”తాతమ్మా! నువ్వెందుకు తెల్లచీరే కట్టుకుంటావ్‌?”- పి. ప్రశాంతి

మెత్తగా కలిపిన అన్నంలో వేడివేడి పప్పుచారు మినప వడియాల్ని చిదిపి తినిపిస్తుంటే నోరు చప్పరించుకుంటూ తింటున్న నానివైపు చూస్తూ తర్వాతి అంకం గురించి ఆలోచిస్తోంది అన్నపూర్ణ. గిన్నెలో చారన్నం అయిపోయిందని గమనించి నాలుగేళ్ళ నాని కూడా చివరి ముద్దని నోట్లోనే ఉంచేసుకుని తర్వాత అమ్మేంచేస్తుందో తెలిసినట్టే కూచున్నాడు.

అన్నం తినిపిస్తున్నంతసేపు బాల కృష్ణుడి కథలని తన్మయ త్వంతో చెప్పే అన్నపూర్ణకి నానితో పెరుగన్నం తినిపించడమంటే… యశోదమ్మ చిన్ని కృష్ణుడి కోసం రేపల్లె వాడంతా  వెతుక్కొచ్చినట్లే

ఉండేది. తెల్లటి పెరుగన్నం నానీకి ఇష్టంలేదు. అన్నపూర్ణ వంటింట్లోకెళ్ళి పెరుగన్నం కలుపుకొచ్చేసరికి తుర్రుమని పారిపోయాడు. పెరుగన్నం గిన్నెతో బయటకొచ్చిన అన్నపూర్ణకి అక్కడ నాని లేకపోయేసరికి ఉసూరుమంటూ ”నీతో చావొచ్చింది రా… ఎలా వేగాలో ఏంటో…” అనుకుంటూ పెరటిదొడ్డి వైపుగా నడిచింది. శాంతక్క ఒళ్ళో కూర్చుని చింత పిక్కలు ఒక్కొక్కటే డబ్బాలో వేస్తున్న నాని అమ్మ చేతిలో పెరుగన్నం గిన్నె చూడగానే చటుక్కున జారుకున్నాడు. దాంతో అన్నపూర్ణకి నీరసమొచ్చింది. పొద్దున్నుంచి ఇంటి పనితోపాటు మర్రోజు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఏమీ తినకపోయేసరికి అన్నపూర్ణకి కళ్ళు తిరిగినట్లైంది. నానీని పట్టుకోడానికి పరిగెత్తింది శాంతి.ఈ గొడవ రోజూ ఉండేదే.

అంతలోనే వెనక్కొచ్చి అమ్మ పక్కన కూర్చుని ”అమ్మా… ఐడియా…” అంది ఎనిమిదేళ్ళ శాంతి. ఏంటన్నట్లు చూస్తున్న అన్నపూర్ణతో మొన్న తను పులిహోరలో పెరుగేసుకుని తింటునప్పుడు నానీ వచ్చి ఆసక్తిగా చూస్తుంటే వాడికి తను ముద్దలు తినిపించడం, అంతకు ముందొకరోజు మెంతి పెరుగు అన్నంలో కలుపుకుని తింటున్నపుడు కూడా నానీకి పెడ్తే కాదనుకుండా తిన్న విషయాలు చెప్పింది. ఇప్పుడు కూడా పెరుగన్నం తెల్లగా లేకుండా పసుపేసిన తాలింపు కలిపితే తింటాడేమో అంది శాంతి. ప్రయత్నించి చూద్దామని వంటింట్లో అప్పుటికే పచ్చడిలో కలపడానికి వేసిన తాలింపులోనించి ఒక స్పూనుడు తీసి పెరుగన్నంలో కలిపింది అన్నపూర్ణ. అంతలో ఏమిచెప్పి తీసుకొచ్చిందోకాని నానీని వెంటబెట్టుకొచ్చింది శాంతి. అన్నపూర్ణ చేతిలోని పెరుగన్నం గిన్నెని ఓరగా చూస్తూ పారిపోబోయిన నాని ఠక్కున ఆగిపోయాడు. వెనక్కొచ్చి గిన్నెలోకి తొంగిచూసి పెట్టమన్నట్లు నోరు తెరిచాడు. ముద్దు ముద్దు కబుర్లు చెప్తూ లేత పసుపువన్నెతో ఉన్న పెరుగన్నం మొత్తం తినేశాడు. హమ్మయ్య అనుకుని శాంతివైపు చూసింది అన్నపూర్ణ. పుట్టింట్లో కమ్మని వాసనతో ఇంటి ముందు వసారాలో రాశులు పోసిన పసుపు కొమ్ములు గుర్తొచ్చి తనలాగే తన పిల్లలకీ పసుపంటే ఇష్టమని అర్థమై చిరునవ్వు నవ్వుకుంది. ఆరోగ్యానికి పసుపు చేసే మేలు గురించి నాయనమ్మ చెప్పేమాటలు మనసులో మెదిలి తృప్తిగా అనిపించింది.

నాయనమ్మ గుర్తురాగానే శాంతి కపోతంలా కనిపించే 87 ఏళ్ళ యశోదమ్మ రూపం కళ్ళముందు కదిలింది అన్నపూర్ణకి. పంచెగా పిలువబడే తొమ్మిది గజాల తెల్లటి మజ్లిన్‌ కాటన్‌ చీరని లోపల్లంగా లేకుండా నడుము దగ్గర చీరచెంగుల్నే ముడేసి, తర్వాత ఒక చుట్టుతిప్పి, ఆపై ఒక గజం బట్టమాత్రం వదిలి మిగిలిందంతా కుచ్చిళ్ళు పోసి కాళ్ళకడ్డం పడకుండా ఎంతో లాఘవంగా కట్టుకుని, వదిలిన గజం బట్టని జాకెట్టులేని భుజాలమీదుగా కప్పుకుని కొద్దిగా ఒంగి నడిచే పులుకడిగిన ముత్యంలాంటి నాయనమ్మ అంటే అన్నపూర్ణకి ఎంతో ప్రీతి. తెల్లవారుతుండగానే లేచి మెల్లగా కాలకృత్యాలు తీర్చుకునొచ్చి చూపుడు వేలుపై పేస్టువేసుకుంటున్న యశోదమ్మని ”పళ్ళపొడితో తోముకోడానికి పళ్ళులేవని, గట్టి చిగుళ్ళకోసం పేస్టు వాడుతున్నావా తాతమ్మా…” అని ఎన్నోసార్లు ఆటపట్టించేది మునిమనవరాలు శాంతి. దానికి ”భడవా… ఎన్ని మాటలు నేర్చావే…” అని ప్రేమగా కోప్పడే తాతమ్మవైపు నవ్వుతూ చూసేది శాంతి.

అంతలోనే ముఖాలు కడుక్కుని ఒకరి చేతులొకరు పట్టుకుని తాతమ్మ, మునిమనవరాలూ పెరటి వైపున్న తులసి కోట దగ్గరికి చేరేవారు. అమ్మ పాలేళ్ళకి  పనులు పురమాయిస్తూ గుమ్మం ముందు ముగ్గేసి మిగతా పనుల్లో ఉంటే, తండ్రి అప్పుడే పితుక్కొచ్చిన చిక్కటి గేదెపాలతో కాఫీ కలుపుతూ, తాతమ్మ – మునిమనవరాళ్ళ సంభాషణ వైపు ఒక చెవి పడేసి వింటుండేది అన్నపూర్ణ. తులసి మొక్కకున్న  గింజకట్టిన గెలల్ని తుంచుతూ, రాలుతున్న ఆకుల్ని తీసేస్తూ నాయనమ్మ చెప్పే ఆరోగ్య చిట్కాలు ఇప్పటికీ ఉపయోగిస్తుంటుంది. ”జలుబు చేసి దగ్గొస్తుంటే నాలుగు తులసాకుల్ని రోజుకి రెండు లేదా మూడుసార్లు నమిలితే తగ్గిపోతుంది. పొడి దగ్గొస్తుంటే ముదిరిన రెండు పెద్ద తులసాకుల్లో ఒక లవంగ మొగ్గ పెట్టి బుగ్గన పెట్టుకుని మధ్య మధ్యలో మెల్లగా కొరుకుతూ వస్తున్న రసాన్ని మింగుతూ ఉంటే మూడు రోజుల్లో దగ్గుమాయం. వారానికొకసారన్నా గ్లాసుడు నీళ్ళల్లో చిటికెడు పసుపు, రెండు తులసి దళాలూ వేసి మరిగించిన నీళ్ళని తాగితే కడుపు

శుభ్రమవుతుంది….” చెప్పుకుంటూ పోతుండేది అన్నపూర్ణ వాళ్ళ నాయనమ్మ. ఇలాంటి తులసమ్మకు కూడా చీడ పడితే కొమ్మలకి పసుపు రాసి చెట్టుపైన పసుపు నీళ్ళు చల్లాలని,  పసుపంటే పుణ్యమని చెప్పే తాతమ్మ మాటల్ని శ్రద్ధగా పాటించేది శాంతి.

ఈ జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న అన్నపూర్ణకి ఒకటి మాత్రం జవాబుదొరకని ప్రశ్నగానే ఉండిపోయింది. తాతమ్మ కబుర్లన్నీ విని, వీలైతే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, ఎన్నో విషయాల్ని శ్రద్ధగా పాటించే శాంతి ఒక విషయానికి మాత్రం ఎప్పుడూ తాతమ్మతో గొడవపడేది. ”అందరూ రంగురంగుల బట్టలేసుకుంటే నువ్వెందుకు తాతమ్మా ఎప్పుడూ ఒకే రంగు చీర ట్టుకుంటావు? పసుపంటే పుణ్యమంటావు… నువ్వెందుకు పసుపు ముట్టుకోవు? నా చెయ్యిజారి పసుపు గిన్నె నీ మీద పడితే, పసుపంటిన ఆ చీరని అప్పటికప్పుడు తీసేసి చాకలామెకి ఇచ్చేశావెందుకని…?” ఏడేళ్ళ మునిమనవరాలి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తెలివైన తన నాయనమ్మ నిశ్శబ్దంగా ఉండిపోవడం అన్నపూర్ణకి ఆశ్చర్యాన్నిచ్చేది. మరి తన కూతురి ఈ ప్రశ్నలకి… నిజానికి తన మనసులోనూ ఉన్న ఈ ప్రశ్నలకి  సమాధానం ఎప్పుడు దొరుకు తుందో…  సమాజంలో ఇప్పటికీ ఎంతో మంది స్త్రీలని కాస్త అటూ ఇటూగా తన నాయనమ్మ ఎదుర్కొంటున్న లాంటి పరిస్థితుల్లోకే నేట్టేస్తున్న ఈ శాస్త్రీయత లేని చేష్టలకి ముగింపు పలకడానికి ఏం చేయాలో…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.