భారతీయ మహిళలపై హెచ్ఐవి పంజా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిస్సహాయ మహిళలు, పిల్లలకోసం నడిచే వాసవ్య మహిళా మండలిలో వుంటున్న 23 ఏళ్ళ నాగమణి తన ఐదేళ్ళ కూతుర్ని హత్తుకుని వుంది.

ముఖంపై నవ్వులేదు. తల్లీ కూతుళ్ళు తీవ్ర మనస్తాపంలో వున్నారని డాక్టర్లు చెప్పారు.

నాగమణి భర్త ఎయిడ్స్ తో మరణించాడు.

“నా భర్త చనిపోయాక నా అత్తామామలు నన్ను ఇంటినుంచి గెంటేశారు” అని ఆమె చెప్పింది.

“నా అన్న భార్యకూడా నన్ను నా పుట్టింటిలో వుండడానికి వీల్లేదంది. ఇంకెక్కడికీ పోయే దిక్కులేదు, అందుకే నా బిడ్డతో ఇక్కడికొచ్చా” అని చెప్పింది.

నాగమణి కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్ అని వైద్య పరీక్షలు నిర్ధారించాయి, కానీ, దాన్ని తట్టుకునే స్థితిలో ఆమె లేదు. తనకి హెచ్ఐవి సోకిందని ఒప్పుకోవడానికి ఆమె నిరాకరించింది.

భారతదేశంలో హెచ్ఐవి బాధితుల సంఖ్య ఇప్పటికే ఐదు మిలియన్లు దాటింది.

2015 నాటికల్లా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టి బాధితుల సంఖ్యను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించిన లక్ష్యసాధన ప్రపంచవ్యాప్తంగా వెనకబడేవుంది, భారతదేశంలో ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టతరమే.

భారతదేశంలో వున్న హెచ్ఐవి బాధితుల్లో 39 శాతం మంది మహిళలే.

హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహనను పెంపొంది స్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

హెచ్ఐవిపై సమాజంలో, ప్రత్యేకించి మహిళల్లో వున్న అవగాహనా లోపాన్ని పారద్రోలేందుకు, భారీ స్థాయిలో ప్రచారం జరిగితే తప్ప పరిస్థితి విషమించే దశలో వుందని ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“నిరక్షరాస్య మహిళలే కాదు, చదువు కున్నారను కుంటున్న మహిళల్లో కూడా హెచ్ఐవి/ ఎయిడ్స్ గురించి అవగాహన లేదు. ఇక్కడున్న మహిళల్లో దయనీయపరిస్థితి ఇది” అని వాసవ్య మహిళా మండలి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దీక్ష చెప్పారు. వాసవ్య మహిళా మండలి నిస్సహాయ మహిళలకు పునరావాసం కల్పించడంతో పాటు హెచ్.ఐ.వి పై అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సమస్యలపై పనిచేస్తోంది.

ఆటంకాలుః
భారతదేశంలో సెక్స్ పై చర్చ ఇంకా ఒక రహస్య విషయం, అందువల్లనే దీనిపై విజ్ఞానం కలిగించడం చాలా కష్టతరమవుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అంబుమణి రామదాస్ అంటున్నారు.

“ఏది చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పడం ద్వారా ముందు భర్తల్ని విద్యావంతుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. వైవాహిక జీవితంలో భార్యకు విశ్వాసపాత్రంగా వుండాలని చెబుతున్నాం. ఇది బాగా దట్టంగా అల్లుకుని వున్న వ్యవస్థ. ఇందులోకి చొరబడటం చాలా శ్రమతో కూడిన పని” అని ఆయన చెప్పారు.

అయితే, అసలు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు, జాగ్రత్తలను ప్రచారం చేసేందుకు తగిన చొరవ చూపడం లేదని ఎయిడ్స్ కార్యకర్తలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

“నన్నడిగితే, ఈ సమస్య పూర్తిగా అదుపు తప్పిందని చెప్తాను” అని నాజ్ ఫౌండేషన్‌కు చెందిన అంజలి గోపాలన్ అన్నారు.

“హెచ్ఐవి పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది” అని ఆమె చెప్పారు.

“అనాథల సంఖ్య పెరగడం మనం చూస్తున్నాం. దీనితో, ఐదేళ్ళ క్రితం మనకు వున్న కొద్దిపాటి అవకాశం కూడా ఇప్పుడు లేకపోయింది” అని ఆమె వాపోయారు.

ప్రమాదపుటంచున వున్న వర్గాలుః
హెచ్ఐవి/ఎయిడ్స్ నిరోధంకోసం ప్రభుత్వం నడిపిన కార్యక్రమాలన్నీ ఇటీవలి వరకు ప్రమాదపుటంచున వున్న వర్గాల- సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులైన పురుషులు, లారీ డ్రైవర్‌ల వంటివారిపై ఎక్కువ దృష్టి నిలిపేది.

ఈ వ్యాధి ఈ వర్గాలకే పరిమితమైందని హెచ్ఐవి గురించి తెలిసిన భారతీయులు ఇప్పటికీ భావిస్తున్నారు.

హెచ్ఐవి గురించి అవగాహన వున్నవారి సంఖ్యకు సంబంధించి ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా, తాను పనిచేసే గ్రామీణ ప్రాంతాలలో 70 శాతం మంది మహిళలు హెచ్ఐవి వైరస్ గురించి అసలు విననే లేదని డాక్టర్ దీక్ష అంచనా.

విజయవాడ శివార్లలో వున్న మురికి వాడలో వుండే లక్ష్మి అనే 33 ఏళ్ళ మహిళ తాను హెచ్ఐవి పాజిటివ్ అని మెడికల్ రిపోర్టు వచ్చినప్పుడే మొదటిసారిగా హెచ్ఐవి గురించి విన్నది.

“నా భర్త లారీడ్రైవరు, ఆయన ద్వారా నాకు హెచ్ఐవి అంటింది. అప్పటివరకు నేను హెచ్ఐవి గురించిగాని, కండోమ్‌ల గురించిగాని వినలేదు. చదువురాని దాన్ని కాబట్టి పోస్టర్లూ, బ్యానర్లు చదవలేకపోయేదాన్ని” అని ఆమె చెప్పింది.

లక్ష్మి 12 ఏళ్ళ కూతురు రెండేళ్ళ క్రితం ఎయిడ్స్ తో చనిపోయినపుడు లక్ష్మి, ఆమె భర్త తామిద్దరూ హెచ్ఐవి పాజిటివ్ అని మొట్టమొదట తెలుసుకున్నారు.

“నాకు హెచ్ఐవి సోకిందంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే, మమ్మల్ని ఎవరూ ముట్టుకోరు, వాళ్ళ ఇళ్ళలోకి మమ్మల్ని రానివ్వరు, చాలా పెద్ద అవరోధం” అని ఆమె వాపోయింది.

“ఒక ఆడమనిషిగా నేను బయటికి వెళ్ళలేను. ఆ సమయంలోనే ఒక డాక్టరుగారు నన్ను పట్టుకుని, భయపడాల్సిన అవసరమేమీ లేదని చెప్పారు. దీంతో నాకు బతుకుమీద ఆశ కలిగింది” అని ఆమె చెప్పింది.

తన ప్రాంతంలోని మహిళలలో హెచ్ఐవి పట్ల అవగాహనా వ్యాప్తికి శ్రీకారం చుట్టడం ద్వారా లక్ష్మి ఈ వ్యాధిపై తన యుద్ధాన్ని ప్రారంభించింది.

ఈమెలాంటి కొంతమంది వ్యక్తులు, వేళ్ళమీద లెక్కించదగిన ప్రభుత్వేతర సంస్థల ప్రచారంతోనే గ్రామీణ భారత దేశంలో హెచ్ఐవిపై అవగాహనా వ్యాప్తి జరుగుతోంది.

హెచ్ఐవి సేవలు, అవగాహనా వ్యాప్తి లోపం చాలా తీవ్రంగా వుందని అంజలీ గోపాలన్ అన్నారు.

“అట్టడుగు స్థాయిలో అందే సేవల నాణ్యతను మనం ఇంకా మెరుగుపరచడం లేదు. అంతేకాక ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత వున్నట్లు కనిపిస్తోంది” అని ఆమె చెప్పారు.

ప్రజలలో, ప్రత్యేకించి మహిళల్లో అవగాహనకోసం కార్యక్రమాలను భారీ స్థాయిలో విస్తరించకపోతే రోగం ముదిరి మిలియన్‌ల జీవితాలను బలితీసుకునే ప్రమాదం పొంచి వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.