రోహిత్‌ ఇప్పుడు రెక్క విప్పిన ఉప్పెన!- అఫ్సర్‌

బహుశా ఒక లాటిన్‌ అమెరికా కవో, ఇంకో ఆఫ్రికన్‌ కవో, మరింకో ఇరాక్‌ కవో, మనదాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం ఊహించినట్టే Roque Dalton లాటిన్‌ అమెరికన్‌ కవి. ఇవాళ రోహిత్‌ గురించి వెల్లువైన యీ కవిత్వ ఉప్పెన మధ్య నిలబడితే, నన్ను Roque Dalton ఆవహిస్తున్నాడు. విప్లవోద్యమ రణక్షేత్రం మధ్యలో నాలుగు పదుల వయసులో రాజ్యానుకూల శత్రువుల చేతుల్లో దారుణ హత్యకి గురైన వాడు Roque Dalton.

మనం ఇప్పుడు తలచుకుంటున్న రోహిత్‌ అతనిలాంటి కవి కాకపోవచ్చు. కాని-అందమైన కల చూస్తూ చూస్తూ బలవంతాన కళ్ళు మూసుకున్న స్వాప్నికుడు. ప్రతి స్వాప్నికుడూ తనదైన ఒక కవిత్వ సీమలో జీవిస్తూ ఉంటాడు. ప్రతి మాటా, ప్రతి చర్యా కవిత్వ ఉద్విగ్నంగా బతుకుతాడు.

కవిత్వ భాషలో చెప్పాలంటే-ఈ లాటిన్‌ అమెరికన్‌ కవి అన్నట్లు-  solid words లో యీ కాలపు ఉద్యమకారుడూ, ఉద్యమ కవీ బతుకుతాడు. మాటలు సర్రుసర్రున జారిపోతున్న విషసర్పాలు మాత్రమే అవుతున్నప్పుడు, చలిచీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి! లేని నిశ్శబ్దాన్ని ఊహించుకొని, లోపలి labyrinth  అడవుల్లో తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్‌ మీడియాల మాయలో భాష స్పృహ తప్పిన అకాలం, విపరీత బలవంతపు ”ఇష్టాల”, ఇచ్చిపుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం. ఇది కవులమీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న ఒకటికి పదిసార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట.

ఇదిగో-యీ కృత్రిమ తగరపు మెరపుల మధ్య రోహిత్‌ నిష్క్రమణ ఒక విస్ఫోటనం!

రోహిత్‌ ఇప్పుడు ఒక phenomenon. రోజూ చస్తూ బతికే రొటీన్‌ గుండెల మీద పిడుగుపాటు లాంటి phenomenon. దీనికి ఒక కులమో యింకో మతమో అక్కర్లేదు. మన ఉనికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే ఒక erasure గా మార్చుకున్నాడు రోహిత్‌. ఇలా అనడం అంటే అతని మరణాన్ని కీర్తించడం కాదు. ఒక అధ్యాపకుడిగా నేను అలా నా విద్యార్థిని చూడలేను, లేదూ ఒక స్నేహితుడిగా అతని చివరి చర్యని యెట్లా అయినా సమర్థించే పని చేయలేను, లేదూ ఒక

ఉద్యమ ప్రేమికుడిగా అతని ఆ చివరి నిర్ణయంలో కారణాన్ని వెతకలేను. కాని, ఎన్నింటికి కారణాలు వెతికే శక్తి మనలో వుంది?!

ఈ పుస్తకంలోని కవితల్లో కవులు ఏకరువు పెట్టిన అనేక ”ఎందుకు”ల వరస క్రమం ఇదీ:
”ఎందుకో ఏకాగ్రత శిబిరాలు అని పిలవరుగానీ
మన పెరట్లో పూసిన భావజాల పువ్వులే వధ్యశిలమీద రాలిపోతుంటాయి” (విల్సన్‌ సుధాకర్‌)
”ఏందోగాని అబయా! / మన పాలిటనే ఫిర్యాదులన్నీ ఫిరంగులౌతయ్‌
ఉత్తరాలన్నీ ఉత్తరించే కత్తులౌతయ్‌ / వివక్షరాలే వెలివాడలూ, ఉరితాడులూ
ఇనుప గోరీలుగా మారిపోతయ్‌” (కృపాకర్‌)
”ఎందుకనుకున్నావ్‌? నీ రాజీనామా తర్వాత నువ్వుండవని”! (మిథిల్‌)
ఇలా ఇంకా కొన్ని ఎందుకు అన్న శోధనలన్నీ వెతకవచ్చు.
ఇలాంటివి జరిగినప్పుడు శుభ్ర స్థిమితంగా, శుద్ధ నిబద్ధంగా కవిత్వం రాయాలనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఆదర్శంగా నిలబెట్టుకున్న స్థిమిత సందర్భం ఇది కాబట్టి! కళ్ళముందు కదులుతున్న వాస్తవికత వాళ్ళని కలవరపరుస్తుందో లేదో కానీ, అది వాళ్ళ కవిత్వంలో మాత్రం ప్రతిఫలించదు. కవిత్వ స్వచ్ఛ స్ఫటికత గురించి ముందే ఏర్పరచుకున్న నిర్వచన నియమాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. ”ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిర్వచన నియమాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. ”ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిష్ఫల యాగమైపోతుంది. ఈ సంకలనంలో పలకరిస్తున్న కవులకి అలాంటి సంశయాలే లేవు, తాము రాస్తున్నది కవిత్వమేనా కాదా అన్న విచికిత్సా లేదు. కళ్ళముందు జరిగిన ఒక దారుణానికి వాళ్ళ ముఖాల్లోకి పొంగిన నెత్తుటి యేరుని దాచుకోకుండా దాన్ని వాక్యాలలోకి మళ్ళించే restless ప్రయత్నం వీళ్ళది.

అసలు ఇంత restlessness-అశాంతి-అనేది వుందా అని naive గా అడిగేవాళ్ళని ఏమీ అనలేం, జాలి పడడం తప్ప! కాసిని పూలూ, రెమ్మలూ, ఆకాశాలూ, పచ్చని నేలా, ఊరికే సోమరిగా తిరిగే మబ్బు తునకలే కవిత్వం అనుకుంటే చేయగలిగేదీ లేదు. అంతకంటే ముఖ్యంగా ఏదో అంటీ ముంటనట్టుగా నాలుగు వాక్యాలు ”శుద్ధం”గా రాసుకుని, జీవితం ఎంత హాయిగా ఉందీ అనుకునే మాయదనమూ ఉంది. కాసేపు ఏ యోగినో, మహర్షినో తలచుకొని, కళ్ళు మూసుకునే అంతర్జాల మార్జాల కవులూ ఉన్నారు. నిజానికి వీళ్ళ లౌకిక జీవితం మూడు సత్కారాలూ ఆరు అవార్డులుగా వర్థిల్లుతూ ఉంటుంది. వీళ్ళ చుట్టూ కవి సమూహాలు మోకరిల్లి ఉంటాయి. ఒక అబద్ధాన్ని శుద్ధ కవిత్వంగా మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని రోహిత్‌ చాలా ఇబ్బందిలో పెట్టాడు.

హెచ్చార్కె అన్నట్టు:

బుద్ధి కేంద్రాలలో కాదు, ఆత్మ క్షేత్రాలలో పోరు / తప్పుడు తర్కాలు, వంచన వ్యూహాలు చాలవు         మనస్సులే ఆయుధాలు. ఒకడు నిలబడింది / ఫెన్సింగ్‌కి ఎటువైపని కాదు, వాడి రొమ్ముల్లో ఏమైనా కొట్టుకుంటూ వుంటే అది నీ పక్షాననే / అవుతుంది, లేదా వాడొక నడుస్తున్న శవమని రుజువవుతుంది

ఇవాళ్టి ఉద్యమ జీవుల కంటే కూడా సాహిత్య జీవులకి ఇలాంటి ”తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్‌ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్‌ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు. మనకి తెలియకుండానే పాత సాహిత్య వాదాలన్నీ మళ్ళీ కొత్త చొక్కా వేసుకొని వస్తున్నాయి. అందులో ఒకటి: సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే అన్నది! సాహిత్యానికి సామాజిక సందర్భం ఉందనడం వీళ్ళ దృష్టిలో విపరీత వాదం అవుతోంది. అలాంటివాళ్ళకు రోహిత్‌ లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా, లేదా, ఎంతమంది అన్యాయంగా చనిపోతూ ఉన్నా మనసు చలించదు. లేకపోగా, వెంటనే వాళ్ళు చాలా సుఖంగా సాహిత్య శుభ్ర యాగంలో తలమునకలై పోతారు.

ఈ బాధల సందర్భంలో ఇలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం ఉందనే తూనికలూ, కొలతలూ అక్కర్లేదు. ఈ బాధలో ఎంత నిజాయితీ ఉందన్నదే ముఖ్యం. ఇందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం ఎంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గర సమాధానం లేదు, క్షోభిస్తూ వుంటే వాటినలా చూసి జాలిపడడం తప్ప!

సుబ్బాచారి అన్నట్టు:
ఇక్కడ ఒక జింక కూలిపోతే మాత్రం / చుట్టూ ఉన్న జింకలు కొద్దిగానే ఉన్నాయి
కానీ అక్కడ పులులు, సింహాలదే పెద్ద సంఖ్య
సహానుభూతి అనేది కవిత్వ లక్షణం కాకుండా పోతున్న సందర్భం ఇది. సహానుభూతికి బదులు సాహిత్య రాజకీయాలు పెత్తనం చేస్తున్న సందర్భం కూడా-సహానుభూతిని వ్యక్తం చేయడానికి అర్హతల్ని, ప్రవేశ రుసుముల్ని నిర్ణయించిపెట్టిన కాలం ఇది. కొంతమంది మాత్రమే కొన్నిటి గురించి మాట్లాడాలి అన్నది ఇందులో ఒకటి. ఈ గిరిగీసిన వాళ్ళు కూడా శుద్ధ సాహిత్య వాదులే. మళ్ళీ అదే గిరుల మధ్య మనం విలువల్ని ఉరేస్తున్నాం. యిన్ని చర్చలూ ఉద్యమ సాహిత్య అనుభవాల తరువాత కూడా! కొత్త ప్రశ్నల్ని కొత్తగా తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఉత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని ఇప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది నా మటుకు నాకు!

అరుణ్‌ బవేరా అన్నట్టు:
తప్పు చేయనివాడికే కాదు… / చెమ్మగిల్లని వాడినీ గురి చూద్దాం
అక్కడ ఈ వాక్యాన్ని ఉరి తీద్దాం…
కవిత్వ నరాల్లో నెత్తురు ఎక్కించాల్సిన కాలం మళ్ళీ వచ్చింది. వాక్యాలకు వాక్యాలనే తిరగ రాసుకోవాల్సిన కాలమిది. రోహిత్‌ మరణం అలాంటి కొత్త కాలానికి ఒక ప్రవేశద్వారం. ఈ సంకలనంలో అనేక కవితల్ని అనేక ధోరణులకు ప్రతిరూపంగా ఉదహరించుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతి కవినీ ఆత్మీయంగా పలకరించి, ఆ వాక్యాల్ని మళ్ళీ వినిపించమని పదే పదే వినవచ్చు. ఆ వాక్యాల లోతుల్లో ఆరిపోని నిప్పు సెగల్ని తాకి రావచ్చు.

ఇది రోహిత్‌ సందర్భం కాబట్టి, ఈ మరణం నన్నింకా కలవరపెట్టే చేదు పీడకలగానే ఉంది కాబట్టి – అతనిలాంటి మరణాన్ని అనుభవించిన Roque Dalton వాక్యాలతోనే ముగిస్తాను.
The dead are getting more restless each day.
Butnot anymore
the dead
have changed.
They get all ironic
they ask questions.
It seems to me they’ve started to realise
they’re becoming the majority!
(A Warrior’s Resting Place)

రోహిత్‌ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు. కానీ, అనేకమంది రోహిత్‌లు మనలో ఉన్నారు. వాళ్ళందరిలోనూ నిర్జీవ రక్తం గడ్డకట్టక ముందే మనం పలకరిద్దాం. ఆ పలకరింతల్లోంచి కొత్త వాక్యాలు రాద్దాం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.