2015 సంవత్సరానికి గాను భూమిక నిర్వహించిన కథ, కవిత పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదాన సభ 30-11-15 వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. సభకు ఆహ్వానం పలుకుతూ ప్రశాంతి అతిథులు డా|| అమృతలత, డా||సీతారామ్ గార్లను వేదిక మీదకు ఆహ్వానించారు.
పోటీలో గెలిచిన విజేతలకు అభినందనలు తెలిపి సభా నిర్వహణ చేయాల్సిందిగా సత్యవతిని వేదిక మీదకు పిలిచారు. సత్యవతి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కథ, కవిత, వ్యాస రచనల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎంతో మంది కొత్త రచయితలను తెలుగు సాహితీ ప్రపంచానికి పరిచయం చేసింది భూమిక. రచయిత్రులతో సాహితీయాత్రలు చేయాలని సంకల్పించినపుడు… తొలి సాహితీయాత్రను పోలవరం ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతానికి నిర్వహించినపుడు జరిగిన వివిధ చర్చల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు… ఒకటి: రచయిత్రులందరం తరుచు కలుసుకోవడం, కలబోసుకోవడం. రెండోది: భూమిక ఆధ్వర్యంలో వివిధ ప్రక్రియల్లో పోటీలు నిర్వహించడం, కొత్త రచయితలను ప్రోత్సహించడం. మొదటి నిర్ణయం కొంత కాలంగా సరిగా అమలవడం లేదు. ఈ పోటీలు కథ, కవిత, వ్యాసరచనల్లో జరుగుతున్నప్పటికీ ప్రతిసారీ పోటీకి వచ్చే వ్యాసాల సంఖ్య తగ్గిపోవటమే కాక నాణ్యత కూడా ఉండటం లేదు. ఈసారి బహుమతికి అర్హమైన వ్యాసాలు రాలేదు. దీనిమీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది.
పోటీలు మాత్రం క్రమం తప్పకుండా నిర్వహిస్తూనే వున్నాం. ప్రస్తుత బహుమతుల ప్రదానోత్సవం పదోది. ఈ దశాబ్ది ప్రత్యేక సందర్భంలో బహుమతులు పొందిన విజేతలకు అభినందనలు తెలిపి డా|| అమృతలతను మాట్లాడాల్సిందిగా కోరారు.
అమృతలత మాట్లాడుతూ హైదరాబాదులో ఎందరో లబ్ద ప్రతిష్టులు వున్నారు. అయినా ఈ బహుమతుల ప్రదానానికి మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు ధన్యవాదాలు. ఎన్నో పత్రికలు పుడుతున్నాయ్, గిడుతున్నాయ్. కానీ భూమిక రెండు దశాబ్దాలపైగా కొనసాగడం చాలా గొప్ప విషయం… దానికి సత్యవతి నిబద్ధతే కారణం. సత్యవతితో స్నేహం కలవడం నాకు చాలా గర్వకారణం విజేతలందరికీ అభినందనలు” అంటూ ముగించారు.
డా|| సీతారామ్, భూమికతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, భూమిక తనకు పెద్దక్క లాంటిదని, ఎనభైలలో తనకు స్ఫూర్తినిచ్చిన ‘మానుషి’ పత్రిక తర్వాత భూమిక మాత్రమే స్త్రీవాదాన్ని పరిపుష్టం చేస్తోందని చెప్పారు. వ్యాపార పత్రిక కాదు కాబట్టి హంగులేమి లేకుండా ఉండడమే భూమిక ప్రత్యేకత. నేనేప్పుడు ఒక వక్తగానే మీటింగ్‌లకు వస్తుంటాను. అలాంటి నన్ను అతిథిగా ఆహ్వానించి గౌరవించినందుకు సంతోషంగా వుంది. కథ, కవిత, వ్యాస రచన పోటీలతో పాటు కార్టూన్ పోటీలు కూడా పెట్టమని కోరుతున్నాను. విజేతలను అభినందిస్తూ… బాగా చదవమని, సమకాలీన రచయితల రచనలు అధ్యయనం చెయ్యమని సూచిస్తూ తన ప్రసంగం ముగించారు.
అతిథులకు, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విజేతలకు క్యాష్ ప్రైజ్‌ను అందజేసిన అబ్బూరి ఛాయాదేవి, అమృతలత, పి.అనురాధ, సుజాతామూర్తి, శేషవేణిలకు కూడా సత్యవతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత విజేతలు శాంతి ప్రబోధ, వారణాసి నాగలక్ష్మి, శారద శివపురపు, సరిత భూపతి, వాసవదత్త రమణ తమ తమ ప్రతిస్పందనను తెలిపారు. డా|| శిలాలోలిత వందన సమర్పణతో సభ ముగిసింది.