ఒకానొక స్వప్న సాక్షాత్కారం : నాలుగవ భాగం

ఆక్స్‌ఫామ్ గిరిజ మాట్లాడుతూ స్త్రీల హింస గురించి పనిచేసే మా సంస్థ 70 దేశాలలో ప్రధానంగా పనిచేస్తోంది… స్త్రీలకి హింస తగ్గిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుంది… చాలామంది స్త్రీలు నాకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి అని అడిగేవాళ్ళు… దాన్ని గురించి ఆలోచించే ‘భూమిక’ తరఫున హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాము. మీరు కూడా హెల్్పలైన్ గురించి అందరికీ చెప్పమంటూ ముగించింది…

ఆ మీటింగ్ అలా ఎంతసేపు కొనసాగిందో మాకైతే తెలీలేదు ఆ తర్వాత అక్కడే గెస్ట్‌హౌస్‌ వారిచ్చిన షడ్రసోపేతమైన విందుతో ఆనందించి మా బసని ఖాళీచేసి అందరికీ పేరుపేరునా వీడ్కోలు తెలిపి కృతజ్ఞతాంజలి ఘటించి నర్సాపురం నుండి బయల్దేరాం.

ఈసారి బస్సులో సమతారోష్ని నా పక్కన కూచుంది.

నర్సాపురం నుండి అంతర్వేది వెళ్తూన్న దారిలో ప్రతీ చిన్న విషయాన్ని నాకు పరిచయం చేస్తూ కోనసీమని చూపించింది…

ఎటుచూసినా నీళ్ళు నీళ్ళు నీళ్ళు… పచ్చదనం కంటిని ఆహ్లాదపరుస్తోంది. ప్రకృతంతా గోదావరి జిల్లాలో తిష్టవేసుక్కూచుని పక్క జిల్లాలకు చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళొస్తోందా అన్నట్లుగా ఒకవైపు గొప్ప అనుభూతి. మరోవంక ఈర్ష్యతో కూడిన దిగులు…

ఇంతలో రోష్ని అందుకున్న
‘ఏడతానున్నాడో బావా… జాడతెలిసిన పోయిరావా… అందాల ఓ మేఘమాల…’ కృష్ణశాస్త్రి గీతం గిలిగింతలు పెట్టింది…
‘ఆకులో ఆకునై… పువ్వులో పువ్వునై’ అంటూ రోష్ని, లక్ష్మి పాడుతూంటే అందరికీ ఆ ప్రకృతిలో ఆగిపోవాలనీ, దాగిపోవాలనీ అన్పించింది… ప్చ్
ఈ జిల్లాలో వుండబట్టే ఆయనంతంత గొప్ప భావగీతాలు వ్రాయగలిగాడేమో అన్పించింది.. అందరి హృదయాలూ మల్లెల మాలలతో ఊగిసలాడాయి…

ఆ మధ్యాహ్నం మేము చూడవలసి వున్న బూరుగులంక ప్రోగ్రాం వర్షం కారణంగా రద్దయింది… అందుకని నేరుగా అంతర్వేది చేరుకున్నాం.

అక్కడ వశిష్ట గోదావరి సముద్రంలో కలుస్తుంది. ఆ పాయ అలా కలవడం స్పష్టంగా గోచరిస్తుంది. దాన్ని అన్నాచెల్లెళ్ళ గట్టు అని అంటారట… అక్కడికి వెళ్ళడానికి తగినంత వెలుతురూ, మా బస్సు ఆ దారికి సరిపడ్డంత చిన్నది కాకపోవడంతో అందరం మరో వైపుగా వున్న వశిష్టాశ్రమం వద్దకి నడుచుకుంటూ వెళ్ళాం. ఆశ్రమం పై నుంచి గోదావరి సముద్రంలో కలిసే దృశ్యం చూసాం.
వశిష్ట గోదావరి ఒడ్డున కట్టడం మూలంగా అది వశిష్టాశ్రమం అయింది… వశిష్టుడి విగ్రహం వున్నదక్కడ.

ఆ ఆశ్రమం చూసుకుని మేము తిరిగి బస్సువద్దకు చేరుకునే టప్పటికి పూర్తిగా చీకటి పడింది…
అంతర్వేది నుండి రాజమండ్రికి మా అంతులేని ప్రయాణం మొదలైంది… అది చాలా సుదీర్ఘంగా… మాటలతో, పాటలతో, అంత్యాక్షరితో కొత్త కొత్త ఆటలతో (గేమ్స్) మద్యమధ్యన ఎవరి సీట్లలో వాళ్ళు సాహితీ చర్చలతోనూ సాగింది…
వెళ్ళి వెళ్ళి వెళ్ళి చివరికి రాత్రి పదింటికి రాజమండ్రి చేరుకుంది మా బస్సు… అప్పటికే మాకోసం గెస్ట్‌హౌస్‌ అరేంజిచేసి ఎదురుచూస్తోన్న కోర్ట్ స్టాఫ్ ఆ వర్షంలో గొడుగులతో ఎదురొచ్చారు… అప్పటికే మాకోసం మంచి ఉపాహారం ఎదురుచూస్తోంది…

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కోర్టు స్టాఫ్ మాకెంతో సహకరించింది కాబట్టే మేము ఏమాత్రం ఇబ్బంది పడలేదు…

అందరం స్నానాలు చేసి పడుకునేటప్పటికి పన్నెండయినప్పటికీ మళ్ళీ ఉదయం మూడింటికే లేచి స్నానాలు చేసి అయిదింటికల్లా రెడీ అయి కాఫీలు తాగి వెళ్ళి బస్సెక్కాం.. జగన్నాధ రధ చక్రాలు కదిలాయి…

మసకమసక తొలిసందె… ఉసురసురనుగాలిలో బస్సు ఒక మహాస్వప్నం వైపు కదులుతున్నట్లుగా వుంది… అందరిలోనూ ఒక ఉద్వేగం.
‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతూంటే యిన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతూంటే యింకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?’ అంటూ కె.బి. లక్ష్మి పాటందుకుంది.
అందరూ తనతో కోరస్ కలిపారు.. గొప్ప హుషారుతో సత్యవతి ఈల వుండనే వుంది… 7 గంటలకు పట్టిసీమ చేరుకుంది బస్సు.

దాన్ని ‘పట్టిసం’ అంటారట నిజానికి.. దాని అసలు పేరయినా పట్టిసీమ కన్నా ఈ ‘పట్టిసం’ అన్నపేరు ప్రజల నాలుకలమీది నుండి తేలివచ్చి మమ్మల్ని తాకుతున్నట్లు గా వుంది. ఆ పట్టిసంలో గౌతమీ గోదావరి ఒడ్డుకు చేరుకుని మేము ఎక్కబోయే లాంచిని ఆసక్తిగా గమనిస్తూంటే వడ్డునున్న రావిచెట్టు ఆకులు కోసి కొసలుగిల్లి దాన్ని ఒడుపుగా పీపాయి చేసి ఊదసాగింది సత్యవతి… అద్భుతమైన సన్నాయి వాద్యం వీనుల విందుగా విన్పించసాగింది ఆ పీపాయి నుండి..
సత్యవతిని చూసి మేమంతా కూడా ఆ రావిచెట్టు ఆకులన్నింటినీ కోసి అత్యంత ఒడుపుగా చుట్టి పీపాయిలు తయారుచేశాం కానీ… ఊది ఊది బుగ్గలు నొప్పెట్టడమే తప్ప ఎంతకీ సౌండ్ రాదు. అలా అంతా రావి ఆకుల్ని నోట్లో వుంచుకుని బూరెల్లాంటి బుగ్గలతో, చిన్నవైన కళ్ళతో ఒక్కొక్కర్నీ చూస్తూంటే అదో అద్భుతమైన దృశ్యం… ఏ శబ్దమూ రాని పీపాయిలతో కలిసి నవ్వులయి.. ఆ నవ్వులన్నీ పువ్వులయి ఆ నదీతీరమంతా విరగ బూశాయి… లాంచి ఎక్కాక కొబ్బరాకుల బూరల్తో అదగగొట్టింది సత్యవతి.

ఇంకా ఎక్కువ ఆలస్యం అయితే ఏ ప్రమాదం ముంచు కొస్తుందనుకున్నాడో ఏమో మా లాంచి డ్రైవరు పరుగు పరుగున వచ్చాడు… ఎట్టకేలకు 8 గంటలకి లాంచిలో మేము లాంచవడం జరిగింది…

అదెంత ఉద్వేగమని. ఒక్కొక్కరమూ చెప్పులు చేతిలో పట్టుకుని వర్షానికి జారుతోన్న గట్టుమీద గట్టిగా నొక్కిపట్టి అడుగులు వేస్తూ ఆ చెక్కబల్లమీదినుండి మెలిమెల్లిగా ఒక్కొక్కరమూ లాంచి డెక్ మీదికి చేరుకున్నాము… అప్పటికే అక్కడ మాకోసం కుర్చీలు వేయబడి వున్నాయి… అందరం కూర్చుని ఒక ఉద్వేగంతో చుట్టూ వున్న గోదావరిని చూస్తుండగా మా లాంచి మెల్లిగా కదిలింది. దూరంగా గోదారి మధ్యలో పట్టిసీమ గుడి.

“తల్లీ గోదారికీ ఎల్లువొస్తే అందం
వెల్లువంటి పిల్లోడికి పిల్లగౌరి బంధం’
‘ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా’
వంటి అనేక పాటలు గోదారిమీద అందరి నాలుకలమీద ఊగిసలాడ్డం… అంతా కోరస్ యివ్వడం మొదలయింది.

లాంచి స్టాఫ్ ఒక్కొక్కరికీ ప్లేట్లలో బ్రేక్‌ఫాస్ట్ అందించారు. అంతా గోదావరి అందాలను చూస్తూ, గోదావరి గురించే కబుర్లాడుకుంటూ టిఫిన్లూ, కాఫీలూ ముగించాము…

లాంచి స్టాఫ్ కింది కెళ్ళి పోయాక మొదలయ్యాయి మా ఆటలు, పాటలూ, డ్యాన్సులూ…

డా|| సమతారోష్ని, విష్ణుప్రియ హీరో హీరోయిన్లుగా

“చిటపట చినుకులు పడుతూ వుంటే
చెలికాడే చెంతనవుంటే..
చెట్టాపట్టగ చేతులు కలిపీ చెట్టునీడకై పరిగెడుతూంటే”
అన్న పాటకి పాతతరం నాయికా నాయికలయితే ఎలా నటిస్తారు,

కొత్తతరం హీరోహీరోయిన్లు ఎలా డాన్సు చేస్తారు అన్నది విడివిడిగా చేసి చూపించడం ఒక మరపురాని దృశ్యం… నవ్వి నవ్వీ చెక్కలయి పోయిన పొట్టలకోసం వెదుకులాడు తూండగా సమతారోష్ని, సత్యవతి యిద్దరూ కూడా కనకమహాలక్ష్మి డాన్స్ రికార్డింగ్ ట్రూప్ అన్న సినిమాలోని డైలాగులు విన్పించి మళ్ళీ అందర్నీ గుక్క తిరక్కుండా నవ్వించారు…

యివన్నీ కూడా ఒకవైపు గోదావరి అందాలను చూస్తూనే కెమెరాలకి పని కల్పిస్తూనే మరో వంక ఆటలూ, పాటలూ, డ్యాన్సులూ, డైలాగులూ… సైమల్టేనియస్ గా సాగాయి…

పదకొండింటికి అందరం మరోసారి టీ తాగాక సీరియస్ డిస్కషన్‌లో పడ్డాం…

పోలవరం ప్రాజెక్టు గురించీ… అసలా ఆలోచన ప్రారంభమయిన నాటినుండీ యివ్వాల్టి వరకూ జరిగిపోతోన్న అనేకానేక పరిణామాలని గురించి… విశేషాలని మొత్తం స్టాటిస్టిక్స్‌నీ చంద్రలత అందరికీ చాలా వివరంగా తెలియ చెప్పింది.. మొట్టమొదటిసారిగా 1930లో అమెరికన్ గవర్నమెంట్ కట్టిన డ్యాం గురించీ… దాని పర్య వసానాలూ… ఆ తర్వాత కట్టబడ్డ అనేకానేక డ్యాంలూ… వాటిమూలంగా ఏర్పడిన పర్యావరణ సమస్యలూ అన్నీ కూలంకషంగా చర్చించింది…

చంద్రలత యిప్పటికే జలవనరులు, ప్రాజెక్టులు కట్టడం మూలంగా ఏర్పడుతోన్న పర్యావరణ సమస్యలూ, నిర్వాసితులయి పోతోన్న అనేక కుటుంబాలు… ముంపుకు గురవుతోన్న అనంతమైన పంటపొలాలు.. వీటన్నింటిమీద ‘దృశ్యాదృశ్యం’ అన్న నవల వ్రాసి వుండడం అందరికీ విదితమే. ఆ నవలలోని ఆసక్తికరమైన కొన్ని దృశ్యాలను కూడా ఆమె చదివి విన్పించింది.

అంతా తమకు కలిగిన సందేహాలకు చంద్రలత నడిగి సమాధానాలు చెప్పించుకున్నారు. అదొక బాధాకరమైన, అవసరమైన, ఆసక్తికరమైన దీర్ఘ చర్చ….

అంతా ఎంతో ఆసక్తితో వింటూండగా లాంచి తాలూకు స్పీకర్ మాట్లాడ్డం మొదలుపెట్టింది.

‘ఇదిగో మనం పాపికొండలు ‘వ్యూ’ లోకి ఎంటరవుతున్నాం’ అని. అందరం అలర్టయిపోయి గోదావరి మీదికి దృష్టి సారించాం.

లాంచి యొక్క టైటానిక్ ప్లేస్ (ముందుభాగం) లో కూర్చోవడానికి అంతా ఉత్సుకత చూపించారు.. అప్పటికే వర్షం పడుతోంది… తడిసి ముద్ద అవుతోన్న హృదయాలని మరింత తడుపుతున్నారే తప్ప ఎవరూ వెనక్కి రావడం లేదు.

ఆ వర్షపు జల్లులో ఉధృతంగా ఎగిసిపడుతోన్న గోదావరి మీద మా లాంచి ఉత్సాహంగా సాగుతోంది…
ఆ కొండలమీద ఇటీవల ఏర్పాటు చేసిన ‘రామదాసు’ సినిమా సెట్టింగ్‌ని చూడమని స్పీకర్ మళ్ళీ అరిచింది. మధ్యమధ్యన కొండలమీదినుండి ప్రవహిస్తోన్న జలపాతాలు మమ్మల్ని అలరిస్తూనే వున్నాయి…

అప్పుడు కె.వరలక్ష్మిగారో మాటన్నారు. గతంలో రోడ్లవసతి లేనపుడు పాపి కొండలు మీదుగా పడవ ప్రయాణం సాగుతూంటే లాంచిలో అందర్నీ మౌనంగా, నిశ్శబ్దంగా వుండమని కోరేవారట… ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయోద్వేగాలు వారిని ఆవహించేవట.

నాకయితే ఏమన్పించిం దంటే కబుర్లలో పడిపోతే మీరీ అందాలని ఆస్వాదించలేరు కాబట్టి మౌనంగా వుండమని కోరేవారేమోనని…

అందరి మనఃశరీరాలూ ఉద్వేగంగా వున్న ఆ సమయంలో కొండవీటి సత్యవతి ఒక్కొక్కరి పెదవుల వద్దా మైకునుంచి ఈ క్షణంలో మీకేమన్పిస్తోందో చెప్పమని కోరింది…

గిరిజ- ‘నేను ఎప్పట్నుండో చూడాలనుకుంటున్న ఈ కోరికని సత్యవతి ద్వారా తీర్చుకోవడం ఆనందంగా వుంది’

మందరపు హైమవతి-పాపికొండల్లో గోదావరిలా నా మనసు ఉరకలేస్తోంది

గీత- ఒళ్ళంతా కళ్ళయితే బావుండునన్పిస్తోంది…

నిజానికి గీత ఈ సాహిత్యంతో నాకేం సంబంధం లేదుసుమా అన్నట్లుగా వుండి యింతమంచి ఎక్స్‌ప్రెషనివ్వడం అందర్నీ ముగ్ధుల్ని చేసింది.

ఎస్.జయ – ప్రకృతిలో మనమూ కలిసిపోవడం చాలా బావుంది ఒక చిరకాల సౌందర్యస్వప్నం సాకారమయినట్లుగా వుంది.

అనిశెట్టి రజిత- రెక్కలున్న పిల్లలు ప్రకృతి ఒడిలోకి ఎగిరిపోతున్నట్లుగా వుంది.

పి. సత్యవతి – నయాగరా ఫాల్స్ కిందికి వెళ్ళి ఆ జలపాతంలో తడిసినపుడు ప్రకృతిలో మమేకమైపోయినంత గాఢమైన ఫీలింగ్ కలిగింది… ఇప్పుడు దాన్ని అధిగమించి ఈ కొండలమధ్య, ఈ గోదావరిలో ఒక గొప్ప ఆత్మీయతేదో కలుగుతోంది.

రెంటాల కల్పన- అమ్మొడిలోకి వెళ్తున్నట్లుగాను, చాలామంది అమ్మల్ని ఒకేసారి చూస్తున్నట్లుగానూ వుంది..

ఇలా అందరూ కూడా ఎవరి భావోద్వేగాలను వారు అందరితోనూ పంచుకోగలగడం అన్న సన్నివేశం నిజంగా అద్భుతమైనది… బహుశా మళ్ళీ మళ్ళీ రానిది…

రెండు కొండలనడుమ పాయలా పారుతోంది కాబట్టి దాన్ని పాపిడి కొండలు అంటారట.. అదే క్రమంగా పాపికొండలుగా మారి పోయిందనీ నిజానికవి పాపిడికొండలనీ చెప్పింది సత్యవతి…

కొంతసేపు మాటలు రానట్లుగా మౌనంగా వుండిపోయాం అంతా ఆ మహామౌనంలో నుండే మేమంతా పాపికొండలు మధ్యలో నుండి ప్రవేశించాం.. మరి కొంతదూరం సాగిసాగి ‘పేరంటపల్లి’ అన్న వూరిని చేరుకున్నాం.

ఎనిమిదింటి నుండి ఒంటిగంట దాకా సాగిన ఆ ప్రయాణంలో చాలాచోట్ల కొండసానువుల్లో అనేక వూళ్ళు, గూడేలు… జలపాతాలూ మా కంటపడుతూనే వున్నాయి. అయితే ఎక్కడా ఆగలేదు మేము… దూరం నుండి ఆ కొండ మనుషులతో మాట్లాడ్డమూ, వీడ్కోలు పలకడమూ, టా..టాలు చెప్పడం మాత్రమే చేశాము… అయితే ఈ పేరంటపల్లి వద్ద అందరం లాంచి దిగి అత్యంత ఎత్తున వున్న ఆ ఊరికి మెట్లెక్కి చేరుకున్నాం…

అక్కడొక ఆశ్రమం వుంది… ఆశ్రమం కంటే కూడా దానిముందు ఒక జలపాతం కొండలమీదినుండి.. బండలమీదుగా… రాళ్ళల్లో గలగలమని శబ్దంచేస్తూ పారుతోన్న ఆ సెలయేటి తేరులో పాటలమై కాళ్ళు తడుపుకుంటూ తేలిపోవడం ఒక అనుభవం.. చాలాసేపటిదాకా ఆ సెలయేటి పాటలో తాదాత్మ్యం చెంది ఎవ్వరూ బయటికి రాలేదు.

ఆ తరువాత ఆశ్రమం చూడ్డం.. ఆ గిరిజనుల నుండి వాళ్ళు తయారు చేసిన వెదురుపువ్వులు కొనుక్కోవడం మరొక అనుభవం… వాళ్ళంతా ఆశ్రమం కంటే ఎత్తుమీద వున్న మరోకొండపై వుంటారట.

 

<<  మూడవ భాగం  ( 1 2 3 4 5ఐదవ భాగం  >>

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.