వివాహిత మహిళలపై హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టం : డబ్బుకోసం భార్యని భర్తే కాకుండా అతని బంధువులు, తల్లీ తండ్రి, ఆడపడుచులు హింసిస్తున్న సంఘటనలు మనకు ప్రతిరోజూ కోకొల్లలుగా కన్పిస్తున్నాయి. ఇది సర్వసాధారణమైపోయింది. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకు వచ్చిన కొత్త కోడలు జీవితం ఇలాంటి మనుషుల మధ్య దుర్భరమై పోతుంది. వారి క్రూరత్వం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ శారీరక క్రూరత్వం, మానసిక క్రూరత్వం అమానుషమైనప్పటికీ, దానికి తగిన శిక్ష చట్టాలలో ఇంతకు ముందు లేదు. ఈ అవసరాన్ని గుర్తించి శాసనకర్తలు భారతీయ శిక్షాస్మృతిలో కొత్త నిబంధనని (498 ఏ) పొందుపరిచారు.
పెళ్ళైన యువతిపట్ల ఆమె భర్తగానీ అతని బంధువులు గానీ క్రూరంగా వ్యవహరించినప్పుడు అది నేరమవుతుంది. వాళ్ళు శిక్షార్హులు అవుతారు. భర్తగానీ, ఆమె బంధువులు గానీ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యల వల్ల పెళ్ళైన యువతి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించినపుడు ఆమె శరీరానికి, జీవితానికి తీవ్రమైన హాని కలిగించే పరిస్థితులు కల్పించినప్పుడు అది క్రూరత్వమవుతుంది. చట్ట వ్యతిరేకమైన డిమాండు చేస్తూ ఆమెను గానీ, ఆమె బంధువులుగానీ, కట్నం గానీ, ఇతర కోరికలు గానీ తీర్చమని ఒత్తిడి చేసినప్పుడు దానిని క్రూరత్వమంటారు.
ఈ నేరం ఋజువు కావాలంటే… ఆమెకు పెళ్ళైందని, ఆమె హింసించబడిందని, ఆ హింస (క్రూరత్వం) ఆమె భర్తచేగానీ అతని బంధువులచే గానీ జరిగిందని ఋజువు చేయాల్సి వుంటుంది. ఈ నిబంధన కింద కేసును ఈ స్త్రీ బతికి వున్నప్పుడు గానీ, చనిపోయినప్పుడు గానీ పెట్టవచ్చు. ఆమె వైవాహిక జీవిత కాలపరిమితితో సంబంధం లేదు. ఈ నేరం కాగ్నిజబుల్ నేరం. ఈ నేరం గురించిన సమాచారం పోలీసులకి అందిన వెంటనే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఈ సమాచారాన్ని ఆమె రక్త సంబంధీకులుగానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ, ఆ స్త్రీ గానీ పోలీసులకి అందజేయవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ నేరం. అంటే బెయిల్ ఇవ్వడమనేది మేజిస్ట్రేట్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేరాలని ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గానీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గానీ విచారిస్తారు.
కోర్టులు నేరుగా ఫిర్యాదులను స్వీకరించవచ్చా?
పోలీసుల చార్జిషీట్‌తో నిమిత్తం లేకుండా, కోర్టులు ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులు గానీ, అన్నదమ్ములుగానీ, అక్కాచెల్లెళ్ళు గానీ, మేనత్తలు గానీ, మేనమామలు గానీ ఫిర్యాదు చేసినప్పుడు విచారిస్తాయి. కోర్టు అనుమతించినప్పుడు ఆమె రక్త సంబంధీకులు కూడా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.