కోనసీమలో కొబ్బరాకులా
మండుటెండలో చల్లటి చెట్టునీడలా
జీవితానికి రూపునిచ్చే బ్రతుకు చిత్రంలా
నాకై పుట్టిన నీవు…
అరటి ఆకులో ఒడ్డించిన
సద్దిబువ్వతో కడుపు నింపుకొని
పొద్దున్నే పలకరించే ఈ మన్నుతో,
ఆ ఆకాశంతో ఎనలేని బంధం ఏర్పరచుకుని
తనివితీరా ప్రకృతితో స్నేహం చేస్తూ పొలంగట్టుని ముద్దాడి,
గుప్పెడు గుండెకు జీవనదిగా మారే గంగమ్మ కోసం తపిస్తూ…
మురిపెంగా తాకే మట్టిలో
అడుగులో అడుగు కలిపి,
పాటలో పాటగా మారి,
రెప్పల వాకిలిలో అందమైన రంగవల్లికను సింగారించి…
నడినెత్తిని తాకే మండుటెండకు
తడిసిన చెమటబిందువును ప్రేమగా అర్పించి
మనదయ్యే రేపటికోసం
చిన్ని ఆశతో పొలంగట్టునే
అంపశయ్యగా మార్చుకొని
కిలకిలా రావాల పక్షులతో
బాసల ఊసుల స్నేహం చేస్తూ
జీవితాంత అభిమానిలా నన్ను నీలో నింపుకొని
నా.. నీ అనే తరతమ భేదం లేకుండా
చెదరని చిరునవ్వుతో నా పేగుబంధం అవుతావు
ఇంత చేస్తున్న నీ కోసం
నేనేం చేస్తున్నాననే ఓ ప్రశ్న నన్ను పలకరించింది
నీ కోసం నిలిచే బాసటనవ్వాలనిపించింది…
నీ కన్నీరు తుడిచే ఆత్మీయ స్నేహమవ్వాలనిపించింది
నీకై నేనూ వున్నాను మిత్రమా…
కుమిలిపోయే కష్టాల కడలి నీకు లేదు నేస్తమా…
…చాల చక్కని పోయెమ్…