వెలి – కొండేపూడి నిర్మల

ఒకటింపావు రాత్రి చలిగాలి… ఒకటే చల్లటిగాలి… గాలికి ముళ్ళు కూడా వుంటాయా అనిపించేట్లు వళ్లంతా గీసుకుపోతోంది.
దిక్కుమాలిన చలి. దిగులుబారిన వెలి. ఎడమచెవి పోటు.
చెమ్మగిల్లిన సిలుకు వోణీ తలచుట్టూ తిప్పి కప్పుకుంది సువర్చల.
వజ వజ వజ… ఇంకా రెండ్రోజులు గడవాలి. గడవ్వా అంటే గడుస్తాయి. ప్రాణాలుగ్గబట్టుకుని కూచున్న ఖైదీకి గడుస్తాయి.
శరీరానికున్న సవాలక్ష బాధలకు తోడు శనిగొట్టు ఆచారాలు.
శుద్ధి చెయాల్ట శుద్ధి!
తను నుంచున్న చోటల్లా నీళ్ళు చల్లాలి.
తను విడిచిన ఊపిరి మీద నీళ్ళు చల్లాలి.
తన కన్నీళ్ళ మీద నీళ్ళు చల్లాలి.
ఖర్మ! ఖర్మన్నర ఖర్మ. ఖర్మ టుది పవరాఫ్‌ హండ్రెడ్‌.
అసలింతకీ ఖర్మంటే ఏమిటి?
గచ్చులూడిన రేకుల గదిలో మునికాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తోంది సువర్చల.
నేల పగుళ్ళ లోంచి బైటపడ్డ జానెడంత జెర్రిగొడ్డు కదల్డమే లేదు. సువర్చలకు జెర్రిలంటే భయం, బల్లులంటే భయం, బొద్దింకలంటే భయం, చివరికి కాస్త పెద్ద సైజు చీమలన్నా భయమే.
అంచేత అది కదిలి వెళ్ళిపోయిందన్న నమ్మకం కలిగితే గాని పడుకో బుద్ధికావడం లేదు.
హాయైన నిద్ర లోంచి పెళ్ళగించి లేపేసింది పాపిష్టి పురుగు. కుడితే ఇంకేమైనా వుందా హమ్మాయ్యో! గంట క్రితం భుజాల మీంచి వీపుదాకా అది పాకినంత మేరా పదోసారి దులుపుకుంది. ఛీ చంపెయ్యాలి. నిప్పెట్టి పారెయ్యాలి గదికి, శపించింది.
పురుగూ పురుగూ కదిలిపోవే నీకు దణ్ణం పెడతా! నిస్సహాయంగా కాళ్ళ బేరానికొచ్చింది.
హమ్మయ్య! కదిలింది దేవుడా కదిలింది. మొరాలకించింది. మనుషుల కన్నా నయమే. అటుపాకి, ఇటుపాకి ఖబడ్దార్‌ అనేట్లు తలెగరేసి మాసిన బట్టల మూట కింద నుంచి, తోమి బోర్లించిన పింగాణి కంచం పక్క నుంచి నీళ్ళ చెంబు చుట్టూ ప్రదక్షిణం చేసి, పనికిరాని పాత చెప్పులు లెక్కపెడుతూ ఆగి, గాలిపోయిన సైకిలు టైరు వ్యాసం కొలిచి గోడవార తూముల మీద పేర్చిన చెక్కవెనక్కి చేరుకుంది. తాత్కాలికంగా అయినా శత్రుబాధ వదిలినట్టే.

తెల్లారితే ఇంగ్లీషు టెస్టుంది. కాసేపు చదువుకుందామా! అబ్బా మళ్ళీనా. పడుకుందాం లెద్దూ. చదువుకుంటే మార్కులొస్తాయి. పడుకుంటే కలలొస్తాయి.

మార్కులొచ్చినా కలలొచ్చినా పురుగుల్రావనే గ్యారంటీ లేదు.

బితుకు బితుగ్గా చాపమీద వొరిగింది.

తల కింద బైండు పుస్తకం వొత్తిడికి చెవిపోటు ఎక్కువైంది.

చిమ… చిమ… చిమ… చిమ…

అంటూ… సొంటూ… మడీమంగలం… మైలా మన్నూ…

ఎవరేనా లేచి ఈ చెవిలో కాస్త మందేస్తే బావుడ్ను.

అడగందే అమ్మయినా పెట్టదంట! ఎవరన్నారామాట? అడక్కముందే కడుపునిండా పెడుతుంది చివాట్లు.

తెలిసి తెలిసి ఎవరు ముట్టుకుంటారిప్పుడు తనని, తలారా స్నానాల కోసం!?

ఎంత హాయిగా పడుకున్నారో తమ్ముళ్ళిద్దరూ దోమతెరలు కట్టుకుని!

తనకెంతో ఇష్టమైన నీలం పూల రగ్గు పెద్దాడి వొంటి మీద వుంది.

తను పెయింట్‌ చేసిన బటర్‌ ఫ్లై దిండు చిన్నాడి తలకిందుంది. ఇద్దరికీ మధ్య మంచంలో అటు తిరిగి పడుకున్నది అమ్మే అయివుంటుంది.

లోపలి గదిలో నాన్న గురక కర్ణకఠోరంగా వినిపిస్తోంది.

వాళ్ళకడుగు దూరంలో తనింత చలిలో… వెలిలో… బాధలో…

ఇల్లంతటికీ తీసికట్టులాంటి పనికిరాని గదిలో పాత సామాన్లలో సామానులా, పురుగుల్లో పురుగులా…

అదో లోకం, ఇదో లోకం, ఇక్కడున్న దానిపేరు అదో లోకం అనాలి కామోసు.

తలకింద పెట్టుకున్న చెయ్యి తీసి విసురుగా తలుపుపెట్టింది. పెళ్ళున కొట్టింది గాలి.

మోకాళ్ళ చుట్టూ చేతులేసి మునగ తీసుకుంది. పుట్టక ముందు అమ్మ కడుపులో ఇలాగే వుంటార్ట! గోడమీద నీడ గమ్మత్తుగా వొణికింది. వాచీలో టైము రెండున్నర.

తెల్లారడానికింకా నాలుగు నరకాలు దాటాలి. బల్బు వెలుగు భగ్గుమంటోంది. రెప్పవాలినప్పుడల్లా కళ్ళు భగ్గుమంటున్నాయి. లైటుంటే వెలుతురు మూలంగా నిద్రపట్టదు. లైటార్పితే పురుగుల మూలంగా నిద్రపట్టదు.

నిశాచరులకీ నిద్రపట్టదట! నిశాచరులంటే పాపాత్ములా!

పుణ్యాత్ములకి పిలవగానే వస్తుందా నిద్ర!

తను పుట్టకముందే ఎన్నో ఏళ్లకి ముందునుంచీ ఈ మురికి గదిలో నోరెత్తకుండా అమ్మ బాధపడుతూనే వుండుంటుంది. పదిహేనేళ్లపాటు తనూ హాయిగా నెలకి ముప్పై రోజులు నిద్రపోతూనే వుంది.

ఒక మనిషి బాధపడుతున్నప్పుడల్లా ఆ చుట్టుపక్కల అంతా నిద్రపోతూనే వుంటారు.

‘ఇంతాలస్యమైందేమే నీకు మేనత్త పోలికా!?’ అంటూ అమ్మ బెంగెట్టుకు పోయి మాచికమ్మ నోయించలేదు. కానీ డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళింది సూదులు బిళ్ళలు… సూదులు బిళ్ళలు…

జబ్బలు వాచిపోయాయి. నాలిక బెరడుకట్టింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.