మేము నివసించే ప్రాంతంలో మా బడి, గుడి మాత్రమే కాదు గుడుంబా స్థావరాలు కూడా ఉన్నాయి. సెలవు రోజులు కావడంతో మా బడి పిల్లలం చాలా మందిమి కలసి ఆడుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్న పొదలలో నిల్వ చేసిన సారా ప్యాకెట్లు చూసాము. ఈ సారా ప్యాకెట్లు చూడగానే మాకు వాటిని ధ్వంసం చేయాలనే ఆలోచన వచ్చింది. అలాగే చేసాము. వరుసగా మూడు రోజులు చేసి మళ్ళీ అదే పని మీద అటుగా వెళ్ళాము. మాటు వేసిన యజమాని మమ్మల్ని పట్టుకున్నాడు. చాలా భయం వేసింది. మా తల్లిదండ్రులను పిలిపించి చెప్పాడు. మమ్మల్ని అమ్మానాన్నలు బాగా కొట్టారు.
యజమానికి కొంత నష్టపరిహారం చెల్లిస్తామని ఒప్పించి మమ్మల్ని తీసుకెళ్ళారు. సెలవులు తరువాత ఈ విషయం తెలుసుకున్న మా టీచర్ కొడతారనుకొని భయపడ్డాం. కానీ ”పెద్దయ్యాక చెయ్యాల్సిన పనిని ఇపుడే చేసారు” అంటూ మమ్మల్ని మెచ్చుకున్నారు. సారాయి గురించి పోలీసు కంప్లయింట్ ఇస్తామని ఆ యజమానికి చెప్పగా నష్టపరిహారం అడగకుండా చల్లగా జారుకున్నాడు. ఇంతకూ మేము ఎవరో తెలుసా…? మేమంతా 1,2,3 తరగతుల పిల్లలం.