ఆకాశంలో సగం – అసలుకేం లెవ్వు! – తమ్మెర రాధిక

”యాకయ్యా”        ”హాజర్‌ సార్‌”
”రుద్రమ్మా”        ”ఎస్సార్‌”
”జీలుగు మునెమ్మా”    ”ఎస్సార్‌!”            ”ముత్తమ్మా”        ”ఆజరు సార్‌”
అటెండెన్స్‌ తీసుకుంటున్న సారంగం సారు తల్కాయ ఎత్తి ఎన్క బెంచీల దిక్కు చూసిండు.
ఆఖరి బెంచీ మీన తల్కాయ వంచుకొని కూసొనున్నది ముత్తమ్మ. కొత్తంగ కొనుక్కున్న గడేరం వంక చూసుకున్నడు. పదకొండు గంటలు అయితాంది. ‘ముత్తమ్మ లేసి వాల్ల నాయిన కోసం బైటికింకా పోలేదేంది’ అనుకున్నడు. ముత్తమ్మ నాయిన పోశాలు బడి పక్కన్నే వున్న చెరువు కట్ట పన్లు చేస్తున్నప్పుడు, ఉపాధి హామి పతకంల! పొద్దుగాల్నే పనులకు పోతడు గన్క, ముత్తమ్మ టిఫిన్‌ బాక్సు పట్కత్తది. బడి పక్కనే చెరువు పని నడుస్తాంది. గందుకనే బిడ్డ పట్కొచ్చే టిఫిన్‌ బాక్సు కోసం బడి ముందు నిలవడ్తే ముత్తమ్మ పోయి ఇస్తది రోజూ.

ముత్తమ్మ దిక్కు చూసిండు సారంగం సారు, ‘క్లాసుల్నించి బైటికి పోతవాన్నట్టు’ ఒక్క నిముషం! ముత్తమ్మ మొకం ఎందుకో చానా బాదగున్నట్టవుపించింది సారుకు. గందుకనే సుల్కనగ ”ఏందింక లేస్త లేవు ముత్తవ్వా! జల్దీ బైటికి పో, మీ నాయినస్తడు నడు నడు” అన్నడు.

గా మాటలకు భయంతోని ముడ్సుకపోయింది ముత్తమ్మ. పక్కనున్న దోస్తు దిక్కు చూసింది. ముత్తమ్మ కండ్లల్ల నీళ్లు..

”ఏందే!” రాజవ్వ గుస గుసగ అడిగింది దోస్తును. ఎందుకేడుస్తున్నదో సమజుగాక.
”బాపు రోజూ బాక్సు కొంటవోను ఈడికొస్తడు కదా! ఇయ్యాల నేను లెవ్వకుంటైంది.” దుఃఖంతోని తల్కాయ వంచుకున్నది ముత్తమ్మ.
”ఏమైందే!!”
”లంగ ఖరాబైందన్పిస్తాంది.”
గా మాటలకు దోస్తు గుండెల్లో రాయి పడ్డది.
”ఓ పొల్లా… ఇంట్ల చూసుకోవద్దానే! గిప్పుడెట్లా?” భయంతోని వనికింది రాజవ్వ.
”రాజవ్వా ఏంది… ఏమో గుసగుస లాడ్తవూ! పాఠం సురూ చేసినంక ఎవ్వల కూడా బైటికి పంప ఆఁ…” కోపం గన్నడు సారంగం సారు.
ఎవ్వరు సప్పుడు చేయ్యకవోయే సరికి, చేతుల పుస్తకం పట్టుకొని పిలగాళ్ళ నడుం గల్నించి (నడమ నుంచి) ముత్తమ్మ కాడికొచ్చిండు.

”నేనిస్త సారూ టిఫిను బాక్సు.” దబదబ డబ్బ పట్టుకొని లేచింది రాజవ్వ.
”కూసో! నీకేం పనే? నువ్వు నడువే” ఏలు లావట్టి చూయించుకుంట అన్నడు సారంగం సారు.

ముత్తమ్మ కూసున్న ఎన్క బెంచీల కాంచి ఎన్కంత మొగపోరలు కూసోనున్నరు. ముత్తమ్మ సార్‌కెయ్యి దీనంగ సూసింది.

”లెవ్వు రాదే!” సారంగం దగ్గరి కొచ్చుకుంట ఇంకేందో అనబోతుంటేనే బెంచి మీన తల్కాయి ఏల్లాడేసింది ముత్తమ్మ!

గద్చూసి సారంగం భయపడి బెదిరి బెదిరి చూస్కుంట నిలవడ్డడు.

”కండ్లు తిర్గుతానయ్యన్నది సారూ… గందుకే లెవ్వలేదది. వాల్ల బాపుకు నేనిచ్చొత్త” ముత్తమ్మ పుస్తకాల మీదున్న బాక్సు పట్కొని బైట కుర్కింది రాజవ్వ.

బీరి పోయినోడల్ల కొద్దిల తేరుకొని ముందుకు వోయి పాఠం చెప్పుడు సురూ చేసిండు.

****

సారమ్మ టిఫిన్‌ బాక్సుల బుడిమెకాయ మిరం, అన్నం పెట్టి మూత బిగించుకుంట-

”నాయిననే టిఫిను పట్కపోతడు తియ్యే! ఊకే ఏడుత్తానవు ఎందుకు? పొద్దుగాల్ల లేసిన కాంచి గిదే కత వెడుతున్నవు కదా!” అన్నది ముత్తమ్మ తల్లి సారమ్మ.

మొగురానికి ఆనుకొని నిలబడి ఏడుస్తున్నది ముత్తమ్మ. ఆమెకు మన్సు అగుమానంతోని చితికి పోతున్నది బల్లెకు పోవ్వాలంటే! బిడ్డకు బల్లె జరిగిందంత రాజవ్వ చెప్పింది. బిడ్డనేమో ‘అందరు నగుతున్నరు…’ అని బడికి పోనని మొండేసం ఏస్కొని కూసున్నది.

”పరీచ్చలున్నయ్యట కదనే, రాజవ్వ చెప్పింది. తయ్యారు కావూ బడికి పొయ్యేతందుకు!” రెట్టించింది సారమ్మ.

”సారు తిడుతాండు ఊకె! వాన్కేం పొయ్యేకాలం బుట్టిందో” అనుకుంట లంగతోని ముక్కు తుడ్సుకుని పొయ్యి దగ్గర కూలవడ్డది ముత్తమ్మ.

”ఎందుకు తిడ్తరు బిడ్డా, నువ్వు నీ దోస్తులు పత్తలాడు తాండ్రా?” నవ్వుకుంటన్నది సారమ్మ.

”అటెంక నువ్వే తిడ్తవు… గీ నిద్ర మొకపోడు గిట్ల మాట్లాడ్తడేంది ఆడ్విల్లతోనని.”

ముత్తమ్మ మాటలు పూరగ కాకతొలికే లోపటి కొచ్చింది సారమ్మ. ”అవే… ముత్తీ… బట్టయ్యింది సుత సూస్కోవానే! మా రాజవ్వ సెప్తాందింట్ల! గంత సోయి లేకుంటున్నవా? మొగపోరల్లుంటరు ఇస్కూల్ల! ఎట్ల పడ్తే అట్ల పోతరా బల్లెకు?” కసిరింది. ఆమె మాటలకు సారమ్మ పొయ్యికాంచి లేచొచ్చుకుంట.

”మా కర్మ గట్ల కాలవడ్డది, తిండికి ఆయవన్నంగ అయ్యో ఇయ్యో దొర్కేవర్కే తిప్పలయితాంది. గీ పోర్కి సుత నాతోని కూలీకి వాల్ల నాయిన నా బిడ్డ కలకటేరు అయ్యిందని మురిసి బల్లెకే పొమ్మన్నడు దాని సోయి దాని కుండొద్దాక్కా!” అన్నది, చుట్టాకు తీసి దాంట్లింత పొవ్వాకు బెట్టి సారమ్మ కిచ్చుకుంట.

”ఆడ్విల్ల గట్ల దిర్గితే నలుగురు నవుతరు ఎర్కేనా?” కసురుకుంటనే సుట్ట సుట్టుకుంట కూసున్నదామె.

”మాకేవన్న సంబురవాక్కా! ఇంట్లె ఎంత దరిద్రం ఎల్ల బోస్తానమో ఎర్కేనా? పోరికి మానం దాసుకునెటందుకు మారు గుడ్డ లేకపాయె ఇంట్ల” గుంజకు చెరబడి కండ్లు తుడ్సుకుంట అన్నది సారమ్మ.

”దరిద్రం ఎవ్వలకైనా వున్నదేనే, మేమేమన్న బంగులల్ల తిర్గుతానమా! నెలొచ్చేనాడు ఎవ్వలనడిగినా బట్ట గుడ్డలు సాయం చేయమా! గింతన్నాలమా!”

గామె మాటినుకుంట, పల్లెంల అన్నమేసి, మిరం పెట్టి, మంచి నీల్లు, కంచం తెచ్చి తల్లి ముందు పెట్టింది ముత్తమ్మ.

ముత్తగోని గూడెంల బడి లేకుంటే పోరగాల్లంత సదువు సందెల్లేకుంట గాయి గాయి తిరుగుతున్నరని, ఎన్నో ఇకమతులు పడి నాయకులను బట్టుకొని బడి సాధించుకున్నరు. చెర్ల ర్యాగడంత గట్టు మీదికి తోలి జాగ సదును సేసి, సిమెంటు ఇటికెలు పేర్చి ముందు గాల రెండర్రలు కట్టిండ్రు. గూడెంలున్న సిట్టి బొట్టి పోరగాల్లనంత జమచేసి బందెల దొడ్లే తోల్నట్టు తోలిండ్రు పిలగాల్లని. ఒక సారును బల్లె కేసింది గవురుమెంటు. రాన్రాను పిలగాల్లు ఎక్కువయితాంటే సార్లను పెంచింది. కూసుంతందుకు బల్లలు లెవ్వనీ, తరగతి గదులు కావాల్నని పంచాయితీ ఓట్లప్పుడు ఎమ్మెల్యేలతోని చెప్పించి, అవ్వి సుత సాధించుకున్నరు గూడెం జనం. అన్ని మంచిగనే వున్నయి గనీ, పిలగాల్లకు ఒంటేలు కొచ్చినా, బైలుకొచ్చినా పొయ్యెతందుకు ఎక్కడ ఏమి సౌక్రం లేదు.

ఎవ్వలైనా సరే దేనికైనా సెట్ల సాటుకు ఉర్కవల్సిందే!

పెద్ద వయసు ఆడపిల్లలు గిసుంట ఇబ్బందులు ఎన్నో పడ్తున్నరు. అన్నం కల్పుకుంట కష్టం సుకం చెప్పుకున్నది సారమ్మ. సుట్ట కాల్చుకుంట ఏదో ఒక సలహా చెప్తనే వున్నది, మద్దె మద్దెల ఆమె బిడ్డను చూసుకుంటు.

”సారమ్మా! పొల్ల తింట లేదానే… సాల్తిమి బొక్కలు మీదేస్కొని తిర్గుతాంది?” అనడిగింది.

”ఏనాటి పైసలానాడే తినాల్నాయె! నెత్తి మీది ఆదారం గీ ఒక్క కొంపే. ఇగ మా సుట్టిర్కం తలాకిట్ల సవుద్రం పెట్కొని నీల్లకేడ్సినట్టుంది. పోరికి మ్యానత్త కొడుకున్నడక్కా. అన్ని సవులతులన్న సంసారమది. కనీ ఏం లాభం? కంచులు, కుండలున్నోని ఇంటల్లుడంటే అందరు నగుతరని మా అడ్విడ్డ వచ్చె పోయె సుట్టాలందర్తోని అంటాండె. నా మొగడు బోయి సెల్లెని బత్లాడిండు. కొంపో గోడో అమ్మి కట్టమిత్తనన్నడు. అల్వో మత్తడి దుంకుతున్న సెరువు లెక్క అగ్గగ్గలాడింది తియ్యి” తినుకుంటనే ఇంకో సేత్తోని కండ్లు తుడ్సుకుంది సారమ్మ.

”పొల్లదేం తప్పే! కట్నం దొబ్బాల్నన్న ఆపాచ్చన నీ అడ్విడ్డ కున్నట్టుంది… కొంపో గోడో అమ్మి దీన్నాడికి తోలిద్దామనేకంటే మంచిగ సదువు సెప్పించి నౌకరికి తోలు” సారమ్మ సుట్ట నేలకు రాసి గుడిసెల్నించి బైటి కెల్లకుంటన్నది.

అదే మంచిదన్పించింది సారమ్మకు గాచ్చనం. తలకాయ తిప్పి బిడ్డకెయ్యి సూసింది బల్లెకు తయారు కమ్మనట్టు.

”రెండ్రోజులాగి పోతనే… బట్టయితే బైటికి పోను మంచి గుండది.” సిగ్గిడ్సి చెప్పింది ముత్తమ్మ గుటికిల్లు మింగుకుంట.

”నీ సోపద్గాల్లంత పోతున్రు గాదే! పరిచ్చలు అయితానయ్యంట గదా! రాయవా? నువ్వు బల్లెకు పోతలేవని నీ అయ్యకెర్కయితే నా తోల్దిత్తడు మల్ల ఆఁ…” అన్నది తల్లి.

ముత్తమ్మ ఏం జవాబియ్యకుంట గట్లనే కూసున్నది.

సారమ్మకు సుత సికాకుగనే వున్నది. బడన్నంక ఆడి పోరగాల్లు బైటి కటీటు పోను తడ్కలన్న కట్టకుంటే ఎట్ల వోతరు? బడి రోజు రోజుకు పిలగాల్లతోని పెద్దగైతాండై! అండ్ల సదివే పిల్లలుసుత పెద్దోల్లు అయితాన్రు. ఆడి పోరలు బైటున్న రోజులల్ల బాద వడలేక ఇంట్లుంటే బల్లె మొత్తం ఎర్కయితున్నది. మూడొద్దులు అయినంక బల్లెకు పోతే పరాష్కం మాటలు ఎక్వయితది.

సార్లు సుత ‘బడికెందుకు రాలేదూ’ అని గుచ్చి గుచ్చి అడుక్కుంట పర్షాను చేత్తుంటరు. చెదిర్న పస్రం లెక్క జూత్తేర్కు కిలాసుల అందరికి నవ్వులాటైతది. ఇంటికొచ్చి మునాసపోడు గట్ల జేసిండు, గిట్ల జేసిండని వీల్లు ఏడ్సుడు సురూ జేత్తరు.

ఏదో రెక్కలు ముక్కలు జేస్కొని, కట్టపడందే ఫాయిద లేదని ఆడపిల్లల జదివిత్తే వీల్లందరు తేనీగ పువ్వు సుట్టు దిర్గినట్టు లేకి మాటలూ, లేకి షకలూ చేసుకుంట పిలగాల్లను ఆగం బట్టిత్తున్రు. ముత్తమ్మ పదో తర్గతి పాసైతే దగ్గర పట్ల ఏన్నన్న ఆస్టలు జూసి, పై సదువులు సదివిత్తే మంచి నౌకర్లు వత్తయ్యని అంగనాడి పంతులమ్మ చెప్తె ఇని గా ముచ్చట మొగంతోని అంటే…

‘ఇమర్శ లేనాడిది కొంపలు తగుల వడ్తే గిట్నే వత్తయి ఆలోశన్లు. ఎట్నో అట్ల సెల్లె కాల్లు గదుమలు పట్కొని, శక్కరి మాటలతోని బుదుగరిచ్చి పిల్లను అండ్ల దండ్ల మల్పుకోవాలే గని నౌకరి జేపిత్తనని మురుత్తానవా’ అని సెల్లె సంబందంమ్మీన ఆశ మరువక కసిరిండు పెండ్లాన్ని పోశాలు. ఒకసారి గట్ల కసిర్తే –

‘పోనీ తీ పోరడ బాదలు వడుకుంట, బల్లెకు వోయి ఎల్గ బెట్టిందాం కన్నా ఆడివిడ్డ కాల్లో ఏల్లో పట్టి పెండ్లి చేసి సాగదోల్తే పానం నిమ్మలం గుంటద’ని అనుకునేది సారమ్మ.

పొద్దుగాల పైసల లెక్క తెచ్చుకొని పోశాలు లోపటి కొచ్చుకుంట ముత్తమ్మ ఏడ్పు మొగం జూసి ‘గట్లున్న వేంద’న్నడు. ముత్తమ్మ నేలకు తల్కా యేసింది. పెండ్లాం దిక్కు చూసిండు.

”బడికి పోను శాతనైతలేదట, రెండు దినాలయినంక పోతత్తియ్యి.” జవాబు ఇచ్చింది తిన్న పల్లెంల కడుక్కుంట.

”చెయ్యని కట్న మత్తదా… మొయ్యని బాడిగత్తదాని ఊకెనే అన్నారు! సదువని పరిచ్చ ఎల్తదా! మన రాత మారుస్తదా ఇది” ముత్తమ్మని చీదరగ చూసుకుంట తల తువ్వాల తీసి దుల్పి మొగురానికి కట్టి గోలెం కాడికి పోయిండు పోశాలు.

”దున్యల లేని మాట చెప్పబడ్తివీ! ఆడి పోరి మన రాత మారుస్తాదీ! ఒగనింటి ఆకిట్ల సాన్పి జల్లేది, నీ యింట్ల ఎన్నెల తెస్తదా!” మొగని మాటకంటే తన మాట ఇసురుగ ఇన్పించింది సారమ్మ. ”మరి టైమయితలేదా బల్లెకు పోనూ! ఏందని అడిగితే రెండ్రోజులాగి పోద్దని నువ్వె జెప్తాంటివి.” అన్నడు లాసిగ కోపంగ.

”పిల్లకు పానం మంచిగ లేదయ్యా” మొగునికి కోపం దాగని చిన్నగన్నది. వాల్ల గోల జూసి ముత్తమ్మకు సెడ్డ కోపం వచ్చింది, గని బాపు తిడ్తడని నోర్మూసుకుని పొయిల కట్టెలు తీసి నీల్లు జల్లి పొయ్యలుకు మొదలుబెట్టింది.

”పానం మంచిగ లేకుంటే మందుల్దినాలె. అంగనాడి ఆయమ్మ నడిగితే మందిస్తది. అంతెగని పరిచ్చ బందువెట్టుకుంటరా! నడూ నేం తోలస్తా పా!” ముత్తమ్మ చెయ్యివట్టి గుంజిండు రమ్మన్నట్టు.

బిగ్గిత పట్టుకున్న చేతుల్ని ఇడ్పిచ్చుకుంట-

”బాపూ… అటెంక పో… నేనే పోత…” అని ఏడ్చింది ముత్తమ్మ. ఎన్నల్లేంది గీ పోరెందుకో గిట్ల జేత్తందేందని పోశాలు గుంజాయిషి పడుకుంట గుడిసె ముంగటికొచ్చి బండమీన కూసున్నడు. దాంతోని ముత్తమ్మకు అర్తమయ్యింది తను బల్లెకు పోయేదంక బాపు బైటనే కాపల కూసుంటడని.

మొన్న బడిస్పెట్నంక క్లాసుల్నించి అందరు బైటికి పోంగనే రాజవ్వని పిల్సి ఇంటికెట్ల పోవాల్నని అడిగింది తను. ఆమె దోస్తులిద్దరు ఆమెని చూసి నోరెల్ల బెట్టింన్రు! గంత గనం తడ్సిపోయింది. బడెంత ఎర్కయినంక పెద్ద సారొచ్చి కోప్పడి ఇంటికి పొమ్మన్నడు. తుప్పలల్ల బడి ఎట్నో ఇంటికి చేరింది. ఇంట్ల పడ్డ సంది గలువట్లకు రాలేక అగుమానంతోని కుమిలిపోతోంది.

సారమ్మ సద్దులు పట్కోని బైటికొచ్చుకుంట ఆలోశన్ల పడ్డ బిడ్డకెయ్యి సూసింది. ఏమనుకున్నదో ఏమో, బైటికి వొయ్యి పోశాలుకు సద్ది ఇచ్చి –

”పిల్లను బల్లె దిగ బెట్టొస్తా, నువ్వు పో!” అన్నది.

బిడ్డ దగ్గిర కూసోని ముత్తమ్మ తలకాయ కడుపుల పెట్టుకుని – ”సూడే ముత్తా… నువ్వు ఎందుకేడుత్తానవే ఊకో? నీగ్గట్ల అవుడు నీ తప్పానే! తీర్తీరు గుడ్డలుంటే ఎట్నో ఎల్లదీద్దువు. కట్టుగుడ్డాయే దాపుడు గుడ్డాయె. సూడు గిట్లవ్వుడు నీ తప్పుగాదు. ఇదంత గవురుమెంటు తప్పు!” అన్నది ఆవేశంగా.

ముత్తమ్మ కేం అర్తం గాలే, తనకు జరింగిందానికి గవురుమెంటు ఎందుకు తప్పుల బడ్తాందో అనుకున్నది.

”గవురుమెంటు ఆడోళ్ళకు ఏమేవో చేత్తానమని గొప్పలు చెప్పుకుంటరు. డాక్రా గ్రూపులోల్లని బాగు చేత్తానమన్నరు. వడ్డీ లేని రుణం ఇచ్చి తల్కాయి పుండ్లు కడుగుతున్న మన్నరు. ఇందిరమ్మ ఇల్లు ఉత్తపున్నానికి ఇత్తాన మంటుర్రు. ఎన్ని చేసినా మీ అసుంటి సదువుకునే బీద పిలగాల్ల గురించి కొన్ని విషయాలు పట్టించుకోవద్దానే? మాసుంటి.. ”బీద పిలగాల్లు సదువుకునే ఒళ్ళల్ల పిలగాళ్ళకు ఏమేం అవుప్రాలు వుంటయ్యో ఎద్కుండొచ్చా గవురుమెంటుకు! పా… మీ బల్లె సార్ల తోని మాట్లాడ్తా… నడువు… అడి పోరగాండ్ల బాదన్నది అందర్ని ఎక్కున్న బూదే…. పా…” బిడ్డ చెయ్యి పట్టి లాపట్టింది సారమ్మ. అవ్వయ్యలు సదువుకునే పోరగాల్లకు కడుపునిండ బువ్వ పెట్టే వరికే తల్లడం మల్లడం అయితానం. బీద పిలగాల్లు సదువుకునే బళ్ళల్ల పిలగాళ్ళకు ఏమేం అవుస్రాలు వుంటయ్యో ఎర్కుండొద్దా గవురుమెంటుకు! పా… మీ బల్లె సార్లతోని మాట్లాడ్తా… నడువు… ఆడి పోరగాండ్ల బాదన్నది అందర్కి ఎర్కున్న బాదే… పా…” బిడ్డ చెయ్యి వట్టి లావట్టింది.

ముత్తమ్మని క్లాసులోకి తోలి తనెంబడి వచ్చిన ఆడోల్లందరితోని పెద్ద సారు కాడికి పోయింది సారమ్మ. వాల్లెంబడి తెచ్చుకున్న గడ్డ పారలు, తట్టలు గోడెంబడి పెట్టి సారుని బైటికి పిల్సింది. ”సారూ ఇయ్యాల… మేమంత ఈడ తానాల గదిని తడ్కలతోని మల్పుదమనుకుంటానం” అన్నది కొద్దిల కోపగొండి మొఖం పెట్టుకొని సారమ్మ.

”అరే… గట్ల ఉరికురికి రావడ్త రేందమ్మ! ఆగుండ్రి.” ఆడోల్లు గుంపుగ వచ్చేసర్కి సారంగం సారు కసురుకోబోయిండు. ”ఏంది సారూ… గట్లంటవూ! ఎందుకుర్కొస్తము… మేం మన్సులం కామా!” గుంపుల ఒకామె జోరుగనే అన్నది.

”సరే.. సరే… ఇంతమంది ఏం చేద్దామని వచ్చారూ? ఏమైనా సమస్యలుంటే అప్లికేషన్స్‌ రాసుకుని రావాలి, గానీ ఇలా గడ్డపారలు, పలుగులూ పట్టుకురావడమేనా?” ఆంధ్ర నుండి ట్రాన్స్‌ఫర్‌ మీదొచ్చిన సారు నచ్చచెప్పబోయిండు.

” ఏ ఊకోవయ్యా సారూ… ఆడ్విల్లలు కట్టపడ్తాండ్రని మేం పర్షాను అయితుంటే అప్లికేషన్‌, గిప్లికేషన్‌ అంటవ్‌…” మీది మీది కొచ్చిందొకామె. ఆ సారు ఎన్కకు తగ్గి లోపటికి పోయిండు.

”సారూ… గీ బల్లె ఆడిపోరలు బైటికి పోవాలంటే ఎసొంటి అడ్డం లేకుంటున్నది. రోజులు జూత్తే ఎట్నో వున్నయి. తాపకోపాలి ఇంటికురికి రారు కదా! మీరు గవురుమెంటుకు రాయాలే, ఈ స్కూల్ల ఆడపిల్లలకు ఏం సౌకర్యాలు లేవని. మేమందరం కావాల్నంటె సంతకాలు చేస్తం” అన్నదొక డ్వాక్రా లీడరు.

హెడ్‌మాస్టరుకు గప్పుడు సమజైంది. ఆడోల్లందరు బడి మీదికి ఎందుకు గుంపుగ వచ్చి పడ్డరో!

వాల్లకెల్లి బెదుర్బెరుగా చూసుకుంట –

”గిప్పటి గిప్పుడు బాత్రూం, లాట్రిన్‌లు వస్తయ్యా. మీరు చెప్పిండ్రు గదా, మిగతాయన్ని మేం చూసుకుంటం. మీరు పోండ్రి.” అన్నడు.

అందరు గుర్రుగా చూసిండ్రా మాటకు. సారమ్మ లాభం లేదనుకొని ”నువ్వెప్పుడన్న రాసుకో సారు గవురుమెంటుకు, మేమయితే కర్రలు పాతి, తడ్కలు కట్టి పోతం. మా పిల్లగాల్లు ఆరిగోస పడుతున్నరు బైటికెల్లాలంటే” అన్నది సారమ్మ పలుగందుకొని.

సారంగం సార్కి బైటికి పిల్చి చెప్పిండ్రు.

”రెండు గోలాలు తెప్పియ్యి సారూ! రోజూ నీల్లు పోయించి వుంచుర్రి. లేకుంటే మేం మా ఎమ్మెల్యే సారుకు చెప్పుతం పోయి”. హెడ్‌మాస్టరు ఈ గోల చూసి చేతులు పిసుక్కుంట లోపలి కురికిండు.

ఆడోల్లందరు గల్సి గుంతలు తవ్వి, కర్రలు పాతి తడ్కలు గట్టిండ్రు బిగ్గిత. వాళ్ళ ఆవేశం చూసి సారంగం ఉరుక్కుంటవోయి దగ్గరి పట్లున్న సిమెంటు ఓడలు చేసేటోని దగ్గర గోలాలు బేరం జేసి రిచ్చల ఏపించుకుని తెచ్చిండు. తడ్కలల్ల గోలాలు బెట్టినంక, ఆన్నే వున్న బోరు కొట్టి నీల్లు దెచ్చి నింపిండ్రు.

ఆడిపిల్లలు సంతోషంగ నవ్విండ్రు.

”పోతాన బిడ్యా… పైలం…” తరగతి గది ముంగట నిలబడుకొని సూత్తాన ముత్తమ్మతోని చెప్పి పోతున్న తల్లిని గర్వంగ చూసుకున్నది ముత్తమ్మ.

*****

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.