నీవేమో!
ప్రకృతిలో జీవిస్తానంటావ్
ప్రేమ కోసం పరుగెడుతావ్
పడుతూ లేచైనా దక్కించుకుంటావ్
వేదన పడ్తావ్… వాదిస్తావ్
బెదిరించైనా సాధించాలనుకుంటావ్
దక్కితే సంతోషిస్తావ్
లేకుంటే విరాగివైపోతావ్
చివరికి నిన్ను నీవు వదలుకొని
ఏకాంతాన్ని కోరుకుంటావ్
లేదంటే…కాలానికి అతీతంగా
రాజీపడుతూ నడుస్తావ్!
నేనేమో!
మనుషులను ప్రేమిస్తాను
మట్టిని లాలిస్తాను
ప్రకృతిగా కరుణిస్తాను
చైతన్యమై జీవిస్తాను
ప్రేమను అనునయిస్తాను
మనోవికారాన్ని దుయ్యబడ్తాను
అమానవీయతను ప్రతిఘటిస్తాను
అవసరమైతే జ్వలిస్తాను
కాదనుకుంటే విముక్తమౌతాను
నీకూ నాకూ ఎప్పుడూ
అసమాన సందిగ్ధాలే!
నీవూ… నేను ఎప్పటికీ
కలవని సమాంతరాలమే!
మన మధ్య ఉన్నదంతా
జాతి వైరుధ్యాల ప్రవాహాలే!
నువ్వు గుడికట్టి పూజిస్తావ్
పూజారివై బంధించాలని చూస్తావ్
నేను గుడిలో కొలువు ఉండలేను
దేవతగా కరుణ చూపలేను
సముద్రం ఆకాశాన్ని తాకటం భ్రమే!
నేల నింగిని చుట్టటం పరిభ్రమణమే!
ఉత్తర దక్షిణాలు ఎప్పటికీ కలవవు
కలవని భావాలు ఎన్నటికీ మనలేవు
అందుకే!
నువ్వు వేరు!… నేనూ వేరే!
జీవితం జీవించటానికి మాత్రమే!
స్నేహం శ్వాసించటానికి మాత్రమే!
బలవంతంగా ఎవరిలోకి చొచ్చుకొని పోలేం!
మనసును భంగపర్చి పరుగెత్తలేం!
ఎందుకంటే!
నేను నేనే!… నువ్వు నీవే!
మనమెప్పుడూ సమాంతర రేకలమే!
ఒకరు పెట్టుబడి మరొకరు ఉత్పత్తి!
నీది వ్యాపారం నాది సహవాసం!
నేను సహచరిణిని నీవు మనువాదివి!