నిశ్శబ్దపు నిశీథిలో నక్షత్రాలు మౌనంగా నాకు తోడైన వేళ…
నిశ్చలమైన నదిపై చంద్రవంక వెన్నెలను అలంకరించిన వేళ…
నడి రాతిరి… అదృశ్యమైన నన్ను నేను వెతుక్కుంటున్నా….!
చిరు సవ్వడి చేసే అలల గలగలలో…
చిరుగాలి వీచే ఆకుల కదలికలో…
అనంతంగా పరుచుకున్న చీకటిలో… ఎక్కడున్నానో….!
నా ఉనికి ప్రశ్నగా మారి… అస్థిత్వం అర్థం కోల్పోయి…
విలువలన్నీ అసందర్భమై… నమ్మకాల ఊపిరి ఆగిపోయి…
శాస్త్రీయత శాంతిగా వెనకడుగు వేసినపుడు…
నాకోసం నేను… నాలోకి నేను…
ఎంత వెతికినా… కన్పించనేం…?
నిరంతరం మెప్పించాలనో… ఒప్పించాలనో…
నన్ను నేను సరిదిద్దుకునే భార్యగా…
ఒక్క కన్నీటి చుక్క రాలనీయక…. కాపాడుకుంటూ కలవరిస్తూ… అమ్మలా…
కష్టంలో…. కన్నీళ్ళలో పాలుపంచుకుంటూ కూతురిలా…
ఎవరినీ నొప్పించలేని ప్రయత్నంలో…. ఒప్పించలేక గాయపడినా… బాధపడినా
అనుబంధాలను గౌరవిస్తూ… కోడలిగా…
ఎంత ఒత్తిడిలోనూ… బాధ్యతను మర్చిపోని ఉద్యోగిగా…
స్నేహమిచ్చే ఓదార్పులో సంతోషాన్ని వెతుక్కునే స్నేహిగా…
ఎక్కడున్నాను నేను…?
స్వచ్ఛంగా… స్వేచ్ఛంగా… ఒక కమ్మని పాటలా…
అపురూపంగా… అందంగా… మౌనంగా… శాంతిగా…
ఎక్కడున్నానో… నేనెక్కడున్నానో…?….!