రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డ్డి
నేను పుట్టీ పుట్టగానే
మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే
మడకలు విప్పేసి
కల్లంలో సేదతీరినప్పుడో
మా అమ్మ తద్దినం నాడో
మా నాయన స్మృతుల అద్దంలో
చందమామగా కనిపించేది మా అమ్మ.
మా అమ్మది మట్టిరంగే
మా అమ్మది మల్లెమనసే
మా అమ్మ మట్టిమనిషే.
చెక్కుపేడులాంటి మనిషి
యాభైముద్దల సంగటి గంపను
దదిబుట్టలా ఎత్తేసేది
మడక దున్నడంలో
బండి తోలడంలో
మా అమ్మ మొగాళ్ళకు సవాలే.
ఇంటిముందు ముగ్గుబెట్టినా
మడిలో ఆకుపరచినా
ఎనుమును పాలు పిండినా
ఎద్దును అదలించినా
మా అమ్మ జానపదకళల రాణే.
మా అమ్మ ముఖం మీద
నవ్వుల చంద్రుడు
ఎప్పుడ పిలగాడై
కొంగుపట్టుకు తిరిగేవాడు
కుంకుమ సూర్యుడు
వసివాడని మొనగాడై
ఎప్పుడు వెలుగుతుండేవాడు.
తలుచుకున్నప్పుడల్లా
మా నాయన కళ్ళల్లో
మా అమ్మ కన్నీళ్ళై ఉబికివచ్చేది
తలుచుకున్నప్పుడల్లా
మా నాయన గొంతు జీరలో
మాఅమ్మ వటై వినిపించేది.
మా అమ్మ వ నాయన్ని
అమ్మై లాలించింది
నిట్టాడై నిలబెట్టింది
మా యింటి బండికి
మా నాయన వలపటెద్దు
మా అమ్మ దాపటెద్దు
మడకనొగంత ఎత్తైన మా అమ్మకు
పొడిచే ఎద్దుకున్నంత ధైర్యం
అయినా ఏ అధైర్య క్రూరమృగవె
మా అమ్మను మింగేసింది
మా నాయన్ని
ఒంటెద్దుబండిని చేసేసింది.