కవి సావిత్రి జయంతి మే 18 – అరణ్యకృష్ణ

బందిపోట్లు

”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని

పంతులుగారన్నప్పుడే భయమేసింది

”ఆఫీసులో నా మొగుడున్నాడు!

అవసరమొచ్చినా సెలవివ్వడ”ని

అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది

”వాడికేం మగమహారాజ”ని

ఆడామొగా వాగినప్పుడే అర్థమైపోయింది

పెళ్ళంటే పెద్ద శిక్షని

మొగుడంటే స్వేచ్ఛా భక్షుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే

మమ్మల్ని విభజించి పాలిస్తోందని!”

ఈ కవిత రాసింది సావిత్రి. ఈ కవిత మార్చి 1984 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయింది. ”సావిత్రి” ఎవరని ఈ తరం కవుల్ని అడిగితే చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళ కోసం సావిత్రి పరిచయం. మే 18 ఆవిడ పుట్టినరోజు. ఒక్క ‘బందిపోట్లు’ కవితతోనే ఆవిడ పేరు మార్మోగిపోయింది అప్పట్లో. భారతదేశ స్త్రీ పురుష సంబంధాలలోని ఒక కర్కశ వాస్తవాన్ని చాలా సులువుగా గుండె పగిలే పద్ధతిలో ఒక చిన్న కవితలో తేల్చిపారేసారామె. మన రక్తంలో ఇంకిపోయే విధంగా మామూలు మాటల్లో చొరబడ్డ నిరంకుశ పితస్వామ్య భావజాలాన్ని ఆమె ఎత్తిచూపారు. 20 ఏళ్ళ వయసులో ఈ కవిత చదివి అశాంతికి గురైనవాళ్ళలో నేనూ ఒకడిని.

రాజమండ్రికి చెందిన సావిత్రి మే 18, 1949న జన్మించి అక్టోబర్‌ 4, 1991న చనిపోయారు. తన 42 ఏళ్ళ జీవితంలో అత్యధిక భాగం పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడారు. సంపన్న క్షత్రియ కుటుంబంలో పుట్టిన ఆమె తన తల్లి జీవితం కలిగించిన వేదన నుండి కవి అయ్యారు. వాళ్ళ అమ్మ అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. ”నా కన్నతల్లి – నా తొలి గురువే కాదు, తొలి నేస్తం, తొలి భ్రాత, తొలి గ్రంథం, తొలి పాట, తొలి బొమ్మ కూడా మా అమ్మే నాకు. అలసిపోయేటప్పుడు పట్టే నిద్ర, గుండె భారమైనప్పుడు వచ్చే కన్నీరు, అవమానం కలిగినప్పుడు నా నిరసన తెలపడానికి వచ్చే జ్వరం, దాన్ని తగ్గించుకోవడానికి నేననుకుంటే ఔషధమూ, లేచి తిరగాలనుకుంటే అన్నమూ, అది సహించదనుకుంటే అనుపానమూ, ఆ తర్వాత నిద్ర రాకుండా చెప్పించుకునే కథా – అన్నీ మా అమ్మే” అని రాసుకున్నారు వాళ్ళమ్మ గురించి. తన తల్లిని ఎదగనీయకుండా చేసి, ఆమెలోని సృజనాత్మకతను చంపేసిన తండ్రిలో పితృస్వామ్య విశ్వరూపాన్ని చూశారు. అందుకే ఆయనంటే పరమ ద్వేషం.

1969లో సావిత్రికి వివాహం జరిగింది. తన తల్లికి జరిగిన అనుభవమే తనకీ ఎదురైంది. ఆమెలోని చైతన్యం పెరుగుతున్నకొద్దీ గృహస్థాయిలో ఆమె పోరాటం కూడా పెరిగింది. కొన్ని సంవత్సరాలపాటు తనదైన ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటంలో సావిత్రి రాటుతేలిపోయారు. దొరికిన పుస్తకమల్లా చదివేవారు. తరచుగా పత్రికలకి, రేడియోకి ఉత్తరాలు రాసేవారు. ఆమెనెవరైనా ”రాజమండ్రి సావిత్రి” అన్నా, ”ప్రభ సావిత్రి” అన్నా, ”రేడియో సావిత్రి” అన్నా పొంగిపోయేవారు. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం సావిత్రి జీవితాన్నే మార్చేసింది. కట్టుబట్టలతో, ఇద్దరు పిల్లలతో గృహపంజరం నుండి బయటపడ్డారామె. రాజమండ్రిలోని రాజేంద్రనగర్‌లో ఒక పూరి గుడిసె అద్దెకు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ‘సమాచారం’ పత్రికలో ఉద్యోగానికి కుదిరారు. హేతువాద సంఘంలోనూ, రాజమండ్రి సాహితీవేదికలోనూ సభ్యులయ్యారు. సాహితీవేదిక ద్వారా ఆమెకు ఎంతోమంది సన్నిహితులు, ఆత్మీయ మిత్రులూ దొరికారు. మల్లాప్రగడ రామారావు, వాడ్రేవు చినవీరభద్రుడు, యర్రాప్రగడ, సోమయాజులు, గోపీచంద్‌, గంధం నాగసుబ్రహ్మణ్యం వంటి వారు ఆమె మిత్రులు. రంగనాయకమ్మగారితోనూ సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.

ఆమె మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేశారు. అయితే మార్క్సిస్టులుగా చెప్పుకునేవాళ్ళలోని పురుషాధిక్య ప్రవర్తనని తీవ్రంగా వ్యతిరేకించి, వాళ్ళ దృష్టికి బలంగా తీసుకెళ్ళేవారు. తనలోని పురోగామిని రోజురోజుకీ పదునెక్కించుకున్నారు. ఒకసారి రాజమండ్రి విక్రమ్‌ హాల్‌లో రాడికల్స్‌ పెట్టిన సభని పోలీసులు భగ్నం చేసి ఆడపిల్లలతో దురుసుగా ప్రవర్తించినపుడు ఆమె పోలీసులతో కూడా ఘర్షణ పడ్డారు. ఆ సందర్భంలో ఆమెని కూడా అరెస్ట్‌ చేసి 15 రోజులు జైలులో ఉంచారు. ఆ కేసు వల్ల ఆమె చాలా ఇబ్బంది పడ్డారే కానీ బెంబేలెత్తిపోలేదు. ఆ తర్వాత ఆమె విశాఖపట్నం ‘డక్కన్‌ క్రానికల్‌’లో ప్రూఫ్‌ రీడర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆమె టి.బి. అల్సర్‌తో బాధపడేవారు. తన ఆరోగ్యాన్ని దారుణంగా నిర్లక్ష్యం చేశారు. రోజురోజుకీ కృశించిపోయారు. ఉద్యోగం మాన్పించేసి మిత్రులు, పిల్లలు ఆమెను టి.బి. ఆస్పత్రిలో చేర్పించారు.

ఐదడుగుల సావిత్రి గారు కేవలం 24 కిలోల బరువు తూగారు. ఆ సమయంలోనే నేనామెను మొదటిసారి చూశాను. ఆస్పత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూ ఉండేవారు. కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. చెవులు వినిపించేవి కాదు. హియరింగ్‌ ఎయిడ్‌ కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. ఊపిరితిత్తులు పాడైపోయాయి. మందులు కూడా పనిచేసేవి కావు. ఇటువంటి సందర్భంలో ఆమె ఒక చేతిని మరొక చేత్తో ఎత్తిపట్టుకుని ‘మనలో మనం’ అనే పుస్తకం సమీక్ష రచన చేయడం చూశాను. మృత్యువు అనివార్యం అన్న స్థితిలో ఆమెకు అలా రాయాలని ఎలా అనిపించేదో, అసలా దీక్ష ఏమిటో అంతుబట్టేది కాదు. అసలు అనారోగ్యం తనకు సంబంధించిన విషయంగా అనుకునేవారు కాదేమో అనిపించేది. ‘కొద్దిగా ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనాలండీ’ అనేవారు మిత్రులతో. విశాఖలో ఆమెను కంటికి రెప్పగా కాపాడుకున్నది ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇంకా కార్పొరేషన్‌ బ్యాంక్‌లో పనిచేసే సోమయాజులు. దివంగత శాంతకుమారిగారు కూడా ఆమెకు ఎంతగానో సహకరించారు. ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చుకున్నారు కూడా. ఆఖరికి 1991 అక్టోబర్‌ 4న ఆమె చనిపోయారు. విరసం కృష్ణాబాయి గారు, శాంతకుమారి గారు దగ్గరుండి అనేక అవాంతరాలను తోసిపుచ్చి, ఆమె చివరి కోర్కెను అనుసరించి ఆమె శరీరాన్ని ‘కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌’కు అప్పగించారు. ఆ రకంగా శ్రీశ్రీకి తీరని చివరికోరిక సావిత్రిగారికి తీరింది. ఆమె తన సాహిత్యాన్నే కాకుండా, శరీరాన్ని కూడా ఈ సమాజానికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

సావిత్రి ‘బందిపోట్లు’ తర్వాతనే స్త్రీ విముక్తివాద కవిత్వం ఉధృతినందుకొందని విమర్శకుల అంచనా. చేకూరి రామారావుగారు ఈ కవితని ‘చేరాతలు’లో సమీక్ష చేసి ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆ కవితని దేశం నలుమూలల్లో అనేక విశ్వవిద్యాలయ సదస్సుల్లో చదివి వినిపించేవారు. అనేక భాషల్లోకి తర్జుమా అయింది ఆ కవిత. ఈ కవితని ఆర్లెన్‌ జైడ్‌, చేరా ఇంగ్లీష్‌లోకి అనువదించారు. పెంగ్విన్‌ వారి ఫెమినిస్ట్‌ పొయట్రీలో కూడా ప్రచురితమయింది.

సావిత్రిగారు మరణించిన తర్వాత ఆమె మిత్రులం ఒక సంస్మరణ సంచికని తీసుకురావాలని సంకల్పించాం. ఆమె రచనలన్నింటినీ సేకరించే బాధ్యత నేను తీసుకున్నాను. ఆమె మొత్తం ఓ పాతిక కవితలు, కొన్ని వ్యాసాలు, సమీక్షలు చేశారు. అవే కాకుండా ఆమె మిత్రులు కూడా ఆమెతో తమ స్నేహాన్ని పంచుకున్నారు. ఆమె రచనలు, ఆమె గురించిన రచనలతో ”సావిత్రి” అనే పుస్తకాన్ని నా సంపాదకత్వంలో ముద్రించాము. నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చే పనుల్లో ఆ పుస్తకం కోసం పనిచేయటం. 1992 నవంబర్‌ 21న రాజమండ్రిలోనే జరిగిన ఒక సభలో చేరాగారు ”సావిత్రి”ని ఆవిష్కరించారు. అద్దేపల్లి, కృష్ణాబాయి, సతీష్‌ చందర్‌లు ప్రసంగించారు. ఈ పుస్తక ప్రచురణలో అమితంగా తోడ్పడినవారు సోమయాజులు, రమేష్‌ చంద్ర (కొన్నేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నారీయన), కృష్ణాబాయి గారు. ఉప్పల లక్ష్మణరావు గారి ”బతుకు పుస్తకం” మీద సావిత్రి చేసిన సమీక్షను ప్రస్తుత 9వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠ్యాంశంగా పొందుపరచటం జరిగింది. సావిత్రి స్మృతి సంచిక గురించి అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

సావిత్రిగారికి నివాళి తెలియచేస్తున్నాను.

అమరత్వం

ఒక ప్రయాణం ముగిసింది

ఆగిన చోట అడుగుజాడలు మొదలయ్యాయి

ఒక పక్షి గొంతు మూగవోయింది

ప్రతిధ్వని కొత్త రాగాలు సమకూర్చింది

ఒక చెట్టు నేలకూలింది

చివుర్లలో అడవులు మొలకెత్తాయి

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో