సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, ఉపాధ్యాయులతో కాని, కనీసం వారి డాక్టరుతోగాని మాట్లాడలేరు. తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి యువతరం ఎక్కడకు వెళుతుంది? తరచూ తమ శరీరాలతో తామే ప్రయోగాలు చేస్తూ వుంటారు. ఇంక ఎక్కువ సంఖ్యలో యువత వేశ్యల దగ్గరికి వెళ్ళడం వలన వాళ్ళని ప్రమాదానికి గురిచేస్తోంది. యువతరం వారి సెక్స్ పరిజ్ఞానాన్ని స్నేహితుల దగ్గరనుంచి తెలుసుకుంటారు. ఈ స్నేహితులు కూడా మీడియా ద్వారా తప్పుడు సమాచారం పొందుతుంటారు. అశ్లీలకరమైన సినిమాలు, ఇంటర్‌నెట్, బ్లూ సినిమాల ద్వారా లైంగిక విజ్ఞానాన్ని పొందాలనుకుంటారు.
చాలా అధ్యయనాల ప్రకారం ఎక్కడ యువతకు సెక్స్ పరమైన పరిజ్ఞానాన్ని సహాయ సంఘాలద్వారా అందింపబడు తుందో, అక్కడ హెచ్ఐవి ప్రమాదశాతం తగ్గుతోంది. అజ్ఞానం అనేది చాలా పెద్ద శత్రువు.
యుఎల్‌సిఎ సూచించిన కథనం ప్రకారం ప్రతీ ఏడు నిమిషాలకి మహిళలు, ప్రతీ నాలుగు నిమిషాలకి పురుషులు సెక్స్ గురించి ఆలోచిస్తూ వుంటారు. ఈ భూమండలం మీద వున్న మిలియన్‌ల జీవులకంటే మనం ఏమీ భిన్నంగా లేము. ఇంకా మన ఆదిమానవుని జీవన విధానాలు బతికే వున్నాయి.
ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపిఎస్ఎసిఎస్) అధ్యయనం ప్రకారం బాలిక 16 వ ఏట, బాలుడు తన 19 వ ఏట సెక్స్‌లో పాల్గొంటారని కనుగొంది. ఎందువలన యువతీయువకులు సెక్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారు? అసలు నిజం ఏమిటంటే, సెక్సు ఆరోగ్యం పట్ల ఈ చిన్న మెదడుల్ని సరైనదారిలో నడిపించే పెద్దలు లేకపోవడం. సెక్స్ గురించి మాట్లాడ్డం అవసరమా? అలా అయితే ఏ వయసువారితో మాట్లాడాలి? ఎపిఎస్ఎసిఎస్ 13 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్యన ఉన్నవారు, లేక 9, 10 వ తరగతి విద్యార్థులు, సెక్స్ శిక్షణ ఇవ్వడానికి సరైనవారని పేర్కొన్నది.
ఇంతవరకు ఇలా జరగలేదు. అందుచేత అధ్యాపకులు ఈపని చెయ్యగలరా? అధ్యాపకుల మనసుల్లో, సెక్స్ అనే సున్నితమైన విషయాన్ని ఎలా ప్రస్థావించాలో నని ఎన్నో భయాలు, ప్రశ్నలు, సందేహాలు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఈ రంగంలో అనుభవం వున్న కేథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి.హెచ్.ఎ.ఐ), ఎపిఎస్ఎసి ఎస్ ఈ సమస్యకి సమాధానం కనుగొనడానికి చేతులు కలిపాయి. నిజానికి అధ్యాపకులు ఇంత సున్నితమైన విషయాన్ని ప్రస్థావించ డానికి సిద్ధంగా లేరు. దీనిమీద వారికి అవగాహన వున్నా అది విద్యార్థుల ముందుకు ఎలా తీసుకురావడం అనేది పెద్ద సమస్యయ్యింది. చాలామంది అధ్యాపకులు ఛాందస భావాలు కలిగివున్నవారవటంచేత సెక్స్ గురించి విద్యార్థులతో మాట్లాడడానికి సుముఖంగా లేరు. వారి ఉద్దేశ్యం ఈవిధంగా చేస్తే అది విద్యార్థులకి, అధ్యాపకులకీ మధ్యన వుండే గురుశిష్య సంబంధాన్ని త్రుంచేస్తుందని వారి నమ్మకం.
సెక్సు ఎడ్యుకేషన్ మీద తాము క్లాసు తీసుకోలేకపోవచ్చని, చాలామంది విద్యార్థులు తమ భావాల్ని, ప్రశ్నల్ని అధ్యాపకుల ముందు అంత సులువుగా ప్రకటించలేకపోవచ్చని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. గౌరవం, హుందాతనం వున్న పవిత్రమైన గురుశిష్య సంబంధం సెక్సు క్లాసు తరువాత ప్రమాదస్థితిలో పడుతుంది! ఇంతకంటే బయటనుంచి ఈ రంగంలో అనుభవం వున్న వ్యక్తిని పిలిపించి, విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మీద శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని పాఠశాల ఉన్నత అధికారులకి అన్పించింది. ఈవిధంగా చేస్తే చాలా ఎక్కువశాతం విద్యార్థులు ఇందులో పాల్గొనే అవకాశం వుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విద్యార్థులు కూడా ఇలా అయితే అధ్యాపకుల పట్ల తమ గౌరవం కొనసాగుతూనే వుంటుందని భావించారు. ఈవిధంగా విద్యార్థులు, అధ్యాపకులు సంతోషించారు. సందేశం చేరవలసిన వారికి చేరుతుంది.
చాలాకాలం కిందటే సిహెచ్ఎఐ పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో వారి బృందం ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాదు జిల్లాలోని కొన్ని పాఠశాలలకి వెళ్ళి, వారికి కొత్త విషయం అయిన హెచ్ఐవి/ఎయిడ్స్ మీద మాట్లాడే అవకాశం కలిగించింది. వారి బృందం కో ఎడ్యుకేషన్ పాఠశాలలైన నిర్మల్ హృదయ, సెంట్. ఎలిజబెత్్స లాంటి స్కూళ్లకి వెళ్ళారు. ఒకటి కిస్నాపూరులోని మారుమూల గ్రామంలో వుంది. ఆ అనుభవం వర్ణించ శక్యం కానిది! విద్యార్థులలో వున్న ఎనర్జీలెవల్సు, వారి ఉత్సాహం, అమాయకత్వం, విద్యార్థులకీ, అధ్యాపకులకీ వున్న శ్రద్ధ ఈ కార్యక్రమం చాలా క్రమబద్ధంగా ముద్ర వేసేదిగా జరిగింది. తమ గ్రామాన్ని ఈ వ్యాధి ఎలా బాధపెడుతుందో తెలుసుకోవాలనే విద్యార్థులయొక్క నిజాయితీ దీనికి కారణమై వుండవచ్చు. వ్యాధి రాకుండా ఆపడానికి యువతరం ఏమి చెయ్యాలనే పరిజ్ఞానం పెంచుకోవాలనే ఆసక్తిని ఈ కార్యక్రమం విద్యార్థుల్లో రేకెత్తించింది.
అదే సంవత్సరం, హైదరాబాదు లోని, సనత్నగర్‌లో డాన్బాస్కో బాలబాలికల ఉన్నత పాఠశాలకి వెళ్ళినపుడు, యువత ఒకే సమస్యని ఏ కోణాల్లోంచి చూస్తారోననే అంశం ప్రముఖంగా ముందుకొచ్చింది.. శరీర అవయవాలు, (ఎనాటమి) గర్భధారణ అనే విషయాలపై క్లాసు తీసుకుంటూ వుండగా ఒక అమ్మాయి కవలలు ఎలా పుడతారని అడిగింది. వెంటనే ఒక అబ్బాయి లేచి వివిధ భంగిమలు కవలపిల్లల జననానికి దారితీస్తాయని జవాబిచ్చాడు. క్లాసుమొత్తం నవ్వుల్లో మునిగితేలింది.
హైదరాబాదు నించి వచ్చిన విద్యార్థులకీ, కిస్నాపూర్ గ్రామంనించి వచ్చిన విద్యార్థుల మధ్య తేడా ఏమిటి? కుటుంబ సంస్కృతి, కుటుంబ జీవన విధానాలు, ఇంటర్‌నెట్, బ్లూ సినిమాలు అందుబాటులో వుండడం ఇంకా చాలా విషయాలు యువతరం మనసుల్ని త్రప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇది యువతరాన్ని ఎక్కడకు తీసుకు వెళుతోంది??? అనే అంశాలు చర్చకు వచ్చాయిక్కడ.
కొన్ని సంవత్సరాల క్రితం నాకు సికిందరాబాదులోని బాలికల పాఠశాలైన కీస్ హైస్కూలుకి వెళ్ళే అవకాశం దొరికింది. అక్కడి విద్యార్థులు చాలా ఉత్సాహంగా, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. అవి ఈవిధంగా వున్నాయి-
1. ఒకే ఒక్కసారి అసురక్షితమైన సంభోగంతో హెచ్ఐవి వచ్చే అవకాశం వుందా?
2.ఋతుస్రావం శుభ్రత- నెలసరిలో వున్నప్పుడు సెక్సులో పాల్గొనడం గురించి
3. ఓరల్ సెక్సు సమస్యలు
4. శీఘ్రస్కలనం తప్పా?
5.చుంబనంతో గర్భధారణ కలుగుతుందా?
6. కండోమ్‌లు నిజంగా సురక్షితమైనవేనా?
7. పి.హెచ్.సి లో సూదులు శుభ్రంగా వున్నాయని ఎలా నిర్ధారణ చెయ్యగలం
8. మన మనసులపై బ్లూ సినిమాల ప్రభావం.
నేను మాట్లాడ్డం అయిపోయిన తరువాత, ముఖ్యవక్తగా వచ్చిన అధ్యాపకురాలు, విద్యార్థులు ఎవరైనా కావాలంటే తనని విడిగా ప్రశ్నలు అడగవచ్చునని తన ఫోను నంబరు ఇచ్చారు. రాత్రి 8 గంటలకి నాకు ఒక విద్యార్థినుంచి ఫోను వచ్చింది. ఆమె తన ప్రేమ సంబంధంలో వున్న సమస్యల్ని నాతో చర్చించాలని ఫోన్ చేసానని చెప్పింది. బోర్డు పరీక్షలు దగ్గరపడుతున్న ఒక పదవతరగతి విద్యార్థికి వచ్చిన నిజమైన సమస్య. మేము టెలిఫోను ద్వారా మాట్లాడుకోవడం జరిగాక, ఆమె తనేం చెయ్యాలో తెలుసుకుంది – ఆమె ఒక సంపన్న కుటుంబంలోంచి వచ్చిన, క్లాసులో మొట్టమొదటి శ్రేణిలో వుండే విద్యార్థి తల్లితండ్రులకు ఏకైక కూతురు. అంతా చెప్పకనే చెపుతోంది!!
ఇంకొక సంఘటన రోసరీ కాన్వెంటు హైస్కూలులో జరిగింది గుర్తుకువస్తోంది. అక్కడ ఒక అమ్మాయి నన్ను ఎసర్టివ్ ట్రైనింగ్ గురించి అడిగింది- ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి తనతో సెక్స్‌లో పాల్గొనమని బలవంతం చేస్తే నేను ఏం చేయాలి? అని అడిగి తెలుసుకుంది.
ఇంకొక సందర్భంలో ఒక పదవ తరగతి అమ్మాయి ఫోనుచేసి నాతో తన సమస్యని చెప్పుకుంది. ఆ అమ్మాయి రోజూ తను ట్యుటోరియల్స్ కి వెళ్ళే దారిలో ఒక అబ్బాయి తారసపడి ఆమె ఆకర్షణలో పడ్డాడు. ఆమె ఇంటికి దగ్గరే అతను కూడా వుండడంతో వారిద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరనుంచి నోట్సు తీసుకోవాలనే నెపంతో ఆమెని తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఆమె అతని గదికి వెళ్ళేసరికి తలుపులు వేసేసి తన ప్రేమ వ్యక్తం చెయ్యడం మొదలుపెట్టాడు. ఆమె అవాక్కయిపోయింది. ఆ అయోమయావస్థలో మాట్లాడడంగాని, కదలడంగాని చెయ్యలేకపోయింది. కొన్ని సెకండ్‌లలో తేరుకుని అతని గదినుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది.
ఆమెలో ఎన్నో భయాలు కలిగాయి. అతను ముద్దు పెట్టాడు కనుక తనకు హెచ్ఐవి వస్తుందేమోనని భయపడింది. భవిష్యత్తులో అతన్ని చూస్తే తనేం చెయ్యాలి. ఈ సమస్య ఆమెని చాలా చికాకు పెడుతోంది, ఆమె చదువుమీద శ్రద్ధ చూపెట్టలేకపోతోంది. అవన్నీ నాతో చర్చించింది.
ఇంకొక కేసు హైదరాబాదులోని ఆఘాఖాన్ స్కూలులోనిది. మా సెషన్ అయ్యాక ఒక అబ్బాయి తన సమస్యతో వచ్చాడు. తన స్నేహితుల్లో ఒకతను ఆరు నెలల క్రితం ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడని, అందుచేత ఆ స్నేహితునికి హెచ్ఐవి రావచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేసాడు. అతను పదే పదే తన స్నేహితుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని, కండోమ్ వాడాడని చెప్పాడు. ఇతనికి చాలా సీరియస్ కౌన్సిలింగ్ అవసరం వుందన్పించింది నాకు. నేను వెళ్ళిపోతూ వుంటే చాలా ఆతృతగా కారు వరకు నాతో వచ్చాడు. నేను నా టెలిఫోను నెంబరు అతనికిచ్చి అతని స్నేహితునికివ్వమని చెప్పాను. ఆ స్నేహితుడు ఫోను కూడా చేసాడు- మేము ఫోనులో మాట్లాడుకున్నాము.
నా ఉద్దేశ్యం ఏమిటంటే వారి సమస్యలను గురించి మాట్లాడిన తర్వాత వివరాలను గోప్యంగా వుంచడం,విద్యార్థుల పట్ల గౌరవం, విద్యార్థినీ/విద్యార్థుల ప్రపంచం గురించి అర్థం చేసుకోవడం అనేది వారికి ధైర్యాన్నిచ్చి బాధ్యతగల జీవితం సాగించడానికి వారికి తప్పకుండా దోహదం చేస్తుంది.
పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలోని ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేము నిర్వహించిన లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ మీద వర్క్‌షాపు పూర్తయిన తరువాత యువతీ యువకుల్లో ఒక ఆశావహమైన మార్పు కన్పించడం, వారిలో చైతన్యం వికసించి, ఒకలాంటి పెద్దరికం వచ్చింది. వారు నిర్మొహమాటంగా తమ సంబంధాల్ని వెల్లడించి, ఎదుటివారిని అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. జీవితం గురించి తెలుసుకునే అవకాశం కలిగి, వారందరిలో ఒకరికోసం ఇంకొకరున్నారనే అనుభూతి ఒక రకమైన హాయిని వారిలో కలిగించి వుండవచ్చు.
అధ్యాపకుల్ని కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం వల్ల, అధ్యాపకులకి, విద్యార్థులకీ మధ్య బలమైన బంధం ఏర్పడి, ఈ కనపడని వ్యాధినుంచి వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది. మా పరిశోధన బృందం గమనించినదేమిటంటే, వర్క్‌షాప్ అయిన తరువాత, ఆ వర్క్‌షాప్ లో పాల్గొన్న యువతీ, యువకుల్లో ఒక స్నేహ బంధం ఏర్పడి,టెలిఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు వచ్చింది. ఇది చాలా ఆశాజనకమైన విషయం. గత నాలుగు సంవత్సరాలుగా సిహెచ్ఎఐ వారిచే నిర్వహించబడిన పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు, జంటనగరాల్లోని వందలాది మంది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతోంది గత నాలుగు సంవత్సరాలుగా. వర్క్‌షాపు అయిన తరువాత విద్యార్థులు మెచ్చుకుంటూ మాకు వ్రాసిన ఉత్తరాలే, విద్యార్థులమీద, అధ్యాపకులమీద,ఈ వర్క్‌షాప్ ఆశాజనకమైన ముద్రవేసిందనడానికి తార్కాణాలు.
(CHAI The Catholic Health Association of India సౌజన్యంతో) అనువాదం- కె. మాధురి