తెలుగు కథ – దళిత బాలల వెత – ఆచార్య మూలె విజయలక్ష్మి

బాల్యం అమాయకత్వానికి, స్నిగ్ధత్వానికి, నిష్కల్మషత్వానికి చిహ్నం. తల్లిదండ్రుల ఆలనా పాలనలో, ముద్దు మురిపాలతో మురిసే బాల్యం రంగురంగుల హరివిల్లు. ఆటపాటలలో మునిగి తేలే బాల్యం, భవిష్యత్తు నిర్మాణానికి చదువు సంధ్యల్లో ఆరితేరే బాల్యం. వెరసి కొందరికి వడ్డించిన విస్తరాకు – మరికొందరికి కూడూ గుడ్డా కరువు. బడి మాట దేవుడెరుగు. పసి వయసులో పనీ, పాటలతో, పోషకాహార లోపంవల్ల రోగాలు రొష్టులతో కొందరి బాల్యం.

బాలికల పరిస్థితి మరీ అధ్వాన్నం. తల్లిదండ్రుల ఆడమగ వివక్ష విషపు కోరల్లో, పెళ్లి పేరుతో మూఢాచారాల కారణంగా నలిగి వక్కలవుతోంది. ఇది బాల్యమా! జీవన్మరణమా! ఇవి నిత్యంకళ్లముందు చలిస్తున్న దృశ్యాలు, సమాజంలో జ్వలిస్తున్న సంఘటనలు. నిరాశ, నిస్పృహలతో నిండిన బాల్యం గడపడానికి ప్రధాన కారణం పేదరికం. సామాజిక వ్యవస్థ ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా అరగడుపరగడుపుతో కాలం వెళ్ళదీసే తల్లిదండ్రులు ఒకవైపు, ఆకాశహర్మ్యాలలో ఉంటూ మృష్టాన్న భోజనాలు ముప్పూటలా తినటానికున్న తల్లిదండ్రులున్న వర్గసమాజం మరోవైపు. ఈ కారణంగా బాలలకు అంది వచ్చే అవకాశాలు, ఆనందాల్లో అంతే అంతరముంటుంది. ప్రభుత్వం అందించే బాలల సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు కావటం లేదు.

బాలల వెతలను కథాసాహిత్యం అక్షరీకరించింది. కథా సాహిత్యంలో ప్రతిఫలించే దళిత బాలల వెతలను, ప్రస్ఫుటం చేయటం ఈ వ్యాసలక్ష్యం. పేదరికం, కులవివక్ష, విద్యా వివక్షత, వెట్టిచాకిరీ, అత్యాచారాలు, మూఢనమ్మకాలు వంటి సమస్యలను రచయితలు ప్రత్యక్షీకరించారు. ప్రశ్నించారు. వెలుగు మార్గాలను సూచించారు.

దళితుల్లో ప్రధాన సమస్య పేదరికం, కూడూ గుడ్డా లోటు, పనికెళ్ళినా అరకడుపు. చింకిపాతలు, మురికి కూపాలు వీరి ఆస్తిపాస్తులు. కుటుంబంలో పేదరికం ప్రభావం ఇల్లాలు, పిల్లలు మీద పడుతుంది. కన్నబిడ్డలకు కడుపు నింపలేని దుస్థితి తల్లికి వ్యధ. భర్త తాగుబోతో, వ్యసన పరుడో అయితే గోరు చుట్టు మీద రోకటి పోటు. ఆకలికి ఒక పూటో, ఒక రోజో తాళవచ్చు. ఆకలి తాళలేక మన్ను బుక్కిన చిన్నారిగాథ జాజుల గౌరి ‘మన్నుబువ్వ’.

ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబం. వాయువుకు తోడు దొబ్బుడుగాలన్నట్లు తండ్రి తాగుబోతు. తండ్రి సంపాదనే కుటుంబానికి ఆదరువు. తండ్రి ఇచ్చే పైసలతో ఒకపూట తిండి మరో పూట పస్తు. తాగకుండా డబ్బు ఇంట్లో ఇవ్వమన్న ఇల్లాలి పోరు చెవికెక్కదు. వారం రోజులనుండి పనులు దొరకవు. ఉన్న పైసలకు బియ్యం తెమ్మని కొడుకును పంపింది. అన్న వచ్చే లోపలే ఆకలి ఓర్చుకోలేక పోయింది పాప. మన్నులో ఆడుతూ అటూ ఇటూ చూసింది. కమ్మని మట్టి వాసన. గుప్పిళ్లు, గుప్పిళ్లు బొక్కింది. కడుపునిండా నీళ్లు తాగింది.

పేదరికం కారణంగా తిండికి లోటు. కడుపు నింపుకోడానికి పడేపాట్లు చిత్రించిన కథలు కొలకలూరి ఇనాక్‌ గారి ఆకలి, ఎర్నీళ్లు.

ఏడేళ్ళ చిన్ని ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గాయాల పాలయింది. లారీ యజమాని పరిహారంగా నెలకు వంద చొప్పున నాలుగు నెలలు, ఆరు నెలలు ఆహారం సమకూర్చాడు. అది చిన్ని కడుపే కాక కుటుంబం కడుపు నింపింది. ఆర్నెల్లు పూర్తయ్యాయి. కుటుంబంలో ఆకలి మళ్లీ చిగురేసింది. చిన్ని ఆకలి తీరే మార్గం ఆలోచించింది. లారీ కింద కావాలనే పడింది. అనంత లోకాలకు చేరింది.

ఆకలి మంచి చెడు ఆలోచించదు. ఆకలి మంట చల్లారాలి. ‘ఎర్నీళ్లు’ కథలో చింతడికి అయిదా రేళ్లు. అమ్మ తప్ప మరొకరు లేరు. ఆమె రెక్కల కష్టం మీదే తిండి తిప్పలు. తల్లి పనికి వెళ్లింది. తల్లి వచ్చేలోపు తట్టుకోలేని ఆకలి. ఇంట్లో కడిగి బోర్లించిన కుండా చట్టి తప్ప ఏమీ లేదు. ఇల్లు వదిలి డొంకలోకి వచ్చాడు. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, వెంట్రుకల పొత్తి కన్పించాయి. అది దిష్టి తీసిన ఆనవాళ్ళు, అవీ ఎవరు తగలరు, తొక్కరు. అలా జరిగితే దిష్టి తీసిన వారికి కీడు తగుల్తుంది. చింతడికి అవేమీ తెలియదు. వెంట్రుకల పొత్తి గాలి కెగిరిపోయింది. ఆ వస్తువులు తెచ్చాడు. నిమ్మరసం చేసుకొని తాగాడు, తల్లికి ఎత్తిపెట్టి పని నుంచి వచ్చాక ఇచ్చాడు.

అలాగే ఆకలి వల్ల నీరసించి, ఇంట్లో అన్నం వండలేదని చెప్పలేక జెరమొచ్చిందని చెప్పి, అంది వచ్చిన ఆహారాన్ని పొందలేక నానాపాట్లు పడిన దళిత బాలిక కథ ఎమ్‌. వినోదిని ‘బాలేదు జెరమొచ్చింది’

పద్నాలుగేళ్ల వరకు ఉచిత నిర్భంధ విద్య బాలల ప్రాథమిక హక్కు. అయితే అది కొందరి బాలలకు అందని ద్రాక్ష. చదువుకోవాలని ఆశ ఉన్నా కడుపుకు కరవయితే చదువు మాటెక్కడ?

ఎంకడు దొర ఇంట్లో పశువుల కాపరి. ఇంట్లో కూడా ఆపనీ, ఈపనీ చేస్తూ చేతికింద ఉంటాడు. ప్రతిఫలం సోలెడు గింజలు. దొర కొడుకు చదువుకుంటుంటే తానూ ఆశపడ్డాడు. తల్లిని అడిగాడు ”దొరలెక్కడ మనమెక్కడ” దొరలు దొరలే బాంచాలు బాంచలే. నీ అయ్య దొరకు నిన్ను అమ్మిండు అని తేల్చింది. అయినా అదే ధ్యాస.

దొరను అడిగాడు. చావుదెబ్బలు తిన్నాడు. సోలెడు గింజలు అరసోలెడయ్యాయి. ఆశ చావలేదు. పంతులింటికెళ్ళి, రాత్రిళ్లు వస్తా చదువు నేర్పించమన్నాడు. వెట్టిచాకిరి నేరమని, పట్నంలో ఉచితంగా చదువు చెప్తారని పంతులు సలహా ఇచ్చాడు. ఎంకడికి ధైర్యం వచ్చింది. ”దొరా నేను చదుకోన్కిపోతున్నా బస్తీకి” అన్నాడు.దొర నివ్వెరపోయాడు. అది దాశరథి రంగాచార్య చదువు కథ.

పైసా ఖర్చు లేకుండా బస్తీలో చదువులు చెప్పే హాస్టలుందని నమ్మబలికి, బాలుని పనికి కుదిర్చిన వైనం అరిగే రామారావు ‘లేతమొలకలు’

సీతాలప్ప కొడుకు కొండడు చాకు. బడి ఆరు మైళ్ల దూరం. గూడెంలో పిల్లలెవరూ బడికెళ్లరు, పశువుల కాపర్లు. కొండడికి చదువంటే మక్కువ. సీతాలప్పకు అన్నవరుసైన నరసిమ్మ కొండడిని బస్తీలో చదువుకు చేర్పిస్తానని తల్లిదండ్రులను ఒప్పించాడు. అక్కడ దళారీకి అప్పగించి జారుకున్నాడు. హైదరాబాదులో పనికి కుదిర్చి చక్కాపోయాడు మస్తాను. అక్కడి పనిమనిషి మాటల ద్వారా ‘అన్నం పెట్టి, గుడ్డలిచ్చి, సంవత్సరానికి వెయ్యిరూపాయల జీతానికి కుదిరినట్లు తెల్సింది కొండడికి. ఇప్పుడు నాగా పెట్టకుండా పర్మనెంట్‌గా పడి ఉండే పనివాడు కొండడు. చదువేమో కాని తల్లిదండ్రులకు దూరమై చాకిరికి చేరువయ్యాడు.

అంటరాని తనం దళితులను బడికి, ఊరికి దూరం చేస్తోంది. కుల వివక్ష బతుకులను బండబారుస్తోంది. అంటరానితనం పాటించడం నేరమైనా, సమాజంలో అడుగంటి పోలేదు. దళితుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.

బడికెళితే అంటరానితనం కారణంగా అసువులు బాసిన దళిత బాలుడి గాథ జిరవి కృష్ణ సమాధుల నీడలు కథ

ముసలయ్య పండుటాకు. కాటి కాపరి. కుటుంబమంతా వరదలో పోయింది. మనవడు సంగడి ఆలనా పాలనా ముసల య్యదే. శ్మశానమే వారికి నీడ. ఊరికెళితే చీదరించుకుంటారని అవసరమయితే తప్పవెళ్ళడు. సంగడు అప్పుడప్పుడు వెళ్ళేవాడు. బళ్ళో చేర్పించమని అడిగాడు తాతను. ముసలయ్య పెదకాపును అడిగితే ససేమిరా అన్నాడు. బెదిరించాడు. సంగడు వినలేదు. ఒకరోజు రాత్రి సంగడి కోసం ఎదురు చూస్తున్నాడు ముసలయ్య ”ఏరా ముసల్నా కొడక ఊళ్ళోకొచ్చి సంగిగాడు పెద్దయ్య కొడుకు పక్కన బళ్ళో కూసుంటాడు. విషయం తెలిసిన పెద్దయ్య జీతగాళ్ళతో సంగిగాడి మక్కెలిరగ్గొట్టించాడు. ఆయింతకే ఆడు సచ్చూరుకున్నాడు. ఆడి శవం ఎవరు ముట్టుకోకుంటే తాడుతో బండిక్కట్టి లాక్కొచ్చిన్నాం” అన్నారు. ముసలయ్య గుండెలు పగిలాయి. భార్య పక్కనే పూడ్చాడు. ఆ సమాధి మీదే తలవాల్చాడు. కాటికాపరి సమాధుల నడుమ అనాథ శవం.

పేదరికంలో ఉన్నవారు పిల్లల సంపాదన వేన్నీళ్లకు

చన్నీళ్లు తోడనుకుంటారు. కాసిన్ని రూకలు గంజికి నూకలైనా వస్తాయని ఆశపడ్తారు. పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తారు. దేవరాజు మహారాజు ‘పొడవని పొద్దు’ కథలో ఎనిమిదేళ్ల పోశయ్యకు చదువుకోవాలని ఆశ. తండ్రిలేడు. చదివించే తాహతు లేదు తల్లికి. బర్రెలు కడిగితే అమ్మగారిచ్చిన పైసలతో బలపాలు కొనుక్కొని అక్షరాలు దిద్దాలనుకున్నాడు. తల్లి ఉప్పుకారం కొనడానికి పట్టుకెళ్లింది. తిండి వున్నోళ్లకే చదువని తల్లి చెప్పింది, తమ కెందుకు లేదు. పోశయ్య మదినిండా ప్రశ్నలు?

దళితుల ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న చిన్నోడి కథ కొలకలూరి ఇనాక్‌ ”గెలుపు” పదకొండేండ్లసన్నోబులుకు తప్పెట దరువేయడంలో సరిరారెవ్వరు. ఆరి తేరినవారే ఆశ్చర్యపోతారు. ఆ చిన్నారికి పేదరికం వారసత్వం. ఒంటిమీద చొక్కాగుడ్డ తప్ప మరో అంగి లేని వాడు. శంకర్రెడ్డి గెలుపు ఊరేగింపులో తప్పెట గొడితే కొత్తబట్టలు వస్తాయని ఆశపడ్డాడు. దరువేశాడు, లయబద్ధంగా అడుగులేశాడు. తప్పెట కొట్టిన వారికి రెడ్డెమ్మ ఇచ్చేది వంద. అది అంత సులభమా చేతికి రావడం. కాళ్ళు పట్టుకోవాలి. దండం పెట్టాలి. కొంగు పట్టాలి, చేతికివ్వదు. ఎవరి డబ్బు వారికే ఇస్తుంది. పద్ధతి తప్పదు. బుడ్డోనికి పుట్టగోచి తప్ప మరో బట్ట లేదు. కొంగు పట్టకపోతే డబ్బివ్వదు. అహం దెబ్బతింది. గోచి విప్పి పట్టాడు. నోటుగాలికి కింద పడింది. తీసుకోలేదు. గోచీ గుడ్డ తలకు చుట్టుకొని దరువేసుకొంటూ ముందుకు సాగాడు.

లైంగిక వేధింపులు :

ఆడపిల్ల అడుగు బయట పెడితే భద్రత లేదు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఆసిడ్‌ దాడులు. బాలికలు పనిపాటలకు వెళ్ళిన చోట్ల, తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కామాంధుల కన్నుపడుతుంది. తమకేం జరుగుతోందో తెలియని అమాయకత్వం, అశక్తత బాలికలది. తల్లిదండ్రులకు తెలిసినా అర్థబలం, అంగబలం లేని కుటుంబాలు. నలుగురికి చెప్పినా, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకం.

దళిత బాలికపై జరిగిన అత్యాచారాన్ని తెల్పిన కథ జాజుల గౌరి ‘కంచె’. సుగుణ, నాగమణి, బుజ్జి హైస్కూల్‌ విద్యార్థులు. సెలవుల్లో కట్టెల కోసం అడవికెళతారు. కట్టెలకోసం కంచె లోపలకెళ్ళిన సుగుణను వాచ్‌మెన్‌ పట్టుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంట్లో చెప్పవద్దంది స్నేహితులను. దిగులుగా వున్న కూతురిని చూసి తల్లి ఆరా తీసింది. దవాఖానాకు తీసుకెళితే గర్భవతి అని తేలింది. పాప ఆత్మహత్యకు సిద్ధపడింది. తల్లి ఆపింది. ”నువ్వెందుకు చావాలి, గీ దునియాల మొగోడు ఎంతో మందికాడ్కి పోయినా ఆడు నీటుగాడే గాని, ఆని కావరం లెక్కలు బరించిన ఆడది ఆ పాపం మూట మోస్తే రంకుతనం అంటగడ్తరు. ఆళ్లకు లేని నాయం ఒక నీకే ఎందుకమ్మ… నీ జిందగి నీకు ముఖ్యం” అంటూ విషయం పొక్కనీయకుండా పిండాన్ని ఖండం చేయించింది.

అత్యాచారానికి గురయికూడా కడజాతి అని ఎద్దేవాకు గురయిన సంఘటనను వివరించిన కథ ఎమ్‌. వినోదిని ‘మరియ’.

మరియ, మార్తా అక్కచెల్లెళ్లు, తండ్రి తాగుబోతు. భర్తతో గొడవపడి పుట్టిల్లు చేరింది. తండ్రి బిడ్డలతో స్నేహితుడు వెంకటేశ్వరరావు కాంపౌండ్‌లో వున్న వారింట్లో నివాసం. రావు భార్య ఉద్యోగి. మరియ రావు ఇంట్లో పని చేసేది. రావు కొడుకు మార్తాతో అసభ్యకరమైన లైంగిక పనులు చేయించుకొని చెప్పవద్దని

బెదిరించేవాడు. మార్తాను బడిలో చేర్పించింది రావు భార్య. బడికెళ్ళి వచ్చేటప్పటికి మరియ లైంగిక దాడికి గురైంది. రాత్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకొంది. మార్తా బడి నుంచి వచ్చి, గమనించిన సంగతి చెప్పింది. అయినా రావు అన్నయ్య మాది నిప్పుని కడిగే వంశం… ఒక కడ జాతి ఆడపిల్లని నాతమ్ముడు తాకుతాడా… అలాయెప్పటికి జరగదు. యింట్లో లక్ష్మీదేవి లాంటి భార్యను పెట్టుకొని అలాంటి అప్రాచ్యపు పని చెయ్యడుగాక చెయ్యడు… అన్నాడు.

సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్‌ అఘాయిత్యానికి గురయి కిమ్మనలేని పరిస్థితిలో ఉన్న బాలిక కథ చల్లపల్లి స్వరూపరాణి ‘భద్రం తల్లీ’

సంక్షేమ హాస్టల్లో చేరిన దళిత బాలిక విద్య. హాస్టల్‌ పిల్లలే వార్డెన్‌ ఇంట్లో పనిమనుషులు. ఆరోజు విద్య వెళ్లింది. రాక్షసత్వం, కాముకత్వం చూపించాడు. చెప్తే చంపేస్తానన్నాడు. చూడడానికి వచ్చిన తల్లికి చెప్పలేక పోయింది. నెలానెలా వచ్చే కడుపునొప్పి రాలేదు. ఎవరికైనా చెబితే హాస్టల్‌ నుండి పంపిస్తాడేమో! నేనెలా చదువుకునేది అన్నది విద్య ప్రశ్న.

మూఢాచారాలు :

ఆడపిల్లలంటే సమాజంలో చిన్నచూపు. లింగవివక్షత, అవిద్య, లైంగికవేధింపులు వంటి సమస్యలే కాకుండా మూఢాచారాలు దళిత బాలికల జీవితాలను పట్టిపీడిస్తున్నాయి. తల్లిదండ్రుల అజ్ఞానం, వ్యవస్థ పెత్తందారీతనం, బాలికలపట్ల శాపంగా మారుతున్నాయి. ఆరు నెలల బిడ్డ నుండి యుక్త వయసులో ఉన్న బాలికలను దేవతలకు అర్పిస్తున్నారు. ప్రాంతానికో పేరు బసివిని, మాతమ్మ, జోగిని వగైరా. దళిత, వెనుకబడిన వర్గాల్లో మూఢాచారం ఇంకా కొనసాగుతోంది. గ్రామదేవతలకు అర్పించిన తర్వాత ఆమె ఊరుమ్మడి ఆస్తి. ఈ కార్యంలో గ్రామపెద్దల ప్రమేయం ఉంటుంది.

మూఢాచారాలకు బలయిన స్త్రీల పిల్లలను సమాజం చులకనగా చూస్తుంది. తండ్రెవరో తెలీదు. ఒక దళిత బాలికను బసివిరాలుగా మార్చే తతంగాన్ని నాగప్పగారి సుందర్రాజు ‘నడిమింట బోడెక్క బసివిరాలయ్యేద’ కథలో కళ్ళకు కట్టించారు. ముసలితనంలో బాగా చూసుకుంటుందని తల్లిదండ్రులు బోడెక్కను బసివిరాలుగా వదలడానికి నిశ్చయిస్తారు. ఈతంతు ఊరందరికి వేడుక. బోడెక్క కంటికి మంటికి ఏడుస్తున్నా పట్టించుకునే వారుండరు.

జోగినిగా మార్చాలనుకున్న గ్రామ పెద్దల నిర్ణయాన్ని ధిక్కరిస్తూ తమ బిడ్డను చదివించాలనుకున్న కుటుంబం గాథ గోగుశ్యామల ‘రడం’

చంద్రయ్య దళితుడు. అతని కూతురిని జోగినిగా మార్చమని గ్రామ పెద్దలు నిర్ణయించారు. చంద్రయ్య అంగీకరించ లేదు. చావు దెబ్బలు కొట్టారు. చలించలేదు. రెండెకరాల భూమిని లాక్కొన్నారు. అయినా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఆస్తిపాస్తులకంటే బిడ్డ చదువే ముఖ్యమని రాత్రికి రాత్రే పట్నంలో హాస్టల్లో చేర్పించారు. తరతరాలుగా జోగినీ వ్యవస్థ కొనసాగాలన్న ఆలోచనకు దెబ్బకొట్టారు.

ముత్యం వెంకన్న ‘దరిలేని బావులు’ కథలో ‘మీ అవ్వనే వస్తది ఫీజు గట్టను, మీ అయ్య లేడా అని పంతులు ప్రశ్నిస్తే బాలుడు ఏం జవాబు చెప్పగలడు?

రాసాని ‘అక్షింతలు’ కథలో ఊళ్లో విషజ్వరాలు వ్యాపించాయి. దానికి కారణం భాగ్యమ్మ తల్లిదండ్రులు కూతురిని జోగిని విడుస్తామన్న మొక్కుబడి చెల్లించకపోవడమే అని గ్రామస్థులు నిర్ణయిస్తారు. 16 ఏళ్ళ భాగ్యమ్మ వివాహిత అయినా మార్చక తప్పదంటారు. తప్పనిసరై తల్లిదండ్రులు సమ్మతిస్తారు. ఆమె భర్తకు మరో వివాహం చేస్తారు. కానీ భాగ్యమ్మ ఊరు వదిలి ముందడుగేసింది.

దళిత బాలలు ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఆకలి మంటల్లో, అవిద్య, కుల వివక్షతవల్ల ఆత్మగౌరవానికి భంగపాటు కలుగుతోంది. ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. మూఢాచారాలకు బలవుతున్నారు. దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. సామాజిక దృక్పథంలో ఇంకా పూర్తిగా మార్పు రాకపోవడం శోచనీయం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.