బహుప్రాణుల బలికోరే యుద్ధధర్మ బోధనలు – నంబూరి పరిపూర్ణ

ఒక దేశమని అనగానే – అది ఒక వివిధ జాతుల, తెగల, కులాల నివాస భూభాగమని అర్థమవుతుంది. దానిలో మళ్లీ వివిధ మతాలనూ, సంప్రదాయ సంస్కృతులనూ, ఆచారాలనూ పాటించే జనసమూహములుంటాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ – అంతా కలసిమెలసి బ్రతుకుతూ, ఆ దేశపు జాతిగా గుర్తింపబడుతుంటారు.

ఇట్టి విభిన్న రీతుల ప్రజలందరకూ – సమాన స్థాయిన న్యాయ, ధర్మ, మానవహక్కులను దఖలు పరిచే ధర్మసూత్రాల పాఠ్యగ్రంథమే ఆ దేశ ప్రజల రాజ్యాంగంగా గుర్తింపబడి, స్వీకరింపబడుతుంది. అది – ఆ దేశ ప్రజల ఆశయ, ఆకాంక్షల్నీ, ఆదేశాల్నీ – అధికారయుతంగా నిర్వచించి ప్రకటిస్తుంది.

ఈ రీతీ నీతులకనుగుణంగా, భారతప్రజ భారతీయులమైన మనం – మనకోసమని – ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఇందుకోసమై, విశిష్టరీతిన – ప్రజాస్వామ్య స్వేచ్ఛాస్వాతంత్రాలు పరిఢవిల్లే కొన్ని యితర దేశాల రాజ్యాంగాల్ని నిశితంగా పరిశీలించి, వానిలోని మేలైన, ప్రజాశ్రేయోదాయక అంశాలనెన్నికచేసి స్వీకరించుట జరిగింది. ఆ విధంగా మన మేధావులూ, రాజకీయనేతలూ – ఒక విశిష్ట సర్వజనశ్రేయోదాయ, క్షేమకర సూత్రాలతో గూడిన రాజ్యాంగాన్ని రచించి, నిర్మించారు. ఈనాటివరకూ అదే రాజ్యాంగాన్ని, అందలి నీతి, న్యాయ, ధర్మసూత్రాల అతిక్రమణ ఏమాత్రమూ జరుగకుండా, పరిరక్షించు కుంటూ వస్తున్నాము. ఆ క్రమంలోనే మన రాజ్యాంగం, మన జాతీయ ప్రామాణిక గ్రంథంగా పరిగణింపబడుతున్నది. దేశంలోని వివిధ జాతుల, మతాల, కులాల విశ్వాసాలకతీతంగా నిర్మింపబడ్డ మన భారత రాజ్యాంగం – ప్రపంచస్థాయి ఆదర్శ రాజ్యాంగాలలో ఒకటిగా గుర్తింపబడి, మన జాతీయ గ్రంథంగా స్థిరపడింది.

దేశంలో కులాలకూ, మతాలకూ చెందిన గ్రంథాలెన్నయినా వుండచ్చును. అది వారికి మాత్రమే తప్ప – సర్వులకు సంబంధించినవి గావు, కానేరవు. దేశం స్వేచ్ఛ పొంది, డెబ్భయ్యేళ్లు గడిచాక, మన ఆదర్శరాజ్యాంగమిప్పుడు – మన జాతీయ గ్రంథమై వుండగా, వేరొక గ్రంథానికి, జాతీయ హోదా కలిగించాల్సిన అవసరమెందుకు?

కానీ – ఆ అవసరమొచ్చిందని బల్లగుద్ది చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ పాలకులూ, పార్టీ అనుయాయులూ! భగవద్గీత జాతీయ గ్రంధమవ్వాలన్న వాదన – ప్రధాన చర్చనీయాంశమైంది. కాగా – భిన్నమతాలకూ, ఆచారాలకూ చెందినవారికి అది కొరుకుడు బడక – వారిని తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. మతాతీత, లౌకిక, ప్రజాస్వామ్య పాలనను రాజ్యాంగబద్ధం చేసుకుని, పాలన జరుగుతున్న ఈ దేశంలో – ఒకానొక ప్రత్యేక మతానికి చెందిన అతిపురాతన మత గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా గుర్తించాలని ప్రకటించడంలో – ఔచిత్యంగాని, న్యాయ నైతికతలు గానీ – ఏవిధంగా వుంటాయి?

భగవద్గీత – పూర్తిగా ఒక మత సంబంధ పౌరాణిక రచనా సంకలనం. అసలున్న కథాంశానికి, క్రమానుగతంగా అనేక ప్రక్షిప్తాలు జోడింపబడిన ఒక యుద్ధ నీతి గ్రంథం. భక్తితో దీనిని విశ్వసించేవారికి మాత్రమే యిది చెందుతుంది. అంతే తప్ప – ఒక చారిత్రకత ప్రామాణికత అనేది లేదు. యుగాల కాలాన, ద్వాపరంలో, శ్రీకృష్ణుడనే అవతార పురుషుడు – అర్జునుడన్న ఓ యుద్ధవీరునికి – యుద్ధధర్మాలను బోధించగా, అవి గ్రంథస్థమై, ‘గీతగా’ రూపొందిన గ్రంథమని ప్రవచిస్తూ వుంటారు కృష్ణభక్తులు. యుద్ధం వల్ల అత్యంత హింస, అసంఖ్యాక జనమరణం సంభవిస్తుంది గాబట్టి – తాను యుద్ధం చేయజాలనని చెప్పిన అర్జునునిలో ఎంతటి మానవీయత! ”అహా! అలా కాదు, ముందు యుద్ధం చెయ్యి, తరవాత సంగతులు నాకు వదిలెయ్యి, నేను చూచుకుంటాను” – అని అర్జునుని బలవంతం పెట్టిన కృష్ణ భగవానుడిలోని ‘అమానవీయత’ – ఎంతటిది!

వీరిలో ఎవరి వాదన ప్రజాహితమూ, అనుసరణీయము?

సర్వప్రాణుల సృష్టికీ, సంక్షేమానికి కర్తను నేనే, యుగదైవాన్ని నేనే అని ప్రకటించిన కృష్ణుడు – లక్షల ప్రాణుల్ని హరింపగల యుద్ధం జరిపి, తన, పర భేదం లేకుండా అందర్నీ హతమార్చమని అర్జునుడికి పురెక్కించి, యుద్ధకాండకు దింపడం అన్నది – దైవ రక్షణ క్రియగా ఎంతవరకవుతుంది?

మనదేశం విషయానికొస్తే – ఆంగ్లపాలనకు ముందు కాలంలోనూ, ఆ తరువాతవారి కాలంలోనూ – భారతం వందల (548) సంస్థానాధీశుల నికృష్ట, నియంతృత్వ పాలనలో మగ్గిపోతుండేది. 1947 – స్వతంత్రానంతరం – మన ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్ని సంస్థానాల్నీ దేశంలో విలీనం చేసి, అఖండ భారతావనిని తీర్చిదిద్దింది. ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వంగా రూపుదాల్చింది.

అట్లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశానికీ, ఆధునిక దృక్పధం గల ప్రజలకూ – అవాస్తవ ఉదంతాలతో, కల్పనలతో గూడిన, ద్వాపర యుగపు భగవద్గీతను ఒక అమూల్య ధర్మబోధన గ్రంథంగా అందించాలని (అధికారికంగా) ఎందుకీ యత్నం?

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై – యుగయుగాలలో జన్మించగలనని చాటి చెప్పిన కృష్ణుడు – 18 అక్షోహిణుల సైన్యంతో సంతతులను హతమార్చే యుద్ధచర్యను, అత్యవసర ‘ధర్మక్రియ’ అని బాధించడమేమిటి? దుష్ట నిర్మూలనతో భూభారం తగ్గించెదననే శ్రీకృష్ణుడు – అందుకు సకల బాలాది వృద్ధులను మట్టుబెట్టే యుద్ధక్రియ మాత్రమే తగిన సాధనమని తలచి, గీతాబోధనకు పక్రమించినట్టా?

మత పురోహిత వర్గాల కల్లబొల్లి స్వర్గ నరకాల, జన్మకర్మల కథలతో, ”చాతుర్‌వర్ణ్యం – మయా స్రష్టం” అంటూ నాలుగు కులాల సృష్టి మనదేనని గీతలో కృష్ణుడే ప్రకటించాడంటూ ప్రజల్ని నమ్మించి, మభ్యపెడుతున్న గ్రంథమా మనకు జాతీయ గ్రంథమయ్యేది?

భగవదవతారుడైన తనను భక్తితో భజించి, శరణు వేడని మనుజులు – ‘పాప’ యోనులు, ‘మూఢ’ యోనులు, ‘అసుర’ యోనులు అనబడు మూడు రకముల పాపాత్ములు కాగలరట. అయినప్పటికీ, అట్టి నరాధములు సైతము తనను శరణుజొచ్చినచో, పరమగతిని పొందగలరని, గీతలో క్రిష్ణ పరమాత్మ వ్రాక్కుచ్చినాడని, ఆ గ్రంథరాజం తెలియ చెప్పడం. పాఠకులకు తెలిసినదే. దీని అర్థం – మనుషుని దుష్ట దుర్వర్తనకు, అతడు జన్మించిన ‘యోని’ నీచహీన స్థితులు కారణమనిట! స్త్రీల జననాంగాలు కూడా, పాప, మూఢ, అసుర లక్షణాలు కలిగివుండునని, ఆ భగవానుడు గీతా ప్రవచనాల్లో క్యాటగరైజ్‌ చేశాడంటే – నమ్మశక్యమా!!

ఇదే గీతా శాస్త్రాన్ని శ్రీకృష్ణుడు – పూర్వమేయుగంలోనో సూర్యుడికి చెప్పాడట. ఆ తరవాత మళ్లీ ద్వాపరయుగంలో అర్జునునికి బోధించడం!! యుగాలు గడిచిన ఆ గ్రంథాన్ని – నేటి ఆధునిక యుగంలో – జాతీయ గ్రంథంగా గుర్తింప జేయడానికి – గట్టి పూనిక వహిస్తున్నదే ప్రస్తుత పాలక హైందవం!

మహాభారతంలోని – చిరువ్యాసం లాంటి ‘గీతను’ – జాతీయ గ్రంథంగా స్వీకరిస్తే, మరి అనేక ధర్మ శాస్త్ర సారాలకూ, లోకోక్తులకూ నెలవైన భారతాన్ని – ఏమయినదిగా గుర్తించాలి? .. వశిష్టగీత, పరాశరగీత, గౌతమ, కణాద, వ్యాస, కపిల, పతంజలి ఆది మునివర్యుల ప్రత్యేక దర్శనాలు – కృష్ణునికి పూర్వమే అస్థిత్వంలో వుండి వున్నాయి. వాటినన్నిటినీ ఈ ‘గీత’ ఏ విధంగా అధిగమించిందని భావించాలి?

ఆది మానవుడు అనేక పరిణామ దశలు దాటి, గుహ ఆవాసములనుండి ముందుకుసాగి – గ్రహాంతరాలకు పయనిస్తున్న ఈ కాలంలో ఊహాజనితమూ, కేవల మతైక పరమూ, మానవుల అసమతను నిర్ధారించునదీ అయిన ఈ గీతను – యోగ శాస్త్రమనీ, పారాయణ గ్రంథమనీ తలకెత్తుకుంటూ, జాతీయ గ్రంథమని ఉబలాట పడడమంటే, మానవుణ్ణి మళ్లీ ప్రాకృత పురాతన దశకు తిరోగించమని అధికారపూర్వక ఆదేశమిచ్చినట్టు కదా?

ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం, విద్య ఉద్యోగాల కల్పన కోసం, వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం, మానవ హక్కులు, విచక్షణా విజ్ఞతలతో గూడిన మానవాభ్యుదయం కోసం – స్వతంత్ర భారతీయులుగా నిరంతర కృషి సాగించుకుందాం. ఇరుగు పొరుగుల యితర దేశీయుల స్వేచ్ఛ సుహృద్భావనల, బలంతో మన భారత రాజ్యాంగాన్ని మన జాతీయ గ్రంథంగా కొనసాగించుకుంటూ మన విలువల్ని ప్రపంచానికి చాటుదాం. ఆధునిక శాస్త్రీయపధాన పురోగమించుదాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.