కొండేపూడి నిర్మల
మొన్న మా తమ్ముడి కూతురు కరుణశ్రీ ఫోన్ చేసింది తన సహ ఉద్యోగితో ప్రేమలో పడిందట. ముందు స్నేహమే అనుకున్నారట,కానీ ఎందుకో…అలా జరిగిపోయిందిట. ఇప్పుడు ఇంక ఒక్క రోజు కూడా అతన్ని చూడకుండా తను ఉండలేకపోతుందిట. అతనైతే వీకెండు సెలవులో అయినా సరే ఎక్కడికో అక్కడికి వచ్చి ఒక్కసారి కనిపించమంటాడట? పరిచయమై ఆర్నెల్లే అయినాగాని అదేమిటో ఆరు జన్మలనుంచి తెలుసున్నట్టుగా వుందట. భావోద్వేగంలో వున్నట్టుంది. అన్నీ తనే చెప్పేస్తోంది. ఇందులో ఆ పాత్ర ఏమిటి ఆలోచించే లోపు, అప్పుడు అంది.
”నువ్వు చాలా లిబరల్ కదా(?) అంటీ, అందుకని ముందుగా నీకు చెబు తున్నాను…” (?)
”మొత్తానికి సపులో పడ్డావన్న మాట..?” (చెత్త ప్రశ్న వేశాను – నేను అడగాల్సింది అది కాదు)
”సూపు లెదు పప్పుచారు లెదు, పెప్సీకోక్ అను…” అ౦టు నవ్వింది. నాకు నవ్వు రాలేదు. తన నవ్వు వి౦టూ, టీవీలో కత్తి పోటు ప్రేమ వార్త చూస్తున్నాను.
”నేను లిబరల్‌గా వుంటానని నువ్వు ఎందుకు అనుకున్నావు. అంటే ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నావా..దొంగా?” అడిగాను. సాధ్యమయినంత మృదువుగా.
”అవును ఆంటీ…సరళ అక్కకి నువ్వే రాయబారం నడిపావు. వెహన్ మామయ్య తరఫున నువ్వే పోట్లాడావు. ఎందురింటి మేరీ అక్కకి, నజీం భయ్యకి నువ్వే రిజిస్టరు ఆఫీసులో సంతకం చేశావు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తావని తెలుసు” (పర్లేేదు నా మేనకోడలు చాలా సమాచారం సేకరించింది).
”అవును కరుణా చేశాను. ఇద్దరిలో ప్రేమ వుంటే అది ప్రకటించడానికి సందేహిస్తున్న చోట, ఆ మూగ ప్రేమకి సపోర్టు చేశాను. ప్రేమించిన ప్రియురాలి కోసం త్యాగం చేసిన ప్రేమ నాకు తెలుసు. ప్రియురాలి భర్తకి నేత్రాలిచ్చిన ప్రేమ నాకు తెలుసు.. ప్రేమించిన వాడి కోసం సింహద్వారం బద్దలు కొట్టుకుని వచ్చిన దేవదాసు, పార్వతి ప్రేమ నాకు తెలుసు. ప్రేమించిన వాడితో వివాహం కాకపోయినా జీవితాంతం స్నేహంగా వున్న వాస్తవాలు నాకు తెలుసు. మనుషులుగా మనం అంతా ప్రేమని పంచాలి. ప్రేమించబడాలి. మరి నీదెలాంటి ప్రేమ…?” అడిగాను.
”చెబుతున్నా కదా అంటీ, మాది రియల్ లవ్.”
”రియల్ లవ్ అంటే ఏమిటి?”
అంటే..ఒకరికోసం ఒకరు..ఊ బిలీవ్ చేస్తూ…అంటే లైట్ తీసుకోకుండా.. సిన్సియర్‌గా…అతను కాకుండా ఇంకొక ఎక్స్, వై, జడ్‌తో బతకలేకపోవడం…ఐ నీడ్ ఫుల్ సపోర్టు ఇన్ మై కెరీర్ అండ్ ఫ్యామిలీ లైఫ్- అన్నమాట…”
(ఏ భాషలోన, ఒక్క వాక్యం పూర్తి చెయ్యలేకపోయినా ఫర్వాలేదు. కనీసం అంచనా సవ్యంగా వుందో లేదో అని నా ఆందోళన, అదే అడిగాను)
”కెరీర్ కోసమే అయితే, అమ్మనాన్న మాత్రం నీ కోసం తపించడం లేదా, అది ప్రేమ కాదా…?” అడిగాను.
”అది వేరు- ఇది వేరు ఆంటీ, వాళ్ళు ఎంతకాలం అని నా కోసం స్ట్రెయిన్ అవుతారు. ఎప్పుడో ఎవరో ఒకర్ని ఫిక్స్ చేస్తారు కదా, ఆ పని నేనే చేస్తాను తప్పేమిటీ..?”
”ఔను ఎంత మాత్రం తప్పు లేదు. కానీ ఒక్క ప్రశ్న అతన్ని అడిగి చూడు.”
”ఏమని ..పెళ్ళి చేసుకుంటావా… పారిపోతావా…అనా..” గోల గోలగా నవ్వింది.
నవ్వు పూర్తయ్యేదాకా ఆగి అప్పుడు చెప్పాను.
”అడిగి చూడు కరుణా, పెళ్ళికి ఒప్పుకోకపోతే అతని రియక్షను ఏమిటి అడిగిచూడు…”
”అయ్యె ఎందుకలా…”
”ఔను అలాగే అడుగు.నిన్ను పెళ్ళి చేసుకోను. స్నేహంగా వుంటాను. జీవితాంతం ఒక మంచి స్నేహితుడిగా వుంటావా అని అడుగు.”
”అదేమిటి నువ్వు ఉల్టాగా ొమాట్లాడు తున్నావు.”
”ఔనమ్మా. అప్పుడప్పుడు మనం కూడా ఉల్టాగానే వుండాలి. ఎందుకంటే ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకునే బాధ్యత అతనిలో నాకు కనిపించలేదు. నువ్వు చెప్పిన వివరాల్ని బట్టే అతని మన:స్థితి అంచనా వెయ్యి. బైక్ కొనడం ఆలస్యం అయినందుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయడన్నావు. అది అతని సున్నితమైన మనస్సు అని నువ్వు అనుకున్నావు. ర్యాగింగు చెయ్యడమే తప్పయితే అది జరిగిన మర్నాడు అందరితో పాటు తన జూనియర్‌కి సారీ చెప్పలేదన్నావు. దాన్ని గురించి నా అభిప్రాయం నాకు వచ్చింది. వాలంటేన్స్ డే నాడు నువ్వు రావడం ఆలస్యమయినందుకు పెప్సీ సీసా విసిరికొట్టాడన్నావు. అదంతా విరహమను కున్నావు. ఇందులో పూర్తి స్థాయి ఒళ్లు పొగరు నాకు కనిపించింది. అధికారం ప్రేమకి సంకేతం కాదు. మనిషి అనేవాడు ఎదుటి వాడి వైపు నుంచి ఆలోచించాలి కరుణా. అది అతనికి రాదు.” ( నా మాటలు నచ్చనట్టు తెలిసి పోతుంది. అవతలివైపు నుంచి మౌనం)
”ఆఫ్‌కోర్స్ నేను కూడా అంతే కదా ఆంటీ, అది పట్టుదల అనుకోవచ్చుగా, ఎంట్రన్సులో సీటు కోసం మూడు సార్లయినా గానీ రాశాను, సాధించాను. అది వచ్చేదాకా నేను పిచ్చిదాన్నే అయ్యను నీకు తెలుసుకదా, నాకే కాదు అమ్మకీ, నాన్నకీ కూడా వర్రీ పెరిగిపోయింది.”
”ఔను పిచ్చివాళ్ళనే అనుకున్నాను.”
”లవ్ అంటే నీకు కూడా ఇంత నెగిటివ్‌గా వుండడం నాకు ఆశ్చర్యంగా వుంది.” తన గొంతులో నిష్టూరం.
”ఓ.కె. బాయ్ ఆంటీ.”
” వద్దు, ఫోన్ పెట్టెయ్యకు కరుణా, ఆవేశపడకు జాగ్రత్తగా ఆలోచించు.”
”లేదులే ఆంటీ, అసలు మా జనరేషన్ అంటేనే మీకు గౌరవం లేదు.”
”గౌరవం వుంది కరుణా. ప్రేమించు, ప్రేమించిన వాడితోనే జీవితం పంచుకో. అలా జరగని పక్షంలో స్నేహంగా వుండు. ఒకరి మీద ఒకరు పగ పెంచుకోవద్దు.” కరుణ ఫోన్ పెట్టేసింది.
నా మనసులో కరుణతో సంభాషణ జరుగుతనే వుంది. ఆస్పత్రిలో ప్రణీత, స్వప్నికలు గుర్తొస్తున్నారు. అనేక దౌర్జన్యాలు ప్రేమ పేరిట చలామణీ అవుతున్నాయి. ఇంకో పక్క వేట కుక్కలను చంపినట్లు ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళని కాల్చి పడెయ్య టం గుర్తొస్తుంది. దాని పేరు ప్రజాస్వామ్య దౌర్జన్యం. బాధితులవి, నిందితులవి కలిపి ఐదుగురు తల్లుల కడుపుకోత. ఒక్కటే నిజం. కడుపుకోతనే సమస్యకు పరిష్కారంగా ప్రకటించిన ప్రభుత్వానిది, ఎన్నికల దౌర్జన్య ప్రేమ. ఫలానా అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని, కాదంటే హత్యో, ఆత్మహత్యో తప్పదని- దాని పేరేమిటి క్రూర ప్రేమ…? దౌర్జన్యాలనుంచి తప్పించుకోడానికి ఆడపిల్లలు కరాటే నేర్చుకోవాలి. అన్ని మతాలు ప్రార్ధనలు చెయ్యలి. మంత్రులు మొసలి కన్నీళ్ళు కార్చాలి. ప్రతిపక్షాలు ఉపన్యాసాలు ఇవ్వాలి. మనమంతా ప్రేక్షకులమై చూస్త వుండడం నిర్లజ్జగా జరిగిపోతోంది. పరమ దౌర్జన్యా లనింటికీ ప్రేక్షకత్వమే కదా కారణం.
ప్రజాస్వామ్యమే ఒక అంధ నేత్రం. మానవ హక్కులు ఎవరికీ అర్ధం కాని, అనుభవంలోకి రాని భేతాళ మంత్రాలు. మరి మా కరుణ లాంటి సరికొత్త ప్రేమికురాలికి ప్రేమ అంటే ఏంటో ఎవరు చెపుతారు?
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags