మా ఊరు వెళ్ళిరావాలి
చక్కని చెట్ల కింద కూర్చొని
చల్లని గాలిని ఆస్వాదించి ఎన్ని రోజులైందో
కొండరేంబళ్ళు ఏరి
జేబులో వేసుకుని తిని ఎన్ని రోజులైందో
మా ఊరు వెళ్ళిరావాలి
వెళ్ళిరావాలి
సెలయేటిలోని చేపపిల్లలను పట్టుకుని
ఎన్ని సంవత్సరాలైందో
వెళ్ళిరావాలి
చెట్లకు పుట్లకు నా చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పి
కలిసి రావాలి
మా ఊరు వెళ్ళిరావాలి
గుళ్ళల్లో పిచ్చుకలను, పేలాడే గబ్బిలాలను
నా ఊహల ప్రపంచాన్ని
మళ్ళీ చూసి రావాలి
నా బాల్యంలో చేసిన చిలిపి చేష్టలను
గుర్తు తెచ్చుకుని, ఆ ప్రదేశాలతో మాట్లాడిరావాలి
వెళ్ళిరావాలి
వచ్చేస్తూ వచ్చేస్తూ
నా జ్ఞాపకాలను బుట్టలలో తట్టలలో
వేసుకుని రావాలి
నేను ఎక్కిన చెట్టు చిటారుకొమ్మని
నా కళ్ళల్లో పెట్టుకుని
తీసుకుని రావాలి
వెళ్ళిరావాలి
మా ఊరు వెళ్ళిరావాలి
వస్తూ వస్తూ
మా మాస్టార్ల మాటలను
సంచులలో వేసి తీసుకొని రావాలి
వెళ్ళిరావాలి
మా ఊరు వెళ్ళిరావాలి
ఏటా ఏటా
ఒక్కసారైనా ఆ ప్రపంచాన్ని కలిసి రావాలి