సమాజం నిండా చలపతులే – కొండవీటి సత్యవతి

సమాజపు అన్ని రంగాల్లోను విషవృక్షంలా విస్తరించిన మనువాద భావజాలపు తానులో చలపతిరావ్‌ కూడా ఓ ముక్క. స్త్రీలకు సంబంధించిన ప్రతి అంశంలోను సమాజం పితృస్వామ్య భావజాలంలోంచే మాట్లాడుతుంది. ”న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అని ఎన్నో ఏళ్ళ క్రితం మనువనే మగదురహంకారి నిర్దేశించిన వాక్యాన్ని అప్పటినుండి ఇప్పటి అత్యాధునిక సమాజం వరకు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. మనువు మధ్య యుగాల నాటి అంధకార యుగంలో స్త్రీ వ్యతిరేకతని ప్రదర్శిస్తే, ఇప్పటి చదువుకొన్న తరం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్వితీయ అభివృద్ధి సాధించిన తరం, తమతో పాటు అన్ని రంగాల్లోను అజేయంగా మహిళలు దూసుకుపోతున్న తరుణంలో కూడా మనువు గాడి మనవల్లా ప్రవర్తించడం ఎంతైనా గర్హనీయం.

ప్రపంచవ్యాప్తంగా పితృస్వామ్యం ఊడలు దిగిన మహా మానై స్త్రీలందరి అభివృద్ధికి ఆటంకంగా ఉంది. దశాబ్దాలుగా స్త్రీల

ఉద్యమం పితృస్వామ్య భావజాలం మీద ఎంతో పోరాటం చేసింది. పోరాటం నడుస్తూనే ఉంది. మన దేశానికి సంబంధించి మనువాదం, కుల వ్యవస్థ, మత మౌఢ్యం స్త్రీల అణచివేతలో ముఖ్య భూమికలు పోషిస్తున్నాయి. మనువాదం పెంచి పోషించిన బ్రాహ్మణ ఆధిపత్యం ఇప్పటికీ చాతుర్వర్ణ వ్యవస్థని చెక్కుచెదరకుండా నిలబెట్టింది. బ్రాహ్మణుడు ద్విజుడని, పరమపవిత్రుడని, పూజనీయుడని ప్రచారం చేసుకుంటూ నిచ్చెన మెట్ల కులవ్యవస్థని స్థిరీకరించారు. తాము పవిత్రులం కాబట్టి వేదం చదివే హక్కు తమకు తప్ప వేరెవ్వరికీ లేదని, స్త్రీలకు అసలు లేదని హుంకరిస్తూ, రాజుల సహకారంతో తమ నీతి నియమాలను ఎవరైనా మీరితే ఎకాఎకిన హత్యలు చేయించడం, రామాయణంలో శంభూక వథ దీనికి మంచి ఉదాహరణ. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణీయ భావజాలం స్త్రీ జాతిని ఇంటికీ, వంటింటికీ, చాకిరీకి పరిమితం చేసింది. స్త్రీ పురుషుడికి సంతానాన్ని కనివ్వడానికేననే పరమ ఛాందస, చెత్త సిద్ధాంతాన్ని భారతీయ పురుషుడి రక్తంలో ఇంకించి, ఆమెని పురుషుడి బానిసగా తయారుచేసి పెట్టారు.

చదువుతో సంబంధం లేకుండా అక్షరాస్యతకి నోచనివాడి నుండి అత్యధిక స్థాయి చదువులు చదివినవాడి వరకూ స్త్రీని భోగవస్తువుగా, బానిసగా భావించడం వెనుక పనిచేస్తోంది ఈ మనువుగాడి ఫిలాసఫీనే. తాము అణిచివేయబడుతున్నామని, సమాన హక్కులు లేకుండా బానిసలుగా బతుకుతున్నామనే చైతన్యం కలగకుండా మొగుడు దేవుడితో సమానమని, ఎలాంటి వాడైనా పతిని పూజిస్తే చాలునని, అతడి బతుకు నిలపడం కోసం నిత్యం నోములూ, వ్రతాలూ చేయాలని నూరిపోశారు. పెళ్ళి చాలా పవిత్రమని, ఎంత హింస ఉన్నా అందులోంచి బయటకు రాకూడదని, కొట్టినా తిట్టినా, ఆఖరికి చంపడానికి వచ్చినా చచ్చిపోవాలే గానీ తిరగబడకూడదనీ స్త్రీలకు నూరిపోశారు, పోస్తూనే ఉన్నారు. భర్తని నాలుగు తన్ని, పెళ్ళి నుంచి బయట పడి స్వతంత్రంగా బతకగల దమ్ము, ధైర్యం ఉన్నప్పటికీ మనువుగాడి చెత్త ఫిలాసఫీ భారతీయ స్త్రీలందరికీ కనబడని సంకెళ్ళు వేసి అణిచివేస్తోంది. దళిత స్త్రీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకవైపు కుల అణచివేత, మరోవైపు మనువుగాడి పితృస్వామ్య అణిచివేతల్లో అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. నిజానికి దళిత స్త్రీలు తమ రెక్కల కష్టంతో తమని తాము పోషించుకుంటూ కుటుంబాలను కూడా పోషించుకుంటారు. భరించేవాడు భర్త అనే భావజాలానికి దళిత స్త్రీ అతీతురాలు. తన శ్రమతో బతికే స్త్రీ కూడా భర్త దౌర్జన్యాన్ని, అరాచకాన్ని సహించడం వెనక పనిచేస్తున్నది మనువుగాడి ఫిలాసఫీ మాత్రమే.

నేటి సమాజం తీరును నిశితంగా పరిశీలించినపుడు లక్షలాది మంది స్త్రీలు ఇంటి పెద్దలుగా, కుటుంబాలను నడుపుతుండడం కనిపిస్తుంది. ఉమెన్‌ హెడెడ్‌ ఫ్యామిలీలు విపరీతంగా పెరిగాయి. వివిధ కారణాల వల్ల ఒంటరిగా బతుకుతున్న స్త్రీలే కాకుండా, భర్తలతో కలిసుంటున్న చాలామంది స్త్రీలు కూడా ఆర్థికంగా, స్వతంత్రంగా బతుకుతున్నారు. భర్త పాత్ర నామమాత్రమే అయినప్పటికీ, వాళ్ళు కుటుంబ పోషకులుగా లేనప్పటికీ వాళ్ళ కుటుంబాల్లో కుటుంబ హింస విపరీత స్థాయిలో ఉంది. తాగొచ్చి కొట్టడం నిత్యకృత్యంగా ఉంది. వివాహేతర సంబంధాలు, విడాకుల ప్రసక్తి లేకుండానే రెండో, మూడో పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటి ఎన్నో అంశాలు ఆ కుటుంబాల్లో నిత్యం హింసను ప్రేరేపిస్తున్నాయి. దీనికి కారణం ఆయా స్త్రీలు స్వతంత్రంగా బతకగల ధైర్యం ఉన్నప్పటికీ మనువుగాడి ఫిలాసఫీ వాళ్ళ మెదళ్ళకు సంకెళ్ళు వేస్తోంది. భౌతిక స్థితి కాకుండా భావజాలం వాళ్ళను కట్టడి చేస్తోంది. పూచిక పుల్లకి కొరగాకపోయినా నువ్వు మగాడివి, అహంకారం, అభిజాత్యం నీకు పుట్టుకతో అబ్బాలి అంటూ మగాడిని అచ్చోసిన ఆంబోతులా వదిలేయడం వల్ల కుటుంబంలో అధిక భాగం తిండి తనే తిని కండలు పెంచి కనిపించిన ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని ఎన్ని రకాలుగా హింసిస్తున్నాడో, ఎంత హీనమైన లైంగిక దాడులకు తెగబడుతున్నాడో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంట, బయట, పనిచేసే చోట్ల తన హింసాయుత ప్రవర్తనలతో స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాడు. ఎన్ని చట్టాలు వచ్చినా పురుషుల బుర్రల్లో దూరి కూర్చున్న మనువుగాడు వాళ్ళని మానవీయంగా మనుషుల్లా ఉండనీయడం లేదు. పురుషులందరూ ఒకేలా ఉన్నారని కాదు, కానీ ఎక్కువ శాతం పితృస్వామ్య భావజాలంతోనే ఉండడం విచారకరం.

మొదటే చెప్పినట్టు మనువాద తాను బట్టలో చలపతిరావు ఒక ముక్క. ఒళ్ళంతా పురుషాహంకారం లుకలుకలాడుతున్న పురుష పురుగు. నోరుజారి బయట పడ్డాడు. కానీ మిగతా తానంతా అదే బాపతు. సంప్రదాయ పరిరక్షక దర్శకులు, బూతుపాటలు రాసే రాతగాళ్ళు, నోటినిండా బురద నింపుకుని ప్రేక్షకులమీద ఊసే యాంకర్లు, ఎవరో రాసిన డైలాగులు తప్ప ఒక్క మంచిమాట ఉచ్ఛరించలేని నాయకులు, కథానాయకుడి చుట్టూ ఉనికిలేని ఉపగ్రహంలా తిరిగే కథానాయిక… సినిమా రంగం జెండర్‌ స్పృహ లోపించిన ఒక కళారంగం. జెండర్‌ అంటే ఏమిటి? స్త్రీ పురుష సమానత్వమంటే ఏమిటి? జండర్‌ జస్ట్‌ సమాజమంటే ఏమిటి? ఇవి వీళ్ళ ఊహల్లోకి కూడా రాని అంశాలు. జండర్‌ ఆధారంగానే ”gender based violence’ జరుగుతుంది అంటే, అది ఏంటి అని అడిగే ప్రబుద్ధులు. అందుకే వాళ్ళు ధారాళంగా వాడే బూతు పంచాంగం వాళ్ళకి వినసొంపుగానే ఉంటుంది. అందులో తప్పేముంది అనిపిస్తుంది. ఎవరిని

ఉద్దేశించి రోతగా, నీచంగా మాట్లాడతారో వాళ్ళు అక్కడే తమ పక్కన, తమ ఎదురుగా, తమతో పాటు ఉన్నారన్న స్పృహ గానీ, సంస్కారం గానీ కనబడవు.

ఇక టివీలలో వచ్చే నానాజాతి సమితి కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అవన్నీ చూడకపోయినా జరుగుతున్న చర్చల ద్వారా అర్ధమైనదేమంటే టివీలో వచ్చే సిరీయళ్ళు స్త్రీ వ్యతిరేకతను ప్రతి డైలాగులోను నింపుకున్నాయని, స్త్రీలను ఒకరికొకరిని శతృవులుగా నిలబెట్టిన దుర్మార్గంతో ఉన్నాయని, రియాల్టీ షోల పేరుతో పసికందుల్ని సైతం తీసుకొచ్చి వాళ్ళ మెదళ్ళను కలుషితం చేస్తున్నారని తెలుస్తోంది. కౌన్సిలింగ్‌ల పేరిట బాధిత స్త్రీలను మరింత హింసకు గురిచేస్తున్నారని వింటూనే ఉన్నాం. ”జబర్దస్త్‌” పేరుతో నడుస్తున్న ఒకానొక ప్రొగ్రామ్‌ హిజ్డా కమ్యూనిటీని అత్యంత హేయంగా అవమానిస్తోందని, దానిమీద ఫైల్‌ అయిన కేసుల ద్వారా అర్థమవుతోంది. ‘వినోదం’ పేరుతో టివీలలో వస్తున్న చాలా కార్యక్రమాలు స్త్రీలని, ట్రాన్స్‌ కమ్యూనిటీని, దళితులని, మైనారటీలను అవమానించేవిగానే వస్తుండడం తీవ్ర ఆందోళన కల్గించే అంశం. దశాబ్దలుగా స్త్రీల ఉద్యమం ప్రోది చేసిన ”సిస్టర్‌ హుడ్‌”ని భంగపరిచి, స్త్రీలకు స్త్రీలే శతృవులంటూ సాగుతున్న సీరియళ్ళ భరతం పట్టాల్సిందే.

మీడియా (అది సినిమా, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా… ఏదైనా కావచ్చు) ప్రజల ఆలోచనల మీద వేసే ముద్ర చాలా ప్రభావశీలమైంది. అందుకే మీడియాను మానవీకరించే పనికి అందరం పూనుకోవాలి.

గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడంలాగా కాకుండా సమూల ప్రక్షాళనవైపు అడుగులేయాల్సిన అవసరం ఉంది. మనువాద, బ్రాహ్మణీయ, పితృస్వామ్య భావజాల బంధనాల్లోంచి, ఒక్కొక్క బంధనాన్ని తెగ్గొట్టుకుంటూ ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది. వేయి తలలతో విషం క్కుతున్న హిందూత్వ భావజాలాన్నే కాక స్త్రీలని అణిచి ఉంచుతున్న సమస్త మత భావజాలాల మీద మహిళలు పెద్ద ఎత్తున పోరు సల్పాల్సి ఉంది. మాటలో, పాటలో, రాతలో సమస్తంలోనూ జండర్‌ స్పృహ ఉండాల్సిన ఆవశ్యకతని వివరించాల్సిన అవసరముంది. ఆ దిశగా అందరం ఐక్యంగా నడవాల్సిన అవసరం ఉంది.

వివక్షకి, అణిచివేతలకి పట్టుగొమ్మలుగా ఉన్న మనువాద, పితృస్వామ్య భావాల నుంచి మానవీయ కోణం వైపు నడిచేవేళ మన అక్కరకు వచ్చే అన్ని చట్టాలను ఆయుధాలుగా మలుచుకోవాలి. విచ్చలవిడిగా పేట్రేగుతున్న వికృత సంస్కృతిని పోరాటం ద్వారా, చట్టం ద్వారా ఎదుర్కొందాం… పోరాడితే పోయేదేమీ లేదు, మనువాద సంకెళ్ళు తప్ప.

 

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.