మౌనం
ఒక ఆయుధమై
ప్రశ్నిస్తుంది
మౌనం
మరో ప్రశ్నకు
సమాధానమౌతుంది
మౌనం
సంకల్పాన్ని
నిర్దేస్తుంది
మౌనం
నిర్బంధాన్ని
విచ్ఛిన్నం చేస్తుంది
మౌనం
ఒకరికి
నిరసన గళం
మౌనం
అనేక
ఉద్యమాల రూపం
మౌనం
జీవితాన్ని
ప్రేమిస్తుంది
మౌనం
అంతరాత్మను
తట్టి లేపుతుంది
మౌనం
కొందరికి
సాధనం
మౌనం
మరికొందరికి
కలల సాకారం
మౌనం
అనేక మలుపుల
సమాహారం
మౌనం
ఒక్కోసారి
వేధిస్తుంది
మౌనం
ఒక్కొక్కసారి
వెల్లువౌతుంది
మౌనం
ఆలోచనలను
రేకెత్తిస్తుంది
మరోసారి
ప్రాణాలని సైతం
హరిస్తుంది
ఇప్పుడు
మౌనం
మాట్లాడుతుంది
తన దారిని
మార్చుకుంటుంది
పదహారేళ్ళ తర్వాత
ప్రజాస్వామ్య
రథచక్రాలకు
పగ్గాలు బిగించి
జనస్రవంతిలో
కదులుతోంది
ఇరోమ్ చాను షర్మిలై
పదం పదం కలుపుకుంటూ
అడుగు ముందుకేస్తోంది
ఇప్పుడు మైదానమంతా
పచ్చని పైరుగాలులై
ఊగుతున్నాయి
ప్రకృతి పరవశిస్తూ
స్వాగతిస్తోంది
జీవితం ఇప్పుడు
ఆమెదే కాదు అందరిదీ
మనలో ఒకరిది కూడా