ఎడతెగని కూలిపనిలో పసిబిడ్డగా చేరుతుంది
నీళ్ళబిందెలతో పాటూ
నీలాపనిందలనీ
వంట చెరకుతో పాటూ
సంసారపు కరుకునీ రంగరించిన
కట్టుబానిసత్వపు కషాయాన్ని అనునిత్యం
దిగమింగుతుంది.
గుక్కెడు నీళ్ళకోసం
మైళ్ళకొద్దీ దూరాలు
నెర్రెలిచ్చిన పాదాల్లో
మోయలేని భారాలు.
కాఫీల ప్రహసనంతో వంటింట్లో
కళ్ళు తెరిచిన ఆమె
వంటింటిని మోసుకెళ్ళి
కూరల్ని కలవరిస్తూ తిరిగొచ్చింది.
మెదడు గదుల్లో…
అడుగంటిన చక్కెరా
పప్పులోకి పాలకూరా
కడగాల్సిన అంట్లూ
ఉతకాల్సిన ప్యాంట్లూ
చొరబాటుదారుల్లా
అల్లకల్లోలం చేస్తుంటే
చేయాల్సిన పనుల్ని బేరీజు వేసుకుంటూ…
గుబగుబలాడుతున్న గుండెతో ఇంటి ముఖం
పడుతుంది.
పెళ్ళితో పాటే ఓ అపరిచితుడ్ని నిలువెల్లా
ధరిస్తుంది.
అలనాటి లక్ష్మణరేఖల నకళ్ళను ఒళ్ళంతా
పులుముకుని
అందమైన బానిస ముస్తాబులోకి అనాయాసంగా
అడుగేస్తుంది.
అలసిపోయిన వంటి సంగతి ఇసుమంతైనా పట్టని
మొగుడనే మగవాడి బహుముఖ దోపిడీ బ్రతుకంతా భరిస్తుంది.
”సూత్రాలూ” మట్టెలనే నిర్జీవ సూత్రాల ఆధిపత్య
పడగనీడకు ఇరుగుపొరుగు సాయంతో నవ్వుతూ
చేరిపోతుంది.
ఆడ అంటూ అబల అంటూనే బలిపీఠమెక్కించే
పితృస్వామ్య కుయుక్తికి
శక్తియుండీ… మౌనంగా మిగిలి..,
”సహనశీలి” పేరుతో చరితార్థమౌతుంది.