శిలాలోలిత
అన్నంరాజు సుగుణమణి కలంపేరు ‘అరవింద’. కథలు, నవలలు, బాలసాహిత్యం ఎక్కువగా రాశారు. ఇటీవల ఈమె వెలువరించిన కవిత్వ సంపుట.ి నక్షత్రమాల’.
వీరి కవిత్వంలో మూడు ప్రధానమైన అంశాలు కన్పించాయి. ఒకటి స్త్రీవాద దృక్పధంతో, స్త్రీ పురుషుల సమానత్వాన్ని ఆకాంక్షిస్త రాసినవి., రెండు మానవతా దృక్పధంతో మనుషులు జీవించాల్సిన స్థితిని, జీవితం అశాశ్వతం, మానవత్వం శాశ్వతం అనే సత్యాన్ని తెలుసుకుంటే జీవితానందం ఎలా సాధించుకోవచ్చో తెలిపే దార్శనిక సత్యాలతో కొన్ని. ఇక, మూడవది సంభాషణా ప్రక్రియ రూపంలో పిల్లల చదువు సమాజానికి ఎంత అవసరమొ విశదీకరించిన తీరు. పేదరికం మనిషిని ఎంత సంక్లిష్ట భరితంగా చేస్తుందో ఇందులో వివరించారు.
అరవింద ప్రస్తుత నివాసం జంషెడ్‌పూర్. వీరికి ‘ప్రేమతంత్రం’ అనే పిల్లల నవలకు ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ లభించింది. దీనితో పాటు తెలుగు యూనివర్సిటీ అవార్డులు రెండు, జ్యేష్ట లిటరరీ ట్రస్ట్ అవార్డు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం, సుశీలా నారాయణ రెడ్డి సాహితీ అవార్డు, ఈమె రచనలకు లభించాయి. చాన్నాళ్ళ క్రితం ‘అవతలి గట్టు’ అని ఈమె రాసిన నవలను చదివి ఆకర్షింపబడ్డాను. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత, అనుకోకుండా ఆమె ‘నక్షత్రమాల’ కవిత్వాక్షరాలను సమీక్షించడానికి వీలైంది. 1960 ఆ ప్రాంతాల్లో తెలుగు సాహిత్యాన్ని రచయిత్రులు ప్రముఖంగా ప్రభావితం చేస్తున్న రోజుల్లో, ఒక బలమైన పాఠక వర్గాన్ని సృష్టించిన రోజుల్లో, ఎన్నో విలువైన రచనలను చేసిన రచయిత్రులలో ‘అరవింద’ ఒకరు. సాహిత్యాన్ని, ముఖ్యంగా వచన సాహిత్యం ఎంతో ప్రతిభావంతంగా ఆ రోజుల్లో రచించారు.
అరవింద కవిత్వం తెరిచీ తెరియగానే, ఆమెంత మృదు స్వభావో, అక్షరాలు చెప్పడం మొదలుపెట్టాయి.చాలా స్పష్టంగా, స్త్రీల అణచివేతను గురించీ, పురుషుడు ఆమెను లోబర్చుకునే విధానాన్ని గురించీ, సమానత్వాన్ని ఇవ్వడానికి అంగీకరించని మగతనాన్ని గురించీ చాలా స్పష్టంగా కవిత్వీకరించారు.
‘వైమనస్యం’ అనే కవితలో కవి, పురుషుడు, స్త్రీ ఈ ముగ్గురి సంభాషణతో కవిత్వం నడుస్తుంది. మారని పురుషంకారాన్ని విమర్శిస్త, స్త్రీ మానసిక పరిణామ క్రమాన్ని, ఆత్మబలాన్ని, ఆత్మగౌరవ ప్రకటనని చేస్తారు.
‘ఈ బిడ్డ ఎవరమ్మా’ కవితలో ఆడపిల్ల ఇంటికీ, మనసుకీ ఎంత వెలుగో, వెన్నెలో చెబుతారు.
అలాగే సమాజంలో పురుషుడు మారాల్సిన స్థితిని కొత్త కోణంలో చూపుత జెండర్ దృక్పధంతో సమస్యని ఆలోచించాలనీ, పిల్లల పెంపకంలో మార్పు వచ్చినపుడే పురుష స్వభావంలో మార్పుని తీసుకు రాగలమని ఆశిస్తారు. ‘కోరిక’ కవితలో తన పెంపకంలో ఉన్నతమైన, సమానత్వపు భావన కలిగిన కోటి మంది కొడుకుల్ని తయరు చేయగలనన్న ఆత్మవిశ్వాస ప్రకటన చేస్తారు. అశాశ్వతమైన చిన్న జీవితంలో ‘ఇగో’ లను విడిచిపెట్టి, సమాన స్థితిలో వుండే ఆనందాన్ని అనుభవించగలిగే స్థితిని ఏర్పరచుకోవడంలో స్త్రీ మున్ముందుకు పోతుందనే ఆశావహ దృక్పధాన్ని వెల్లడించిన, శైలీ నైపుణ్యమున్న భావగాఢతవున్న కవయిత్రి అరవింద.
ఇక, రెండవ అంశం-గొప్ప వర్మికత సాధించిన ఆధ్యాత్మిక ధోరణితో అరవిందగారి కవిత్వం సాగుతుంది. స్త్రీలు అస్తిత్వ వేదనలో కనలి కనలి ప్రవహించిన తీరు కన్పిస్తుంది. ”నువ్వు నన్ను పట్టి బంధించేనాటికి/నేను నక్షత్రాల మీద వాలేదాన్ని/ వెలుతురు తాగేదాన్ని” కొత్త భావన యిది.
తన స్వేచ్ఛను తానే నరుక్కుని బ్రతికెయ్యడమనే విషాదాన్ని , ప్రాపంచిక జీవితంపట్ల ఉదాసీనతను, కంపార్ట్ మెంట్స్‌గా జీవితాన్ని ఎలా విభజించుకుంటూ మనసు గదుల్లో ఒకో దృశ్యాన్నీ ఎలా అమర్చుకుంటారో అద్భుతంగా వ్యక్తీకరించింది.
ఏదీ అంటనితనం, ఏదీ మిగలని తనం, పరాయితనాన్ని ‘ప్రవాసం’ కవిత వెలి బుచ్చింది. మనిషితనం కోసం వెతుకులాట ‘పెన్నిధి’ కవిత, నాస్తికత, మహామాయ, కలం, కరుణారసం, గారడీ,గాజు మేడ, మంచి కవితలు. ఏడు రంగుల గాజుకుప్పె, వెదురు గొట్టంలో నా వూపిరి నింపి ఇలాంటి కొత్త ఎక్స్ ప్రెషన్స్ వున్నాయిందులో. మృత్యువును పెళ్ళి రోజుగా అభివర్ణించింది. ‘నిజమైన పెళ్ళి’ స్త్రీ జీవితంలో విశ్రాంతి, ఆనందాన్ని కలిగించేది మరణం అంది. జీవితం పట్ల గొప్ప ప్రేమ. మనుషుల పట్లభావోద్వేగ పరమైన గాఢానుభతి, గొప్ప అనురక్తి ఈ ప్రపంచం మిథ్య, బ్రతికినంత కాలం మనిషిగా జీవించమనే ఉద్బోధ, మానవత్వపు మణిహరంలా జీవితాలు భాసించాలనే కోరిక వున్న పరిపూర్ణ మనసులు మాత్రమే యిలాంటి కవిత్వాన్ని సృజించగలరు.
‘కొండలు బండలు పిండి అవుతున్నాయి/రచయిత జీవిత సత్యాన్ని అన్వేషిస్తున్నాడు/ నవల కవితలు గుట్టలవుతున్నాయి… అంటూ శేష రహస్యాన్ని, శేషప్రశ్నలా అరవింద కవిత్వం మన ముందుంచారు.
రిపోర్ట్
కొండవీటిసత్యవతికి రంగవల్లి అవార్డు పద్రానం
ప్రతి సంవత్సరం రంగవల్లి మెవెరియల్ ట్రస్ట్, హైదరాబాద్ వారు విప్లవోద్యమ నాయకురాలు రంగవల్లి పేరు మీద యిచ్చే అవార్డులను ఈ సారి భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతికి, కె.ఎస్.మల్లీశ్వరికి ప్రకటించారు. రంగవల్లి పుట్టిన రోజైన డిశంబరు 31 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రంగవల్లి అభిమానులతో హాలంతా నిండిపోయింది.
ఈ సభకు ముఖ్య అతిధిగా జస్టిస్ యతిరాజులు, సభాధ్యక్షులుగా ప్రొ. ఆర్, కృష్ణారావులు విచ్చేసారు. ప్రొ. చేకూరిరావరావుగారు ట్రస్టు పరిచయం చేయగా వాసిరెడ్డి నవీన్ పురస్కార గ్రహీతల పరిచయంచేసారు
2008 సంవత్సరానికి విశిష్ట మహిళా పురస్కారం కింద ర.25,000 నగదును, మొమెంటోను కొండవీటి సత్యవతికి శ్రీ జస్టిస్ యతిరాజులు గారు ప్రదానం చేసారు. అలాగే విశిష్ట కధానికా పురస్కారం కింద కె.ఎన్. మల్లీశ్వరి కథ ‘వెతుకులాట’కి ర.5000, మెమెంటో ప్రదానం జరిగింది.
”My Mother,My Strength”
ఆంగ్లోపన్యాసకురాలు డా. జయశ్రీ మొహన్‌రాజ్ సంపాదకత్వంలో వెలువడిన ” My Mother,My Strength” పుస్తకావిష్కరణ, డిశంబరు 10, 2008 లో జూబ్లిహిల్స్‌లోని ‘ఒడిస్సి’లో జరిగింది. శ్రీ నరేంద్ర లూధర్ పుస్తకావిష్కరణ చేసారు. ప్రొ.సి.సుబ్బారావు, ప్రొ.లక్ష్మిచంద్రగార్లు పుస్తకం గురించి మాట్లాడారు.
వివిధ భారతీయ భాషలకు చెందిన 24మంది రచయిత్రులు, కవయిత్రులు తమ తల్లులతో తమకు గల బాంధవ్యాన్ని, తమ తల్లులు తమకెలా బలాన్ని ఇచ్చారో వర్ణిస్తూ రాసిన స్వీయనుభవాలను డా. జయశ్రీ ఆంగ్లంలో గుది గుచ్చితే, రపా మరియు కో ప్రచురణ సంస్థవారు అందంగా ముద్రించారు.
తమ తల్లుల గురించి ఈ పుస్తకంలో రాసిన ఒరియా రచయిత్రి డా.ప్రతిభా రాయ్, బెంగాలీ రచయిత్రి ప్రొ.లక్ష్మి శ్రీ బెనర్జీ, ఉర్దూ రచయిత్రి జిలానీబానో, మరాఠీ రచయిత్రి సానియా, తెలుగునుంచి అబ్బూరి ఛాయదేవి, కొండవీటి సత్యవతి ఈ సమావేశానికి హాజరయ్యారు.
పుస్తకం వెల ర. 195/-
కాపీలకు: ఒడిస్సీ, అక్షర, క్రాస్‌వర్డ్, వాల్డెన్‌లలో లభిస్తాయి.