– మమత, (ఏక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం – మాధురి.కె
మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ. మా నాన్నగారు వ్యవసాయ కూలి, మా అమ్మ గృహిణి, ఒక అక్క. నాకు 10 సంవత్సరాల వయసులో మా అమ్మ గుండెజబ్బుతో మరణించింది. నన్ను, మా అక్కని పాఠశాల్లోంచి తీసేసి, ఇంటిపని మొదలుపెట్టించారు. కొన్ని సంవత్సరాల తరువాత నేను పెద్ద మనిషినయ్యాను. నాకు 15 సంవత్సరాలొచ్చేసరికి మా పక్క గ్రామంలో ఒకతనితో నా వివాహం జరిగింది.
మొదట నా వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కాని నా ఆనందం ఎంతోసేపు నిలువలేదు. వున్నట్టుండి ఎంతో మంచివాడు, దయగలవాడు అయిన నా భర్త నన్ను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. మేము ప్రతీ చిన్న విషయానికి గొడవ పడడం మొదలుపెట్టాము. ఒకరోజు నేను పిల్లల్ని వదిలేసి, మా అక్కతో వుండడానికి వెళ్ళిపోయాను. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ వుండేదాన్ని. కొద్ది నెలల్లో మా నాన్నగారు పోయారు. మా నాన్నగారి మరణం నన్ను చాలా కృంగదీసింది- నేను పనిచెయ్యడం మానేసాను. దానివల్ల మా అక్కకు కోపం వచ్చి మేమిద్దరం ఎప్పుడూ గొడవపడేవాళ్ళం. నేను మళ్ళీ పనికోసం వెతుక్కోవడం మొదలుపెట్టాను, కాని ఏమి దొరకలేదు. నేను ఎప్పుడు పనికోసం బయటకు వెళ్ళినా, మా కాలనీలోని కొంతమంది మగవాళ్ళు నన్ను వెంబడించి వారితో కొంత సమయం గడపమని కోరేవారు. మెల్లిగా నేను ఆ ఊబిలోకి కూరుకుపోయాను- డబ్బు నాచేత ఆ పని చేయించింది. నేను ఒకతనితో హైదరాబాదు వచ్చేసాను.
ఒక హోటల్‌లో డాన్సరుగా చేరాను. కాని నాతో పని చేస్తున్న ఇద్దరి డ్యాన్సర్‌లతో పాటు చాలా కష్టాలు అనుభవించాను. మేము పోలీసులవల్ల, కస్టమర్‌ల వల్ల చాలా భయంతో బ్రతుకుతూ వుండేవాళ్ళం. డాన్సు కార్యక్రమాలకి వచ్చే ఒక కస్టమరు నా దగ్గరకు వచ్చి, నన్ను తనతో వచ్చి కొత్త జీవితం ప్రారంభించమని కోరాడు. నేను ఆ ప్రతిపాదనకి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఒప్పుకున్నాను. మేము చాలా ఆనందంగా వుండేవాళ్ళం.క్రమంగా నా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
పరీక్షలో హెచ్ఐవి అని వచ్చింది. తరుచూ జ్వరంతో, అతిసారంతో బరువు త్రగ్గుతూ, బాధపడుతూ వుండేదాన్ని. ఎంతమంది డాక్టర్‌ల దగ్గరకు వెళ్ళినా, ఎన్ని ఆస్పత్రులకి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. నాతో కలిసి వుంటున్నతనితో గుంటూరులో వున్న మా అక్క దగ్గరకు నన్ను చేర్చమని కోరాను కాని మా అక్క నన్ను వుంచుకోవడానికి ఒప్పుకోలేదు. వేరే గత్యంతరం లేక అద్దెకు ఒక ఇల్లు తీసుకుని వుండడం ప్రారంభించాను. కాని మా అక్క నా ఆస్తిని, డబ్బుని తనకు ఇవ్వమని చాలా గొడవ చేసేది. నేను నిరాకరించాను. మా అక్క నన్ను తనింటికి రానిచ్చేది కాదు, నన్ను ముట్టుకునేది కాదు. ఈ భయంకరమైన వ్యాధిగురించి తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా భయంగా వుండేది. అందువల్లే మా అక్క నన్ను దూరంగా వుంచేది. ఈ విషయం తెలిస్తే నాకు సహాయం చెయ్యడం ఆపేస్తాడని భయపడి, నాతో వుంటున్నతనికి కూడా చెప్పడానికి ధైర్యం చాలలేదు.
ఎవరూ స్నేహితులు, బంధువులు లేక ఒంటరిదాన్నైపోయాను. నా పార్ట్ నర్ నాకు క్రమం తప్పకుండా డబ్బు పంపిస్తూ వుండేవాడు. కాని నా దగ్గరకు రావడం మానేసాడు. ఎవ్వరూ నన్ను చూడడానికి వచ్చేవారు కాదు. జీవితం చాలా అంధకారంగా, అయిపోయింది. నేను చాలా నీరసపడిపోయాను. మమత తన కథను ఇంతవరకే చెప్పగలిగింది. తర్వాత తీవ్రమైన అనారోగ్యం ఆమెను కుంగదీసింది. ఆమె గొంతు మూగబోయింది. ఇలాంటి స్థితిలో ఏక్షన్ ఎయిడ్ సమాజ ఫెలోషిప్ బృందం ఈమెను కలిసారు.
కౌన్సిలింగ్ ఇచ్చి, పరీక్షలు జరిపిన తరువాత 200 కన్నా తక్కువ సిడి 4 తో పాజిటివ్ అని తేల్చారు. ఇది జరుగుతూ వుండగా అక్క ఆమెతో 3 లక్షలుపెట్టి ఒక ఇల్లు కొనడానికి ఒప్పించింది. మమత వాళ్ళ అక్కపేరుమీద ఇల్లుకొంది. కొద్ది రోజుల్లోనే ఆమె శారీరకంగా మరింత కృంగిపోయింది. ఆమెకు జీవితం మీద విరక్తి కలిగింది. మళ్ళీ కోలుకోలేదు. ఉన్నట్టుండి మందులు తీసుకోవడం ఆపేసింది. ఒక వారంలోనే ఒక అనామకురాలిగా, అంటరానిదిగా మరణించింది. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆమె అక్కకు తెలిపారు కాని ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. మున్సిపాలిటీ వారు వచ్చి ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. మమత అక్క అక్కడకు వచ్చింది. కాని, చెల్లెలి మృతదేహాన్ని మాత్రం ముట్టుకోలేదు.