– మూలం: మౌరా ఎలారిమె
(అనువాదం: నాగలక్ష్మి, ఇంటర్ ద్వితీయ; చైతన్య, ఇంటర్ ద్వితీయ)
మా యింటిముదున్న
అరుగుమీద కూర్చుని
నన్ను నేనే ప్రశ్నించుకుంటాను…
ఎటు వెళుతున్నాను నేను
జీవించే ఆశ నాకేమైనా వుందా?
కళ్ళకు మసకబారిన చూపునిస్తూ
మనసంతా
ప్రతికూల ఆలోచనల సమూహమే
నాలోలోపల ఎక్కడో
చిరుజ్వాల మండుతూ
ఈ జీవితాన్నిలా కొనసాగించమనే
అడుగుతూ… అర్థిస్తూ…
నేనూ ఒక ప్రయోజన పూరిత
పౌరురాలనే అనీ
నాకూ ఉత్పాదక శక్తి వుందనీ
నిరూపించుకోవాలనీ,
గుర్తింపు పొందాలనీ
ప్రయత్నిస్తాను.
ఆ ఆలోచనల్నే దాచుకుంటాను
ఈ జీవితాన్ని నేనొక మహదవకాశంగానే
భావిస్తున్నాను
నేను పుట్టకముందు నుంచే
ఈ లోకమొక మంచి చోటు అనుకుంటాను
ఎయిడ్స్ నా నుంచి ఈ సదవకాశాన్ని
ఏ మాత్రమూ
అపహరించుకుపోదనే తలుస్తాను
అదే
నాకు ధైర్యాన్నిస్తుంది.
నా జీవితాన్ని పాజిటివ్‌గా కొనసాగించే
మనోనిబ్బరాన్నిస్తుంది.
ఎయిడ్స్ కి వ్యతిరేకంగా జరిపే పోరులో
నా వంతు నేనూ దోహదపడతాను
అదే
నా జీవితాశ
అదే
నా జీవన కాంక్ష
నా జీవించాలన్న కోరిక కూడా
అదే…