ఎచ్చమ్మ కతలు – పరిచయం – డా|| బండారి సుజాత

”శ్రీ” నీ తోడై వున్నా నిరాడంబర జీవితమే నిక్కమని నమ్మిన ఆదర్శమూర్తి
”మ”ణి మాణిక్యాల ‘మాండలీక’ భాషపై మక్కువ పెంచుకున్న మహిళామణి
”తి”రుమలరెడ్డి సాహచర్యంతో తిరుగులేని రచయిత్రిగా ఎదిగిన తెలంగాణ శిరోమణి”పా”కాల యశోదమ్మ పదబంధాలు, నుడికారాలు, జాతీయాలతో తెలంగాణ యాసలో రాసిన కథలు సొగసైన ఆణిముత్యాలు
”కా”లంతో మనమూ మారాలని తెలిపినా, కలకాలం తెలంగాణ భాషను నిలుపుకోవాలన్న సుకవి
వె”ల”లేని కథలల్లి, కవన పరిమళాలు అందించిన కవయిత్రి
”య”శ: చంద్రికలతో ‘ఎచ్చమ్మ’గా  నిలిచిన తెలంగాణ ఆడపడుచు
”శో”ధనలో, సాధనలో అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గాంచిన యశస్విని
”ధా”ర్మికమైన తెలంగాణ సంప్రదాయాలను, సంస్కృతిని దశదిశలా చాటిచెప్పిన గొప్ప వక్త
”రె”డ్డి గారి భార్యనని తెలుపక స్వయంకృషితో ఎదిగిన అమృతమూర్తి
ప్రాచీన సాహిత్యం, సంస్కృతాంధ్ర భాషలపై ఆధిపత్యం ఉన్నా అసలు కంటే
వ”డ్డి”నే ముద్దనే విధంగా తెలంగాణ కథన రీతికి ప్రతీకగా నిలచిన ప్రతినిధి మన ”ఎచ్చమ్మ”.

‘ఎచ్చమ్మ కతలు’ పుస్తకంలో తెలంగాణ మాండలీకంలో రాసిన 21 కథలున్నాయి. తన అనుభవాలను, బాల్య స్మృతులను ఎరిగిన సంఘటనను తీసుకొని కథలుగా రాశారు. సామెతలు, పదబంధాలు, జాతీయాలు, నుడికారాలతో సామాజిక రుగ్మతలను, కుటుంబంలో జరిగే అవకతవకలను గురించి తమ కథలలో తెలిపారు. ఇవి లేఖారూపంలో ఉన్నాయి.

‘మోనా’ కథలో ఆడపిల్ల పరిస్థితులు అనుకూలించక కుటుంబం నుండి బయటకు వస్తే కలిగే అనర్థాలను తెలుపుతుంది. అందుకు తెలిసీ తెలియని వయసులో కష్టాల పాలయ్యే ఆడపిల్లలు పరిసరాలను మనుష్యుల నడవడికను జాగ్రత్తగా గ్రహిస్తూ వచ్చే ఆపదలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఇతరులకు మన వంతు సహాయం చేయాలని తెలుపుతుంది.

‘ఆ రొండు నావి’ కథలో ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుంది పద్మిని. ఆమెను ప్రేమించిన విజయ్‌ తను వచ్చేవరకు ఎలమంద ద్వారా ఐలమ్మ పేరుతో తన ఇంటికే పంపిస్తాడు. ఇవేమీ తెలియని విజయ్‌ తండ్రి ఎలమంద మనవరాలే అనుకుని పద్మిని బరువు బాధ్యతలు నావి అంటాడు. ఆడపిల్ల గడప దాటితే వచ్చే అనర్థాలు అందరికీ తెలుసు. ఎవరి బిడ్డో తెలియకున్నా ఆమె బాధ్యత తీసుకొని కూతురిగా ఆదరించే మనుషులు కూడా సమాజంలో ఉంటారని ఈ కథ ద్వారా తెలియచేస్తుంది

‘దొరా! నన్ను అమ్ముకోకు’ కథలో సాఫీగా సాగే కుటుంబంలో ఏదో ఒక అనర్థం జరగక మానదు. మిత్రుడే ద్రోహం తలపెడుతున్నాడని తెలియని పరమేశంకు తన అభివృద్ధికి తోడ్పడే మిత్రుడంటే ఇష్టం ఏర్పడుతుంది. దినదినాభివృద్ధి చెందిన పరమేశం పనుల ఒత్తిడితో కుటుంబానికి దూరమవుతుంటాడు. వ్యసనాలకు బానిసవుతాడు. ఇది గమనించిన భార్య సీత తన ధర్మాన్ని నెరవేరుస్తూ పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తుంటుంది. పెద్ద కాంట్రాక్టుతో రోడ్లు, ఇతర పనులు చేయించిన పరమేశం మినిస్టర్‌తో ప్రారంభోత్సవం చేయిస్తాడు. పని పూర్తయిన తర్వాత చేదోడు వాదోడుగా  వున్న స్నేహితుడు కనపడడు. మళ్ళీ తన అభివృద్ధికి ఏదో ఒక పథకం ఆలోచిస్తున్నాడనుకొని, చాలా రోజులయింది భార్యతో కలిసి భోంచేసి అనుకొని ఇంటికి వెళ్తాడు. తన ఇంట్లో తన భార్యతో ‘నీకు దగ్గరవ్వాలనే, పరమేశానికి నేను లేందే గడవకుండ చేశానని, ఇదంతా నీ సుఖంకే’నంటూ చేయి పట్టుకోబోయిన అతన్ని విదిలించుకొని అప్పుడే వస్తున్న భర్త దగ్గరకు వెళ్తుంది. అభివృద్ధి కోసం స్నేహితుని మాటలతో పొలాలను అమ్మిన పరమేశంతో ‘దొరా నన్ను అమ్ముకోకు’ అంటుంది.

ఇల్లు, పిల్లలను మరచి డబ్బు సంపాదనలో మునిగే పురుషులకు ఈ కథ కనువిప్పు కలిగిస్తుంది. తమ వెంట వుంటూ ద్రోహం చేసే నమ్మక ద్రోహులను ఒక కంట కనిపెడుతూ వుండాలి. ఎంత మంచివారైనా ఎప్పుడో ఒకసారి చెడు చెదల పురుగులా చేరుతుందని, అటువంటి వాటిని గ్రహించి జాగ్రత్త పడాలని, భర్త చేసే ప్రతి పనికి గంగిరెద్దులా తల ఊపకుండా మంచి చెడులను తెలుసుకోవాలని ఈ కథ తెలియచేస్తుంది.

‘కోడలమ్మ ఎతలు’ కథలో కోడలు ఏ పనిచేసినా తప్పు పట్టే అత్తగారు, తప్పుపడుతున్న అత్తగారు తప్పని చెప్పిన పనిని సరిచేసినా కూడా అందులో మళ్ళీ తప్పు వెతికితే అత్తగారితో వేగలేకపోతున్నానని, ఇవేమీ భర్తకు చెప్పట్లేదని, భర్త మంచివాడు కనుక ఇవన్నీ భరిస్తున్నానని అనుకుంటుంది.

అత్త అనగానే అన్ని తప్పులు వెతకకుండా మంచి, చెడు ఆలోచించి చెప్పాలి, అదే స్థితిలో మన కూతురుంటే ఎలా మాట్లాడతామో అలా  వున్నప్పుడు ఏ గొడవలు రాకుండా  వుంటాయి. తాము చేసే తప్పులు కూడా తెలుసుకోవాలని, ఇతరుల తప్పులు వెతకడం సరికాదని, కుటుంబానికి ఇద్దరూ ముఖ్యమే కనుక పెద్దరికం నిలుపుకుంటూ ఇంటిని సరిదిద్దుకోవాలని కోడలమ్మ ఎతలు ద్వారా తెలుపుతుంది.

‘సీతమ్మ విలాయత్‌’లో  విదేశాలలో వున్న పిల్లల దగ్గరికి వెళ్ళడానికి, చూడటానికి తల్లిదండ్రులు పడే తపన కనిపిస్తుంది. వెళ్లడానికి ముందు వాళ్ళకు అవసరమయ్యే వస్తువులు, ఇతరులు తమ వాళ్ళకోసం ఇచ్చే వస్తువులు, వచ్చిపోయే జనాలతో మాట్లాడటం, విమాన ప్రయాణం గురించి వున్నది వున్నట్లుగా చెప్పేది ఈ కథ. విదేశాలలో వున్న పిల్లలను చూడాలనే ఆరాటం, వెళ్ళలేని అశక్తతతో, కలలోనే కన్నవాళ్ళకు చేరికయ్యే తల్లుల బాధ ఇందులో కనిపిస్తుంది.

‘మిఠాయి రాములు’లో మిఠాయిలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న రాములుకు సంతానం లేకపోవడంతో మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత ఇద్దరు భార్యలకు సంతానం కలుగుతుంది. అందరి అవసరాలు తీర్చి, పిల్లల పెళ్ళిళ్ళు చేసి కుటుంబాలకు కావలసిన  సౌకర్యాలు కల్పించేసరికి అతని సంపాదన కరిగిపోతుంది. వంతులవారీగా రాములు ఇద్దరి ఇళ్ళల్లో ఉంటుంటాడు. తమ వంతు కాని సమయంలో భర్తకు ఎవరూ అన్నం పెట్టరు. సంపాదన వున్నంతవరకే ఎవరైనా కనిపెట్టుకుని చూస్తారు. ఆదాయం లేకున్నా, ఆస్తి లేకున్నా ఎవరూ దగ్గరికి రానీయరు. అందుకే విలువలు పడిపోతున్న నేటి కాలంలో స్వార్థానికి బానిసవుతున్న మనుషుల ప్రవర్తన వల్ల కొంత ఆస్తిని ఎవరికీ చెందకుండా తమను కనిపెట్టుకుని చూసిన వారికి చెందుతుందని తెలిపే ప్రయత్నాలు జరగాలని ఈ కథలో తెలియజేస్తుంది.

‘సందె బిచ్చం తల్లి’ ఆస్తిపాస్తులున్నంతసేపు జల్సాగ ఖర్చుపెట్టి తాగుడుకు బానిసై తన ఇంటికే ముఖం కప్పుకొని అడుక్కోవడానికి వచ్చిన బాలయ్య కథ. భర్త నోటికి జడిసి అడిగినవన్నీ చేసిపెడుతూ, ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతుంటే బాధపడుతుంది కానీ ఎవరికీ చెప్పదు. చివరికి తన ఒంటిమీద నగలను అమ్మి భర్త  కోరిక తీర్చుతుంది. కానీ కోడలి ముందు ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన భర్తను తిడుతుంది. గుట్టు చప్పుడు కాకుండా ఎన్ని కష్టాలైనా భరించే స్త్రీల వ్యథ ఈ కథలో తెలుపుతుంది. భర్తకు ఇచ్చే విలువ ఇస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి స్త్రీలు ముందుకు రావాలని, లేకుంటే కష్టాలపాలవుతారని తెలియజేస్తుంది.

స్త్రీలు ఎదుర్కొనే కష్టనష్టాలను ఈ కథలలో తెలుపుతూ, అవసరానికి అనువైన ఆలోచన చేసి కుటుంబాలను స్త్రీలు కాపాడుకోవాలని,  కలలకంటే వాస్తవమే ముందు కనుక వ్యామోహాలు వీడి వాస్తవంలో బ్రతకాలంటూ, మనిషిని మనిషిగా ఆదరిస్తూ మంచి విలువలను కలిగి  వుండాలని, వ్యసనాలకు లోనైన వారిని మందలించి మంచి మార్గంలో పెట్టి కుటుంబాలను బాగుచేసు కోవాలని, మనుష్యులకు డబ్బు కాదు మానవ సంబంధాలే ముఖ్యమని ఈ కథల ద్వారా తెలుపుతుంది.

జమ్మి, పరుపుబండ, బుక్కిందే దక్కింది, పెద్దమఱ్ఱి మొదలైన కథలలో రాజకీయం, ఎన్నికల గురించే కాక నాయకులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఈ కథల ద్వారా తెలుస్తుంది.

మారుతున్న కాలంలో మారిన రాజకీయాలు, రిజర్వేషన్లతో వచ్చే నాయకులందరికీ నాయకత్వం అలవడదు. రిజర్వేషన్లవల్ల తమకు అనుకూలమైన వారిని నిలుపుకొని గెలిపించుకోవడం, పేరొకరిది, పనులు చేసేవారు ఒకరు. కుల, మత పట్టింపులు లేకుండా మసలుకోవాలని, రాజకీయ నాయకులు వచ్చిన సొమ్మంతా పంచుకుని ప్రజలకు హాని చేయవద్దని, వచ్చిన నిధులను సద్వినియోగం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలంటూ, ప్రజల కష్టాలు తీరుస్తూ మంచి నాయకత్వ లక్షణాలతో నిస్వార్థ సేవ చేయాలని తెలుపుతుంది.

‘నిశ్చితార్థం’ కథలో ప్రభ, ప్రసాద్‌లకు ఒకరంటే ఒకరికి ఇష్టం. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ప్రసాద్‌ తల్లిదండ్రులు ప్రభను చూసి నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందామని వస్తారు. అందమైన ప్రభను చూసిన ప్రసాద్‌ చెల్లెలు ఓర్వలేకోతుంది. ప్రభతో అందరూ పాతకాలం మనుషుల్లా ఉన్నారంటూ, చదువుకున్న నీవు కూడా మోడరన్‌గా లేవంటూ ఇష్టంలేని మాటలు మాట్లాడుతారు. ప్రభ బాధపడి తండ్రితో ఈ పెళ్ళి తనకిష్టం లేదంటుంది. ప్రసాద్‌ తల్లి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విషయం చెబుతాం అంటుంది. వచ్చినవాళ్ళకు మర్యాదలకు లోటులేకుండా చేసి పంపిస్తారు. విషయం తెలుసుకున్న ప్రసాద్‌ ఎవరికీ చెప్పకుండా ప్రభను పెళ్ళిచేసుకుని వస్తాడు. బాధపడుతున్న ప్రభ తల్లిదండ్రులతో అమ్మ, చెల్లికి ఏమీ తెలియదు, వాళ్ళ మాటలు పట్టించుకోకండని చెబుతాడు.

ఇష్టపడి పెళ్ళిచేసుకుందామనుకున్న వారి పెళ్ళి జరగకుండా ఏదో ఒక కారణంతో పెద్దలు ఆపడంతో వారి మనసులు గాయపడతాయి. పెద్దలు పెద్ద మనసు చేసుకుని పిల్లలను ఆశీర్వదించాలని ఈ కథ తెలియచేస్తుంది.

‘ఎదుర్కోళ్ళు’ పెళ్ళికి ముందు జరిగే తంతు ఇది. అమ్మాయి తరఫువారు అబ్బాయి తరఫువారిని పెళ్ళికి ఆహ్వానిస్తూ నోరు తీపి చేసుకుంటారు. వరసైన వారితో, వియ్యంకులు ఒకరికొకరు పరిహాసమాడుకుంటూ బంధుత్వాలను తెలుపుకుంటారు. పెళ్ళికి ముందు జరిగే తంతుతో కొత్త పరిచయాలు పెరిగి ఇంకొన్ని సంబంధాలు బలపడటానికి అవకాశముంటుంది.

‘సొమ్ము సోమందం’ నగలంటే, చీరలంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు ఉండేది కాదు. తల్లిదండ్రులు ఆడపిల్లలను తమకు ఉన్నంతలో ఆభరణాలు పెట్టి మంచి కుటుంబంలోకి పంపించేవారు. కష్టానికి, నష్టానికి ఆ సొమ్ములు వారికి బ్రతుకుతెరువు అయ్యేవి. అలా ఎచ్చమ్మ ఆనాటి నగలన్నింటిని పరిచయం చేస్తుంది. అవన్నీ దాదాపు ఈ రోజుల్లో ఆడపిల్లలకు అలంకరణ వస్తువులయ్యాయి.

ఈ కథలు తెలంగాణలో జరిగే పెళ్ళి విషయాలను తెలుపుతాయి. కుటుంబ సంబంధాలను నిలుపుకోవడానికి స్త్రీ, పురుషులు పాటుపడాలని, విలువలను కాపాడుకుంటూ జీవితాలను సరిదిద్దుకోవాలని తెలియజేస్తుంది. మన సంప్రదాయాలను మరువకుండా కాపాడుకోవాలని తెలంగాణ బిడ్డగా తెలుపుతుంది.

‘నా పైనాల (చిత్రం-1) నా తిరుగు పయినం (చిత్రం-2)’  కథలో రైలు ప్రయాణంలో జరిగిన విషయాలు తెలుపుతుంది. రైలులో బెర్తులు ఎలా వుంటాయి, టికెట్‌ కలెక్టర్‌ చేసే పని, అందరూ కలిసి ప్రయాణం చేసినంతసేపు ఏ విధంగా పలకరించుకుంటారో తెలుపుతూ కొందరు సంతోషంగా, కొందరు బాధగా ఉండే విషయా లను తెలుపుతుంది.

తిరుగు ప్రయాణంలో ఎచ్చమ్మ వున్న పెట్టెలోకి ఎక్కిన వాళ్ళు ఆడవాళ్ళు. వారి అందచందాలను, మర్యాదను, వ్యక్తిత్వాలను తెలియజేస్తుంది. పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు మారుతున్న కాలంలో మారే పిల్లల ప్రవర్తనను వారికి తెలిపి మంచి పౌరులుగా నిలబెట్టాలని తెలుపుతుంది.

‘మా ఊరి ముచ్చట్లు’ కథలో ఊరిలో జరిగిన విషయాలు తెలియజేస్తుంది. ఊరు చుట్టూ వున్న పచ్చటి పొలాల గురించి, బీరన్న దేవుడిని కొలిచే యాదవుల గురించి, పీరీల పండుగ, ఎల్లమ్మను పెట్టుకోవడం.. ఇలా జరిగే ఉత్సవాలలో స్త్రీలు, పురుషులు పాల్గొని సంతోషంగా గడుపుకుంటారని తెలియజేస్తుంది.

పెళ్ళి విషయాలు, కొమ్ము దాసర్లు ఇలా అందరూ వచ్చి వారి విన్యాసాలతో ఊరందరినీ సంతోషపెడతారని తెలియజేస్తుంది.

తాను చేసిన ప్రయాణంలో కలిగిన అనుభవాలు, పరిచయాలు, వ్యక్తిత్వాలను తెలియజేస్తుంది. రైలు గురించి వివరంగా రాస్తుంది. ఊర్లలో జరిగే మంచి చెడులను, ఊరి ట్టుబాట్లను, జీవన విధానం, వృత్తి పనుల వాళ్ళు చేసే వృత్తుల గురించి, కుల, మత బేధం లేకుండా చేసుకునే పండగల గురించి తెలియజేస్తుంది. ఆనాడున్న వీరందరూ ఈ రోజుల్లో వృత్తులను మరచి వివిధ పనులలో చేరడం మనకు తెలియజేస్తుంది.

నా పైనాల చిత్రం-1, 2, మా ఊరి ముచ్చట్లు 3, ఈ ఐదు కథలలో ప్రజల జీవన విధానం, భిన్నమైన మనుషుల ప్రవర్తన, పల్లెలో జీవించే ప్రజలు ఒకరికి ఒకరు తోడ్పడే విధానం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను తెలియజేశారు.

‘కాలం చెప్పిన తీర్పు’ కథలో తమకోసమే పనిచేసి చనిపోయిన ఎలమంద కొడుకును గోపాల్రావు చదివించాలని, కొడుకుతో పాటు చదివిస్తాడు. ఎలమంద భార్య భీమికి కొంత పొలం ఇస్తాడు. ఆ జాగలో ఇల్లు కట్టుకుని కూరగాయలు పండించుకుంటూ గోపాల్రావు ఇంట్లో పనిచేస్తుంటుంది ఎలమంద. గోపాల్రావు తదనంతరం అతని భార్య పాపమ్మకు అది నచ్చక భీమితో కొడుకును చదువు మాన్పించి పనిలో పెట్టమంటుంది లేదా భూమి వదిలి వెళ్ళిపొమ్మంటుంది. కాయకష్టం ఎక్కడైనా చేసి బ్రతుకుతానని చెప్పి భీమి వెళ్ళిపోతుంది.

గోపాల్రావు కొడుకు డబ్బు దుబారా చేస్తూ చదువు అబ్బక జల్సాగా తిరుగుతుంటాడు. భీమి కొడుకు డిప్యూటీ కలెక్టరై ఊరందరి మన్ననలు పొందుతాడు. చదువు ఎవరి సొంతం కాదు. దానికి కుల మతాల పట్టింపులు లేవు. కష్టపడి చదివిన భీమి కొడుకు ఉన్నత స్థానాన్ని పొంది తల్లిదండ్రుల పేరు నిలబెడతాడు. మనిషి స్వార్థంతో ఎవరికీ హాని చేయకూడదని, డబ్బుండగానే సరిపోదని ఆ డబ్బును సద్వినియోగం చేసే మంచి గుణం వుండాలని, ఇతరులకు సహాయపడాలని ఈ కథ ద్వారా తెలుపుతుంది.

‘తరాల నాటి తెగులు’ కథలో తాము కొత్తగా ట్టుకొన్న ఇల్లు ‘సుధర్మ’ చుట్టూ వున్న పరిసరాలను తెలియజేస్తుంది. నగర జీవితంలో రాత్రింబవళ్ళు రణగొణ ధ్వనులేనని, మారుతున్న కాలంలోని ప్రజల మార్పును, వివిధ రకాలుగా జీవించే మానవ జీవిత విధానాన్ని తెలియజేస్తుంది. చెత్త ఏరే పిల్లలు, దేవుడి పటాలను పెట్టుకుని అడుక్కునే పిల్లలు.. ఇలా అనేకానేకాలుగా తిరిగే వీథి బాలల దైన్యాన్ని తెలియజేస్తూ బాధపడుతుంది. ఇలాంటి దైన్యస్థితిలో వున్న పిల్లలను కాపాడుకోవాలని, వారి జీవితాలు బాగుచేయడానికి ప్రయత్నం చేయాలనేది ఆమె అభిమతం.

ఇలా ఒక్కొక్క  కథలో ఒక్కో విషయాన్ని ఎత్తిచూపుతూ, తెలియచేసే తప్పులను సరిదిద్దుకోవాలని, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాలని, మరుగున పడుతున్న మన భాష, యాసలకు మనం ఊపిరి పోయాలని, సమాజంలో జరిగే మంచి, చెడులను మానవత్వంతో ఆలోచించి మనకు తోచిన సహాయం చేసి ఆదుకోవాలని తెలుపుతుంది. మనకు తెలియని మన తెలుగు పదాలను ఏర్చి కూర్చి రాసినవి ఎచ్చమ్మ కథలు.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.