మంకెన పువ్వెరుపు – పి. ప్రశాంతి

”నానమ్మా… నానమ్మా… దగ్గరగా వేసున్న వీధి గుమ్మం తలుపుల్ని నెట్టుకుని లోపలికొచ్చిన శాంతికి నానమ్మ కనపడలేదు. ఇంటి తలుపులన్నీ తీసే ఉన్నాయి కానీ ఎక్కడా అలికిడి లేదు. బ్యాగ్‌ లోపలపెట్టి మళ్ళీ వరండాలోకొచ్చింది.

”నానమ్మా… ఓ నాయనమ్మా” అంటూ బావి దొడ్లో, వెనక పెరట్లో, స్నానాల గది ఉన్న దొడ్డి… ఇంటి చుట్టూ ఒక రౌండేసి వచ్చింది. నానమ్మ కనపడలా. ఒక పక్కగా

ఉన్న వంటింటివైపు చూసింది. గొళ్ళెం పెట్టుంది. పదవుతోంది… ఈ టైంలో ఎక్కడి కెళ్ళిందబ్బా అనుకుంటూ ముందుకు నడిచింది. గోడవారగా సిపాయిల్లా నిటారుగా పెరిగిన మొక్కల్నిండా ఎర్రటి మంకెన పూలు, గాలికి తలలూపుతూ పిలుస్తున్నట్లే ఉంది. ఆ పక్కనే ఉన్న సౌందర్య కనకాంబరం… మొక్కల్నిండా పూలతో పగడాలు పూసినట్లు న్నాయి. తలెత్తి చూసేసరికి వాకిట్లో ఎత్తుగా, గుబురుగా పెరిగి చెట్టునిండా విరబూసిన ఎర్ర మందారాలు కనిపించాయి. ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించి వాకిట్లో కొచ్చింది. ఇంటిముందు వసారా పొడవునా వరసగా నాటిన గులాబీ చెట్లు, అన్నీ ఎర్ర గులాబీలే… డిఫరెంట్‌ షేడ్స్‌లో! మరోపక్క నిండుగా గుత్తుల్తో ఉన్న ఎర్ర నూరువరహాలు… ఆసక్తిగా బావి దొడ్లోకి వచ్చింది. బావిపక్కగా లేత ఎరుపులో ఉన్న చిన్న కనకాంబరం మొక్కలు, వాటికి అవతల అంతెత్తు పెరిగి చెట్టు నిండా పూలతో ఎర్ర గన్నేరు… నిండు గులాబి రంగులో ముద్ద గన్నేరు… పెరట్లోనే జూకా మందార, మిరప మందార పొదలు… అంతలో తనలో తను మాట్లాడుకుంటూ వస్తున్న నానమ్మ కన బడింది. అప్పుడే శాంతిని చూసిన దశరథమ్మ ‘ఎంతసేపయిందమ్మా వచ్చి… అప్పుడే మొక్కల్లో తిరుగుతున్నావ్‌… ఈ ఎండకి… మంచి నీళ్ళన్నా తాగావా…’ అంటూ గబగబా దగ్గరకొస్తున్న నానమ్మని పట్టుకుని ”నానమ్మా… నువ్వు కమ్యూ నిస్టువా… విప్లవ వాదివా… ఇంటి చుట్టూ ఎర్ర పూలు… ఇల్లంతా తెరిచుంచావ్‌…” అంటున్న శాంతిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ‘అదేంటో నాకు తెలవదు కానీ, ఏదన్నా దాచేసుకుంటే కదా దోచుకెళ్తారేమోనని తలుపులేసుకోవాలి! ఉన్నంతలో నలుగురికీ పంచితే అందరూ బతుకుతారు కాని… మనకే ఉండాలని, మనకే కావాలని నిల్వ చేసు కుంటే ప్రాణం నిమ్మళంగా ఉంటుందా? మా అమ్మ అనేది… ఎవరికైనా పెట్టేటప్పుడు ఏమాలో చించకు… పెట్టేయ్‌… పిడికెడు పెడ్తే దోసిడొ స్తుంది, పట్టెడు పెడ్తే పుట్టెడొస్తుందనేది…’ అంటున్న నానమ్మలో మహామహులు కన్పించారు శాంతికి.

‘తలదాచుకోవడానికింత చోటు… కడుపునిండడానికింత కూడూ చాలదూ… ఓ ఆస్తులు సంపాదించి ముందు తరాల కివ్వాలని, బంగారాలు, వెండి సామాన్లు చేయించివ్వాలని… వేలంవెర్రి కాకపోతే ఎందుకీ హైరానా. సంపాదించిందంతా తినకుండా, కడుపు కట్టుకుని దాచి… పిల్లల కిస్తే మాత్రం ఆళ్ళు బాగుపడిపోతారా సోమర్లవుతారు కానీ! సరైన సావాసం కాపోతే వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నదంతా హారతి కర్పూరం చేస్తారే కానీ కష్టపడడం మా పని కాదనుకుంటారు. కూర్చుని తింటే కొండలే కరిగిపోతాయి కదా! కష్టం చెయ్య లేరు, పని చేతకాదు. పొట్ట కోస్తే నాలుగు ముక్క లొస్తయ్యో లేదో గానీ చదువుకున్నా మన్న అహంకారంతో కష్టం చేసే మనుషులు అలగా జనంగా కనిపిస్తారీళ్ళకి… కనీస మానవత్వం లేదు. ఏం కట్టుకుపోతారో పోయేటప్పుడు…’ మినప సున్నుండలు ప్లేట్లో పెట్టిచ్చి నిమ్మకాయ కోసి షర్బత్‌ కలుపు తున్నా నానమ్మ మాటల ప్రవాహం మాత్రం సాగిపోతూనే ఉంది.

‘ఏమైంది నానమ్మా… చాలా కోపంగా ఉన్నావ్‌’ అంది శాంతి. చేస్తున్న పనిని ఒక్క క్షణం ఆపి శాంతిని చూస్తూ ‘శంకరం కొడుక్కి తట్టు పోసిందని ఆస్పత్రికి తీసుకెళ్తే జనం ఉన్నారని కూర్చోమందంట నర్సు. అక్కడున్న బల్ల మీద కూర్చుంటే పక్కనే ఉన్న నాగిరెడ్డి మనవరాలు ‘జొరమొచ్చిందా…’ అని ఈడి నుదుటి మీద చెయ్యేసిందంట. ‘అవును గీతమ్మా! నువ్వు బడికి పోలా… నీకేవైంది ఈడికొచ్చినావ’ని అన్నాడంట. ఇదంతా చూసిన ఆ పిల్ల మేనమామ, బాబాయ్‌ కలిసి ఆ పిల్లాడ్ని ఈడ్చి కొట్టి, కింద పడేసి ‘మా పిల్లని పట్టుకోవడానికి నీకెన్ని గుండెలు. అలగా జనాలకీ ఈ ఆస్పత్రే కావాల్సొ చ్చిందా… మీ గూడెంకి నర్సొస్తుందిగా పోండ’ని కాళ్ళతో తన్నారంట. శంకరం భార్య ఏడ్చుకుంటూ వస్తే అక్కడికే ఎల్లొస్తున్నా…’ అంటున్న నానమ్మని ‘ఆ పిల్లలు ఏం చదువు కుంటున్నార’ని అడిగింది శాంతి. ‘ఆ పిల్ల ఐదో తరగతి, ఆడు నాల్గో తరగతంట. ఏం చదువుకుంటే ఏం? ఆళ్ళు మనుషులు కారా? ఈళ్ళు దిగొచ్చారా?’ అని ఆవేశంగా అంటున్న నానమ్మ వైపు గిల్టీగా చూసింది శాంతి. ‘సారీ నానమ్మా! ఒక్క క్షణం నేను కూడా మిగతా వాళ్ళలాగే ఆలోచించాను. వయసులో

ఉన్నారేమో అనుకుని ఆ పిల్ల పక్కన వీడెందుకు కూర్చోవాలి, కావాలనే చేసుంటాడనుకున్నా… నేనలా ఆలోచించ కూడదు. వయస్సులో

ఉన్నవాళ్ళయితే ఏం, వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటే? కానీ ఒకందుకు సంతోషం… నాకు కులం గుర్తు రాలా… అయినా ఈ కుల, మతాల గొడవ ఇప్పుడు మరీ ఎక్కువైంది. మీ తరం వారి నుంచి మేం నేర్చుకుంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది…’ అంటున్న శాంతి తలపై ప్రేమగా చెయ్యేసి ‘పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవమ్మా! పెంచుకుంటున్న పశువుని ప్రేమగా చూస్తాం… ఇంటి ముందుకొచ్చిన కుక్కకింత ముద్ద పడేస్తాం… పిచ్చుకల కోసం కంకులు కడతాం… పిట్టా, పురుగూ తినాలని చేలో పంటొదుల్తాం… ఇన్నీ చేసే మనిషి బుర్రలో ఏముందో మరి… సాటి మనిషిమీద ఎప్పుడూ అనుమానమే. కల్మషం లేని మనిషే దేవుడంటే! మనిషికి మనిషి సాయం చేసుకోక పోతే బతుకుందా! ఒకర్నొకరు గౌరవించు కోనిదేం సంస్కారం!! హెచ్చుతగ్గులు మనం పెట్టుకున్న య్యేగా… దాన్తోనే బాధంతా.. తుడిచి పారేస్తే అంతా సమానమే. అంతా సంతోషమే…’ అంటున్న నానమ్మ మంకెన పువ్వులా కనిపిస్తుంటే ఆరాధనగా చూసింది శాంతి.

కులం పేరుతో రాజకీయాలు నడుపుతున్న వారు, కులాలను మరిన్ని ముక్కలు చేసి నాయకులమై పోదామను కుంటున్న స్వార్థపరులు… వీళ్ళందరి కబంధ హస్తాల్లోంచి మానవత్వం బయటపడాలంటే నానమ్మ ఫిలాసఫీనే దారి. కానీ, విభజించి పాలించు అన్న చందాన పోతున్న లోకానికి ఈ ఫిలాసఫీ చేరేదెలా?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.