– ఉషా రేవల్లి
కొంతమందికి తాము కారణ జన్ములమని తెలియదు
తాము అనాలోచితంగా వేసే అడుగుల జాడల్లో
మరెందరో గమ్యాలు వెతుక్కుంటారని వారికి తెలియదు
వెనుతిరిగి చూడకుండా, తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను లెక్కపెట్టుకుంటూ
తమ దుఃఖాన్నీ, సంతోషాన్ని కొలుచుకుంటూ వారు ముందుకు సాగిపోతారు
సూర్యాస్తమయంలో ఒక రేఖగా ముగిసిపోతారు
కానీ వారికి తెలియదు తాము కారణజన్ములమని
వారి శ్వాసనుంచి సుడిగాలి బలం కొందరు పుంజుకున్నారని
వారి మౌనం నుంచి విప్లవ శంఖారావం ఉద్భవించిందని
వారి జీవితం నుంచి స్ఫూర్తి
వారి మరణం నుండి నీరవసూక్తి
పొందిన వారు కొందరు తాము నేర్చుకున్న పాఠాలను
ప్రతి వీధికీ, వాడకీ, ప్రతి యింటికీ, ప్రతి గుండెకీ
వినిపిస్తూ పోతారని వారికి తెలియదు
నందినికేమైంది? ఆ పసిమొగ్గ అదృశ్యపుష్పంగా విరిసింది
ఇంకెన్నో మస్తిష్కాల్లో కొత్త ఆలోచనలు, ఆశలు నాటింది
నందినికేమైంది? నిన్నటి వరకూ మన మధ్య వుంది
ఈరోజు మన గుండెలోతుల్లో ఉద్వేగ శక్తిగా ఒదిగిపోయింది
మరో వెయ్యి కారణజన్ములకు జన్మనిచ్చింది.
(ఆలిండియా రేడియో, హైదరాబాద్)