”ఎన్ని హత్యలు ఈ నేలలో
ఎన్ని రక్తపుటేర్లు ఈ ప్రవాహాలలో
ఎన్ని సజీవ సమాధులు ఈ నేల గుండెలో
ఎన్ని నడిచే శవాల తరాలు
ఈ జాతి చరిత్రలో
ఛీ… ఇది… బ్రతుకా..?
…ఇది…మనిషితనమా…?
…ఇది…స్వతంత్ర దేశమా…?”
దిక్కులు పిక్కటిల్లేలా
భరతమాత ప్రశ్నిస్తోంది
కర్తవ్యాన్ని అరిచి అరిచి చెప్తోంది
రోషంలేని తన పిల్లల్ని చూసి
సిగ్గుపడుతున్నానంటోంది…
తమ్ముడూ, చెల్లీ, దీనికి
ఒక్కటే కారణం…
నీ వెలుగులను దోచుకున్న దొంగ
నిన్ను చీకటి గుయ్యారాల్లో బంధిస్తే
ఆ చీకట్లను చీల్చి చెండాడక పోవడం
నీ నేరం!
మనువు అనే పరాన్నభుక్కు
నీ శ్రమను తరతరాలు
ఉచితంగా దోచుకునేందుకు
పన్నిన కుటిల కుట్ర
నాల్గుగోడల కులాన్ని
దానికి కాపలాగా పెట్టిన మతాన్ని
వాటిచుట్టూ అల్లిన
ఎన్నెన్నో… అసంబద్ధ అబద్ధాల
చిత్ర విచిత్రాల కల్పనలను
యాత్రా కాలక్షేప కథలను
అంబేద్కరు సూర్యుడు ఏనాడో
కాల్చి… బూడిద చేశాడే…
ఆ బూడిదనే నెత్తిన మోయడం
మహా నేరం!
ఆ కిరణాల దారుల్లో పరుగెత్తకపోవడం
నీ మరో… నేరం!
ఆరోగ్యవంతమైన పోటీకి
నిలువలేని పిరికితనంతో కదూ
వాడు నిచ్చెనమెట్లను కల్పించుకున్నాడు
పైమెట్టునే స్థిరాస్థి చేసుకున్నాడు
అయినా… నువ్వంటే గుండెల్లో
భయ ప్రకంపనలే
నీ చూపు మీద నిఘా…
నీ మాట మీద నిఘా…
నీ ప్రతి అడుగు మీదా… నిఘా
ఆ అడుగు తన గుండెల మీదే
అన్నంత ఉలికిపాటే!
తన బ్రతుకు నీకు పట్టనే పట్టదు…
అది నీ మీద కుట్ర అయినా…
కాని, వాడి చూపులు నిను వెన్నంటే…
ఏమో.. అందనంత ఎత్తు ఎక్కేస్తావేమో
చుట్టూ ఎన్ని అగ్నిగుండాలు మండించినా!
నువ్వు… నువ్వుగా ఉన్నా భయమే
నువ్వు… అక్షరాలతో చెలిమి చేసినా భయమే
… సత్యంతో ప్రయోగం చేసినా భయమే
నువ్వు… ఖురానును హత్తుకున్నా భయమే
నువ్వు… సిలువను మోసినా భయమే
నువ్వు… డాక్టరువో యాక్టరువో
లాయరువో లీడరువో… ఏమైనా భయమే
ఏమీ…కాకున్నా…భయమే…!
భయమే… వాణ్ణి … బందీని చేసింది
నిన్ను కూడా..బానిసను చేయించింది!
… ఒక్కడుగా నువ్వుంటే
చిక్కవు వాడికని రెక్కలు విరిచాడు
ముక్కలు చేశాడు
నాలుగు ఎద్దుల ఐక్యతను చీల్చి
దొంగదెబ్బతో నంజుకు తిన్న… నక్కజిత్తులకు
బలైపోయావు… అమాయకంగా!
ఆమె ఆత్మబలం ముందు
తన అంగబలం ఓడిపోక తప్పదనే
జన్మనిచ్చిన అమ్మను
తోడై నిలిచిన అర్ధాంగిని
నాలుగ్గోడల మధ్య బందీలను చేశాడు
శస్తే స్వాతంత్య్రమన్నాడు!
అందరి నోళ్ళూ కళ్ళూ గంతలు కట్టి
దేశసంపదంతా… వేలవత్సరాలు
తనకే రిజర్వేషన్ (రిజర్వుడు) అన్నాడు
తానే దైవం… తన వాక్కే వేదం అంటూ
మూఢనమ్మకాల మూర్ఖత్వాలను … దేశానికి
చరాస్థిగా చేశాడు
ఎగువ నీళ్ళు తాగుతూ
దిగువ… ఎక్కడో… బిక్కుబిక్కుమంటూ
నిలిచిన మేకపైకి లంఘించి
‘నా నీళ్ళు ఎంగిలి చేస్తావా?’
అన్న తోడేలు కుట్ర… కనువిప్పు చేయాలి…
నేస్తం రోహితు మరణం…జాతిని మేల్కోల్పాలి…
ఇక్కడ… ఆత్మహత్యలన్నీ హత్యలే, తమ్ముడూ,
ఎదలో ఊపిరాడని బానిసత్వం…
బానిసత్వం… శవసమానం
దేశాన్ని శవాల గుట్టగా చేసిన
గతకాలానికి… తక్షణం… ముగింపు పలుకు
స్వేచ్ఛకు…ఇప్పుడే స్వాగతం పలుకు…
ఇప్పుడే…సమాధిని చీల్చుకుని
బయటికి…రా –
చావుకు మరణం…పునరుద్ధానంలోనే…!
భయం గుప్పిట బందీ అయి
జ్యేష్టత్వాన్ని దొంగిలించి…ఆపాదించుకున్న
అంత్యజుడు…తక్షణం…భయశూన్యుడు కావాలి
నక్కజిత్తులకు తోడేళ్ళ కుట్రలకు
వీడ్కోలు పలకాలి…విముక్తుడవ్వాలి
అప్పుడే వాడు…మనిషిగా…స్వేచ్ఛాజీవిగా…
కొత్తగా జీవిస్తాడు…పసిపాపగా…
హాయిగా నవ్వుతాడు…మనుషుల్లో
ఒకటవుతాడు
అప్పుడు మాత్రమే…వాడి గుండెల్లో
మమత సమత ప్రేమ త్యాగం మొలకెత్తుతాయి
అప్పుడే…ఈ నేలలో…న్యాయం ప్రాణంపోసుకుని
నిటారుగా నిలబడుతుంది…
హక్కులు ఆనందంగా
స్వేచ్ఛాగీతాన్ని శ్రుతిచేస్తాయి…
ప్రపంచం ముంగిట మన దేశం
ఆత్మ గౌరవంతో తలఎత్తుతుంది…
కులమత శృంఖలాలు తెంచుకున్న
భారతదేశంగా…స్వేచ్ఛా శిఖరంపై…
అప్పుడే…ఔను, అప్పుడే…
భారతమాత కన్నీరు తుడిచే
సమానతా సూర్యుడు…నీతి సూర్యుడై
ఉదయిస్తాడు..!!