అమెరికా తెలుగు కథా సాహిత్యంలో ‘గృహహింస’ చిత్రణ- డాక్టర్‌ తన్నీరు కళ్యాణ్‌ కుమార్‌

శారీరకంగాకానీ, మానసికంగాకానీ కుటుంబ సభ్యులు హింసించడాన్ని గృహహింస అంటారు. అనాది కాలం నుండి పురుషాధిక్యపు భారతీయ సమాజంలో స్త్రీ అణిచివేతకు గురి అవుతూనే ఉంది. తరాలు మారినా స్త్రీ – పురుషుల మధ్య అంతరాలు మాత్రం మారడం లేదు. భారతీయ కుటుంబవ్యవస్థలో పురుషునిదే పై చేయి. వివాహానంతరం భార్య, భర్త అదుపాజ్ఞలలో జీవనం సాగించాలనేది భారతీయ ధర్మం. ఈ ధర్మమే స్త్రీల పాలిట శాపమైకూర్చుంది. భారతీయ నారీమణులకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమే ఈ అవమానాలకు ప్రధాన కారణం. ఆధునిక సమాజంలో కూడా స్త్రీ ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలా కుటుంబాలలో భర్తదే పైచేయిగా ఉంటుంది. సంసారంలో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే భర్తలు స్త్రీలను శారీరకంగా హింసించడమనేది భారతీయ కుటుంబ వ్యవస్థలో సర్వసాధారణమైపోయింది.

భారతీయ వివాహవ్యవస్థలోని వరకట్న దురాచారం అనేక కుటుంబాలలో స్త్రీలపై జరిగే గృహహింసకు ప్రధాన కారణభూతమవుతుంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలలో కూడా ఈ గృహహింసలకు గురికాబడిన స్త్రీలు

ఉన్నారు. అక్కడి భారతీయ కుటుంబాలలో భర్తలు పెట్టే హింసలకు బలైన స్త్రీల వేదనలు మీడియాలో తరుచుగా గమనిస్తూనే ఉన్నాం. పరాయిగడ్డపై భార్యకు అండగా నిలవాల్సిన భర్తే ఆమెను క్రూరంగా హింసించడమనేది హీనమైన చర్య. ఉన్నత చదువులు చదువుకొని, గౌరవప్రదమైన ఉద్యోగాలలో కొనసాగుతున్నవారు కూడా స్త్రీలను హింసించడం విచారకరం.

లక్షల – కోట్ల రూపాయలు వరకట్నం తీసుకొని వివాహం చేసుకున్న భర్తలు తమ భార్యలకు రక్షణ ఇవ్వకపోగా, శారీరకంగా – మానసికంగా హింసలకు గురిచేస్తుంటే, ఆ పరాయి దేశంలో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, స్వదేశంలోని తల్లిదండ్రులకు చెప్పుకోలేక మౌనంగా మూగవేదనను అనుభవిస్తున్న గృహిణులను కేంద్రంగా చేసుకొని అమెరికా తెలుగు కథా సాహిత్యంలో కొన్ని కథలు వెలువడ్డాయి. అక్కడ గృహహింసలకు గురైన భారతీయ స్త్రీలకు అండగా నిలిచి వారి తరుఫున పోరాడే సంస్థలను గూర్చి కూడా ఈ కథలు వివరిస్తాయి. ఆర్థిక స్వావలంబనతో స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిన ఆవశ్యకతను ఈ కథలు నొక్కి చెబుతాయి.

తరాలు మారినా, ఖండాలు దాటినా భారతనారికి భర్త వల్ల కలిగే బాధలు మాత్రం తప్పడం లేదని కొవ్వలి కాటూరి జ్యోతి రాసిన ‘తరతరాల కథ’ అనే కథ తెలుపుతుంది. మూడు తరాలకు చెందిన ముగ్గురు స్త్రీలు తమ తమ జీవితాలలో పొందిన వేదనను ఈ కథ చిత్రించింది. ఈ కథలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యమునను భర్త మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఉన్నత విద్యావంతురాలైన యమున ఎంతో కష్టపడి కెనడాకు వెళ్తుంది. అక్కడ తన భర్త తనకంటే ముందే మరొక అమ్మాయిని చేసుకొన్నాడని తెలిసి ఆశ్చర్యపోతుంది. అలాంటి స్థితిలో పరాయి దేశంలో ఏమి చేయాలో తెలియక బాధపడుతున్న యమునను గంగ ఆదరిస్తుంది. గంగ ఇచ్చిన స్ఫూర్తితో యమున తన కాళ్ళ మీద తాను నిలబడి, తన కొడుకుని బాగా చదివించుకుంటుంది. అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడిన యమున కొడుకు తెలుగమ్మాయిని వివాహం చేసుకొని యమునను బాగా చూసుకుంటూ ఉంటాడు.

యమునకు స్ఫూర్తినిచ్చిన గంగ విషయానికొస్తే ఆమెకు చిన్నతనంలో వివాహం కావడం చేత 15 ఏళ్ళకే ఒక బిడ్డకు జన్మనిస్తుంది. పిల్లవాడు పుట్టిన నాలుగు నెలలకే ఆమె భర్త కాలం చేయడంతో ఆ వయస్సుకే ఆమెను విధవను చేయడం భరించలేని ఆమె అన్న తనను మద్రాసుకు తీసుకొని వస్తాడు. అక్కడ గంగ అనేక పనులు చేసుకుంటూనే తాను చదువుకొని తన కాళ్ళమీద నిలబడి పిల్లవాడిని పెంచి పెద్ద జేసి అతనికి మంచి భవిష్యత్తునిస్తుంది. గంగ తన కొడుకు – కోడలితో కెనడాకు వచ్చి అక్కడ సంగమ్‌ అనే నర్సింగ్‌ హోమ్‌ను నడుపుతూ కష్టాల్లో ఉన్న అనేకమంది స్త్రీలను ఆదుకుంటూ ఉంటుంది. ఈ కథలోని మరొక పాత్ర అయిన సరస్వతి వివాహానంతరం భర్త వెంట విదేశాలకు వస్తుంది. సరస్వతిని ఆమె భర్త శారీరకంగా హింసించడమే గాక, అనుమాన రోగంతో ఆమె డుపులో పెరుగుతున్న బిడ్డను కూడ చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. యమున తనకు పరిచయమైన సరస్వతిని గంగ వద్దకు తీసుకెళ్తుంది. గంగ ఆమెకు ధైర్యం చెప్పి నర్సింగ్‌ హోమ్‌కు ఆహ్వానించి ధైర్యం చెప్పడంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో గంగ, యమున, సరస్వతీ మూడు తరాలకు చెందిన స్త్రీమూర్తులు. కానీ ఈ స్త్రీలు అనుభవించిన కష్టాలు దాదాపు ఒకే రకమైనవి. జీవితంలో ఎదురైన కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించడమే గాక, తన చుట్టూ ఉన్న తమలాంటి వారిని చైతన్యపరిచే గంగ లాంటి స్త్రీమూర్తుల అవసరం అమెరికన్‌ సమాజానికి ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ అవసరం భారతీయ సమాజానికి ఉంది. భర్త పెట్టే బాధలను భరిస్తూ కూడా తాను భర్తను వీడి వస్తే అతను ఏమైపోతాడోనని ఆలోచించే సరస్వతి లాంటి సహన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు.

సత్యం మందపాటి రచించిన ‘మరణముహూర్తం’ కథలో సునేత్ర గృహహింసకు గురైన ఒరిస్సా అమ్మాయి. వివాహానంతరం భర్తతో పాటు అమెరికాకు వచ్చిన సునేత్రను ఆమె భర్త అనేక శారీరక – మానసిక హింసలకు గురి చేస్తాడు. సహనం నశించిన సునేత్ర భర్తను హత్య చేస్తుంది. తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తాను ఆత్మహత్యకు పాల్పడుతుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలం కాగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. టెక్సాస్‌ కోర్టు ఆమెకు మరణశిక్షను విధిస్తుంది. జైలులో కూడా సునేత్ర ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకనాడు సెక్యురిటీ గార్డు తుపాకి లాక్కొని కాల్చుకోబోతుంది. ఆమె చేతిలోని తుపాకీని తీసుకుందామని ప్రయత్నించిన మరో పోలీసు ఆఫీసర్‌ తుపాకి పొరపాటున పేలి బుల్లెట్‌ ఆమె ఛాతీలోకి దూసుకెళ్ళడంతో మరణిస్తుంది. వైవాహిక జీవితాన్ని మధురంగా ఊహించుకుంటూ అమెరికా వెళ్ళిన సునేత్ర భర్త వేధింపులతో నరకాన్ని చూసి, బిడ్డల్ని చంపుకొని తన జీవితాన్ని తానే అంతం చేసుకుంటుంది. ఈ కథలో సునేత్ర పాత్ర పట్ల పాఠకులకు అపారమైన సానుభూతి కలుగుతుంది.

గృహహింసను చిత్రిస్తూ సత్యం మందపాటి రాసిన మరో కథ ‘రామేశ్వరం పోయినా’. ఈ కథలో సరళను భర్త భాస్కర్‌ కట్నం కోసం వేధిస్తుంటాడు. అందరి ముందు భార్యతో ఆప్యాయంగా

ఉన్నట్లు నటిస్తూ భాస్కర్‌ ఇంట్లో భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ

ఉంటాడు. సరళను చేసుకోవడం వల్ల తనకు రెండు లక్షల కట్నం తగ్గిందని హింసిస్తూ ఉంటాడు. భర్త పెట్టే బాధలను గూర్చి స్వదేశంలోని తల్లిదండ్రులకు చెప్పాలని సరళ అనేక సార్లు అనుకుంటుంది. కానీ లక్షలు ధారపోసి పెళ్ళి చేసి అమెరికాకు పంపిన తమ కూతురు బ్రతుకు ఇలా అయినందుకు వారు బాధపడతారని ఈ విషయాలు వారికి చెప్పదు. ఒకనాడు భాస్కర్‌ తన భార్య సరళను చంపడానికి ప్రయత్నిస్తాడు. భర్త నుండి తప్పించుకున్న సరళ తనను కాపాడమని తమకు సమీపంలో నివసించే నాగరాజు దంపతులను ఆశ్రయిస్తుంది. ఈ విషయాన్ని నాగరాజు దంపతులు అక్కడ స్త్రీ హక్కుల కోసం పోరాడే సంస్థలో సభ్యురాలైన నిరుపమ దృష్టికి తీసుకెళ్తారు. కొద్దిసేపటికి భాస్కర్‌ నాగరాజు ఇంటికి వచ్చి సరళను బలవంతంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేయబోతాడు. అప్పటికే నాగరాజు భార్య శారద పోలీసులకు ఈ విషయం తెలియజేయడంతో వారు అక్కడికి వచ్చి, సరళ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భాస్కర్‌ను అరెస్ట్‌ చేస్తారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్లుగా అమెరికాకి వెళ్ళిన భారతనారికి కట్నం బాధలు – గృహ హింసలు తప్పడం లేదని ఈ కథ తెలియజేస్తుంది. అట్లే అమెరికాలో భార్యభర్తలిద్దరికీ ఆస్తిపై సమానమైన హక్కు

ఉంటుందని ఈ కథ తెలుపుతుంది.

పూడిపెద్ద శేషుశర్మ రాసిన ‘చీకటి వెలుగులు’ కథలో మాధవి గృహహింస బాధితురాలు. వివాహానంతరం అమెరికాకు వచ్చిన మాధవికి ఆమె భర్త తన శాడిజంతో నరకాన్ని చూపిస్తాడు. ఆమె శరీరంపై వాతలు పెడుతూ ఆనందపడుతుంటాడు. భర్త పెట్టే ఇబ్బందులను స్వదేశంలో తమ వారికి చెబితే వాళ్ళు ఎక్కడ బాధపడతారోనని భర్త పెట్టే అన్ని బాధలను మాధవి మౌనంగా భరిస్తూ ఉంటుంది. ఇంతలో భర్తకు ఎయిడ్స్‌ అన్న సంగతి తెలియగానే ఆ నరకం నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్న మాధవికి కిషోర్‌ స్వదేశానికి వెళ్ళడానికి సహాయపడతాడు. వైవాహిక జీవితంలో విషాదాన్ని చవిచూసిన కిషోర్‌ చివరకు మాధవిని వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

భర్తే సర్వస్వమని నమ్మి, అతనితో జీవితం పంచుకోవాలని కోటి ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఒక తెలుగింటి ఇల్లాలికి ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో పొన్నలూరి పార్వతి రాసిన ‘ఇది కథ కాదు’ అనే కథ తెలియజేస్తుంది. ఈ కథలో సాహితి, వైజయంతి మంచి స్నేహితులు. వైజయంతి ఉన్నత చదువు కోసం అమెరికాకి వెళ్తుంది. వివాహానంతరం అమెరికాకి వచ్చిన సాహితిలో ఒకప్పటి ఉత్సాహం లేకపోవడం వైజయంతి గమనిస్తుంది. స్నేహితురాలి విచారానికి గల కారణాలు కనుక్కోవాలనే ఉద్దేశ్యంతో ఒకనాడు వైజయంతి, సాహితి ఇంటికి వెళ్తుంది. అక్కడ సాహితి భర్త శ్రీనివాస్‌ తీరు, ఆమె అత్తగారి ప్రవర్తన గమనించిన వైజయంతికి సాహితి విచారానికి గల కారణం అవగతమవుతుంది.

సాహితి కూడా తన ఆవేదనను స్నేహితురాలికి చెప్పుకొని బాధపడుతుంది. భర్త శ్రీనివాస్‌ పెద్దవాళ్ళ బలవంతం కొద్దీ తనను వివాహం చేసుకున్నాడని, అతనికి తనపై ఎలాంటి అభిమానం లేదని, అంతేగాక అనేక రకాలుగా తనను అవమానిస్తాడని, అందుకు అత్తమామలు కూడా వంతపాడుతుంటారని చెబుతుంది. నిరాశ-నిస్పృహలతో కృంగిపోతున్న సాహితికి వైజయంతి కొండంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. జీవన సమరంలో పోరాడి గెలవాలనే స్ఫూర్తిని స్నేహితురాలికి అందిస్తుంది. ఆర్థికంగా సాహితి తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఉద్యోగం చేయాలనీ, ఆ దిశగా అభ్యుదయం వైపుకు పురోగమించాలని వైజయంతి తన స్నేహితురాలికి ప్రబోధిస్తుంది. ఆ విధమైన నిర్ణయానికి సాహితి సిద్ధం కావడంతో కథ ముగుస్తుంది. దేశం కాని దేశంలో భర్త అనురాగాన్ని – ఆత్మీయతను పొందక బ్రతుకీడ్చుతున్న భారత నారీమణులకు స్ఫూర్తినిచ్చే కథ యిది.

భర్తలు పెడుతున్న హింసలను మౌనంగా సహిస్తున్న మహిళాలోకం ఒక్కసారి కన్నెర్ర చేస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆరి సీతారామయ్య రాసిన ‘గట్టు తెగిన చెరువు’ అనే కథ విశదీకరిస్తుంది. ఈ కథలో శారద వివాహానంతరం భర్త మాధవరావుతో పాటు అమెరికాకి వస్తుంది. మాధవరావు భార్యను అనేక రకాలుగా అవమానిస్తుంటాడు. శారద అన్నింటిని మౌనంగా భరిస్తూ ఉంటుంది. ఇంతలో మాధవరావు ఉద్యోగం పోతుంది. దీంతో మాధవరావు మరింత రెచ్చిపోయి శారదను హింసిస్తూ ఉంటాడు. ఆ బాధలన్నింటినీ శారద భూదేవి వలె భరిస్తూ ఉంటుంది. కొద్దిరోజులకు మాధవరావుకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది. అయినా అతని ప్రవర్తనలో ఏ మార్పు రాదు. అతని నీచ ప్రవర్తన పరాకష్ఠ దశకు చేరుతుంది. దీంతో సహనం నశించిన శారద భర్తను హత్య చేస్తుంది.

భారతీయ సమాజంలో స్త్రీలు అన్ని విషయాలలో భర్తలపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇప్పటికీ భారతీయ సమాజంలో చాలా మంది స్త్రీలు ఇలాంటి వారే. కాలం మారుతున్న కొద్దీ స్త్రీలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా పురోగమిస్తున్నారు. స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా భర్తలపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఐతే చాలా మంది భర్తలకు స్త్రీలు ఉద్యోగాలు చేయడం నచ్చదు. స్త్రీలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే ఎక్కడ తమ అధికారం అడుగంటిపోతుందోనని పురుష ప్రపంచం భయపడిపోతుంది. ఈ క్రమంలో ఉద్యోగాలు చేస్తున్న భార్యలను చాలామంది భర్తలు మానసికంగాను, శారీరకంగానూ హింసిస్తున్నారు. ఇలాంటి భారతీయ భర్తల దృక్పథాలను వెల్లడించే కథలు అమెరికా తెలుగు కథా సాహిత్యంలో వెలుగు చూసాయి.

అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో నివసిస్తున్నప్పటికీ, ఏమాత్రం మారని కొందరు భారతీయ భర్తల దృక్పథాన్ని ఆరి సీతారామయ్య రాసిన ‘రెండు వారాల సెలవు’ కథ వెల్లడిస్తుంది. ఈ కథలో అమెరికాలో ఉద్యోగం చేసే శ్రీనాథ్‌, సుమతిని వివాహమాడతాడు. భర్తతో అమెరికాకి వచ్చిన సుమతి తాను కూడా కోర్సులు నేర్చుకుంటూ, ఒక చిన్న ఉద్యోగంలో చేరుతుంది. కానీ శ్రీనాథ్‌కి భార్య ఉద్యోగం చేయడం ఏమాత్రం నచ్చదు. ఇంతలో శ్రీనాథ్‌ ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. శ్రీనాథ్‌ తనతో పాటు సుమతిని కూడా రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అందుకు సుమతి తాను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుంటే మళ్ళీ తనకు ఉద్యోగం రావడం కష్టమని, కాబట్టి కొన్ని రోజుల తరువాత వస్తానని అంటుంది. అందుకు శ్రీనాథ్‌ రెండు వారాలలో సుమతి తన వద్దకు రాకపోతే విడాకులు ఇస్తానని బెదిరిస్తాడు. సుమతి ఎన్నో రకాలుగా భర్తకు నచ్చచెప్పి ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అంతేగాక శ్రీనాథ్‌ అనేక రకాలుగా సుమతిని హింసించే ప్రయత్నాలు చేస్తాడు. ఆమెను చంపుతానని కూడా బెదిరిస్తాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో అక్కడ భారతీయ స్త్రీల హక్కులకై పోరాటం చేస్తున్న ఉష ఆమెకు అండగా నిలుస్తుంది. ఈ విషయాలన్నింటిని సుమతి స్వదేశంలోని తన తండ్రికి లేఖ రాస్తుంది. సుమతి కుటుంబం ఆమె నిర్ణయాన్ని స్వాగతించడమే గాక, ఆమెకు అండగా నిలవడంతో కథ ముగుస్తుంది.

భార్య ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టంలేని ఒక భర్తకు, కనువిప్పు కలిగించడానికి ఆ ఇల్లాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందో గొర్తి సాయి బ్రహ్మానందం రాసిన ‘అతను’ అనే కథ తెలియజేస్తుంది. ఈ కథలో మెడిసన్‌ చదివిన ఉత్పల వివాహానంతరం భర్త ప్రభాకర్‌తో కలిసి అమెరికాకు వస్తుంది. ప్రభాకర్‌ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కానీ భార్య ఉద్యోగం చేయడం మాత్రం ప్రభాకర్‌కు ఇష్టం ఉండదు. కష్టపడి ఎంతో ఇష్టంగా చదువుకున్న తన చదువు పనికి రాకుండా పోతున్నందుకు ఉత్పల ఎంతో బాధపడుతుంది. తమ వంశంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే సంప్రదాయం లేదని, కావున ఉద్యోగం చేయవద్దని ప్రభాకర్‌ పట్టుపడతాడు. ఉద్యోగం చేస్తే భార్యకు వచ్చే సంపాదన తన కంటే ఎక్కువగా ఉంటుందని, అది తనకు పరువు తక్కువని ప్రభాకర్‌ అసలు ఉద్దేశం. తనను ప్రేమగా చూసుకునే భర్త ఇలా సంకుచితంగా ఆలోచించడం ఉత్పలకు నచ్చదు. వ్యక్తుల మధ్య దూరం ప్రేమను బలపరుస్తుందని, వ్యక్తుల ఆలోచనల్లో మార్పును తీసుకొస్తుందని భావించిన ఉత్పల తన మూడేళ్ళ కూతురు నేహను భర్త వద్దే వదిలి, అతనికి చెప్పకుండా స్వదేశానికి ప్రయాణమవుతుంది. భారతీయ భర్తల సంకుచిత ఆలోచనా దృక్పథాన్ని ఈ కథ చక్కగా వెల్లడిస్తుంది.

అమెరికా తెలుగు కథా సాహిత్యంలో గృహహింసను చిత్రించిన కథలు చాలా తక్కువగానే వెలువడ్డాయి. అమెరికా తెలుగు కథా సాహిత్యాన్ని రచయితల కంటే రచయిత్రులే అధికంగా రాస్తున్నారు. ఐతే అక్కడి భారతీయ కుటుంబాలలో స్త్రీలపై జరుగుతున్న గృహహింసను గూర్చి రాసే ప్రయత్నాన్ని చాలా తక్కువమంది రచయిత్రులే చేశారు. ఈ కథలలోనే సందర్భోచితంగా ఆ దేశంలో గృహహింసలు జరిగితే పోలీసులు స్పందించే తీరు, స్త్రీల కోసం పనిచేసే – పోరాడే అక్కడి స్వచ్ఛంద సంస్థలు, స్త్రీలు ఆ దేశంలో గల ప్రత్యేక హక్కులు – చట్టాలు తదితర అంశాలను కథలలో రేఖా మాత్రంగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేశారు. అమెరికా సమాజంలో స్త్రీలకు గల స్వేచ్చ, అక్కడి ప్రభుత్వం వారికి కల్పిస్తున్న హక్కులు – చట్టాలు, స్త్రీల రక్షణకు అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను కూడా అక్కడి నుండి వెలువడే కథలలో చిత్రించే ప్రయత్నాన్ని అమెరికా తెలుగు కథా రచయితలు – రచయిత్రులు చేస్తే బాగుంటుంది. అమెరికా తెలుగు కథ నేడు అక్కడి తెలుగు వారికే కాదు, ఇక్కడి వారికి కూడా సొంతమైన కథ. ఈ కథలు ఇక్కడి మహిళా లోకానికి కూడా స్ఫూర్తిని కలుగజేస్తాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.