పుట్టింటికి ప్రయాణం కథాపరిచయం- జి. సరిత

(సుసర్ల లక్ష్మీనరసమాంబ రాసిన ఈ కథ 1932 మే నెలలో గృహలక్షి పత్రికలో వచ్చింది. వీరు ఇంద్రగంటి జానకీ బాలగారి తల్లి)

సుసర్ల లక్ష్మీనరసమాంబ గారు వ్రాసిన కథ.

ఈ కథ 1932వ సంవత్సరం మే నెలలో గృహలక్ష్మి పత్రికలో వచ్చింది.

గంగాభాయి గంటలు లెక్కించుకుంటూ చెల్లెలిని అత్తవారింట దిగబెట్టడానికి వెళ్ళిన భర్తకోసం ఎదురు చూస్తుండటంతో ఈ కథ ప్రారంభమైంది. గుమ్మం వద్ద గుర్రపుబండి ఆగడంతో భర్త వచ్చాడని ఎదురువెళ్ళి ఇంత ప్రొద్దెక్కిందేమిటి రైలు లేటైందా ఏమిటి అని అడుగుతుంది గంగాబాయి. అవును లేటయింది అంటూ కూర్చున్నాడు సుబ్బారావు. లేచి స్నానం చేస్తే భోజనం చేయవచ్చు అని గంగాబాయి అనగానే సుబ్బారావు స్నానం చేసి వస్తాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం కాగానే పడుకొని సుబ్బారావు గృహలక్ష్మి పత్రిక చూస్తుంటే ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఏమీ అనరు కదా అని అడుగుతుంది గంగాబాయి. మంచి విషయమైతేనే అడుగు అంటాడు సుబ్బారావు. దసరా పండగకి మనిద్దరిని రమ్మని ఉత్తరం వ్రాశాడు మా నాన్నగారు అంటుంది గంగాబాయి.

అవును ఈ విషయం నాకు తెలిసింది. ఐతే ఏమిటి, నీవు పుట్టింటికి వెళతావా ఇప్పుడు. ఆడవాళ్ళకు ఎప్పుడూ పుట్టింటిగోలే. ఏది ఒకసారి ఉత్తరం తీసుకురా అంటాడు సుబ్బారావు.

మనం వెళ్తామంటే మానాన్న బయలుదేరి వస్తాడట. మీకు శలవలు ఎన్ని రోజులున్నాయి అని అడుగుతుంది గంగాబాయి.

సెలవులు కేవలం పదిహేనురోజులే. సెలవుల్లో హాయిగా ఇంటిదగ్గర ఉండటమే మేలు, వూళ్ళు తిరగడం దండగ అంటాడు సుబ్బారావు. మీరు కూడా వస్తే బాగుంటుంది. మీ స్వంత ఇల్లులాగానే ఉంటుంది. శ్వశుర గృహం పరమసుఖం అన్నారు కదా; మీకేమిలోటు జరగదు అని అంటున్న భార్యతో సుబ్బారావు మాటలు బాగా నేర్చావు నీకు వెళ్ళాలని ఉంటే నీవు వెళ్ళు అంటాడు.

మనిద్దరం వెళితేనే సరదాగా ఉంటుంది. నేను వెళితే మీకు భోజనం ఎవరు వండుతారు అని అంటున్న గంగాబాయితో సుబ్బారావు నాభోజనానికి ఏ లోటు రాదు కాని నీకు వెళ్ళాలని

ఉంటే మీ నాన్నగారు రాగానే వెళ్ళు అంటాడు.

నిజంగానే సుబ్బారావు వెళ్ళమన్నాడని భావించిన గంగాబాయి మీకు కోపం వస్తుందని ఇన్ని రోజులు అడుగలేదు కాని మా వాళ్ళను చూసి చాలా రోజులైంది. మా చెల్లెలు కూడా వచ్చిందట. మీరు కూడా నాతో వస్తే మావాళ్ళు చాలా సంతోషిస్తారు. స్కూలు టీచర్లకు చాలా రోజులే సెలవులుంటాయి కదా, మళ్ళీ వెళ్ళడానికి వీలుకాదు అంటుండగా ఆలోచిద్దాంలే అంటూ వీధిలోకి వెళ్ళాడు సుబ్బారావు. గంగాబాయి తండ్రికి ఉత్తరం రాస్తుంది వచ్చి తీసుకెళ్ళమని. కూతురు రాసిన ఉత్తరాన్ని చదివి ఆమెను తీసుకెళ్ళడానికి గంగాబాయి ఇంటికి వస్తాడు ఆమె తండ్రి. తండ్రికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి క్షేమసమాచారం అడుగుతుంది గంగ. తండ్రికి చాలా మర్యాదలు చేస్తుంది గంగ. భోజనాలు చేశాక సుబ్బారావు గంగను పిలిచి ఎలాగూ మీ నాన్న మనల్ని చూడటానికి వచ్చాడు కదా మనం ఇంకోసారి వెళ్దాంలే ఈ సారి రానని చెప్పు అని భర్త అనగానే మీరు పంపుతానంటేనే కదా మా నాన్నకి

ఉత్తరం రాశాను. ఇప్పుడేమో పంపనంటారేమిటి అంటుంది గంగ. వచ్చి చూశారుగా నీవెందుకు వెళ్ళడం మీచెల్లెళ్ళను, అమ్మను కూడా ఇక్కడికే తీసుకువస్తే అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుంటాం అంటున్న భర్తతో పదిరోజులు ఉండి వస్తాను అని గంగ అనగానే నీవు వెళ్ళడం నాకు ఇష్టంలేదు నీకిష్టమైతే వెళ్ళు. మీ నాన్న రమ్మంటే ఇప్పుడు వచ్చేటందుకు వీలుకాదని చెప్పు కాని, నేను వెళ్ళవద్దన్నానని మాత్రం చెప్పకు అంటున్న భర్తతో గంగ మా నాన్నతో మీరే మాట్లాడండి అంటుంది.

గంగ తండ్రి కూడా అల్లుడిని ప్రయాణానికి సిద్ధంగా

ఉండండి అంటే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి కాని నేను మాత్రం రాను అంటాడు సుబ్బారావు. గంగ తండ్రి ఆమెను బట్టలు సర్దుకో రేపు ప్రయాణం అని అంటాడు. సుబ్బారావు భార్యకు వద్దని సైగ చేసి బజారుకు వెళ్తాడు. గోపాలంగారు ఉప్మాచేస్తున్న గంగ దగ్గర కూర్చొని తెల్లవారకుండా ప్రయాణానికి మంచిది త్వరగా బట్టలు సర్దుకో అంటుండగ గంగ నాన్నతో మీ అల్లుడికి నన్ను పంపటం ఇష్టంలేదు. మొదట పంపుతానంటే ఉత్తరం రాశాను. ఇప్పుడేమో వద్దంటున్నాడు నీవే అడుగు అంటుంది. గోపాలం గారు అల్లుడితో అమ్మాయి రానంటుంది. నీకు ఇష్టం ఉంటే అది తప్పకుండా వస్తుంది అనగా సుబ్బారావు తప్పకుండా తీసుకెళ్ళండి అంటాడు. ఆయనవెళ్ళ వద్దంటే రానన్నాను గాని నాకు రావాలనే ఉంది నాన్న అంటుంది గంగ.

విన్నావా, ఎందుకు పంపవు? పదిరోజులు ఉండి వస్తుందిలే. మావాళ్ళంతా చూడాలని కంగారు పడుతున్నారు అంటున్న మామగారితో సుబ్బారావు ఇప్పుడు అనవసరంగా ఎందుకని అన్నాను తర్వాత ఎప్పుడైన వచ్చి పదిరోజులు కాదు నెల ఉంటాము అంటాడు.

యిప్పుడే మీరిద్దరు రండి పదిరోజులు వుండండి. తర్వాత వచ్చినప్పుడు నెలరోజులు ఉండవచ్చు. మీ అత్తగారు మరీ మరీ చెప్పింది తీసుకురమ్మని. ఇద్దరూ రండి అని గోపాలం గారు అనగానే రేపటిమాట ఆలోచిద్దామని వెళ్ళిపోతాడు సుబ్బారావు.

రాత్రి భోజనాలు చేశాక గంగ తన గదిలో గృహలక్ష్మి చదువుతుండగా సుబ్బారావు వచ్చి గంగతో మీ నాన్నతో ఎందుకు చెప్పావు నేను పంపించనని అనగానే గంగ మా నాన్న నొక్కినొక్కి అడుగుతుంటే ఏమని చెప్పాలి. మీరు తీసుకువెళ్ళమంటారు. నేను రానంటే నాది తప్పు అవుతుంది. అందుకే అలా చెప్పాను అంటుండగా సుబ్బారావు నీవెందుకు పనికిరావు. వట్టి ఫూల్‌వనుకోలేదు అని తిట్టగానే నేను వెళ్ళను లెండి. రానని మానాన్నతో చెప్పి వస్తాను అని గంగ అంటుండగా ఇంత జరిగాక రానని చెపితే నేనే పంపించటంలేదు అనుకుంటాడు మీనాన్న. వస్తానని చెప్పిరా అంటాడు సుబ్బారావు. మీరు కూడా వస్తే ఇద్దరం సరదాగా వెళదాం రండి అంటున్న గంగతో నేను రాను నీవు వెళ్ళు అంటున్న సుబ్బారావుతో ఇద్దరం వస్తున్నామని చెప్పివస్తాను అంటుంది గంగ.

గంగ తండ్రితో వస్తామని చెప్పి భర్తవి, తనవి బట్టలు సర్దుతుంటే సుబ్బారావు వచ్చి నీతో రావాలన్నమాట నేను. నేను లేకపోతే వెళ్ళవా మొత్తానికి అనుకున్నది సాధించావు అసాధ్యురాలివే. నాచేత ఒప్పించావు. ఐనా నీకు పుట్టింటికి వెళ్లాలని ఎందుకంత సరదా అంటే ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్ళాలని ఆశ ఉంటుంది అని గంగ అనడంతో ఈ కథ ముగుస్తుంది.

కథా విశ్లేషణ – పుట్టిల్లు : అత్తిల్లు

సమాజంలో అంతర్భాగమైన కుటుంబవ్యవస్థకు కొన్ని నియమాలను రూపొందించింది ఈ సమాజం. కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు సభ్యులైతే, పిల్లలకు వివాహ వయస్సు వచ్చేవరకు వారంతా ఒకే కుటుంబ సభ్యులుగా మెలుగుతారు కాని మగ పిల్లలకు వివాహమైతే అతనికి వచ్చే భార్య కూడా అతనితో పాటు ఆ కుటుంబంలో సభ్యురాలవుతుంది. కాని ఆడపిల్లలకు వివాహమైతే వారు ఆ ఇంటిని వదిలి ”ఆడ”కే (అత్తవారింటికి) వెళ్ళాల్సివచ్చే ఒక నియమనిబంధనను రూపొందించింది ఈ సమాజం. ఇలా ఆడపిల్లలు తల్లివారింటి నుండి అత్తవారింటికి వెళ్ళే క్రమంలో తనకు పుట్టినపుడు పెట్టిన పేరును, తల్లిగారింటి పేరును వదిలివేసి అత్తవారింటి బాధ్యతలను మోయాలనిపిస్తుంది. వివాహవ్యవస్థ ఆడపిల్లను ”ఆడ” (అత్తారింటికెళ్ళే అమ్మాయిగా) పిల్లగా మార్చింది. అప్పటికి అమ్మాయిలకు అత్తవారిల్లే తన ఇల్లు అవుతుంది. పుట్టిల్లు పరాయిఇల్లుగా మారుతుంది. కాని పుట్టింట్లో స్వేచ్ఛగా పెరిగిన అమ్మాయికి అత్తవారింట్లో స్వేచ్ఛ లేకపోవడం, అత్తమామలు, ఆడపడుచు, భర్త పెట్టే హింస, వారి నియంత్రణ, అధికార ధోరణి ఇవన్ని ఆమెకు అత్తవారింటిపై అది తన ఇల్లే అన్న మమకారం కలిగించలేకపోతున్నాయి. అదలావుండగా పుట్టింటి వారి ఎడబాటు భరించరానిదై ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కల్పించుకొని తన వారిని కలుసుకొనటానికి ”పుట్టింటి ప్రయాణం” చెయ్యాలా అని ఆతృతతో ఎదురుచూసేట్లు చేస్తుంది.

ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే తల్లిదండ్రులు, సోదరులు చూపే ఆప్యాయత, అభిమానం, ఉన్న కొద్ది సమయమైనా స్వేచ్ఛగా గడిపే క్షణాలు, పుట్టింటివారు పెట్టే పసుపుకుంకుమలు ఇవన్ని ఆడపిల్లలకు అనిర్వచనీయమైన ఆనందాన్ని, భరోసాను, భద్రతను కలిగిస్తాయి. కాని ఆడపిల్ల అత్తింటి నుండి పుట్టింటికి రావడానికి అధికారం లేదు. ఆమె అలా రావాలంటే భర్త, అత్తమామల, ఇతర కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవలసివస్తుంది.

ఆడపిల్లకు పుట్టింటికి వెళ్ళాలన్న ఆశ భర్త ఆమోదంతోనే తీరుతుంది. భర్త ఆమోదం తెలపనపుడు ఆ భార్య అసంతృప్తి అంతా ఇంతా కాదు. మరి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్న భార్య తన భర్తను ఎలా ఒప్పించిందో చివరికి అతన్ని కూడా తనతో పాటు ఎలా ప్రయాణానికి సిద్ధం చేసిందో సుసర్ల లక్ష్మీనరసమాంబ రచించిన పుట్టింటికి ప్రయాణం అనే కథ ద్వారా తెలుసుకోవచ్చు.

గంగాబాయి తండ్రి కూతురిని పుట్టింటికి రమ్మని ఉత్తరం రాస్తాడు. వచ్చిన ఉత్తరాన్ని చదివి భర్తకు ఈ విషయాన్ని తెలిపి పుట్టింటికి వెళ్ళాలి ఆమె. కాని పుట్టింటి నుండి ఉత్తరం వచ్చిందని, తండ్రి పండగకి రమ్మన్నాడని నేరుగా భర్తకు తెలిపే ధైర్యం, చొరవ కూడా లేదు గంగకి. ముందుగా అతనితో ”ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఏమీ అనరు గదా” అని గంగ ముందుగా అడిగితే మంచి సంగతైతే యేమీ అనను అడుగు అని హామీ ఇస్తాడు అతను. అంటే భర్త తనను ఏమీ అనడు అనే భరోసా ఇచ్చిన తర్వాతనే తన తండ్రి రాసిన ఉత్తరం గురించి ఆమె భర్తకు తెలియజేసింది. మంచిసంగతైతే ఏమీ అనను అన్న భర్తమాట గమనించదగింది. అది ”మంచి సంగతి” అని ఎవరు నిర్ధారించాలి? అది ఎవరికి మంచి సంగతి? అంటే నిర్థారించాల్సింది భర్తే – ఆయనకు మంచిదైతేనే అది మంచిది.

ఉత్తరం గురించి చెప్పగానే సుబ్బారావు ఎప్పుడూ ఆడవాళ్ళకి పుట్టింటి గోలేనా అని అంటాడు. అంటే భార్య పుట్టింటికి వెళ్ళటం భార్యకు మంచి సంగతేమో కానీ భర్తకు మాత్రం కాదు. అందుకే పుట్టింటికి పోవాలన్న ఆమె ఆశ అతనికి గోలగా అనిపించింది.

సుబ్బారావుకు భార్య పుట్టింటికి వెళ్ళడం ఇష్టంలేదు. అందుకే ఈ సెలవుల్లో హాయిగా ఇంటిపట్టునే ఉందాం. ఊళ్ళు తిరగడమెందుకు అంటాడు భార్యతో.

భర్తను ఒప్పించడానికి గంగ మా పుట్టింటికి వెళ్తే, మీరు కష్టపడనక్కరలేదు. మీ స్వంత ఇల్లులాగే ఉంటుంది. శ్వశుర గృహం పరమ సుఖం అన్నారు అంటూ భర్తకు ఒక ఆశను చూపించింది. అల్లుడు అత్తవారింటికి వెళ్తే అత్తమామలు, బావమరుదులు చాలా ఆదరంగా చూస్తారు. సకల సౌకర్యాలు కల్పిస్తారు. చక్కటి మర్యాదలు చేస్తారు. అత్తగారింట్లో ఉన్నన్ని రోజులు అల్లుడికి పరమ సౌఖ్యంగా ఉంటుంది. కనుకనే గంగ మీ స్వంత ఇల్లులాగే ఉంటుంది అని భర్తకు తన పుట్టింటిపై ఆశను చూపగలిగింది. ఐనా సుబ్బారావు అత్తగారిల్లును పరాయి ఇల్లుగా భావించాడు. కనుకనే అత్తగారిల్లు నా స్వంత ఇల్లు లాగా ఎలా ఉంటుంది అని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు. ఒకవేళ నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు అని అంటాడు.

తనను మాత్రమే పుట్టింటికి వెళ్ళమన్న గంగకు తాను ఒంటరిగా వెళ్ళడం నచ్చలేదు. తనతో పాటు భర్త కూడా రావాలన్నది ఆమె కోరిక. ఒక వేళ తాను ఒక్కతే వెళితే భర్తకు భోజనం ఎలా అన్న సమస్య ఆమెది. అనాది కాలం నుండి భర్తనే సర్వస్వంగా భావించి, భర్త క్షేమమే తమ క్షేమమని భావించిన స్త్రీలు ఎల్లవేళల భర్త అవసరాలను గమనిస్తూ వారికి కావలసినవి సిద్ధం చేస్తూ నిత్యం గృహకార్యకలాపాలలో గడిపేవారు. అందుకే గంగ తాను పుట్టింటికి వెళ్తే భర్తకు భోజనం ఎవరు సిద్ధం చేస్తారు అని ఆలోచించగలిగింది. అదే విషయాన్ని సుబ్బారావుతో అంటుంది. నేనువెళితే మీకు భోజనం ఎలా అని గంగ అనగానే ”నా భోజనానికేమిలే, నీవంత పట్టుదలగా వెళ్ళాలంటే వెళ్ళు మీ నాన్న వస్తే” అని సుబ్బారావు అనటంలో గంగ పుట్టింటికి వెళ్తే తనకు వంట చేసుకోవడం సమస్యగానే ఉంటుంది. ఐనా ఆ విషయాన్ని భార్యకు చెప్పి ఆమె దృష్టిలో చులకన కావడం అతనికిష్టం లేదు కనుకనే భార్య పుట్టింటికి వెళ్ళినంతమాత్రాన తన భోజనానికి ఏ ఇబ్బంది రాదు అన్న వ్యంగ్యం, అహంకార ధోరణి స్పష్టమవుతాయి.

మీ నాన్న వస్తే నీవెళ్ళు అని సుబ్బారావు అనగానే గంగ చాలా సంతోషించింది. అసలు తండ్రి ఉత్తరం రాశాడని గంగ భర్తను అడిగింది కాని ఆమెకు ఎప్పటి నుండో తల్లిగారింటికి వెళ్ళాలని ఉంది. ఆమె పుట్టింటికి వెళ్ళి సరిగ్గా ఏడాదైంది. భర్త ఎక్కడ కోపగిస్తాడో అనుకొని పుట్టింటికి వెళ్ళాలనే కోరికను ఇన్నాళ్ళు బయటపెట్టలేదు గంగ.

ఇప్పుడు తండ్రి నుండి ఉత్తరం రాగానే గంగకు భర్తను అడిగే ధైర్యం వచ్చింది. తన చెల్లెలు కూడా పుట్టింటికి వచ్చిందని తెలిసి ఎలాగైనా ఆమెను కూడా చూడాలని ఉందని మనిద్దరం కలిసి వెళ్తే వాళ్ళు సంతోషిస్తారని భర్తను ఒప్పించే ప్రయత్నం చేసింది. భర్త తనను వెళ్ళమనగానే ఎలాగైనా తనను ఒక్కదాన్ని అయినా పంపిస్తాడు కావచ్చు అని నమ్మిన గంగ తండ్రికి తనను తీసుకుపొమ్మని ఉత్తరం రాస్తుంది.

గంగ రాసిన ఉత్తరాన్ని చదివి ఎలాగైనా అల్లుడు కూతుర్ని పంపిస్తాడేమోననుకొని గంగ తండ్రి గోపాలం కూతురింటికి వస్తాడు.

మామగారు రాగానే సుబ్బారావు గంగను పిలిచి నీవు మాత్రమెట్లా వెళతావు, యీసారి మేమిద్దరం కలిసివస్తామని చెప్పు అంటాడు. ఆమాట వినగానే గంగ నిరాశ చెందింది. గంగ భర్తతో మాట మారుస్తున్నారు ఎందుకండి మీరు కూడా వస్తే మంచిది అంటుంది కాని సుబ్బారావు ససేమిరి ఒప్పుకోడు. భర్తను ఒప్పించడానికి మా చెల్లెలు, మా అమ్మ అంతా నన్ను చూడాలని అంటున్నారు. వారికోసమైనా వెళదాం రండి అంటూ బ్రతిమిలాడుతుంది గంగ. కాని సుబ్బారావు ఆ మాటకు కూడా అంగీకరించే స్థితిలో లేడు. నేను మాత్రం రాను నీకు ఇష్టమైతే వెళ్ళు కాని నేను వద్దన్నానని మాత్రం మీ నాన్నకు తెలియజేయకు. నీవే ఏదో సర్దిచెప్పు అంటాడు.

గోపాలం కూడా అల్లుడిని పండగకి వచ్చి పదిరోజులు ఉండమని బ్రతిమిలాడిన, నాకు వీలు కాదు కాని మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటూ భార్యకు మాత్రం వెళ్ళవద్దనట్లు సైగ చేస్తాడు.

గోపాలం కూతురిని బట్టలు సర్దుకోమంటాడు. గంగ తండ్రితో నన్ను పంపటం ఇష్టం లేదువారికి. మొదట పంపిస్తానంటే నీకు ఉత్తరం రాశాను కాని ఇప్పుడు పంపనంటున్నాడు అని అసలు నిజం చెప్తుంది తండ్రికి. ఇక అల్లుడినే అసలు సంగతి అడుగుదామని గోపాలం సుబ్బారావుతో అమ్మాయి రానంటుంది మరి అని అనగానే ఆమె రానంటే నేనేమి చెయ్యాలి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటాడు సుబ్బారావు. మామ అడిగిన తర్వాత కూడా సుబ్బారావు తన తప్పు బయటపెట్టకుండా భార్య మీదకే త్రోసివేస్తాడు.

గోపాలం నీకు ఇష్టముంటే తప్పకుండా వస్తుంది అని అల్లుడిని అనగానే సుబ్బారావుకు ఏమి చెప్పాలో ఎలా తప్పించుకోవాలో తెలియక నేనేమి చెప్పను తీసుకెళ్ళండి అని అనగానే గోపాలం అమ్మాయీ! విన్నావా తీసుకువెళ్ళమన్నాడతను, నీవు రానంటావు అనగానే గంగ ఆయనకి యిష్టం లేనిదే నేనెట్లా రాను, పంపిస్తే తప్పకుండా వస్తాను. అతను వద్దు అని చెప్పడం వల్ల రానన్నాను కాని నాకు రావాలనే ఉంది నాన్న అంటుంది. ఆమాట వినగానే సుబ్బారావు అల్లుడితో అమ్మాయి రాకపోవడానికి కారణం నీవే. పదిరోజులుంచుకొని పంపిస్తాను అనగానే సుబ్బారావు ఇప్పుడు అనవసరంగా వెళ్ళడమెందుకు అన్నాను. మరోసారి ఇద్దరం వచ్చి పదిరోజులు కాదు నెలరోజులు ఉంటాము. అని మామగారి ముందు తన తప్పు బయటపడకుండా సర్దిచెపుతాడు. గోపాలం అల్లున్ని ఒప్పించడానికి ఈ సారి వచ్చి పదిరోజులు ఉండండి. తర్వాత వచ్చి నెలరోజులు ఉండండి మీ అత్తగారు మరీమరీ చెప్పింది నిన్ను తీసుకురమ్మని అనగానే అలాగే లెండి రేపటిమాట ఆలోచిద్దాం అని వెళ్ళిపోతాడే కాని భార్య, మామ ఇద్దరూ ఇంతగా బ్రతిమిలాడుతున్నా తాను మాత్రం అంగీకరించే స్థితిలో ఉండడు సరికదా మామ ముందట తన తప్పు బయట పడకుండా ఉండాలని భార్యనే దోషిని చేయాలని అనుకుంటాడు.

సుబ్బారావు తనే భార్యను పంపించనన్నాడన్న నిజం మామకి తెలిసిందని గ్రహించి భార్య వద్దకు వెళ్ళి నేను పంపించనన్నాని ఎందుకు చెప్పావు. నీవెందుకు పనికిరావు వట్టి ఫూల్‌వి అని తిట్టేసరికి గంగ బాధతో సరేలెండి నేను రానని చెప్తాను. తర్వాత మీరు, నేను వెళ్దాం లెండి అంటూ వెళ్తుంటే ఇంతా జరిగాక ఇప్పుడు రానంటే నాదే తప్పు అంటారు. అందుకే వస్తానని చెప్పిరా అని గంగతో సుబ్బారావు అనగానే సరే వస్తానని చెబుతాను కాని మీరూ రండి సరదాగా వెళదాం అని గంగ అనగానే నేను రాను నీవే వెళ్ళు అని సుబ్బారావు అంటుంటే గంగ మీరు రాకపోతే నేను వెళ్ళను. మీరు కూడా వస్తున్నారని చెప్తాను అంటూ తండ్రితో చెప్పివచ్చి ఇద్దరి బట్టలు కూడా సర్దింది. వాటిని చూసి సుబ్బారావు మొత్తానికి అసాధ్యురాలివే నాచేత ఒప్పించావు. ఐనా నీకు పుట్టింటికి వెళ్ళాలని ఎందుకంత సరదా? అని భార్యను అడగగానే ఎవ్వరికైనా పుట్టింటికి వెళ్ళాలని ఆశ ఉండదూ అంటూ గంగ సమాధానమిచ్చింది.

ముగింపు : ఈ కథలో గంగకే కాదు ఏ ఆడపిల్లకయినా తనంతట తాను తల్లిగారింటికి వెళ్ళే స్వేచ్ఛలేదు. తనకు వెళ్ళాలని ఉన్నా భర్తను అడిగే స్వేచ్ఛకూడా లేదు. ఆమె పుట్టింటికి వెళ్ళాలంటే మొదట తండ్రి నుండి రమ్మని ఉత్తరం రావాలి, ఆ ఉత్తరం చూపి ఆడపిల్ల భర్తను ఒప్పించాలి, తర్వాత వచ్చి తమను తీసుకెళ్ళమని తండ్రికి ఉత్తరం రాయాలి, తండ్రి వచ్చి అల్లుడి అనుమతితో కూతురిని పుట్టింటికి తీసుకువెళ్ళాలి. ఇద్దరినైనా సరే మామగారో, బావమరిదో వచ్చి తీసుకొని వెళ్ళాల్సిందే. ఇది తెలుగువారిళ్ళ సంప్రదాయం. ఆ సంప్రదాయమే ఈ కథకు నేపథ్యం.

ఈ కథలో కూడా గంగను, ఆమె భర్తను పండగకి రమ్మని గంగ తండ్రి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం చూపి గంగ భర్తను ఒప్పించి తనను తీసుకెళ్ళమని తండ్రికి ఉత్తరం రాస్తుంది. ఉత్తరం చదివిన తండ్రి కూతురిని తీసుకెళ్ళడానికి వస్తే తీరా భర్త వద్దన్నాడని, రానని తండ్రితో చెప్పగానే గంగ తండ్రి కూడా అల్లుడిని ఒప్పించడానికి చేసిన ప్రయత్నం, మరోవైపు గంగ భర్తను ఒప్పించడానికి చేసిన ప్రయత్నం కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది రచయిత్రి ఈ కథలో. ఈ కథ కుటుంబంలో హింసను బయటపడనీయలేదు. గంగ గృహలక్ష్మి పత్రిక చదవడం వల్ల ఆమె విద్యావంతురాలైన స్త్రీ అని తెలుస్తుంది. అణిగిమణిగి ఉన్నట్లే కనిపించినా తన పనిని సానుకూలం చేసుకోనే చాతుర్యం కలిగిన యువతి గంగ. తన ఒద్దిక ప్రవర్తన ద్వారా భర్తను ఒప్పించి తనతో పాటు ప్రయాణానికి సిద్ధం చేసింది గంగ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.