భూమికకు, అమ్మా, నవంబరు భూమిక గురించి- శాంతి ప్రబోధ గారి ‘బిజలీ… బుజ్జి… బిడ్డ’ కథ అపురూపం. ఆడ శిశువు మగ శిశువు అని నిర్ణయించేది మగవాడి విత్తనమే అని బిజిలీకి మరి కాస్త వివరంగా బోధించి ఉంటే మరింత బాగుండేది.
ప్రత్యేక వ్యాసం పి. ప్రశాంతి గారి తర్జుమా ప్రతిభావంతంగా ఉంది. ఈ మధ్య చాసో కథలను ఆంగ్లీకరించినవి చదివాను. (ది డాల్స్ వెడ్డింగ్ – వెల్చేరు నారాయణరావు డేవిడ్‌షుల్‌మన్). ఎంత నీరసంగా వుందో చెప్పలేను. అవి కథలు మాత్రం. ప్రశాంతి గారిది అత్యంత క్లిష్టమైన భావాలున్న వ్యాసం. చేసే పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే బాగుండక ఏమవుతుంది.
– వి.ఎ.కే రంగారావు. చైన్నై.
*****
భూమిక ఎడిటర్ గారికి,
నవంబర్ 2015 భూమిక సంచిక చూశాను. అందులో 36వ పేజీలో బొర్రా గోవర్ధన్ గారు మరి ఇద్దరు రాసిన వ్యాసం చదివాను. అది నేను వారికి 26-08-2015 వ్రాసిన లేఖకు సమాధానం. దానితో పాటుగా నేను వారిని ఏమి కోరానో ఆ లేఖ కూడా పంపివుంటే బాగుండేది. పాఠకులను తికమక చేసేందుకు లేక పాఠకుల సానుభూతి పొందేందుకు వారు ఆ పని చేసివుండవచ్చు. నేను అడిగినది ఏమిటి? వారు వ్రాసినది ఏమిటి? ఒక వ్యక్తి కిరాణా కొట్టుకువెళ్లి చింతపండు కావాలి అని అడిగితే అది లేదని చెప్పటానికి ఇష్టం లేని ఆ వ్యాపారి మంచి బెల్లం వుందని చెప్పినట్లు, బెల్లాన్ని గురించి ఉపన్యాసం దంచినట్లుగా వుంది వారి సమాధానం. అందుకోసమే నేను వారిని ఏమి కోరానో ఆ లేఖ కాపీ మీకు పంపుచున్నాను.నేను ఎక్కడా బుద్దుని గురించి వారిని అడుగలేదు. బౌద్ధం ఏమిటి అని అడుగలేదు. మరి వారు ఎందుకు బుద్ధుని గురించి వ్రాశారో తెలియదు.
వ్యక్తులను, సంఘాలను కించపరిచే విధంగా వ్రాసి దాని మీద వివరణ కోరిన తరువాత దాని మీద చర్చించుకోవాలి గాని కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించడం సరికాదు. వ్యక్తులను, సంఘాలను కించపరిచే విధంగా వ్రాతలు వ్రాస్తే దాని మీద ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వ్రాశారో చెప్పమని అడుగగా దానికి సమాధానం లేక సంబంధం లేని విషయాన్ని గురించి వ్రాసి పాఠకుల సానుభూతి పొందాలన్న తపన మాత్రమే ఆ లేఖలో వున్నది.
– నార్నె వెంకట సుబ్బయ్య, మంగళగిరి.
*****
భూమిక సంపాదకులు సత్యవతి గారికి నమస్కారాలు
‘పుట్టింటి ప్రయాణం’ అనే మా అమ్మ గారి కథ – విశ్లేషణ నవంబరు 15 భూమికలో చూసి ఎంతో ఆనందపడ్డాను. వ్యాసం వ్రాసిన జి. సరిత గారికి, ప్రచురించిన మీకు కృతజ్ఞతలు. మా అమ్మగారిలో వున్న ఆ రచనాభిమానమే నేను వ్రాయడానికి ప్రేరణ అని నేను ఎప్పుడూ అనుకుంటాను. కృతజ్ఞతాభివందనాలతో….
– జానకీ బాల, సికింద్రాబాద్.
*****
భూమిక సంపాదకులుకు! నమస్తే!
కథల పోటీ ఫలితాలు చూశాను. సంతోషం, భూమిక భూమంతా వ్యాపించి కీర్తి కిరీటాలు ఎగరేయాలని కోరుకుంటున్నాను.
– హైమా శ్రీనివాస్, ఇ-మెయిల్.
*****