తెలుగు కథలో పితృస్వామ్యం – సహన, అసహన భావనలు- కె.సుభాషిణి

అసహజ అసమాన సమాజంలో వ్యవస్థ నిర్దేశించిన సూత్రాలు, నియమ నిబంధనలకు అనుకూలంగా మానవ జాతి నడుచుకుంటోంది. కుల, మత, లింగ, ప్రాంత ఆధిపత్యాలతో సమాజం నిరాఘాటంగా  సాగిపోతోంది. అయితే సమాజం చలన శీలనమైంది. మొదట ఏర్పటిన అనాగరిక, జంతు సంబంధిత లక్షణాలతో కూడిన మాతృస్వామ్య వ్యవస్థ కనుమరుగయింది. కాలక్రమేణా పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడి సమాజంలో అణువణువునా పాతుకుపోయింది. అంటే స్త్రీల లైంగికత్వాన్ని, మాతృత్వాన్ని, శ్రమను, స్వేచ్ఛను నియంత్రించే ఆధిపత్య విధానం అమల్లోకి వచ్చింది.

స్త్రీలపై అమలయ్యే సామాజిక, కుటుంబ వివక్షలను ప్రశ్నించకుండా సహనంతో భరించడం వల్ల స్త్రీలు తమ హక్కులను కోల్పోయి జీవితంలో నష్టపోతారు. తద్వారా సమాజానికి కూడా తీరని నష్టం కలుగుతుంది. అంటే యిక్కడ స్త్రీలు సహనం అనే ముళ్ళ కిరీటాన్ని వదిలించుకుని అసహనాన్ని చైతన్య రూపంలో ధిక్కార స్వరాలను పలికించడం ఆత్మగౌరవానికి సంకేతమవుతుంది. స్త్రీలు తమ హక్కులను, ఆకాంక్షలను వెల్లడించే సందర్భాల్లో ఆధిపత్య అహంకారంతో చెలరేగిపోయే కొన్ని సమూహాలు అసహనాన్ని ప్రదర్శిస్తున్నాయి. తమ కాళ్ళ దగ్గర, తమ అజమాయిషీలో బ్రతకవలసిన స్త్రీలు హక్కుల గురించి మాట్లాడడం, ప్రశ్నించడం అనే విషయాలను ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. దీంతో స్త్రీలు సంపూర్ణ స్వేచ్ఛను, హక్కులను పొందలేకపోతున్నారు. సమాజంలోనూ, కుటుంబంలోనూ తిష్ట వేసుకుని కూర్చున్న పితృస్వామ్య భావజాలాన్ని ఎదుర్కోవడానికి ఒక తార్కిక దృక్పథం అవసరమయింది. స్త్రీ, పురుషుల మధ్య వున్న శారీరక, సామాజిక, కుటుంబ సంబంధాలను, అసమాతలను స్త్రీల హక్కుల వైపు ఉండి పరిశీలించి, మాట్లాడే ఆలోచనా విధానానికి అంకురార్పణ జరిగింది.

ఈ దృక్పథాన్ని తెలుగు సాహిత్యం సొంతం చేసుకుంది. ప్రతి ప్రక్రియలోనూ ఈ ఆలోచనా ధోరణి చాలా ప్రస్ఫుటంగా కనిపించసాగింది. గురజాడ, శ్రీపాద, చలం లాంటి రచయితలు తమ అనుభవాలలో, పరిశీలనలలో వచ్చిన స్త్రీల సమస్యలను వారిపై సమాజం, కుటుంబం చూపే వివక్షలను నిర్భయంగా కథల్లో వెల్లడించారు. వీరికంటే ముందు భండారు అచ్చమాంబ స్త్రీల అవసరాలు, ఆకాంక్షలను గుర్తించి ధన త్రయోదశి, స్త్రీ విద్య కథలు వ్రాశారు. సాంప్రదాయవాది అయినప్పటికీ కనుపర్తి వరలక్షుమ్మ స్త్రీలకు ఆత్మగౌరవ అవసరాన్ని ”మూడు తీర్మానాలు” కథలో నొక్కి చెప్పారు. భర్త ఆధిపత్యాన్ని, హింసలు భరించే స్థాయి నుండి చైతన్యవంతురాలయిన కూతురు యిచ్చిన భరోసాతో సంకెళ్ళు తెంచుకొని బయటపడిన స్త్రీ జీవితాన్ని చిత్రించిన కథ తురగా జానకిరాణి రచించిన ”నా జీవితం నాకిచ్చేయి”. అప్పటినుండి తెలుగు కథలలో పితృస్వామ్యాన్ని కట్టడి చేసే ధోరణి పుంజుకుంది.

స్త్రీలను పితృస్వామ్యానికి దాస్యులుగా వుంచుకోవడానికి కులాలు, మతాలు సకల శక్తులు ప్రయోగిస్తుంటాయి. కుల రహిత సమాజాన్ని అంబేద్కర్‌ కలగన్నారు. అందుకు కులాంతర వివాహాల అవసరాన్ని నొక్కి చెప్పారు. కులాంతర వివాహాలలో కూడా స్త్రీలు తమ భర్తల కులాచారాలను పాటించమని అత్తింటి కుటుంబాలు ఆంక్షలు పెడుతుంటాయి. ఈ వివాహాల్లో భర్తకంటే భార్య కింది కులానికి చెందినదైతే ఆ స్త్రీ అదనంగా పితృస్వామ్యంతో పాటు కులపరమైన అవమానాలు, అవహేళనలకు గురి కావలసి వుంటుంది. వీరు రెండు బలమైన శక్తులతో ప్రతి క్షణం యుద్ధమన్నా చేయాలి లేదా ఆ శక్తులకు తలవంచి దు:ఖంతో, అవమానంతో కాలాన్ని నెట్టుకు రావాలి. మామూలుగా పెద్దలు కుదిర్చిన వివాహాలలో స్త్రీలకు అంతో యింతో పుట్టింటి సహకారం వుంటుంది. కానీ కులాంతర వివాహం చేసుకున్న స్త్రీలకు సహాయం అందని ద్రాక్ష పళ్ళ లాంటిదే. సొంత శక్తి, చైతన్యాలతోనే ఈ వివక్షను ఎదుర్కోగలగాలి.

తమకంటే తక్కువ కులం వ్యక్తిని ఇష్టపడిందని తమ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలినే మూడో కంటికి తెలియకుండా నీళ్ళలోకి తోసి చంపేసిన కుల, పురుష అహంకారాలను నరనరాన జీర్ణించుకున్న వ్యవస్థ యొక్క నగ్న స్వరూపం కళ్యాణ సుందరీ జగన్నాధ్‌ ”అలరాస పుట్టిల్లు” కథలో కనిపిస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలుగా వెళ్ళిన బహుజన స్త్రీ అరుణ, అత్తింటివారి కుల అహంకారానికి, మామ పురుష అహంకారానికి నలిగిపోతూ, సొంత ఉనికినే కోల్పోతూ చివరకు ఉద్యోగం కూడా బలవంతంగా మానివేయవలసిన పరిస్థితి ”చీకట్లో చూపు” కథ ద్వారా తెలుస్తుంది. పళ్ళ బిగువున అసహనాన్ని నొక్కి పట్టుకుంటున్న భార్యకు ఈ కథలో చివరగా భర్త అండగా నిలుస్తాడు. కాబోయే కోడలు మాంసాహారి అని తెలిసి ఎన్నో షరతులు విధించి శాకాహారిగా మారాలని బెదిరించి, బలవంతంగా మార్చడానికి నామాలు వేయించడం అనే గగుర్పొడిచే విషయాన్ని ”నామాలు” అనే కథలో చదివి ఆశ్చర్యపోని పాఠకులు వుండరు. నామాలు వేయించుకుని, అత్తింటి వారికి విధేయంగా వుంటూ, జీతం మొత్తం తెచ్చి భర్త చేతుల్లో పెడుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించని అత్తింటి వారి చేష్టలకు పూర్తిగా సహనం కోల్పోయి, భర్తను ధిక్కరించి బీఫ్‌ ఫెస్టివల్‌కు వెళ్తున్నాను అని చెప్పి తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటుంది.

మతాంతర వివాహాలు చేసుకున్న స్త్రీలు అనివార్యంగా భర్తల మతాచారాల సంస్కృతిలోకే నెట్టివేయబడుతున్నారు. అందుకు కారణం భార్యలు భర్తల యింటికి వెళ్ళి కాపురం చేసే సంస్కృతిలోనే సమాజం వుండటం. పుట్టింట్లో ఎవరి అజమాయిషీలను అంగీకరించని ఒక ముస్లిం యువతి హిందూ  బ్రాహ్మణుడ్ని పెండ్లి చేసుకొని అత్తింటివారి ఆంక్షలను స్వీకరించటాన్ని ”అమీనా బేగం ఉరఫ్‌ అలివేలు మంగ” కథ వివరించింది. మతాంతర వివాహాలు అంటే మత మార్పిడి చేసుకునే వివాహాలుగా వుండకూడదు. మతాలకు అతీతంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవంతో సహజీవనం చేయడం అత్యంత విలువలతో కూడుకున్నది. కులాన్ని, మతాన్ని వదిలేసుకున్న యువతిని పెండ్లి నిఖా పద్ధతిలో చేసుకుందామని ముస్లిం యువకుడు ప్రతిపాదిస్తే పూజా పునస్కారాలను వ్యతిరేకించడం అంటే యింకొక మతాన్ని ఆచరించడం కాదు అని ప్రతిభ ”సంకెళ్ళు నీకు బై..బై..” కథలో అంటుంది. ఈ రెండు కథల్లోనూ పురుషులు తాము ప్రేమించిన యువతులను తమ సంప్రదాయాలకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. మొదటి కథలో భర్త మతాచారాలకు, సంస్కృతికి తలవొగ్గి తన సొంత అస్థిత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని వదులుకున్న స్త్రీగా మనకు అమీనా కనిపిస్తుంది. రెండో కథలో స్వేచ్ఛకు తావులేని మతాంతర వివాహ ప్రతిపాదనను తిరస్కరించి, పెండ్లి కంటే స్వేచ్ఛనే ముఖ్యమైనది అని తేల్చి చెప్పి పితృస్వామ్య కుట్రకు బలి కాకుండా తనను తాను కాపాడుకుంటుంది ప్రతిభ.

శ్రామిక కుటుంబాలలో చాకిరీ చాలా వరకు స్త్రీలదే. తన శ్రమను కుటుంబ సేవకోసమే కాక కుటుంబ పోషణకు కూడా ధారపోయవలసి వస్తుంది. అయినా ఆమె శ్రమకు గుర్తింపు దొరకటం దుర్లభమే. ఆమెకు తన గురించిన కనీస ఆలోచన కూడా  రానంత పనిని ఆమె మీద రుద్దుతుంది పితృస్వామ్యం. స్త్రీని శారీరకంగా బలహీనురాలిగానూ, ఆర్థికంగా పురుషుని మీద ఆధారపడేటట్లుగానూ చేసుకోగలిగితే స్త్రీపై ఆధిపత్యం చెలాయించవచ్చని చెప్పిన కథ ”తాయమ్మ కథ”. మొదటి నుండి నిరాదరణకు గురైన తాయమ్మకు భర్త దాష్టీకం, అత్త చేసే పెత్తనం భరించరానిదవుతుంది. జుట్టు, కట్టు, బొట్టు… వీటన్నింటిపైనా నియంత్రణ. కదలికలపైనా నిఘా. పేరుకు పోయిన కోపం, అసహ్యం క్రమంగా ఎదురు తిరిగే మనిషిగా మారుస్తుంది. ఎంత ఎదురు తిరిగినా ఈ కథలో తాయమ్మ విజయం సాధించలేకపోతుంది. స్త్రీలు శారీరక హింస నుండి బయటపడడానికి, ఆర్థికంగా  యింకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకడానికి యింకెంత శక్తులు కూడగట్టుకోవాలో తాయమ్మ జీవితం చెబుతుంది.

భారతదేశంలో మరుగుదొడ్లు లేక స్త్రీలు యింకా ఇక్కట్లకు గురవుతూనే ఉన్నారంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. అది స్త్రీల ఆత్మగౌరవానికి ఎంత భంగపాటో సమాజానికి అర్థం కావాలి. మరుగుదొడ్ల అవసరాన్ని, అవి లేక ఆరుబయటకు పోలేక, పోతే ఆకతాయి మగవాళ్ళు చేసే వెకిలి చేష్టల్ని భరించలేక సిగ్గుతో చితికిపోయిన స్త్రీల దీనగాథను వివరించే ”కట్ట” కథ మనల్ని కదిలిస్తుంది. ముస్లిం స్త్రీలకు వున్న ఘోషా పద్ధతి, పేదరికం అంశాలతో ముడిపడి ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్న సండాస్‌లలోకి పోలేక నలిగిపోయిన కొత్త పెండ్లికూతురును ”సండాస్‌” కథలో చదువుతాం. ఈ కథలు చదివిన పాఠకులు అసహనంతో రగిలిపోతారు. ఈ కథల్లో ఆర్థిక అంశాలు కూడా చర్చకు వస్తాయి.

స్త్రీ లైంగికత్వం పట్ల నియంత్రణ అంటే స్త్రీ శరీరంపై అధికారం చెలాయించటం. స్త్రీ శరీర అవయవాలు మగవారి ప్రతాపాన్ని చూపించుకునే అధికార స్థావరాలు. స్త్రీ శరీరంతో జరిగే వ్యాపారం అంతా యింతా కాదు. స్త్రీ శరీరంలో పైకి కనిపించే, కనబడని అవయవాలన్నింటిపైనా అజమాయిషీ, ఆంక్షలు సమాజంలో అమలు జరుగుతుంటాయి. ఈ ఆంక్షలలో వున్న అసమానతలే ”రాజకీయ కథలు”గా రూపుదిద్దుకున్నాయి. యవ్వనంలోకి అడుగుపెడుతున్న అమ్మాయిల శరీరాలను మగ

వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసి లొట్టలు వేసుకుంటూ, చొంగ కార్చే వైనాన్ని ”మొద్దు రాచ్చిప్ప” కథ బయటపెడుతుంది. పిల్లలు లేని స్త్రీని ఈ సమాజం అంగీకరించదు. ఎద్దు పుండును కాకి పొడిచినట్లు పొడుస్తుంది. పిల్లల్ని కనాలి, అందులోనూ మగపిల్లవాడికి జన్మ యివ్వలేని స్త్రీ జన్మ వ్యర్థం అని ముద్ర వేయటం పరిపాటి. ఎంతమంది ఆడపిల్లలనైనా కను కానీ ఒక్క మగపిల్లవాడికైనా జన్మనివ్వాల్సిందే అని శాసిస్తుంది పితృస్వామ్యం. రక్తహీనతతో, గర్భసంచిలో గడ్డ ఏర్పడి ప్రాణాంతకం అయినప్పటికీ మగపిల్లవాడి కోసం భర్త మరో పెండ్లి చేసుకుంటాడనే భయంతో గర్భ సంచిని తీసివేయించుకోవడానికి ఒప్పుకోక ప్రాణాలు పోగొట్టుకున్న ఒక అభాగ్య ముస్లిం స్త్రీని ”ఫాతేహా” కథలో చదివి తెలుగు పాఠకులు జాలితో పాటు కోపంతో ఊగిపోతారు. భర్తల అరాచక రసికత్వానికి బలయ్యే స్త్రీలు ఎందరో! భర్తలను సంతృప్తి పరచాలనో, దూరమవుతామనే భయంతోనో అవసరమైన ఆపరేషన్లు చేయించుకోక కొందరు, అనవసరమైన ఆపరేషన్లు చేయించుకునే స్త్రీల యదార్థ కన్నీటి జీవితాలు ”నింఫోమేనియా కథలు” పేరిట అక్షర రూపం దాల్చాయి.

పరువు అనే తప్పుడు సాంప్రదాయానికి లోబడి ఎవరికీ చెప్పుకోలేక, సొంత ధైర్యం లేక బాధపడే స్త్రీలు చివరకు తమ హక్కులను కోల్పోయి, సొంత ఉనికిని కోల్పోయి జీవచ్ఛవాలుగా బ్రతుకులు వెళ్ళదీయటమన్నా జరుగుతుంది లేదా ప్రాణాలు కోల్పోవడమన్నా జరుగుతుంది. ‘మహతి’ కథలో అత్తింట్లో అమానుష హింసాకాండను పుట్టింటి వాళ్ళకు చెప్పుకోలేక, హింసనుండి బయటపడే చైతన్యం లేక మహతి ఆత్మహత్య చేసుకుంటుంది. హింసను భరించలేక అసహనాన్ని ప్రదర్శించలేక బలైపోయిన యువతి మహతి. పితృస్వామ్య కబంధ హస్తాల నుండి బయటపడడానికి స్త్రీలు సన్నిహితుల అండ కోరుకుంటారు. వారు ఎవరైనా కావచ్చు. కొంతమంది భరించినంత కాలం భరించి చివరికి ఏదో ఒక సందర్భంలో తెగువను ప్రదర్శించి బయటపడుతుంటారు. భర్త దుర్మార్గం, కుటుంబ పోషణ పట్ల నిర్లక్ష్యం, పరాయి స్త్రీ వ్యామోహాన్ని ఎంత మాత్రం భరించలేక కొడుకుతో బయటకు వచ్చేస్తుంది ”మురళి వాళ్ళమ్మ” కథలో రుక్మిణి. కొడుకు పెద్దయ్యాక తండ్రిలాగే పరాయి స్త్రీ ఆకర్షణలో పడటం ఎంత మాత్రం సహించలేకపోతుంది. కొడుకు తప్పును ఎత్తిచూపి కోడల్ని

హెచ్చరిస్తుంది. సహనంతో నోరు విప్పని కోడలి తరఫున తనే నోరు విప్పుతుంది. భర్త హింస నుండి బయటపడిన చైతన్యంతో కోడలికి అండగా నిలుస్తుంది. తప్ఫు ఎవరు చేసినా, తన రక్త సంబంధీకులైనా సరే వారి పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తి చూపి స్త్రీల పక్షాన నిలబడాలి అని చెప్పే కథ యిది. ”గోవు” కథా శీర్షికే చాలా గడుసయినది. నలభై ఏండ్ల పాటు పుట్టింట్లో  కుటుంబ సభ్యుల ఆధిపత్యాన్ని, నిరాదరణను మౌనంగా భరించిన గోవు అనబడే గోమతి స్థితిపరుడు, లాయరు, వయసు మళ్ళిన రెండో పెండ్లి వానితో వివాహం తర్వాత కూడా  మరింత అణచివేతకు గురవుతుంది. గర్భంలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డమీద ఎంతో యిష్టాన్ని పెంచుకున్న గోమతి ఆశను మొగ్గలోనే తుంచి, బలవంతంగా ఆపరేషన్‌ చేయిస్తారు. ఈ దుశ్చర్యను తట్టుకోలేక భర్త, వృద్ధ ఆడపడుచు మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఆమె వంటింట్లో నుంచీ వీథిలోకి వచ్చి బలహీనులు, గంగి గోవులలాంటి బాధిత స్త్రీలను పోగేసి ఇదీ మీ బ్రతుకు అని చెబుతుంది. దీంతో చైతన్యం పొందిన మహిళలు తమ చుట్టుపక్కల వున్న బాధితులను సంఘటితం చేయాలని చెప్పిన కథ యిది.

కుటుంబ హింస, ప్రేమ రాహిత్యానికి గురైన స్త్రీలు భర్తకు, కుటుంబానికి కట్టుబడి వుండాలే తప్ప ఈ సమాజం గీసిన హద్దులు దాటి బయటికి పోకూడదు. ముసలి లాయర్‌ మొగుడు దగ్గర దొరకని ప్రేమ అమీర్‌ దగ్గర దొరుకుతుందని ”మైదానాన్ని” వదిలి అడవిలోకి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. తర్వాత కథ తెలుగు పాఠకులకు చిరపరిచితమే. తన సంతోషం కోసం నచ్చిన వాడితో వెళ్ళిపోయిన తల్లి సంతోషంగా వుండాలని కోరుకుందాం అంటాడు ”దమయంతి కూతురు”తో దమయంతి కొడుకు. మరి దమయంతి సంతోషంగా ఉందా? తెలియదు. ”గీతలకావల” కథలో నాలుగు పదుల వయసులో కోటిరెడ్డితో వెళ్ళిపోయిన పార్వతమ్మ ముందు జీవితం, తర్వాతి జీవితం చూస్తే, కోటిరెడ్డే కూలి నాలి చేసి పార్వతమ్మను పోషించి, గౌరవంగా చూసుకుంటుండడంతో అతని సాంగత్యంలో సంతోషంగా గడుపుతోందని తెలుస్తుంది. సమాజం గీసిన హద్దులు చెరిపి వెళ్ళిపోయినవారు గీతలకావల కూడా సంతోషంగా వుండటం పాఠకులకు తృప్తినిస్తుంది.

పురుషుని శక్తినీ, శౌర్యాన్ని వర్ణించిన కవులు, స్త్రీని సుకుమారిగా, అవయవాల పొందికగా, మాంసపు ముద్దగా చిత్రించారు. ఈ ధోరణి యిటీవల వచ్చింది కాదు. పురాణ గ్రంథాలు, ప్రాచీన సాహిత్యం, ప్రబంధాలలో పుంఖానుపుంఖాలుగా వర్ణించి ప్రజల మధ్య పడేశారు. అంతేకాకుండా పాతివ్రత్య ధర్మాన్ని పాటించి పురుషుని అడుగుజాడల్లో నడవాల్సిందిగా స్త్రీలను శాసించాయి. పురాణాలలో ముఖ్యంగా రామాయణంలో స్త్రీ పాత్రలపై చూపించిన వివక్షను ఎత్తి చూపే ఆధునిక దృష్టి కోణం నుండి పునర్వ్యాఖ్యానం చేసిన కథలు చాలానే వచ్చాయి. వీటికి సమాంతరంగా శ్రీ కృష్ణుని ఎనిమిదవ భార్య అయిన ”లక్షణ” భర్త నిరాదరణతోనూ, ఒంటరితనంతో విసిగిపోయి శ్రీకృష్ణుని నిగ్గదీసి అతని స్త్రీ లౌల్యాన్ని ఎత్తిచూపిన కథ ”లక్షణ”. ఇదే తరహాలో బ్రహ్మ, సరస్వతులను

ఉద్దేశిస్తూ రెండు కథలు కనిపిస్తున్నాయి. స్త్రీల కష్టాలకు, కడగండ్లకు, హత్యలకు, ఆత్మహత్యలకు బ్రహ్మే కారణమని నారదుడు భూలోక వాసులకు చెప్పడానికి ”బ్రహ్మ నిర్వాకం” కథలో పూనుకుంటాడు. భూలోకంలో పురుషులు సుఖంగా జీవించడానికి, స్త్రీలను చైతన్యరహితంగా ఉంచడానికి, వారివైపు నుండి ఎలాంటి వత్తిడి రాకుండా వుండడానికి కావలసిన సూత్రాలు, పుస్తకాలు తయారు చేయమని సరస్వతిని ఆదేశిస్తే, బ్రహ్మ ఆదేశాలను బేఖాతరు చేసి భూలోక మార్గానికి ప్రయాణం కట్టిన ఆధునిక సరస్వతి ”బ్రహ్మ సూత్రాలు” కథలో కనిపిస్తుంది.

కరువుకు, కోస్తా పెట్టుబడిదారుల మోసపూరిత రాజకీయ కుట్రలకు బలయిన రాయలసీమ ప్రజలను ముఖ్యంగా  స్త్రీలను ముఠా కక్షలు మరింతగా కుంగదీశాయి. భూస్వామ్య సంస్కృతిలో భాగమైన ఈ ముఠా కక్షలు స్త్రీని పావుగా వాడుకొని ప్రత్యర్థులపైన పగ సాధిస్తాయి. ఈ ముఠా  కక్షలకు ఎక్కువగా బలయింది గ్రామీణ ప్రాంతాలలోని బడుగు పేదలు, స్త్రీలే. వీరి జీవితాలను అక్షరబద్ధం చేసి ”ఫ్యాక్షన్‌ కథలు” పేరిట ఒక పుస్తకాన్ని దశాబ్దాల క్రితమే తీసుకువచ్చారు. స్త్రీల కోణం నుండి వచ్చిన కథలు తక్కువే. ముఠా కక్షల్లో భర్తను పోగొట్టుకున్న స్త్రీ, తన చుట్టూ పొంచి వున్న ప్రమాదాలు అంటే ఇంట్లోనే పూర్తిగా బందీ కావడం, మామ, బావలు లైంగికంగా వేధింపులు మొదలుపెట్టడంతో,  సంఘర్షణకు గురై, తెగించి ఇంటినుండి బయటపడి కొత్త జీవితం ప్రారంభిస్తుంది ”ఒక వేకువలోకి” కథలో.

స్త్రీలకు రాజకీయాలను దూరం చేసింది సమాజం. స్త్రీలు స్వంతంగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అనేది సహజంగానే జరగదు. ఇంటిపనికి, పిల్లల పెంపకానికే జీవితాన్ని అంకితం చేయబడిన స్త్రీ బయట ప్రపంచం చూడటం, దాన్ని గమనించడం, అందులో భాగం కావడానికి యింకా ఎక్కడ సమయం వుంటుంది? తన సంతోషం, అభిరుచులు కొద్దిగా అయినా పొందాలంటే కాస్త కాలాన్ని అప్పు తెచ్చుకోవాల్సిందే అంటారు ”టైమ్స్‌ అండ్‌ స్పేస్‌” కవితలో. భారతదేశంలో స్త్రీలను ఓటు బ్యాంకులుగా చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. పేరుకే స్త్రీలు ప్రజా ప్రతినిధులుగా వుంటారు. వారి తరఫున అధికారం చెలాయించేది మాత్రం భర్తో, తండ్రో, కుమారుడో ఎవరో ఒకరు అయి వుంటారు. వారి ప్రయోజనాలే తమవిగా భావించి స్వంతం చేసుకుంటారు స్త్రీలు. భర్త, తమ్ముడు మధ్య జరిగే రాజకీయ ఎన్నికల క్రీడలో నలిగిపోయి భర్తను సానుభూతి ఓట్లతోనైనా గెలిపించు కోవాలని స్వీయ పాతివ్రత్య ధర్మానికి లోనై ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించుకున్న సున్నిత మనస్కురాలైన స్త్రీ జీవితాన్ని ”రాచపుండు” కథలో ఆవిష్కరించారు రచయిత్రి. పేరున్న వ్యక్తికి కోడలుగా, అధికారాన్ని, దర్పాన్ని అణువణువునా ప్రదర్శించే వ్యక్తికి భార్యగా వున్న స్త్రీ, రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్‌ ఎన్నికలలో  నిలబడాల్సి వస్తుంది. గెలిచాక భర్త, మామలకు భయపడకుండా పంచాయితీ ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతో రబ్బర్‌ స్టాంప్‌గా కాకుండా స్వయంగా పంచాయితీ రికార్డును చూడడానికి నిర్ణయించుకునే స్త్రీ ”గంగ జాతర” కథలో కనిపిస్తుంది. మహిళా సాధికారకతకు నాంది అనుకోవచ్చు. అయితే ఈ కథలో బూర్జువా పార్టీ తరఫున నిలబడి గెలిచిన వ్యక్తి స్త్రీయే అయినప్పటికీ స్త్రీలకు, పేద ప్రజలకు ఎంత మటుకు న్యాయం చేయగలదు అనే సందేహం పాఠకులకు కలుగుతుంది. దళితులకు కేటాయించిన పంచాయితీలలో, పెత్తందార్లు తమ మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులను సర్పంచ్‌లుగా  నిలబెట్టి గెలిపించుకుంటారు. ఇక పెత్తందార్లు  కుర్చీలలో కూర్చుంటే దళిత సర్పంచ్‌లు నేలమీద కూర్చునే సంస్కృతి కూడా కనిపిస్తూనే వుంటుంది. ఆ సర్పంచ్‌ స్త్రీ అయితే పరిస్థితి యింకా దారుణం. పంచాయితీ కార్యాలయాల్లో దళిత మహిళా సర్పంచ్‌ చేత చెత్త కూడా ఊడ్పిస్తుంటారు. ఈ తరహా బానిస మనస్తత్వాన్ని వదిలించుకుని తన తోటి దళిత స్త్రీలకు ఏదైనా చేయాలనే దృఢ నిశ్చయంతో ”సర్పంచ్‌ ఎవరు” కథలో కుల, పురుష అహంకారులైన పెత్తందార్లను ధిక్కరించి తన చైతన్యాన్ని చాటుకుంటుంది.

స్త్రీల హక్కులు, ఆకాంక్షల పట్ల అసహనాన్ని ప్రదర్శించే పితృస్వామ్యం సహనాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరాన్ని నేటి అభ్యుదయ రచయితలు గుర్తు చేస్తున్నారు. రణరంగంలో మొహరించే శతృవర్గాలుగా కాకుండా కలిసి జీవించే, కలిసి పనిచేసే వర్గాలుగా వుండాలని ఆశిస్తున్నారు. స్త్రీ పురుషుల మధ్య పేరుకుపోయిన అన్నిరకాల అసమానతలను ఎత్తి చూపి ఆరోగ్యకరమైన, ప్రజాస్వామిక కుటుంబాలను, సమాజాన్ని నిర్మించడానికి తెలుగు కథ తన వంతు కృషి చేస్తోంది. మారుతున్న పరిస్థితులు, అవి స్త్రీలపై చూపే ప్రభావాలను నిశితంగా గమనిస్తూ వాటిని సాహిత్యరూపంలో పాఠకులకు అందచేయవలసిన బృహత్తర బాధ్యత రచయితల మీద వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.