డా.శిలాలోలిత
రాజ్యశ్రీ ‘చిరుసవ్వడులు’ అని కవిత్వానికి పేరు పెట్టడంలోనే ఆమె సున్నితమైన స్వభావం, నెమ్మదితనం, వినయం కన్పిస్తున్నాయి. తుఫాను శబ్దాలతో హోరెత్తి పోతున్న సమాజపు అసమానతలు ఆమెలో అనేకానేక ప్రశ్నలను రేప, అవన్నీ కవిత్వ ముఖాన్ని తొడుక్కొని మనముందుకు వచ్చాయి.
ఈ ముఖం కొత్తదే. కానీ కవయిత్రి కున్న అనుభవ నైశిత్వం, సామాజిక అవగాహనవల్ల పరిణితి చెందిన కవిత్వమైంది.
‘కవిత్వలన్నింటిలోన చైతన్యశీలి అయిన మహిళ తన చుట్టూ వున్న సమాజంలో వివిధ సందర్భాలలో పొందిన స్పందనలు ఉన్నాయి. సమాజంలోని విలువలు గురించి కవిత్వీకరించారు. భారతీయ సమాజంలో మనుషులమధ్య సంబంధాల, ముఖ్యంగా కుటుంబ చట్రంలో, సమాజ చట్రంలో నేటి మహిళ పొందుతున్న అనుభవాలు, అనుభతులు, నేటి మహిళ జీవన సారం వర్ణించారు. ప్రపంచంలో వ్యక్తి తాను ఎన్నో సుసాధ్యం చేసుకున్నా, సమాజం ఎంత మారినా, మనుషుల మధ్య సామరస్యత లేనిదే వ్యక్తికి గాని, సమాజానికిగాని మిగిలేది ఏమీ వుండదనీ, భావించారు. ఈనాటి తెలుగు భాషకు ఏర్పడిన పరిస్థితి నుంచి పెరుగు తున్న ధరలు, ఉగ్రవాదం ఆమె కవిత్వంలోని వస్తువులు. (ముందుమాట: ఆవుల మంజులత)
‘జ్ఞానులమవడానికి కొలబద్ద
ఎంత అజ్ఞానులవె తెలుసుకోవడమే’ ఈపంక్తులు రాజ్యశ్రీగారి జీవితానుభవాలకు, అనుభతులకు ఆలోచనలకు – అక్షర రూపాలు! (ముందు ొమాట: రావూరి భరద్వాజ)
మినీ కవితలు కొన్ని, కవితలు కొన్ని వున్నాయి ఇందులో. మినీ కవితల్లో, వ్యంగ్యం, అధిక్షేపణ,విశ్లేషణ, జీవిత దర్శనం వున్నాయి.
‘స్త్రీ పురుషుల అసమానత్వం
బహుశ:
స్త్రీ సర్దుబాటు తనంవల్ల
వచ్చిందేమొ!’
అనే నిజాన్ని చటుక్కున కొత్త కోణం నుంచి చెప్పారు.
‘వంటింటిని
వీపు మీద మొసినా
రుచి పచుల
అలకలు’అని విమర్శించారు. అలాగే, ‘కొంగు పట్టి నడిచిన
కొడుకు
నిర్దేశిస్తున్నాడు
నా నీడని,’- పురుషస్వామ్యమనే ఎన్ని రూపాలతో మనని నిర్దేశిస్తుందో వెల్లడించింది.
‘కొడుకులో స్వాంతన
పొందాలనుకుంది
ఆమెకేం తెలుసు
ఇద్దరు మొగుళ్ళవుతారని?’ ఈ కవిత్వ పాదాలు చూడగానే ప్రముఖ కవయిత్రి సావిత్రి రాసిన ‘బందిపోటు’ కవిత గుర్తొచ్చింది.
క్లుప్తత వల్ల గాఢతను సంతరించుకున్నాయీ పాదాలు.
స్త్రీ పురుష స్వభావంలో భేదాన్ని ‘బాహ్యానికి ప్రాధాన్యం అతడిది
అంతరంగానికి విలువ
ఆమెది’.
రైతుల స్థితిని వ్యంగ్యంగా ఇలా విమర్శించింది.
‘రైతులు పురుగు మందు
తాగనక్కరలేదు
విద్యుత్‌శాఖావారి
పుణ్యం చాలు’ – అని తేల్చేస్తుంది. ‘నువ్వు నాలాగే
వుండాలనుకోవడమే
పుణ్యం చాలు’ అని తేల్చేస్తుంది.
‘నువ్వు నాలాగే
వుండాలనుకోవడమే
అన్ని సమస్యలకు మూలం’అని దార్శనిక సత్యాన్ని విప్పి చెప్పింది.
‘నిన్ను చూసి తప్పుకునే వారికి
నావాడని చెప్పుకునేలా
ఎదిగి చూపించు’
ఓటమిని, పట్టనితనాన్ని, జీవితంలో పోరాడి ఎలా సాధించాలో చెప్పింది.
ఈ కవయిత్రి రాజ్యశ్రీ భావాల్లో ఆధునికత వుంది. కానీ, కవిత్వ రచనలో ఇప్పుడొస్తున్న కవిత్వాధ్యయనం చేయడం ద్వారా కవిత్వ శిల్పాన్ని మెరుగులు దిద్దుకోగలరు.
రాజ్యశ్రీ ప్రస్తుతం, సెక్రటేరియట్‌లో, సహాయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆంప్ర సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక కార్యదర్శి. చేతన సచివాలయ సారస్వత వేదిక అధ్యక్షులు. పలు కవితలకు బహుమతులను అందుకున్నారు. వారి సాహిత్యాభిరుచి, నిరంతరం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.