సంపాదకీయం

స్త్రీలు లబ్దిదారులు కాదు… హక్కుదారులు

భారతదేశ స్త్రీలు లబ్దిదారులేనా… రాజ్యంగం ప్రకారం సమాన హోదాకల పౌరులు కాదా?! స్త్రీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమా… మరైతే అభివృద్ధి పథంలో స్త్రీలు భాగస్వాములుగా, హక్కుదారులుగా ఉండాల్సిన స్థానమేమైనట్లు? దేశీయ చట్టాల్లో, అంతర్జాతీయ ఒప్పందాలలో ఆడంబరంగా సాక్షాత్కరింపచేస్తున్న స్థితి స్త్రీలకి నిజంగా ఎప్పుడొస్తుంది?!

నేషనల్‌ పాలసీ ఫర్‌ ఉమన్‌ 2016 డ్రాఫ్ట్‌ చదువుతున్నపుడు రకరకాల ఆలోచనలు, సంఘర్షణలు మనసులో మెదిలాయి. ఒకటిన్నర దశాబ్దం తర్వాత (2001) కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా మేల్కొని ఉరుముల్లేని పిడుగులా ఒక డ్రాప్ట్‌ ఉమన్‌ పాలసీని రూపొందించి వివిధ వర్గాల అభిప్రాయ సేకరణ కోసం సర్క్యులేట్‌ చేసింది. 2001లో తయారు చేసిన నేషనల్‌ పాలసీ నిర్దేశించిన గమ్యాలు ఏమిటో, ఆ గమ్యాలు చేరారో లేదో ఎక్కడ ప్రస్తావించలేదు. పదిహేనేళ్ళ తర్వాత మరో కొత్త పాలసీ అంటూ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది అంతర్జాతీయంగా మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌కి (శతాబ్ది అభివృద్ధి లక్ష్యాలకు) కాలంచెల్లి ప్రస్తుతం సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) ఏర్పడిన నేపథ్యంలో ఒక కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం అడుగు వేసిందేమోనని అనిపిస్తోంది.

డ్రాఫ్ట్‌ మొత్తం చదివినపుడు ఎవరో ఒక కన్సల్టెంట్‌ తయారు చేసి స్త్రీ శిశు అభివృద్ధి శాఖకు అందించినట్టుంది కానీ ఒక వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తూ తయారు చేసినట్టులేదు. భారతీయ సమాజంలో ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న పెక్కు సవాళ్ళ ప్రస్తావన సూచన ప్రాయంగా ఉంది కానీ, ఆ సవాళ్ళను, సమస్యలను పరిష్కరించాల్సిన విధానాలు మాత్రం మహా చప్పగా, పసలేకుండా ఉన్నాయి. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు స్త్రీల హోదాను ఏ విధంగా దిగజార్చేసాయి, ఏ విధంగా స్త్రీలు ఆ విషవలయం నుండి బయట పడగలరు అనే అంశాల మీద ప్రస్తావన లేదు.

భారత రాజ్యాంగం స్త్రీలకు అన్నింటా సమానహక్కులు, అవకాశాలు ప్రసాదించింది. అయితే ఏ హక్కునూ అనుభవించనీయని పితృస్వామ్య సమాజం, కుటుంబం స్త్రీల చుట్టూ లోతైన కందకాలతో కూడిన కోట గోడల్ని కట్టింది. ఆ గోడల్ని బద్దలు కొట్టడం అంత సులువైన విషయం కాదు. తల్లి గర్భంలో ఉండగానే ఆడపిల్ల మీద మొదలయ్యే వివక్ష పుట్టాక, పెరిగాక… పెళ్ళయ్యాక… మొత్తం జీవిత చక్రమంతా హింసలతో నిండిఉండి ఆమెను తీవ్రమైన అణిచివేతకు గురి చేస్తున్నది. పుట్టుక నుండి మరణం వరకు హింసల మధ్య, ఆంక్షలతో పరాధీనంగా బతికే స్త్రీలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని స్వంతం చేసుకుని, అనుభవించగలిగిన స్వేచ్ఛలేని స్త్రీల కోసం ప్రభుత్వాలు చేసే చట్టాలు కూడ అక్కరకు రాని చుట్టాలే. సమస్య లోతుల్ని స్పృశించకుండా పైపై పూతలుగా చట్టాలను చేసి లాభం లేదని ఇన్ని సంవత్సరాల అనుభవం చెబుతున్నది.

1961లో తెచ్చిన వరకట్న నిషేధ చట్టం ఘోరంగా విఫలమై వరకట్నం మరింత వికృత రూపం దాల్చింది. వరకట్న వేధింపులు, మరణాలు మరింత పెరిగిపోయి ఐపిసి సెక్షన్‌ 498ఏ చట్టం వచ్చింది. 498ఏ చట్టం వరకట్న మరణాలను ఆపకపోగా కుటుంబ హింస తీవ్రరూపంతో విజృంభించింది. నిస్సహాయులైన బాధిత స్త్రీలు 498ఏ ను వాడుకోవడానికి ప్రయత్నిస్తే పురుష సంఘాలు అడ్డం పడి ఈ చట్టం దుర్వినియోగమై పోతోందంటూ గల్లీ నుండి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టి 498ఏని కోరలు లేని కాగితం పులిని చేసి పెట్టారు. క్రిమినల్‌ చట్టం కాస్తా…. 2005 లో సివిల్‌ రూపంతో గృహహింస నిరోధక చట్టంగా అవతరించింది. హింసిస్తున్న మగవాడి చిటికన వేలు కూడా ముట్టుకోకుండా స్త్రీలకు అన్ని ప్రయోజనాలు కల్పిస్తామనే వాగ్ధానంతో అమలులోకి వచ్చిన గృహహింస నిరోధక చట్టం అదనపు బాధ్యతతో బాధ్యతలు చేపట్టిన సొకాల్డ్‌ రక్షణాధికారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కొన ఊపిరితో నడుస్తున్న వేళ నిర్భయ (సఖి) సెంటర్‌ లంటూ (ఒన్‌ స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్లు) ఒక కొంగొత్త సెంటర్‌ ఆసుపత్రి ఆవరణలో వెలిసింది. భారీ వాగ్ధానాలతో బాధిత మహిళలకు అన్ని సదుపాయాలు, ప్రయోజనాలు ఒకే సెంటర్‌లో సగౌరవంగా అందచేస్తామని, సివిల్‌, క్రిమినల్‌ కేసులు, ఎఫ్‌.ఐ.ఆర్‌., నష్టపరిహార చెల్లింపులు, వైద్య సహాయం, న్వాయ సహాయం, పునరావాసం, వసతి కల్పన అన్నీ ఒకే గుమ్మంలోంచి బాధిత స్త్రీల కొంగుల్లో వేస్తామనే ప్రచారంతో ఏర్పాటైన ఈ సెంటర్లు డి.వి.సెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు కౌన్సిలర్లు ఇక్కడికి బదలీ మీదొచ్చిన నేపధ్యంలో గాల్లో దీపంలా మినుకు మినుకుమంటున్నాయి.

60 రోజుల్లో తీర్పులు రావాల్సిన డి.వి. కేసులు ఆరు సంవత్సరాలుగా కోర్టుల్లో మగ్గుతున్నాయి. రక్షణ ఆర్డర్లుగానీ, నివాసహక్కు ఆర్డర్‌ గానీ రావాలంటే సంవత్సరాలు పడుతున్న వేళ బాధిత స్త్రీలు ప్రభుత్వ వసతి గృహాల భయానక స్థితి వల్ల రోడ్ల పాలవుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న సంక్షేమ గృహాలు బడ్జెట్లు విడుదల కాక, వాటిని మెరుగుపరిచే దిక్కు దిశా లేక దయనీయ పరిస్థితిలో నివాస యోగ్యం కాని దశకు చేరుకున్నాయి.

పని చేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం చచ్చి, చెడి తెచ్చారు. చట్టమొచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఈ చట్టాన్ని అమలుపరచాల్సిన స్త్రీ శిశు అభివృద్ధి శాఖ దీనికి సంబంధించిన విధివిధానాలను, అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చెయ్యనేలేదు. ఈ చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు? ఎవరు బాధ్యులు, ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చట్టాన్ని అమలు చేయకపోతే ఎలాంటి శిక్షలుంటాయి? ఇవేమీ మాట్లాడరు? స్త్రీ, శిశు అభివృద్ధి, వైద్య, పోలీసు శాఖలు, న్యాయ వ్యవస్థ… అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన సందర్భంలోనూ చట్టాన్ని అమలు చేయాల్సిన ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి కూడా చట్టం మీద సరైన శిక్షణలుండవు! ఒక యూనిఫార్మ్‌ పద్ధతిని రూపొందించరు? చట్టం గురించి ప్రచారం చెయ్యరు? పనిచేసే చోట మహిళలకి భద్రత కల్పించాలన్న ఇంగిత జ్ఞానం యాజమాన్యాలకు… అది ప్రభుత్వ సంస్థా, ప్రయివేటు సంస్థా, కార్పోరేట్‌ సంస్థా… ఏదీ ఇందుకు మినహాయింపు కాదు. అన్నీ ఒకే తాను బట్టలే ఈ అంశంలో.

దేశంలో బాలికల సంఖ్య విపరీతంగా పడిపోతున్నా సరే ఒట్టి వాగాడంబరపు మాటలు తప్ప పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం అమలు గురించి చిన్న చప్పుడూ వినబడదు. అల్ట్రాసౌండ్‌ మిషన్‌లకి ఆడపిండాల్ని అనుక్షణం బలిస్తూ మొసలి కన్నీళ్ళు కారుస్తున్న ప్రభుత్వాల వైఖరికి కోట్లాది మంది బాలికలు పుట్టకుండానే చనిపోతున్నారు. వంశం, వంశాంకురం, వారసుడు, తల కొరివి పెట్టే వాడు లాంటి మాటల్ని నిస్సిగ్గుగా మాట్లాడుతున్న పితృస్వామ్య సామాజిక చట్రం గురించి మాట్లాడకుండా పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టాన్ని అమలు చేయగలమను కోవడం భ్రమల్లో కెల్లా పెద్ద భ్రమ. ఎన్ని కోట్ల మంది బాలికలు చనిపోయినా ఫర్వాలేదు… మగ పిల్లలు బతికుంటే చాలనుకునే మూర్ఖ మనుష్యులు, చావుబతుకుల్లో ఉండీ కొడుకు కోసం మళ్ళీ మళ్లీ పిల్లల్ని కనడానికి సిద్ధపడ్డ ఆ తల్లి పోయినా ఫర్వాలేదు… వంశాంకురాన్ని, అంటే కొడుకును కంటే చాలనుకునే పిచ్చి జనాలు స్త్రీలు లేని పురుష రాజ్యాలను స్థాపించాలనుకుంటున్నట్టుంది. స్త్రీల పునరుత్పత్తి – ఆరోగ్యం తన హక్కుగా కాక పితృస్వామ్య భావజాలంతో నిండిన కుటుంబం, అందుకేమాత్రం తీసిపోని ఆరోగ్య వ్యవస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తోంది.

ఒక పక్క కుటుంబ భౌతిక అవసరాలను తీరుస్తూనే మరో పక్క కుటుంబ ఆర్థిక, సామాజిక బాధ్యతలనీ తలకెత్తుకుని కొవ్వొత్తిలా కరిగిపోతున్న స్త్రీలకు కావలసింది పైపై మెరుగులతో ఉన్న కొత్త కొత్త స్క్రీములు కాదు… పక్కా ప్రణాళికతో కూడిన సూక్ష్మస్థాయి నుండి మొదలై అన్ని స్థాయిల్లోనూ క్రియాశీలక భాగస్వామ్యం కావాలి. తనకు ఋణం అవసరమా? అవసరమైతే ఎంత కావాలి? దేనిపై పెట్టుబడి పెట్టాలి? లాభనష్టాలని ఎలా అంచనా వేసుకోవాలి? ఇవన్నీ అవలీలగా నిర్ణయించుకోగల సత్తా స్త్రీలకుంది. కాని వారిని రెండో స్థాయి పౌరులుగా చేసి, అదిలించి, బెదిరించి పొదుపు సంఘాల పేర్న అప్పులపాలు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు, ఆ లింకుల్ని ఏర్పాటు చేసే సంస్థలు పబ్బం గడుపుకుంటున్నారు కాని పేద మహిళలు మాత్రం చక్రవడ్డీలని కట్టలేక, సంఘం నుండి బైటపడదామంటే మరేరకమైన అభివృద్ధి పథకాలకీ నోచుకోరన్న పరోక్ష బెదిరింపులకు తట్టుకోలేక ఏదో రకంగా కాలం వెళ్ళదీయాల్సొస్తోంది. వ్యవసాయదారులైన స్త్రీలు కూడా కూలీలుగా మారాల్సొస్తోంది. చెమటోడ్చి బంజరుని బంగారం చేయగల మహిళా రైతుల్ని పురుషాధిక్య వ్యవస్థ కనీసం కౌలుదారులుగా గుర్తించడానికీ అడ్డం కొడుతోంది!

అసలు స్త్రీల పరాధీనతకు, వివక్షకు, రెండో తరగతి పౌరులుగా బతకడనికి గల కారణాలను, రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చినట్టుగానే మహిళలకి అన్ని హక్కులు, సమానత్వం ఇచ్చినప్పటికీ స్త్రీలు హక్కుదారులుగా కాక లబ్దిదారులుగా మారడానికి దారి తీస్తున్న అంశాల గురించి దేశ వ్యాప్తంగా, విస్తృతంగా చర్చ జరగకుండా, పునాదుల్లో మార్పుల కోసం నాందీ ప్రస్తావనలు, ప్రయత్నాలు జరగకుండా మరో వంద చట్టాలు స్త్రీల కోసం తెచ్చినా వ్యర్థమని ఇప్పటికే రుజువైపోయింది. కుటుంబంలో, సమాజంలో, వ్యవస్థల్లో స్త్రీల పట్ల ఎలాంటి సానుకూల వాతావరణం లేని చోట ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా… ప్రభుత్వం అమలు చేయలేదు (వ్యవస్థల్లో పేరుకున్న జండర్‌ ఇన్సెన్సిటివిటీ వల్ల). స్త్రీలు ధైర్యంగా చట్టాలను వాడుకోలేరు.

స్త్రీలలోనూ ప్రత్యేక అవసరాలున్న స్త్రీల ప్రస్థావన 21వ దశాబ్దాం దాటి 22వ దశాబ్దం వైపు శరవేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలోనూ చాలినంతగా చెయ్యకపోతే, వాస్తవాల్ని దాచేద్దాం అని చూస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. కూ+దీు హక్కుల ఉద్యమంలాంటి వాటిని చూసీ చూడనట్టు వదిలేస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుందని విధానకర్తలు గుర్తించాలి.

2001 పాలసీ ఉద్దరించింది ఈ పదిహేనేళ్ళల్లో ఏమీ లేదు. కొన్ని కొత్త చట్టాలను చేయడం తప్ప. 2016 పాలసీని ముందుకు తీసుకెళ్ళే ముందు భారతదేశంలో స్త్రీల స్థితిగతులు, హోదామీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. పితృస్వామ్య భావజాలం మీద, కుటుంబంలో, సమాజంలో జడరూపంలో బిగిసుకుపోయిన పితృస్వామ్య పట్టును అర్థం చేసుకుని దాని పట్టును సడలించగలిగే కార్యాచరణని, కార్యక్రమాలని రూపొందించుకోకపోతే ప్రజాస్వామిక సంబంధాలు ఏర్పడే అవకాశమే లేదు. వనరులు మొత్తం పురుషుల ఆధీనంలోనే ఉంచేసి, స్త్రీలు సమానత్వం సాధించండి అంటే చెవుడుతో బాధపడే వ్యక్తి ముందు శంఖం ఊదినట్టే.

కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజ్యాంగం స్ఫూర్తిని గౌరవిస్తూ మహిళలను సమాన హక్కులున్న పౌరులుగా గుర్తిస్తూ చట్టాలను పకడ్బందీగా అమలు చేయటం అవసరం.

2016 మహిళల జాతీయ పాలసీ మహిళల్ని లబ్దిదారులుగా కాకుండా పౌరులుగా గుర్తించి పౌరులుగా వారికి చెందవలసిన సమస్తాన్ని వారి పరం చేసే అతి సూక్ష్మ చర్యల నుండి, అతిపెద్ద కార్యక్రమాలకు తెరతీస్తే స్త్రీలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.