కొండేపూడి నిర్మల
ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను.
అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో…
ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.
నవ్వుకీ నవ్వుకీ మధ్య అతను దున్నేసిన 47 సినిమాల సామాజిక స్పృహ ముక్కలు ప్రసారం అవుతున్నాయి. పాతికేళ్ళ క్రితం కూడ ఇలాంటిదే సంచలనం రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు పాత్రలు వెలిగించిన పౌరాణిక హీరో నడిరోడ్డు మీద నీళ్ళాడిన దీన బాంధవ దృశ్యం అన్ని పత్రికల నిండా వచ్చింది. అయినా గానీ అప్పుడు, ఇప్పుడున్నంత ప్రచార సామగ్రి లేదని, నిజం చెప్పాలంటే అసలు ఆ హీరో పుట్టడమే సామాజిక స్పృహతో పుట్టాడని, ఇప్పటి హీరో వ్యాపార విలువలతో నటించాడని ఒక వేదిక ఘోషిస్తోంది. ఛానల్ మార్చాను. అక్కడ నటశేఖరుడు అల్లూరి సీతారామ పాత్రని ఇరగదీస్తూ కనిపించాడు. ఇంకో చోట ఊర్వశి బిరుదు తెచ్చుకున్న నటీమణి పోలీసు వేషంలో గూ౦డాల్ని ఎగిరెగిరి తంతోంది. ఇంకో చోట యా౦గ్రీ హీరో ఒకరు ఆంధ్రదేశంలోని అక్క చెల్లెళ్ళ శీల రక్షణ బాధ్యతలో కన్నీరు మున్నీరవు తున్నాడు. మరో చోట తల్లి తెలంగాణా అంటే ఎవరో కాదు నేనే అంటోంది మరో నాయిక. అక్షరాలా తొంభై ఛానళ్ళూ.నొక్కి నొక్కి నా బోటన వేలు వాచి పోతోంది. ప్రజా సేవ కోసం ఒకర్ని తోసుకుంటు ఒకరు పీకల మీద కొచ్చేస్తున్నంత భ్రాంతి…అక్కడితో అయిందా?..? అవలేదు. మరి పాపం వాళ్ళ కొడుకులు, కోడళ్ళూ, బామ్మరుదులు, వియ్యంకులు, వేలు విడిచిన వాళ్ళు, కాలు విడిచిన వాళ్ళకి మాత్ర౦ మంత్రిత్వ శాఖలు కావద్దా? ఇంకో పక్క పుట్టడమే ప్రజాసేవ కాగా నాలుగైదు తరాల నించీ కిట కిట లాడుతున్న ప్రధాన, ప్రతిపక్ష పార్టీల, వామ పక్షాల తాలుకు కొడుకులు,కోడళ్ళూ, కూతుళ్ళూ, అల్లుళ్ళూ, బామ్మరుదులు.. గట్రా..గట్రా.. భావి భారత పౌరులు కార…? వాళ్ళకి మటుకు కుర్చీ ఎక్కి పాలించడం చెత కాదా…? వీళ్ళను చూస్తున్న సంబరంలో నిన్న గాక మొన్న జరిగిన రైలు బాంబుదాడులు, కబ్జాలు, ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో పసిపిల్లల మీద జరిగిన గినియ పందులు ప్రయెగాలు, ఆయేషాలాంటి విద్యార్ధినుల మీద జరిగిన హత్యలు అన్నీ.. అన్నీ వెనకబడ్డాయి. అఖండ ప్రేక్షకత్వం మూడు గంటలు కాదు ముప్పాతిక జీవితాన్ని కళ్ళప్పగించి చూసేలా చేస్తోంది. తమిళనాడు జనాల ఉగ్ర ప్రేమ, కర్నాటక జనాల నిర్లిప్త వైఖరి రె౦డూ మనలో వరదలు కడుతున్నాయి. ఇవాళ హీరో వేషం కడితే రేపు రాజకీయల్లోకి పనికొస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించి పోయింది. తెరమీద బొమ్మలకి మంచి రోజులొచ్చాయి. ఇన్‌కంటాక్సు కట్టకపోయినా సరే, రెండు ప్రాజెక్టుల్ని తలదన్నే పారితోషికాలు నిర్లజ్జగా పుచ్చు కుంటున్నా సరే. కట్టుకున్న ఇల్లాల్ని కాటికి పంపినా సరే, కట్టుకోని ఇల్లాళ్ళు వూరినిండా ఏడుస్తూ వున్నా సరే. అన్నీ విలువల్నీ వదిలేసినా సరే…వాళ్ళని చూస్తే ఎందుకో గాని మనకి ఆనంద బాష్పాలొస్తాయి. పక్కన నిలబడి ఫోటో దిగాలనిపిస్తుంది.. ఈ ఒరవడిలో దుష్ట పాత్రలు, విదూషక పాత్రల కట్టే వాళ్ళకి గిరాకీ లేదేమొ. ప్రచారానికి అయినా గాని పనికి వస్తారో రారో. జూనియరు ఆర్టిస్టుల సంగతి సోదిలోకి రాదనుకోండి.. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత ప్రజా స్వామ్యపు వెండి తెర మీద ఎటువంటి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రం ప్రసారమవు తుందో ఏమిటో అని జేబురుమాళ్ళతో సిద్ధంగా వుండాలి.
ప్రజాసేవ చెయ్యలనుకున్న వాళ్ళకి రాజకీయ పదవి తప్ప ఇంకో వర్గం లేకపోవడం ఏమిటో నాకెప్పుడ అర్థం కాదు. నిజాయితీ గల ప్రతి పక్షం అవసరం లేదా..? ప్రతి పక్షంలో వున్న వాళ్ళెప్పుడు ఎందుకంత ఏడుపు మొహాల్తో వుంటారో..? ఇవాల్టి తెలుగు దేశంగానీ, నిన్నటి కాంగ్రెస్సు గానీ అవే పదవీ దు:ఖాలు..అవే ఆరోపణలు, రోత, అవినీతి, పేదరికం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా వీళ్ళే కాపలా కాస్త్తారు. తొమ్మిదేళ్ల పాటు ప్రజా స్వేచ్ఛని, పత్రికా హక్కుల్ని మంటకలపిన పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారపు మొహంలోను అదే దు:ఖం . ”నేను చాలా సామాన్యుడ్ని.. ప్రజాసేవలోనే బతికాను. నా మీద అభిశంశన ఎందుకో అర్ధం కాదు.
సామాన్యుడికీ అదే అర్ధంకావడం లేదు. దేశాలు జేబులో వేసుకు తిరిగే నేతలు సామాన్యులైతే మరి తమని ఏమని పిలుస్తారో…అని, ఓటు హక్కుతో సహా అన్నిటా ప్రేక్షకులమే అయిన మనమీద ఇంకా ఎన్ని బొమ్మలు ఆటలు ఆడతాయె. ఆశగానే ఎదురు చూద్దాం. హీరో అనబడు వాడు సినిమా అయ్యేలోపు అయినా దుష్టులమీద చంపుడు పందెం వేసి గెలుస్తాడు కదా. హీరోయిన్ని రక్షిస్తాడు కదా. లేకపోతే వంద రోజులు ఆడించంకదా. ఇదీ అంతే.