ఈ నెల 26వ తేదీన హన్మకొండ పింజర్లలోని శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో భూమిక, ప్రియాంకల సంస్మరణ సభ జరిగింది. సమావేశంలో ఆచార్య తిరుమలరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”భూమిక ప్రియాంకలై రెండోసారి బలైన సమ్మక్క సారక్కలు” పేరిట తెలంగాణ రచయితల వేదిక వరంగల్ శాఖ భూమిక, ప్రియాంకల ఫోటోలతో, కవితలతో ప్రచురించిన గోడపత్రికను తెలంగాణ రచయితల వేదిక అధ్యుక్షుడు ప్రముఖ జానపద విజ్ఞానవేత్త ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పాలకవర్గానికి చెందిన మనుషుల వల్ల బలైపోయిన బానోతు భూమిక, బానోతు ప్రియాంకలు ప్రజల మనసుల్లో నిలిచిపోవడానికే ఈ గోడపత్రిక ఆవిష్కరణ చేశామని చెప్పారు. పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కమ్మలకుంట్ల తండాలో వారి పేరిట స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని, ఆ ఇద్దరు బాలికలు ఆనాడు రాజ్యకాంక్షకు బలైన సమ్మక్క, సారక్కల్లాగా నిలిచిపోతారని అన్నారు. వారి ఫోటోలతో ఉన్న గోడపత్రిక ప్రేరణ కలిగిస్తుందని, స్మరించుకునేలా చేస్తుందని, జ్ఞాపకమై ప్రవహిస్తుందని అన్నారు. అక్షరాలు ప్రజలవెంటే ఉండాలనేది తెలంగాణ రచయితల వేదిక ఆశయమన్నారు. కవులు, రచయితలు ముందుకు వచ్చి ప్రశ్నించాలని, లేకపోతే అందరికీ ముప్పేనని చెప్పారు. చిన్నారులైన భూమిక, ప్రియాంకలు ఏం తప్పుచేశారని వారిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఊరకుక్క వారి శవాల విడి భాగాలను తెచ్చేదాకా ఈ విషయం ఎవరికీ తెలియదన్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్, పోలీసు శాఖలు గుర్తించలేదని, తర్వాత కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. భూమిక, ప్రియాంకలపై పాటలల్లి తీజ్ పండుగను జరుపుకోవాలని, గిరిజన కథకులు పురాణంగా చెప్పాలని కోరారు.
మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. భూమిక, ప్రియాంకల మరణం గురించి ఓట్ల కోసమే పుట్టిన వారిపై ఒత్తిడి చేయాలన్నారు. ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత మాట్లాడుతూ మనం ఏం చేయలేని స్థితి నుండి ఏమైనా చేసే స్థితికి ఎదిగినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని, న్యాయం జరిగేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. ఐద్వా రత్నమాల మాట్లాడుతూ హత్యకు సంబంధించి అప్పటి జిల్లా కలెక్టర్‌ను కలిసినపుడు తాను కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నానని నిస్సహాయత వ్యక్తం చేశారని చెప్పారు. భూమిక, ప్రియాంకల స్మృతివనం కమిటీని ఏర్పాటుచేసి కమిటీ కన్వీనర్‌గా బాదావత్ రాజును ఎన్నుకున్నారు. సమావేశానికి ప్రముఖ కవి అన్వర్ అధ్యక్షత వహించారు. వడ్డెబోయిన శ్రీనివాస్, వజ్జీర్ ప్రదీప్, జైసింగ్ రాథోడ్, డా.రాజారాం, నల్లెల రాజయ్య, ఉదయ్‌సింగ్‌లు కవితలు చదివారు. అమృతరాజు పాట పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో భూమిక తల్లిదండ్రులు యాకిబాయి, కిషన్ నాయక్, ప్రియాంక తండ్రి బాలు నాయక్, భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు వరంగల్ జానీ, అల్లావుద్దీన్, శంకరరావు, శ్రీధర్‌రాజు, మంద సంజీవ, సాగర్, పిట్ట సాంబయ్య, సోమ రాంమూర్తి, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.