ఎవరూ లేని
ఈ నిశ్శబ్ద వొంటరి రాత్రిలో
ఎక్కడ నుంచో
ఒక పిట్టకూత వినిపిస్తుంది
ఏ అరణ్యంలోనో
ఆకు పచ్చని చెట్ల మీదో
గాఢంగా
దట్టంగా
కురిసిన చీకటి –
యిప్పుడీ రాత్రి సెలయేరు ఒడ్డున
కలత కళ్ళు తెరచుకుని
దు:ఖపు కలలను
నెమరువేసుకుంటున్నందుకు-
ఊరడింపుకైనా
ఈ కాసింత పిలుపును వినిపిస్తుంది
పిట్ట
నిద్రలేక అరుస్తుందో
నిద్రని దూరం చేసుకుని
నాలాగే
చీకటిని ప్రేమిస్తూ
అరుస్తుందో
తెలుసుకోలేని అసమర్ధుణ్ణి కాను
తెల్లార్లూ
పిట్టకూతే వినిపిస్తుంది
బాధలాంటి ఉదయం
మళ్ళీ
నిన్నటిలాగే ఎదురౌతుంది
నెమ్మది నెమ్మదిగా
ఉన్న ఒకేఒక్క తోడు దూరమైపోతుంది
దిగులు ఆవరిస్తుంది
పిట్ట ఎటెగిరిపోతుందో!
నిశ్శబ్దమంత
నిరాకారమైంది
ఏదీ లేదనిపిస్తుంది
రేపటిని
రేపటిలాంటి నిశ్శబ్దాన్ని
ఛేదించడమెలాగో!