తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ”షి టీమ్స్”ను ప్రారంభించింది. సాధారణ దుస్తుల్లో వున్న పోలీసులు ఈ షీ టీమ్స్‌లో వుంటారు. వొక్కో టీమ్‌లో ఐదుగురు ఆడ, మగ పోలీసులుంటారు. వారంతా బహిరంగ స్థలాల్లో, గుర్తించిన ప్రదేశాల్లో అంటే స్త్రీలు ఎక్కువగా తిరుగాడే చోట్లలో తిరుగుతూ మహిళల్ని వేధిస్తున్న మగవాళ్ళ వికృత చర్యల్ని వీడియో తీసి వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇలా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన నిందితుల్ని కోర్టులో హాజరు పర్చడం, కౌన్సిలింగ్ చెయ్యడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్‌కి సదరు నిందుతుల తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులను కూడా పిలుస్తారు.
ప్రతి శనివారం ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ పరిధిలో జరిగే షీటీమ్స్ అఫెండర్స్‌కి కౌన్సిలింగ్‌ని గత డిశంబరు నుండి భూమిక చేపట్టింది. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించినపుడు, సైబరాబాద్ కమీషనర్ గారి సూచన మేరకు షీ టీమ్స్ అఫెండర్స్‌కి కౌన్సిలింగ్‌ని కూడా భూమిక మొదలుపెట్టింది. ప్రతి శనివారం దాదాపు 40 నుండి 50 మంది నిందితులు, వారి కుటుంబ సభ్యులకు భూమిక కౌన్సిలర్లు కౌన్సిలింగ్ ఇస్తారు. ‘ఈవ్ టీచింగ్’ అంటూ వేధింపుల్ని తక్కువ చేసి చూస్తూ, అదో సరదా ఆటలాగా, అది తమ హక్కులాగా భావించే మగవాళ్ళకి వాస్తవాలు వివరించడం, ప్రస్తుతం అమలులో వున్న చట్టాల తీవ్రత గురించి, కఠినమైన శిక్షల గురించి వివరించడం కౌన్సిలర్ల బాధ్యత. తల్లిదండ్రుల్ని, కుటుంబ పెద్దలని ఉద్దేశించి భూమిక బాధ్యులు సత్యవతి, ప్రశాంతి వివరిస్తారు. ఎక్కువ సంఖ్యలో దొరుకుతున్న మైనర్లమీద ఎక్కువ సమయం కేటాయించి, పోలీసులకు దొరికితే ఎదుర్కొనబొయే పరిణామాలను వివరిస్తారు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్‌ని బాగా మందలించడం జరుగుతుంది.
భూమిక భాగస్వామ్యం వహించిన ఈ కార్యక్రమం వల్ల బహిరంగ స్థలాల్లో స్త్రీల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను లోతుగా అర్థం చేసుకోవడానికి, వేధింపులకు పాల్పుడుతున్న వారి మానసిక స్థితి గతులను అర్థం చేసుకుంటూ వారితో నేరుగా సంభాషణ జరపడానికి అవకాశం దొరికింది.