ఉపాధ్యాయుడు, కవి బాలసుధాకర్ మౌళి సంకలనం చేసిన ‘స్వప్నసాధకులు – విద్యార్థుల కవిత్వం’ పుస్తకం నుండి
ట్రిపుల్ ఐటిలో మొదటి సంవత్సరం చదువుతున్న ఎం. విజయ రాసిన కవితలు.
నేనూ, ఆకాశం
ఆవరణంలో కూర్చొని
ఆకాశంలోకి చూస్తున్నాను
చంద్రుడు కనిపిస్తున్నాడు
చుక్కలు కనిపిస్తున్నాయి
ఎందుకో అమ్మ గుర్తుకొస్తోంది
అమ్మలాంటి గురువూ
గుర్తుకొస్తున్నారు
ఈ చీకటిలో
ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తున్నాను
ఆకాశం
కష్టజీవుల ఆకలి ముఖంలా ఉంది
ఆకాశం పుస్తకంలానూ ఉంది
పుస్తకంలో అక్షరాలు
కష్టజీవుల కన్నీటిబొట్లు
ఆకాశంలో
కష్టజీవుల కన్నీటిబొట్లూ
కనిపిస్తున్నాయి
ఈ రాత్రి ఆకాశమంతా
ఒక స్త్రీ ముఖంలానూ కనిపిస్తోంది
ఆకాశంలో జీవితం కనిపిస్తోంది
జీవితంలో నేనూ ఆకాశంలానే
కనిపిస్తున్నాను
వెలుగులోకి…
చీకటి దారిలో
నేనూ, నా ఆలోచన కలిసి అడుగులేస్తున్నాం
ఆ దారిలో
నా చదువు, నా ఆశయం, నా జీవితం
హఠాత్తుగా ఊహించని వెలుగు
ఆ వెలుగు
నా ఆలోచనని మార్చి
నా ఆలోచనని సాహిత్యంతో ముడివేసి
సాహిత్యంలోంచి సమాజాన్ని చూపి
ఆ చీకటి దారిలో
వేకువను నాటింది
ఆ వేకువ నీడలోనే
నా గమ్యం వైపు అడుగులు వేస్తున్నాను
అమ్మ చేయి
స్వేచ్ఛానువాదం
హిందీ మూలం ః కేదార్‌నాథ్ సింగ్
ఆమె చేతిని
నా చేతిలోకి తీసుకున్నాను
ప్రపంచమంతా
ఆమె చేయిలాగానే
వెచ్చగా, అందంగా కనిపించింది
తిరిగి వస్తాం
స్వేచ్ఛానువాదం
సిరియన్ మూలం ః రీమా
పన్నెండేళ్ళ సిరియన్ శరణార్థి
మా హృదయాలతో
నిన్ను ప్రేమిస్తున్నాం
నీ పిల్లలుగా ప్రేమిస్తున్నాం
జ్ఞాపకాలు నిన్నెలా మరువగలవు
నీ చెంపలపై కన్నీటిని తుడవడానికి
మేం త్వరలో తిరిగివస్తాం
మట్టిని, పూలను ముద్దాడేందుకు
ఒకానొకరోజు
మా తల్లుల వద్దకు తిరిగి వస్తాం
ప్రియమైన సిరియా!
మేం త్వరలో తిరిగి వస్తాం