నేను మణిపురికి వెళ్ళినప్పుడల్లా
ఆమె స్ఫూర్తిని అనుభూతి చెందేవాడ్ని,
మణిపురి లాస్యం తిలకించినప్పుడల్లా
ఆ కదలికల్లో
ఏదో స్వేచ్ఛా విషాదం గోచరించేది.
కొండలు కన్నీరు కారిస్తే
ఏర్పడిన ‘లోక్‌తక్’ సరస్సు
ఆమె గురించి మాట్టాడుతున్నట్టే ఉండేది.
ఊహించండి
పదహారేళ్ళు ఆమె అన్నం తినలేదు
ఆకులైనా ముట్టని అపర్ణ కాబోలు!
అద్దం కూడా చూడనంది
తన ముఖం కనిపిస్తే
మమకారం కలుగుతుందని కాబోలు!
అమ్మనూ చూడనంది
బతుకుపై ఆశ చిగురిస్తుందని కాబోలు!
తన శరీరమే ఒక ఆయుధమంది
ఆ ఆయుధంతో
స్వేచ్ఛా కాంక్షను బతికించింది.
సైనికులు ఎక్కడైనా
మృత్యు వైణికులే
చావును చంపడానికి ఆమె
దవాఖానాను జైలుగా మార్చుకుంది.
ఇంఫాల్ వెళ్ళినప్పుడల్లా నేను
కంపించి కంపించిపోతాను
విమానంలోంచి కొండలన్నీ
చెక్కిన ఆమె ముఖంలా అనిపిస్తాయి.
ఒక నెల్సన్ మండేలా
ఒక అంగసాన్ సూకీ
ఒక ఇరోం షర్మిలా
ధిక్కార శక్తికి ప్రతీకలై
నవజీవన పతాకలై
రెపరెపలాడుతారు.
భూమండలంలోని సమస్త కవిత్వం
వారి ముందు మోకరిల్లుతుంది.
ఇవాళ షర్మిల కలకాదు
వాస్తవం –
(16 సంవత్సరాలు నిరసన వ్రతం పాటించిన
ఉక్కుమహిళగా పేరొందిన ఇరోం షర్మిల కోసం)