వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన రజనీ ఎలా వున్నావు? కవిత్వపు ఒంటిమీద నీ ఇంటి పేరుతోనే ప్రసిద్ధం కదా! పాటిబండ్ల రజనీ అనగానే, పాఠకులందరికీ నువ్వూ, ‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’ కవితా గుర్తొస్తాయి. చాలా మంచి కవిత అది. స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కృతం చేసి, తుఫాను హెచ్చరికల్ని చేసింది. రజనీ! నీ కవితల్లో ‘రాజీవనాలు’ కూడా నాకిష్టమైందే. ఎందుకంటే చాలా వ్యంగ్యంగా, భావగర్భంగా రాసిన కవిత అది. చాలావరకు కుటుంబాలన్నీ ‘రాజీవనాలే’ అనే స్టేట్‌మెంట్‌ ఇచ్చేసావు.

ఇప్పుడెక్కడున్నావ్‌? తిరువూరు లోనా, విజయవాడలోనా? విజయవా డంటే గుర్తొచ్చింది. ఒకసారి నీ సారధ్యం లో కృష్ణా పుష్కరాల సందర్భంలో కవయిత్రుల సమ్మేళనానికి పిల్చావు. అప్పుడందరం కలిసి చాలా సంతోషంగా గడిపాం. పి.సత్యవతిగారు, మందరపు హైమవతి, నిర్మలలిద్దరూ.. ఇలా చాలామందిమి కలిసాం. ఇంకొకసారి విజయవాడ వచ్చినప్పుడు (కాలేజ్‌ పేరు గుర్తులేదు) హోటల్‌ రూమ్‌లో మిత్రులందరం కలిసి చాలాసేపు సాహిత్య చర్చలూ, ఆత్మీయతలు, అవరోధాలు గురించి కూడా మాట్లాడుకున్నాం. స్త్రీ వాద సాహిత్యంలో ఒక బలమైన స్వరం నీది. ‘ఎర్ర జాబిళ్ళ ఎరీనా’ పై నేనొక ఆర్టికల్‌ కూడా రాసినట్లు గుర్తు. ‘మామగారి కథలు’ పేరిట నువ్వేసిన పుస్తకం. కృష్ణాజిల్లాలోని ఒక పల్లెటూరిలో జీవిస్తున్న మామగారి ప్రతిబింబమది. పురుష స్వభావాన్ని, గ్రామీణ సంస్కృతిని, అలవాట్లని చాలా పారదర్శకంగా వివరించావందులో. కొంతకాలం పోయాక అవి చరిత్రలో నిలబడి పోతాయి. కాలేజ్‌ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చానని చెప్పాను కదా! అప్పటి నీ ఆత్మీయత విలువైంది. మీ ‘వారు’ (యుద్ధం కాదు) బస్‌లో విపరీతమైన రద్దీగా ఉండడంతో నా కోసం చాలా కష్టపడి ఒక సీటును సంపాదించ గలిగారు. ఆ అర్థరాత్రి బస్సెక్కిన నేను విషాదాన్నే మోయాల్సి వచ్చింది. మా నాన్నగారు రామిరెడ్డిగారు ఓ రాత్రంతా మృత్యువుతో పోరాడుతూ, పోరాడుతూ, నా మీదున్న ప్రేమతో నా కోసం ప్రాణాల్ని అలా ఉగ్గబెట్టుకొని వున్నారు. ‘నాన్నా! ఎలా ఉన్నారు?’ అన్న నా ప్రశ్నకు జవాబుగా నా అరచేతిలోనే నాన్న ప్రాణం పోయింది. కన్నీటి చారికల్తో నాన్న రూపమింకా హృదయపు గది తెరిచినప్పుడల్లా జ్ఞాపకాల రజనును మోసుకొస్తూనే ఉంటుంది. ఆ రోజు నేను రాలేకపోతే బహుశాః చివరి చూపు మిగిలేది కాదేమో! కాలం తనతోపాటు తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది కదా! నాన్నను మాత్రం నాలోనే దాచేసుకు న్నాను జ్ఞాపకాల రూపంలో. ప్రతి మనిషీ తన ఆత్మీయులకు సంబంధించి మృత్యు గీతల్ని ఇలా మోస్తూ బతికెయ్యడమే జీవితం కదా!

సరే, రజనీ ఎలా ఉన్నావ్‌ చెప్పు. నిన్ననే ముకుంద రామారావుగారు అనుసృజన చేసిన ‘అదేగతి’ పుస్తకం ‘గోల్డెన్‌ త్రెష్‌ హోల్డ్‌’లో ఆవిష్కరించారు. 560 పేజీల్తో ఉన్న ప్రపంచ దేశాల సాహిత్యం అందులో ఉంది. తప్పకుండా చదువు. చాలా మంచి మంచి కవితల్ని అనువదించారు. కవయిత్రుల కవిత్వాన్ని కూడా ఒక ప్రత్యేక దృష్టితో అనువదించారు. ‘ఒక నజియా కోసం’ అనే అద్భుతమైన నవలను కూడా ఇటీవల చదివాను. నైజాం సంస్కృతినీ, తెలంగాణా పోరాట కాలం నాటి విషయాల్ని కలుపుతూ, వలస జీవితాల్ని ప్రేమైక మూర్తుల రూపాల్ని ప్రతిబింబిస్తూ చాలా ఉత్కంఠను కలిగిస్తూ హఠాత్తుగా నవలను ఆపేసి, రెండవ భాగం తర్వాత అని తాత్కాలిక ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. జర్నలిస్ట్‌ కూడా కావడంవల్ల అతని కథన శైలి విలక్షణంగా ఉంటుంది. ‘నగేష్‌ బీరెడ్డి’ రాసిన ఈ నవలను ‘సెవెన్‌ రూట్స్‌’ చదివినప్పుడు ఎంత ఉద్వేగానికి గురయ్యానో అంతే పొందాను. ఈ మధ్య నువ్వేం రాస్తున్నావ్‌? ఇవ్వాల్టినుంచి ‘వంగూరి చిట్టెంరాజు’ ఫౌండేషన్‌ వాళ్ళు మూడురోజుల పాటు హైదరాబా ద్‌లో మహిళా ప్రత్యేక సభలు నిర్వహి స్తున్నారు.

లాస్ట్‌ మంత్‌ అమెరికా వెళ్ళిన కొండవీటి సత్యవతి ఫస్ట్‌కి వచ్చేసింది. తను ఇండియాలోనే లైఫ్‌ బాగుంటుం దంటోంది. ఈ సారి ‘భూమిక’ చదివావా లేదా? కవితలు గానీ, కథ గానీ పంపొచ్చుకదా! ‘మహా శ్వేతాదేవి’ ముఖచిత్రంతో వచ్చిందది. ఒక అద్భుతమైన వ్యక్తిత్వమున్న మనిషిని కోల్పోయాం మనం. పి.సత్యవతి గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి బాధపడ్డాను చాలా. మధ్యమధ్యలో మాట్లాడుతు న్నాను. చక్కటి నవ్వు, దాన్ని మించిన వీణా వాయిద్యం రింగ్‌టోన్‌తో మాట్లాడుతు న్నారిప్పుడు. ఆవిడ్ని చూడ్డానికన్నా ఒకసారి రావాలి. వచ్చే నెల 11న ఆవిడ్ని సత్కరిస్తున్నారు కూడా కదా! వీలైతే తప్పకుండా కలుద్దాం. చాలాకాలమైంది మన చూపులు కలుసుకుని. తెలుగు భాషలో ఉన్న సామెతల్లో ముప్పావు వంతు నీ కవితల్లో, కథల్లో ఉన్నాయి. అది నీ ప్రత్యేకత. వ్యంగ్యం నీ అక్షరాల్లోనే ఉంది. మంచి కవయిత్రిగా, మిత్రురాలిగా సదా నాలో వెలుగుతూనే ఉంటావ్‌.

-నీ శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.