సవాళ్ళుంటాయ్‌… చావు పరిష్కారం కానేకాదు – పి. ప్రశాంతి

ఆ రోజు.. నాకింకా  గుర్తుంది… ఈ మధ్య పదేపదే గుర్తొస్తోంది… కాదు, దినపత్రికల్లో వస్తున్న వార్తలు మరీ మరీ గుర్తుచేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలైపోయాక ఎండాకాలం సెలవలకి ఎప్పట్లాగే అమ్మమ్మగారి ఊరెళ్ళినా తను మునుపటిలా లేదు. కజిన్సందరితో కలిసి ఆటపాటల్లో… రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా సాగే అంతెరగని కబుర్లలో… చేల గట్లమ్మట సాగే కథాయాత్రల్లో… తను లేదు. కజిన్సంతా ఒత్తిడి చేసినా రానంటే రానంది. తాతమ్మతో ముచ్చట్లు, అమ్మమ్మతో కలిసి పనులు, తాతగారితో కబుర్లు… రేడియోలో వార్తలు, పాటలు… విసుగొస్తే పుస్తకాలు తప్పించి ఎప్పట్లా హుషారుగా లేదు. అమ్మమ్మ మాత్రం ‘పెద్దదవుతోందిగా! యువరం వచ్చింది’ అనేది.

తను ఎదురు చూడకపోయినా పదో తరగతి పరీక్షా ఫలితాలు రానే వచ్చాయి. పేపర్లో నంబర్‌ చూసుకోవాలన్న ఆసక్తి కూడా లేనట్లు కూర్చుంటే పొద్దున్నే తాతగారే పేపరు తెచ్చి ‘రిజల్ట్స్‌ వచ్చాయి. నంబర్‌ చెప్పమ్మా, చూద్దాం…’ అంటూ వరండాలో బల్లమీద కూర్చున్న తన పక్కకొచ్చి కూర్చున్నారు. అనాసక్తిగా నెంబర్‌ రాసిస్తే టెన్త్‌ రిజల్ట్స్‌ వేసిన ప్రత్యేక పేపరంతా ఆ చివర్నించి ఈ చివరిదాకా రెండుసార్లు చూసేసి ‘శాంతీ నంబర్‌ కరక్టే ఇచ్చావా… ఒకసారి సరిగ్గా చూడు’ అంటూ శాంతిని పిలిచారు. అప్పటి దాకా ఆపుకుంటున్న దు:ఖం తన్నుకొచ్చే స్తోంది. బలవంతంగా  ఆపుకోబోయేసరికి పెదాలు అదురుతున్నాయి. కళ్ళు ఎర్రబడిపోయాయి. కాళ్ళల్లో సన్నటి  ఒణుకు… అడుగుల్లో తడబాటు కనబడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ బొమ్మలా నడిచొచ్చి తాతగారి చేతిలోని కాగితం ముక్క తీసుకుని చూస్తూ ‘నంబర్‌ కరక్టే…’ అని పొడిగా అంది. తన ముఖం చూసిన తాతగారు ఏమనుకున్నారో ఏమో ‘ఫర్వాలేదులే… ఈ సారి కొంచెం కష్టపడితే మంచి మార్కులొ స్తాయి. అమ్మానాన్నల్తో నేన్చెప్తాలే…’ అంటూ భుజం చుట్టూ చెయ్యేసేసరికి ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఎక్కెక్కి ఏడుస్తుంటే లోపల వంట చేస్తున్న అమ్మమ్మ కూడా వచ్చి ‘ఏమయ్యిందే… పరీక్ష పోతే పోయిందిలే… ఇక్కడే ఉండి చదువుకుని మళ్ళీ రాద్దూగాని… ఊరుకో ఏడవకు’ అంటూ చెరోపక్కా కూర్చుని సముదాయించారు.

తనకి ముందే తెల్సు పేపర్లో తన నెంబర్‌ రాదని. మరి మూడు పేపర్లు  రాయలేదు కదా! పరీక్షల్నాటి నుండి ఈ రోజువరకు తాను పడ్డ బాధ/మధన… ఎవరికీ తెలియకుండా ఉండడానికి తాను చేసిన ప్రయత్నం… ఎవరికైనా చెప్పేసి తన గుండె బరువు దించేసుకోవాలన్న తపన… కానీ లోపలెక్కడో భయం!

చదువంటే ఎంతో ఇష్టమైన తనకి, స్కూల్లో టీచర్లంతా మెచ్చుకునే తనకి… పదో తరగతి పూర్తవడం జీవితంలో మరో కొత్త అధ్యాయానికి ప్రారంభం అనుకునే తనకి… పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నప్పుడెదురైన అనుభవం కల్లోలాన్ని రేపింది. అందరితో కలుపుగోలుగా ఉండే తను, ఎటువంటి అవహేళనని, మోసాన్నైనా ఎవరూ భరించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా అంటుండేది. అటువంటి దేదైనా ఎప్పుడైనా ఎదురైనా డేరింగ్‌గా ఎదుర్కొనేది. ఓటమినెప్పుడూ ఎరగదు.

కానీ, టెన్త్‌ పరీక్షలు బాగా  రాస్తున్నా నన్న ఉత్సాహంతో ఉన్న తనకి లెక్కల పరీక్ష రోజు ఎదురైన అనుభం జీవితంలో ఓడిపో తున్న భావాన్నిస్తుంటే తట్టుకోలేకపోయింది. గంభీరంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో ఎక్కడ బైటపడిపోతానో అని ఫ్రెండ్సందరికీ క్రమంగా దూరమైపోయింది. పరీక్ష హాల్లో తన సీటు మధ్య వరసలో వచ్చింది. తనకి కుడిపక్క మరో రెండు వరసలు, ఎడమ పక్క ఒక వరస కుర్చీలున్నాయి. ఎడమ పక్క కుర్చీలోని విద్యార్థి ముందు రోజు పరీక్షకి స్లిప్పులు పెట్టి కాపీ కొడ్తుంటే అసహనంగా అనిపించినా ఇన్విజి లేటర్‌కి చెప్పలేదు. అదే తన బుర్రని వేధిస్తుంటే మర్నాడు లెక్కల పరీక్షకి మరిన్ని స్లిప్పులు పెట్టి కాపీ కొట్టడమేకాక, తన పనైపోయాక ఆ స్లిప్పుల్ని చిన్న చిన్న ఉండలుగా నలిపేసి అటూ ఇటూ విసిరేస్తుంటే కోపాన్ని అణచుకో లేకపోయింది. అయినా, టెన్త్‌ కదా… అని జాలిపడి లోగొంతుకతో కోప్పడ్తూ ”ఏంటది? కాపీ కొట్టడమే తప్పు… పైగా స్లిప్పులు అటూ ఇటూ విసిరేస్తున్నావ్‌… నీ స్లిప్పులు నీ దగ్గరే పెట్టుకో” అంది. ఆ విద్యార్థి గుర్రుగా చూస్తుండగానే స్క్వాడ్‌ రావడం, అతన్తో సహా ఇద్దరు విద్యార్థుల్ని తీసుకుపోవడం చకచకా జరిగిపోయాయి.

పరీక్ష హాల్నుండి బైటకొచ్చాక ఐదా రుగురు అబ్బాయిలు తనెళ్ళే దార్లో అడ్డమొ చ్చారు. ‘మావాడ్ని పట్టించావు కదా! నువ్వెలో పరీక్షలు రాస్తావో చూస్తాం. రేపు వచ్చావో యాసిడ్‌ పోస్తాం’ అంటూ బెదిరించారు. ‘వెధవలింతే’ అనుకుంటూ తిట్టుకుంది. మర్నాడు సబ్జెక్టంతా బాగా ప్రిపేరైన ఉత్సాహంతో సిటీ బస్సు దిగి ఎగ్జామ్‌ సెంటర్‌వైపెళ్తున్న తనని యాసిడ్‌తో ఉన్న ఫిలమెంట్‌ తీసేసిన బల్బుల్ని చూపిస్తూ మూడువైపుల నుంచి కమ్ముకుంటుంటే భయంతో, ఉక్రోషంతో ఏం చెయ్యాలో తోచక స్కూల్‌  గేటు బైటే ఆపున్న రిక్షాలో ‘పోనీ’ అంటూ కూర్చుండిపోయింది. కళ్ళు బైర్లు  కమ్ముతున్నాయి, గొంతు పిడచగట్టుకుపోతోంది, కళ్ళమ్మట నీటి ధార ఆగట్లేదు… ఇంకా మూడు పరీక్షలున్నాయి… రాయనేలేదు! పరీక్షకని మాత్రం రోజూ ఇంట్లోనుండి బయలుదేరేది.

ఎవ్వరికీ చెప్పలేకపోయింది, ఎంతో క్లోజ్‌గా ఉండే చెల్లికి కూడా… పెద్ద గొడవల వుతాయన్న భయం. అసలే ఆవేశంలో ఉన్న కుర్రాళ్ళు… పౌరుషం, పొగరుతో పాటు… సాహసాలు చేసే దుడుకు వయసు. తనవాళ్ళకే మన్నా హాని తలపెడ్తారేమో అన్న ఆలోచనతో అన్నింటినీ మనసులోనే కుక్కేసుకుంది.

అయినా ఎప్పుడూ చావాలన్న తలంపు రాలేదు. మరిప్పుడెందుకని పేపర్ల నిండా అవే వార్తలు… పరీక్షల్లో ఫెయిలయి నందుకు… తక్కువ మార్కులొస్తాయేమోనని… ఫస్ట్‌ క్లాస్‌ రాలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు… ఒక పరీక్ష పోతే ఏంటి? మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఒక జీవితం పోతే… మరోటొస్తుందా? ఒక కూతురో, కొడుకో చచ్చిపోతే మరొకరొస్తారా? అసలు బ్రతికుంటేనేకదా జీవితంలో పాసయ్యేది. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, విద్యా సంస్థలు అందరూ ఒకే యావలో కొట్టుకుపోతున్నారే.. భావితరం మానసికంగా గట్టిగా ఉండాలి కాని.. సూయిసైడల్‌గా కాదు కదా…!! మన విద్యావ్యవస్థ సరిగ్గా ఉంటే… అసలు మార్కులా కావలసింది… సబ్జెక్టా…? డిగ్రీలా కావలసింది… జ్ఞానమా…??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.