ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ (Be Bold) కార్యక్రమానికి ముందుగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో హెచ్ఐవి / ఎయిడ్స్ కేసులు పెరుగుతుండటం ఆరోగ్యపరంగా తీవ్రమైన పరిణామంగా మారింది. హెచ్ఐవీ/ ఎయిడ్స్ పట్ల ప్రజల్లో దాదాపుగా తొంభైశాతం మందికి అవగాహన ఉన్నట్లు, అరవై శాతం మందికి వ్యాధి ఎన్ని మార్గాల ద్వారా సోకుతుందో తెలుసని బిహేవియరల్ సర్వేయలన్స్ సర్వే అధ్యయనం స్పష్టం చేసింది. వ్యాధి సోకడానికి అవకాశమున్న అంశాలు,నిశ్శబ్దంగా వుండటం, పరీక్షలు, సంరక్షణ, ఆదరణకు సంబంధించి సమాజ వైఖరి, హెచ్ఐవీతో జీవిస్తున్నవారికి లభిస్తున్న వైద్య సేవలు వంటివి ప్రజల్ని తమకు హెచ్ఐవీ వుందో లేదో తెలుసుకోవడానికి ముందుకు రానివ్వడం లేదు. కేవలం యాభై శాతం మంది హెచ్ఐవీతో జీవిస్తున్నవారికి మాత్రమే తమకు హెచ్ఐవీ ఉన్నట్లు తెలుసని అంచనా. మిగతావారు అందుబాటులో ఉన్న పరీక్షల్ని ఉపయోగించుకోవడం లేదు. కారణం సమాజవైఖరి లేదా అందుబాటులో వున్న వైద్య పరీక్షల గురించి తెలియకపోవడం.
ఈ సమస్యను అధిగమించడానికి ఎపిఎస్ఎసిఎస్ తన సేవల్ని మరింత విస్తృతం చేసింది. ఎక్కువమందికి వైద్యపరీక్షలు అందుబాటులో వుండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 205 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్లు వుండగా, గత మూడునెలల్లో మరో 375 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది.
ప్రజలు తమకు హెచ్ఐవి వుందో లేదో తెలుసుకోవడానికి వీలుగా ‘బి బోల్డ్’ ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ప్రజలు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడమే ఈ ప్రచారోద్యమం లక్ష్యమని ఎపిఎస్ఎసిఎస్ డైరెక్టర్ శ్రీ జి. అశోక్ కుమార్‌గారు వివరించారు.