– సి. హెచ్. పభ్రాకర్
నాలాగా నీలాగా వారూ వుండాలంటే ఎలాగ?
కాంక్షల కాశ్మీరాంబరాల్లోంచి
ఆంక్షల ముసుగుదుప్పట్లదాకా
ప్రయాణించినవాళ్ళు
తప్పెరుగని వయసు కోరికల్లో
తప్పటడుగులు వేసిన వాళ్ళు
తమను తాము కాపాడుకోవటం తెలీక
అమాయకంగా
జీవితం రంగుల్లోకి ప్రవేశించి
రోగగ్రస్తులైనవాళ్ళు
నాలాగా, నీలాగ వారూ వుండాలంటే ఎలాగ?
ప్రేమనీ, నమ్మకాన్నీ ఆశిస్తూ
కాస్తంత ప్రోత్సాహాన్నీ, ప్రేరణనీ
కోరుకుంటూ
నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా
‘వెలివాడల్లో’కి తరిమివేయబడుతున్న వాళ్ళు
ఒంటరితనం నీడల్లోకి ఒదిగిపోతున్నవాళ్ళు
పతితులా, భ్రష్టులా, బాధాసర్పద్రష్టులా
హెచ్.ఐ.వి. పీడితులు….
నాలాగా, నీలాగ వారూ వుండాలంటే ఎలాగ?
ఆపన్నుల నాదుకొనే
‘మానవీయ స్పర్శ’ అందిస్తామో,
‘మానవతకి’ మచ్చలేనంటూ
వల్లకాటికి తరలిస్తామో,
మనమూ వారితో కలిసి జీవితాశలు పంచుకోకుంటే
ఏదో ఒకనాడు
వారితో మమేకం కాక తప్పదు.
డి.డి. (టైనింగ్) ఎపిఎస్ఎసిఎస్, హైద్రాబాద్.