ఓరుగల్లు అనే గేయాన్ని సరస్వతి పుత్రుడుగా పేరు గాంచిన పుట్టపర్తి నారాయణచార్యులు రచించారు. ఈ గేయ కవితను పరిచయం చేస్తూ ప్రాచీనవైభవ విశేషాలను, స్త్రీ మూర్తుల పరాక్రమ విశేషాలను వివరించడం దీని ఉద్దేశ్యం. ఈ గేయాన్ని తను రాసిన మేఘదూతం కావ్యం నుండి స్వీకరించబడింది. ఇది సందేశ కావ్యం అంటే మధ్యవర్తి ద్వారా కావాల్సినవ్యక్తికి కబురు పంపడం. యక్షుడు తన భార్యకు సందేశం పంపడం కాళిదాసు మేఘసందేశంలోని కథ. ఖైదీగా ఉన్న యువకుడు మేఘం ద్వారా భార్యకు సందేశం పంపడంతో ఇక్కడ మేఘదూతం అనే గేయంతో ప్రారంభమవుతుంది.
ఈ గేయంలో పుట్టపర్తివారు రాణిరుద్రమ పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులకు క్రీ.శ. 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతిదేవునికి పురుషసంతానం లేనందున రుద్రమనే పురుషునివలె పెంచుతూ సకల యుద్ధ విద్యలను నేర్పించాడు. ఆమెను సర్వ శక్తివంతురాలిగా ఎదిగేలా చేశాడు. ఈ ఓరుగల్లు గేయంలో జైలు పాలైన యువకుడు మేఘుడితో చెప్పిన సందర్భంలో ఓరుగల్లు వైభవాన్ని తెలియపరచాడు.
”ఓ మేఘమా ఓరుగల్లు అనేది కాకతీయులు పాలించిన నగరం ఆంధ్రచరిత్ర అనే కన్యకకు పుట్టిల్లు.”
”చండీశ్వరిదేవి జలజలా పారించే
శాత్రవుల రక్తమ్ము చెడని సెలయేరుగా”
అక్కడ రుద్రమదేవి చండీశ్వరి దేవి వలే శత్రువుల రక్తాన్ని సెలయేరులా ప్రవహింపచేసింది. అంతటి ధీరవనితలోని వీరత్వం అక్కడ కనిపిస్తుంది. రుద్రమ పరాక్రమం రూపు దాల్చినట్టు శత్రువులపై నిప్పులు వెడలగక్కింది. రాణి రుద్రమ దేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక, వెలమలు వారు వీరు అని కాకుండా అన్ని కులాలవారు ఉండేవారు. రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేది. దానధర్మాలు చేసేది. అనేక కళలను పోషించినట్లు చరిత్రకారులు, చరిత్ర మనకు చెబుతుంది.
రుద్రమ కాలంలో ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయిస్థంబాల గుడి వైభవంగా వెలుగొందాయి. ఎవరికి అన్యాయం జరిగినా వెంటనే విచారించి న్యాయం చేసింది. మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే ఋజువైంది. దీనికి కారణం తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేయడమే. ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమదేవి పాలనావిధానాన్ని ప్రశంసించారు. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి. తన జీవితం అంతా తన తండ్రి గణపతి దేవుని అడుగుజాడల్లో నడిచింది. తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమ అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
దేవగిరిరాజైన యాదవ వంశీయుడైన మహాదేవరాజు రుద్రమదేవిని స్త్రీయే కదా అని తలచి, తేలికగా చూసి తన పౌరుషం మీద నమ్మకంతో రుద్రమదేవిపై దండెత్తాడు. అప్పుడు ఆమె నిప్పులు గక్కుతూ కాళికాదేవివలె విజ్రుంభించి, అన్ని చోట్ల తానే ప్రత్యక్షమై హూంకారాలతో మహాదేవరాజును తరిమికొట్టింది.