి వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన నవ్య స్పృహ తప్పి పడి ఉంది. లలిత ”నవ్యా, నవ్యా ఏమైందమ్మా, కళ్ళు తెరు” అంటూ ఏడవసాగింది. వెంటనే ఆనంద్‌ నవ్యని చేతులలో తీసుకుని ”నవ్యని హాస్పిటల్‌కి తీసుకెళదాం పద” అంటూ గబగబా కారు దగ్గరికి పరిగెత్తాడు.

గబగబా తలుపుకి తాళంవేసి లలిత తాను కూడా వెనకాలే పరిగెత్తి కారులో కూర్చుంది. కారు రయ్యిన హాస్పిటల్‌ వైపు దూసుకుపోయింది. హాస్పిటల్‌ ఎమర్జన్సి వార్డులో నవ్యని పరీక్షించిన డాక్టరు బయటికి వచ్చి ”చెంపపైన బలంగా దెబ్బ తగలటం వల్ల తల అదిరి అమ్మాయికి స్పృహ తప్పింది. అంతే భయపడాల్సిందేమీ లేదు. కొంచంసేపట్లో తెలివివస్తుంది. రూంలోకి మారుస్తాము ఒక రెండుగంటలు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాక ఇంకొకసారి చెవి లోపలకూడా పరీక్షచేసి అంతా సరిగా ఉందని నిర్థారించాక అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు” అని చెప్పారు.

”ఇంతకీ అమ్మాయిని చెంపపైన అంత గట్టిగా ఎవరు కొట్టారు?” అంటూ అనుమానంగా ఆనంద్‌కేసి చూసారు డాక్టరు గారు. ఆనంద్‌ లలిత కేసి చూసాడు. దాంతో డాక్టరు గారికి అంతా అర్థమయ్యింది. ”కొంచెంలో అమ్మాయికి గండం తప్పింది. అదే చెవిపైన తగిలి ఉంటే వినికిడి దెబ్బ తినేది మీ అమ్మాయికి. ఇంక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి” అంటూ తనవంతు సలహా ఇచ్చి డాక్టరుగారు వెళ్ళిపోయారు.

కాసేపటికి నవ్యని పక్కనే ఉన్న రూంలోకి మార్చారు. ఆనంద్‌ లలితా ఇద్దరూ పరుగు పరుగున నవ్య దగ్గరికి వెళ్ళారు. అలికిడికి కళ్ళు తెరిచిన నవ్యకి తననే ఆదుర్దాగా చూస్తున్న అమ్మా నాన్న కనిపించారు.

”నన్ను క్షమించమ్మా నవ్యా ఇంకెప్పుడూ ఇలా జరగదు” అన్నాడు ఆనంద్‌ ప్రేమగా నవ్య తలనిమురుతూ. లలితకూడా ఆనంద్‌ మాటలని సమర్థిస్తూ ”అవును” అన్నట్లు రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కింది ఆప్యాయంగా.

”అమ్మా నాన్న మీరిద్దరూ కూడా నన్ను క్షమించండి” అంది నవ్య మనసులో వాళ్ళిద్దరినీ తాను ఎదిరించి మాట్లాడినందుకు బాధపుడుతూ.

అయితే ”పార్టీలో గ్లాసులలో పోసింది నిజమైన బ్రాందీ అయినప్పటికీ, తానూ తన ఫ్రెండ్స్‌ అది తాగలేదనీ, ఊరికే తాగినట్లు నటించామనీ, నిజానికి తనకి గానీ తన ఫ్రెండ్స్‌కి గానీ డ్రింక్‌ చేసే అలవాటులేదనే” విషయాన్ని తల్లిదండ్రులకి ఎప్పటికీ తెలియనివ్వలేదు నవ్య.

తండ్రి తనకు క్షమార్పణ చెప్పిన విధానంతోనే ఆయనలో పరివర్తన వస్తుందనే నమ్మకం కలిగింది నవ్యకి. ఆ ”పరివర్తన” శాశ్వతం కావాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంది నవ్య.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.