– సీతారాం
నాకేమైంది
మీకేమైంది
మనకేమైంది
నందినికేమైంది
ముందే వెళ్ళిపోయిన అమ్మానాన్నలు
తల్లిలేని నందినికి
తండ్రీ లేని నందినికి
ఒక్క నానమ్మ మాత్రమే మిగిలివున్న నందినికి
ఎవరు పలకరించినా సెలయేరులా గలగలా పారే నందినికి
ఆటల, పాటల, మాటల నందినికి
ఊహల ఊసుల ఊయల నందినికి
ఇప్పుడేమైంది
ఎందుకలా పడుకుంది
నందినీ నందినీ
ఎర్ర మందారాల
ముద్దబంతి పూల
తెల్లమల్లెల నవ్వుల నందినీ
నువ్వెందుకలా బబ్బున్నావ్
లే నందినీ సీతాకోక చిలుకై ఎగురు నందినీ
కాళ్ళా గజ్జా కంకాళ్ళమ్మ ఆడు నందినీ
ఓ సాయంత్రం
సూర్యాస్తమయాన్ని తుమ్మ చెట్ల సందుల్లోంచి చూస్తూ
నందిని ఇంటికెళ్ళాను
నులక మంచం మీద ఆ పసి పాపతో
మృత్యువు పడుకొని వుంది
నిరాశా నదిలాంటి నందిని
హెచ్.ఐ.వి బాధిత బాల్య నందిని
వైరస్ నవ్వై కనుపాపల
కాంతులీనుతున్న నందిని
రెక్కలిరిగిన సీతాకోక చిలుకై
వాలిపోతున్న పాలిపోతున్న నందిని
మనల్ని సామూహికంగా ఓడించేసిన నందిని
ఔను నందినికి ఏమైంది?
నందినికి ఏమౌతుంది??
మనకు మాత్రం ఏమైంది???
(హెచ్.ఐ.వి. బాధిత నందిని కోసం- నందిని లాంటి పిల్లల కోసం)